వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి : చంద్రబాబు అయిదేళ్లలో మూడు సినిమాలు చూపించారు

ఫొటో సోర్స్, ysjagan/fb
'సమర శంఖారావం' పేరుతో తిరుపతిలో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో గ్రామస్థాయి నుంచి మొదలుకుని రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశారని జగన్ ఆరోపించారు.
చంద్రబాబు పాలనలో మట్టి, ఇసుక, బొగ్గు, రాజధాని భూములను, కరెంటు కొనుగోళ్లను వదిలిపెట్టలేదన్నారు. విశాఖ భూములను, గుడి భూములను, దళితుల భూములను వేటినీ వదిలిపెట్టకుండా దోచేశారని జగన్ ధ్వజమెత్తారు.
న్యాయానికి, అన్యాయానికి ఎన్నికలు జరగబోతున్నాయని జగన్ వ్యాఖ్యానించారు. చాలాచోట్ల వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తూ.. 59 లక్షల దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు.
వైసీపీ అధికారంలోకొస్తే వృద్ధాప్య పింఛన్లను రూ.3 వేలకు పెంచుతామని ప్రకటించారు. రైతులను ఆదుకునేందుకు ప్రతి మే నెలలో రూ.12,500 సాయం అందిస్తామని తెలిపారు.

ఫొటో సోర్స్, ysjagan/fb
ఈ సభలో జగన్ ఇంకా ఏమన్నారంటే..
- చాలాచోట్ల వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారు. 59 లక్షల దొంగ ఓట్లు నమోదు చేయించారు.
- చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. చాలా గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు.
- వచ్చే ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే ఎన్నికలు. విశ్వసనీయత, మోసానికి మధ్య జరిగే ఎన్నికలు. ఆప్యాయతకు, డబ్బుకు మధ్య జరిగే ఎన్నికలు.
- చంద్రబాబు ప్రజలకు మూడు సినిమాలు చూపిస్తున్నారు. 2014లో మొదటి సినిమా చూపించారు. ఆ సినిమాలో ఆయన కొట్టిన డైలాగుల్లో ఒక్కదాన్ని కూడా చేయలేదు. ఆ ఎన్నికల్లో నరేంద్ర మోదీతో కలిసి చంద్రబాబు ప్రచారం చేశారు. మోదీ వస్తున్నారు.. రెండు నెలల్లో అన్నీ అయిపోతాయని చెప్పారు. జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారు.
- 2014 ఎన్నికలయ్యాక మొదటి సినిమాను పక్కన పెట్టి, చంద్రబాబు కొత్త కథ మొదలుపెట్టారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలన్నదే ఆ స్టోరీ. మట్టి, ఇసుక, బొగ్గు, రాజధాని భూములను, కరెంటు కొనుగోళ్లను వదిలిపెట్టలేదు, విశాఖ భూములను, గుడి భూములను, దళితుల భూములను వేటినీ వదిలిపెట్టకుండా దోచేశారు.
- ఈ మధ్య చంద్రబాబు మరో సినిమా మొదలుపెట్టారు. ఆ సినిమా టైటిల్.. 'ఎన్నికలకు 6 నెలల ముందు, 3 నెలల కోసం'. నాలుగేళ్లు బీజేపీతో, పవన్ కల్యాణ్‌తో కలిసి తిరిగి రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇప్పుడు వాళ్లతో పోరాటం చేస్తున్నట్లుగా చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు.
- మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తానని చంద్రబాబు సినిమా డైలాగులు కొట్టారు. పునాది కూడా పూర్తి కాకుండానే, దాన్ని జాతికి అంకితం చేస్తూ సినిమా చూపిస్తున్నారు.
- ఆయనే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. అయిదేళ్లుగా ప్రత్యేకహోదా గురించి మాట్లాడిన వారి మీద పీడీ యాక్టులు పెట్టి జైలులో వేసే కార్యక్రమాలు చేశారు.
- కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వతం చేస్తామని డైలాగులు కొట్టారు. ప్రత్యేక హోదా 15 ఏళ్లు వస్తుందన్నారు. హోదా తెస్తానని ఇన్ని రోజులు డ్రామాలాడిన చంద్రబాబు, ఇప్పుడు ఎన్నికలకు ఆరు నెలలు ఉండగా నల్లచొక్కా వేసుకుని, ధర్మ పోరాట దీక్షల పేరుతో డ్రామాలు చేస్తున్నారు.
- డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. బెల్టు షాపులు రద్దు చేస్తామన్నారు. పొదుపు సంఘాల రుణాలు వడ్డీలతో సహా కలిసి 2014 నాటికి రూ.14,000 కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.25 వేల కోట్లకు పెరిగాయి. ఈ అయిదేళ్లలో వాటి గురించి ఊసెత్తని చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికల ముందు 'పసుపు, కుంకుమ' అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు.
- ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు రైతులకు కేటాయించామని.. రైతుల చెవుల్లో పువ్వులు పెట్టడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు.
- 57 నెలలు మోసం చేసి... ఇప్పుడు నిరుద్యోగ భృతి అంటున్నారు.
- కట్టని రాజధానిలో వేల ఎకరాల భూములను అమ్ముకుంటున్నారు. బాహుబలి గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతున్నారు.
బాబు, జగన్ ఇద్దరూ అంతే
ఒకే వర్గానికి పరిమితం కాకుండా సమాజంలో అన్ని వర్గాలకూ ప్రయోజనం చేకూర్చే పథకాలను నేతలు ప్రకటించడం ఆహ్వానించాల్సిన విషయమని సీనియర్ జర్నలిస్టు డానీ అన్నారు.
కేవలం రైతుల కోసం ప్రాజెక్టులు, పట్టణాల్లో ఫ్లైఓవర్లు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలందరికీ సాయం అందించేలా అప్పట్లో వైఎస్. రాజశేఖర రెడ్డి కొన్ని పథకాలు ప్రకటించారు. వాటినే జగన్ కాపీ కొట్టి 'నవరత్నాలు' ప్రకటించారు. ఇప్పుడు జగన్ నుంచి చంద్రబాబు కాపీ కొట్టారు.
రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నంత కాలం ధనికులకే సాయం చేస్తారు. ఎన్నికలప్పుడు మాత్రమే వారికి సామాన్య ప్రజలు గుర్తుకొస్తారు. వృద్ధులకు పింఛన్లు, పేదలకు ఆరోగ్య పథకాలు ప్రకటించడం మంచిదేనని డానీ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019: రైతుల కోసం పథకం ‘అన్నదాత సుఖీభవ’
- ఆమెది తెలంగాణ, నాది మహారాష్ట్ర.. స్వలింగ వివాహం చేసుకున్నాం
- ఈ జైల్లో తిండి, నీళ్లు ఉండవు.. కానీ ఖైదీలు ఇక్కడే ఉంటామంటున్నారు
- విజయ్ మాల్యా అప్పగింతకు ఆమోదం లభించింది... కానీ, ఆయన భారత్‌కు వచ్చేదెప్పుడు?
- జార్జి ఫెర్నాండెజ్: ఖాదీ సోషలిస్ట్ పార్లమెంటరీ రెబల్
- #MyVoteCounts: 'గ్రామీణ విద్యార్థుల సమస్యలు తీర్చేవారికే నా ఓటు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








