లేపాక్షి: ఒకవైపు అభివృద్ధి, మరోవైపు నిర్వాసితుల ఆవేదన

లేపాక్షి
    • రచయిత, ప్రతిమ ధర్మరాజు
    • హోదా, బీబీసీ కోసం

అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని లేపాక్షి ఒక పర్యటక ప్రాంతం. ఇక్కడి శిల్ప సంపద, ఏకశిలా నంది విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. అయితే, కొన్నేళ్లుగా లేపాక్షికి పర్యాటకుల సందడి పెరుగుతున్నా, ఇక్కడ అభివృద్ధి పనుల వల్ల నివాసాలు కోల్పోయినవారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

గత కొన్నేళ్లుగా ఇక్కడ ఏటా లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చే పర్యటకుల కోసం విస్తరించిన రోడ్ల కారణంగా ఇక్కడి వ్యవసాయ భూముల ధరలు భారీగా పెరిగాయి.

"నాలుగేళ్ల కిందట మా భూమి విలువ రూ. 3 లక్షలు ఉండేది. ఈ రోజు అది 30 లక్షలకు చేరింది. పర్యటక కేంద్రంగా దీనికి ప్రాధాన్యం పెరగడంతో నాలాంటి ఎంతోమంది చిన్నచిన్న రైతుల జీవితాలు మారాయి" అని స్థానిక రైతు దాసప్ప చెప్పారు.

2016, 17, 18 ల్లో ప్రభుత్వం లేపాక్షి ఉత్సవాలు నిర్వహించింది. రహదారుల, పార్కులు, పర్యటకుల కోసం హోటళ్లు, వసతి గృహాలు నిర్మించింది.

"లేపాక్షి ఉత్సవాలు ప్రారంభించినప్పటి నుంచి పర్యటకుల సంఖ్య పెరుగుతోంది. పదేళ్లుగా మా వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతోంది. గత నెల కంటే ఈ నెల రూ.7 వేలు అదనంగా సంపాదించగలుగుతున్నాం" అని చిరువ్యాపారి మహబూబ్ బాషా వివరించారు.

వీడియో క్యాప్షన్, వీడియో: ఒకవైపు పర్యటకుల సందడి, మరోవైపు నిర్వాసితుల కన్నీళ్లు

అయితే, ఇక్కడ అభివృద్ధి పనుల కారణంగా నివాసాలు కోల్పోయినవారు మాత్రం అసంతృప్తితో ఉన్నారు.

లేపాక్షి మ్యూజియం నిర్మాణం, పార్క్ నిర్మాణం కోసం ఆ ప్రాంతాల్లో ఉండే కొందరిని ప్రభుత్వం ఖాళీ చేయించింది. వారికి మరో ప్రదేశంలో స్థలం కేటాయించింది. కానీ, ఆ ప్రదేశంలో ఎలాంటి వసతులూ లేవని స్థానికులు అంటున్నారు.

అభివృద్ధి పనుల కారణంగా నష్టపోయినవారికి ఇంకా పరిహారం అందలేదు.

లేపాక్షి

"ప్రభుత్వం ఇచ్చిన ఆ స్థలాల్లో కనీసం కరెంటు, తాగునీటి సదుపాయం లేవు. అద్దె కట్టలేని మేం చాలా ఇబ్బందులు పడుతున్నాం. కేవలం స్థలం ఇస్తే మాలాంటి పేదలు ఇల్లు ఎలా కట్టుకోవాలి" అని భగవంతప్ప చెప్పారు.

"గత్యంతరం లేక మేం ఈ మరుగుదొడ్డిలో ఉంటున్నాం. మా జీవితాలను బజారున పడేసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు? మాలాగే ఇళ్లు కోల్పోయినవారు చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిపోయారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల నియమావళి కారణంగా అధికారులు నిర్వాసితుల సమస్యల గురించి మాట్లాడేందుకు నిరాకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)