'గ్రామీణ విద్యార్థుల సమస్యలు తీర్చేవారికే నా ఓటు' #MyVoteCounts

#MyVoteCounts సిరీస్‌లో భాగంగా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయబోతున్న యువతుల మనోగతాన్ని, వారు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏమిటి? ఈ ఎన్నికల నుంచి వాళ్లు ఏం ఆశిస్తున్నారు? అన్న విషయాలను తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది.
తాజాగా గుజరాత్‌లోని నదియాడ్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి బినాల్‌తో బీబీసీ మాట్లాడింది. బినాల్ తొలిసారిగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు.
దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాలు అధికంగా ఉన్నాయని ఈ యువతి అంటున్నారు.
అభివృద్ధి పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకూడదని, దేశంలో అత్యధిక జనాభా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆమె కోరుతున్నారు.
పట్టణాల్లో మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లోనూ నాణ్యమైన విద్యను అందించేందుకు ఎవరు కృషి చేస్తారో వారికే వచ్చే ఎన్నికల్లో ఓటు వేస్తానని బినాల్ స్పష్టం చేశారు.
"నేను పల్లెటూళ్లోనే గుజరాతీ మీడియంలో చదివాను. గుజరాత్‌లోని విద్యార్థుల్లో 60 శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. వారికి పట్టణాల్లో మాదిరి నాణ్యమైన విద్య లభించడంలేదు.
వారికి సరైన విద్య లేకపోతే, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు వారు ఎలా సిద్ధంకాగలరు? పట్టణ విద్యార్థులతో పోటీపడలేరు. వారిలా అనర్గళంగా మాట్లాడలేరు. దాంతో, పోటీ ప్రపంచంలో గ్రామీణ విద్యార్థులు వెనకబడే ప్రమాదం ఉంటుంది.
స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా అని మాట్లాడే ప్రభుత్వం, వాటి గురించి గ్రామీణ విద్యార్థులకు ఏమీ బోధించడం లేదు. ఇలా అయితే వారు ఎలా అభివృద్ధి చెందుతారు?" అని బినాల్ ప్రశ్నిస్తున్నారు.
విద్యా ప్రగతి వార్షిక నివేదిక -2018 ప్రకారం, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థుల్లో కేవలం 44.2శాతం మంది మాత్రమే రెండో తరగతి విద్యార్థుల పాఠాలను చదవగలుగుతున్నారు.
గత పదేళ్లలో నాణ్యమైన విద్యనందించడంలో ప్రైవేటు స్కూళ్లు ఎప్పుడూ ప్రభుత్వ స్కూళ్ల కన్నా ముందే ఉంటున్నాయని ఆ నివేదిక తెలిపింది.

"గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన అందించే విషయాన్ని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే, నాయకుల పిల్లలు పెద్ద పెద్ద స్కూళ్లకు వెళ్తారు. వారికి గ్రామీణ విద్యార్థుల సమస్యలపై ఎలాంటి ఆసక్తీ లేదు" అని ఈ యువతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
"వచ్చే ఐదేళ్లలో నేను యూపీఎస్సీ పరీక్ష పాసై, పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నా. గ్రామీణ విద్యార్థులకోసం ఏదైనా చేయాలనుకుంటున్నా. అప్పుడు వారు కూడా వారి కలలను నిజం చేసుకుంటారు. జీవితంలో ముందుకు సాగుతారు" అని బినాల్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- గర్భనిరోధక పిల్ రోజూ వేసుకోవచ్చా.. ఇది అందరికీ ఎందుకు పని చేయదు
- 1948 జనవరి 30: మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచిందంటే...
- జార్జి ఫెర్నాండెజ్: ఖాదీ సోషలిస్ట్ పార్లమెంటరీ రెబల్
- "మా ఊళ్లో పక్కా ఇళ్లు కట్టుకోవద్దని దేవుడు చెప్పాడు.. మట్టి ఇళ్లలోనే ఉంటాం’’
- #MyVoteCounts: ఉద్యోగాలు ఇచ్చే పార్టీకే ఓటేస్తా
- 'వక్షోజం తొలగించిన చోట టాటూ ఎందుకు వేయించుకున్నానో తెలుసా...'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









