ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతి నగర నిర్మాణం ఎంతవరకు వచ్చింది?

ఫొటో సోర్స్, AP CRDA
- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ అధికార, విపక్షాల మధ్య రాజధాని నిర్మాణ అంశం పదేపదే ప్రస్తావనకు వస్తోంది. నగర నిర్మాణంలో పురోగతి సాధించామని అధికార పక్షం చెబుతుంటే, ఇన్నాళ్లూ తాత్కాలిక భవనాలు తప్పితే, శాశ్వత నిర్మాణాల కోసం ఒక్క ఇటుక కూడా పడలేదంటూ విపక్షం ఆరోపిస్తోంది.
మరోవైపు, రాజధాని వల్ల రైతులకు పెద్దగా ఇబ్బంది లేకున్నా, నాలుగేళ్లుగా తమకు ఉపాధి లేకుండా పోయిందని స్థానిక గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో అసలు అమరావతి నగర నిర్మాణం ప్రస్తుతం ఏ స్థితిలో ఉందన్న విషయాన్ని బీబీసీ పరిశీలించింది.
మేము రాజధాని ప్రాంతంలో పర్యటించినప్పుడు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాలు మినహా మిగిలిన పనులన్నీ నిర్మాణ దశలోనే కనిపించాయి.
ముందస్తు అంచనాల ప్రకారం ఫిబ్రవరి నాటికి పూర్తి కావాల్సిన అధికారుల భవనాలు, ఎమ్మెల్యేల క్వార్టర్స్ కూడా మరో సంవత్సరం నాటికి గానీ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డు పరిస్థితి కూడా భూసేకరణ పూర్తి కాకపోవడంతో స్పష్టత రావడంలేదు. అర్థాంతరంగా ముగించినట్టుగా కనిపిస్తోంది.
అయితే, ప్రస్తుతం రాజధాని ప్రాంతమంతా నిర్మాణ పనులతో సందడిగా ఉంది. పలు భవనాలు, వివిధ కార్యాలయాలు పునాది దశలో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నిర్మాణ రంగ కార్మికులతో కోలాహలం కనిపిస్తోంది.
ఒకటి రెండేళ్లలో రాజధాని నగరానికి ఓ రూపం వచ్చే అవకాశం ఉందని ఇంజనీరింగ్ పనులు పర్యవేక్షిస్తున్న వారు చెబుతున్నారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక- ఏపీ ప్రభుత్వ నిర్ణయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రెండు రాష్ట్రాలకూ హైదరాబాద్ నగరాన్ని పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. నవ్యాంధ్ర రాజధానిని సిద్ధం చేసుకోవడానికి సమయం పడుతుందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. ఈ విషయంలో స్పష్టత కోసం ఆ కమిటీ రాష్ట్రమంతా పర్యటించింది. పలువురి అభిప్రాయాలను సేకరించింది. పలు ప్రాంతాలను పరిశీలించింది. చివరకు పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాలు కాకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించాలని నివేదిక ఇచ్చింది.
కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమరావతి పేరుతో నూతన నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
2014 డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతాన్ని ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. పట్టణాభివృద్ధి శాఖ అధ్వర్యంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీయే)ను ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత 2015 అక్టోబర్ 24 నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం ఆడంబరంగా నిర్వహించారు. ప్రధాన మంత్రి ఏపీ రాజధాని నిర్మాణం కోసం మట్టి- నీళ్లు హస్తిన నుంచి తీసుకొచ్చారు. అమరావతి నిర్మాణంలో కేంద్రం అన్ని రకాలుగానూ సహకరిస్తుందని ప్రకటించారు.

అధికారులు ఏం చెబుతున్నదేంటి?
రాజధాని శంకుస్థాపన తర్వాత వివిధ కార్యక్రమాలు, భవనాల నిర్మాణాల కోసం పలుమార్లు శంకుస్థాపనలు నిర్వహించారు.
తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనం, తాత్కాలిక హైకోర్టు నిర్మాణాలు పూర్తయ్యాయి. వినియోగంలోకి వచ్చాయి. శాశ్వత భవనాల నిర్మాణ పనులు వివిధ దశల్లో సాగుతున్నాయి.
డిజైన్ల విషయంలో జాప్యం జరగడంతో సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో ఆలస్యమైంది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం సాగుతోంది. ఐఏఎస్ అధికారుల భవన సముదాయం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గృహ సముదాయం, ఎన్జీవోల హౌసింగ్ సహా పలు నిర్మాణాలు సాగుతున్నాయి.
రాజధాని నగరం మొత్తం 270 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. అందులో 30 శాతం పార్కులు, సామూహిక అవసరాల కోసం భూములు కేటాయిస్తున్నారు. 1,600 కిలోమీటర్ల పొడవున రోడ్లు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం రూ.36,960 కోట్ల విలువైన పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్నవి పూర్తయితే మొత్తం 77 శాతం పనులు పూర్తవుతాయని సీఆర్డీయే అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం తొలి దశ పనుల్లో మొత్తం 12,986 కోట్లతో రోడ్ల నిర్మాణం జరుగుతోందని సీఆర్డీయే చెబుతోంది. ప్రభుత్వ భవనాలు, గృహాల కోసం రూ. 5,883 కోట్లు, భూసమీకరణ కోసం రూ.12,545 కోట్లు వెచ్చిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇతర దేశాల సహకారం
నివసించదగిన నగరానికి సాంకేతిక సహకారం, స్టార్టప్ ప్రాంత అభివృద్దికి సింగపూర్‌ని డెవలప్‌మెంట్ భాగస్వామిగా ఎంచుకున్నారు. వాణిజ్య, సాంకేతిక సహకారం, రవాణా ప్రణాళికలు, స్మార్ట్ సిటీ ప్రణాళికలు జపాన్ సహకారంతో సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. పెట్టుబడుల ప్రోత్సాహం, మౌలిక వసతులు, ఫైనాన్సింగ్ రంగాల్లో యూకే తోడ్పాడు అందుతుందని తెలిపారు.
రాజధాని ప్రాజెక్ట్ ఫైనాన్స్, నగర సామర్ధ్యం పెంపుదల ప్రపంచబ్యాంక్ సహకారంతో సాగుతాయన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్‌లో చైనా చేయూత కూడా ఉందని సీఆర్డీయే అంటోంది. మాస్టర్ ప్లాన్ కన్సల్టెంట్‌గా సింగపూర్ పట్టణ ప్రణాళికా సంస్థ సుర్బానా వ్యవహరిస్తోంది.
వ్యూహాత్మక నిర్వహణలో మెకంజీ అండ్ కంపెనీ, ఇంజనీరింగ్ విభాగంలో నెదర్లాండ్స్‌కి చెందిన ఆర్సాడిస్, టీసీఎస్‌తో పాటు వివిధ విభాగాలలో పలు సంస్థల సహకారంతో రాజధాని నిర్మాణం జరుగుతుందని వివరించారు.
విద్యా, వైద్య సంస్థల కార్యకలాపాలు
రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకూ వివిధ సంస్థలకు 1,428 ఎకరాల భూమి కేటాయించారు. అందులో ప్రైవేటు సంస్థలకు 1,116 ఎకరాలు ఇచ్చారు.
రూ.23,850 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దాంతో 71 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంటోంది. విట్, ఎస్ఆర్ఎం వంటి విశ్వవిద్యాలయాలు, ఆర్ఎస్ మెడిసిటీ, హెచ్‌సీఎల్ వంటి సంస్థలకు పనులు సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
2050 నాటికి 35 బిలియన్ డాలర్ల జీడీపీ వృద్ధి లక్ష్యంగా సీఆర్డీయే నిర్ణయించుకుంది.

కష్టాల్లో కూలీలు
గడచిన నాలుగేళ్లలో రాజధాని అభివృద్ది పేరుతో స్థానికంగా 29 గ్రామాలలో కూలీలకు చిక్కుతెచ్చిపెట్టారని పలువురు వాపోతున్నారు. తమకు ఉపాధి లేకుండా పోయిందని అంటున్నారు. స్థానిక మందడం గ్రామానికి చెందిన కౌలు రైతు రాజేష్, వ్యవసాయ కూలీ ఈశ్వరమ్మ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
"చుట్టూ మూడు పంటలతో కళకళలాడుతూ ఉండేది. అందరికీ చేతినిండా పనిదొరికేది. కానీ, ఇప్పుడు ఒక రోజు పనికి వెళితే మూడు రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. పొలం పనులు లేక, మరో ఉపాధి దొరక్క కష్టాలు పడుతున్నాం. చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదు. రైతులకు ఫర్వాలేదు కానీ, కూలీలం చాలా కష్టపడుతున్నాం. ప్రభుత్వం నెలకు రూ. 2500 ఇస్తోంది. కానీ, అవి దేనికి సరిపోతాయి? గతంలో రోజూ పని ఉండేది. భార్య భర్త కలిసి రోజుకి రూ.700 సంపాదించేవాళ్లం. నెలకు రూ.20 వేలు వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం 2,500 ఇస్తోంది. నెలకు పది రోజులకు మించి పని దొరకడం లేదు. వ్యవసాయ కూలీకి వెళ్తే మరో రూ.2 వేలు వస్తున్నాయి. మా జీవనం భారంగా మారింది" అని చెప్పారు ఈశ్వరమ్మ.

కౌలు రైతు రాజేష్ కూడా అలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు.
"అరకొరగా మిగిలినపొలాల కౌలు బాగా పెరిగింది. ఎకరానికి 60 వేలు కౌలు ఇస్తున్నాం. దొండ పాదులు సాగుచేస్తున్నాం. పెట్టినపెట్టుబడులకు, వస్తున్న ఆదాయానికి పొంతన ఉండడం లేదు. పెద్ద రైతులు తమ పొలాలను పూలింగ్‌లో ప్రభుత్వానికి ఇచ్చేసి దర్జాగా ఉన్నారు. అరెకరం రైతు అయిన నేను మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా కష్టాలు తీరడం లేదు. కూలీలకు ఇస్తున్న రూ.2500 మూడేళ్ల తర్వాత పెంచాల్సి ఉన్నా, పెంచట్లేదు" అని రాజేష్ వాపోయారు.
రద్దీ బాగా పెరిగింది
రాజధాని ప్రాంతానికి చెందిన రైతు బి.అర్జునరావు మాట్లాడుతూ "ఈ నాలుగేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. రోజూ పొలాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే మాకు ఇప్పుడు చేతిలో పొలం లేదు. దాంతో జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఓపిక ఉన్న రైతులు కొందరు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో దూర ప్రాంతాల్లో భూములు కొని సాగుచేస్తున్నారు. కానీ, నాలాంటి వాళ్లకు అంత ఓపిక లేదు. అయినా రాజధాని ప్రాంతానికి పెరిగిన రద్దీతో నాకే ఆశ్చర్యం వేస్తోంది. కూలీలకు మాత్రం కొంత కష్టంగానే ఉంటోంది. ప్రభుత్వం ఆదుకుంటే మంచిది" అని అభిప్రాయపడ్డారు.
రాజధాని నగరం మాత్రం ఇప్పటికీ ఓ రూపు దాల్చినట్టుగా కనిపించడం లేదని పర్యాటకుడు ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.
"ఎన్నికల షెడ్యూల్ రాకముందు వరకూ నిత్యం ఆర్టీసీ బస్సులలో ప్రభుత్వమే వివిధ ప్రాంతాల నుంచి సామాన్య ప్రజలను ఇక్కడికి తరలించడంతో సందడి ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. టిప్పర్ల సందడి, ట్రక్కుల హడావిడి, బుల్డోజర్ల మోత మాత్రమే కనిపిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన పనులు గమనిస్తే రాజధాని తాత్కాలిక భవనాల నుంచి శాశ్వత భవనాలలోకి మారేందుకు మరో ఐదు, పదేళ్లు పడుతుంది" అని చెప్పారు.

పెరిగిన ఇంటి అద్దెలు
అమరావతి రాజధాని నగరం ప్రకటన తర్వాత తుళ్లూరు ప్రాంతంలో అన్ని తరగతుల జీవిన విధానంలోనూ స్పష్టమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా రైతులు వ్యవసాయం వదిలి రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో అడుగుపెట్టారు.
కూలీలు ఉపాధి లేక కొందరు వలస పోతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇతర గ్రామీణ వృత్తిదారులు కూడా జీవన వ్యయం పెరిగిందని అంటున్నారు.
కొత్తగా నిర్మించిన భవనాలకు అద్దెలు పెద్ద మొత్తంలో లభిస్తుండడంతో అమరావతి ప్రాంతంలోని ఇంటి యజమానులు సంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి వేటలో, ఉద్యోగాల నిమిత్తం అమరావతికి వలసలు పెరుగుతున్నాయి. దాంతో ఇంటి అద్దెల రూపంలో కొంతమందికి భారీగా ఆదాయం లభిస్తోందని ఉద్దండరాయుని పాలెం గ్రామానికి చెందిన కావూరి మల్లీశ్వరి వివరించారు.
"రియల్ ఎస్టేట్ కూడా 2014 నుంచి రెండేళ్ల పాటు ఉధృతంగా సాగింది. కానీ, 2016 తర్వాత కాస్త నెమ్మదిగా సాగుతోంది. ముఖ్యంగా నోట్లరద్దు వంటి అనేక కారణాలతో పాటు రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు మందకొడిగా సాగుతుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గింది" అని విజయవాడ క్రెడాయ్ ప్రతినిధి సంతోష్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, APCRDA

ఫొటో సోర్స్, AP Govt
"వేగంగా సిద్ధమవుతోంది"
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం వేగంగా సిద్ధమవుతోందని ఏపీ సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ బీబీసీకి తెలిపారు.
"నగరంలో పెద్ద స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు జరిగేందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నాం. మౌలిక సదుపాయాల కల్పన కొలిక్కి వస్తోంది. విట్, ఎస్ఆర్ఎం వంటి సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. హైకోర్టు భవనం నుంచే ప్రస్తుతం న్యాయమూర్తులు విధులు నిర్వహిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాం. అమరావతిని సుందరనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాలుగానూ సన్నద్ధమయ్యాం" అని శ్రీధర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కొత్త రాజధానిలో జనాలు కరవు
- రాజధానుల ఎంపిక ఎలా జరుగుతుంది?
- ఏడీఆర్ సర్వే: కేసీఆర్ పాలనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన రేటింగ్ ఎంత?
- సౌదీ కథలు: 'ఆ నరకం భరించలేక ఏందన్నా తాగి సచ్చిపోదాం అనిపిస్తుంది సార్’
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: ఎక్కడ ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు?
- స్వలింగ సంపర్కుడైన కుమారుడి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
- టీఎన్ శేషన్: దేశ రాజకీయ నేతలే ఆయన బ్రేక్‌ఫాస్ట్
- కాళేశ్వరం ప్రాజెక్టు: కలల నిర్మాణం ఒక వైపు... కడతేరని విషాదం మరో వైపు
- ‘మోదీ చౌకీదార్ కాదు చోర్... పవన్ కల్యాణ్ అధికారంలోకి రావడం ఖాయం’
- ఏడీఆర్ సర్వే: చంద్రబాబు పాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన రేటింగ్ ఎంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









