బ్రెస్ట్ కేన్సర్: 'వక్షోజం తొలగించిన చోట నేను టాటూ ఎందుకు వేయించుకున్నానో తెలుసా?'

ఫొటో సోర్స్, KRIS HALLENGA
- రచయిత, లూసీ వాలిస్
- హోదా, బీబీసీ స్టోరీస్
23 ఏళ్ల వయసులో క్రిస్ హల్లెంగాకు బ్రెస్ట్ కేన్సర్ ఉందని తెలిసింది. సగటున ఇలాంటి ఫలితాలు వచ్చిన వారిలో రెండున్నరేళ్లు మాత్రమే జీవిస్తారు.
కానీ పదేళ్ల తర్వాత కేన్సర్ సమస్యను అధిగమించడం సాధ్యమే అని ఆమె ప్రజలకు చెప్పాలనుకున్నారు.
ఆపరేషన్ చేసి వక్షోజం తీసేసిన దగ్గర క్రిస్ హెల్లెంగా ఒక తాడుపై నడుస్తున్న కళాకారిణి టాటూను వేయించుకున్నారు.
నేను ఈ టాటూను బహుశా మూడేళ్ల క్రితం వేయించుకున్నాను. మనకు ఏదైనా వ్యాధి ఉంటే దాన్ని, మిగతా జీవితంతో ఎలా బ్యాలెన్స్ చేయచ్చు అనేదానికి ఇది గుర్తు అన్నారు.
క్రిస్ స్నేహితుడు టీవీ, రేడియో ప్రజంటర్ ఫియర్నె కాటన్ ఈ టాటూను డిజైన్ చేశారు.
నేను ఆ మచ్చను దాయాలనుకోలేదు. నేను దాన్ని ఒక కళాఖండంలాగా ప్రదర్శించాలని అనుకుంటున్నాను.

ఫొటో సోర్స్, KRIS HALLENGA
కేన్సర్ నా శత్రువు కాదు
నన్ను ఇది నిజంగా కుంగదీయలేదు. మన ఉన్న పరిస్థితిని అంగీకరించినపుడు, దేనితో అయినా మెరుగ్గా పోరాడవచ్చు. అందుకే నా శరీరంలో క్యాన్సర్‌ను నేను శత్రువులా చూడలేదు. దానితో పోరాడ్డానికి బదులు.. దానితో కలిసి పనిచేయాలని అనుకున్నాను.
2009లో బ్రెస్ట్ కేన్సర్ అడ్వాన్స్‌డ్ స్టేజిలో ఉందని తెలిసినప్పుడు ఆమె భయపడిపోలేదు. బదులుగా యువతుల్లో ఆ వ్యాధి గురించి అవగాహన కల్పించాలనుకున్నారు. క్రమం తప్పకుండా వక్షోజాలను పరీక్ష చేయించాలని వారికి చెప్పడానికి కోప్పఫీల్ అనే చారిటీ ప్రారంభించారు.
కేన్సర్ ఉందని గుర్తించకముందే జీవితం ఎంత అనూహ్యమో ఆమెకు తెలుసు. 15 ఏళ్లకే నానమ్మ , తర్వాత ఐదేళ్లకు నాన్న చనిపోవడంతో క్రిస్ కుంగిపోయారు.
23 ఏళ్లకు నాకు ఈ వ్యాధి గురించి తెలిసేటప్పటికే, మనం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతామని, జీవితం శాశ్వతం కాదనే విషయం నాకు తెలుసు. ఆ అవగాహన నాకు నా పరిస్థితిని ఎదుర్కోడానికి సాయపడింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 19కి ఆమెకు స్టేజ్-4 బ్రెస్ట్ కేన్సర్ వచ్చిందని తెలిసి పదేళ్లు పూర్తవుతాయి.
క్రిస్ శరీరంలో కేన్సర్ అప్పటికే ఆమె పొత్తికడుపు, కాలేయం, తుంటిలోకి వ్యాపించింది. ఆమెకు మెదడులో కణిత కూడా ఉంది.
నాకు అదంతా తెలిసినపుడు, రెండున్నరేళ్లలో చనిపోతున్నానని నేను అనుకోలేదు. కానీ చాలా కాలం బతుకుతాననే విషయం కూడా తెలీదు.

ఫొటో సోర్స్, KRIS HALLENGA
40 ఏళ్లుగా పెరిగిన మనుగడ రేటు
డాక్టరు తనకు చనిపోతావని ఎప్పుడూ చెప్పలేదని క్రిస్ చెప్పారు. అందుకే నేను వ్యాధి నుంచి కోలుకోగలిగాను. నేను అలాంటి గడువులు కూడా నమ్మను అన్నారు.
క్రిస్ డాక్టర్ డంకన్ వీట్లీ కూడా "వ్యాధి బయాలజీని బట్టి వారు జీవించే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు ఒకేలా కనిపించినా అది ఒకరికి ప్రమాదకరం కావచ్చు. కానీ గత పదేళ్లుగా అత్యాధునిక చికిత్సలు కూడా వచ్చాయి. క్రిస్‌కు ఇచ్చిన కొన్ని మందులు ఆమెకు మొదట ఆ వ్యాధిని గుర్తించినపుడు అందుబాటులోనే లేవు" అన్నారు.
"బ్రెస్ట్ కేన్సర్ చికిత్స ప్రత్యామ్నాయాలు కూడా పెరుగుతున్నాయి. అంటే మనం బ్రెస్ట్ క్యాన్సర్‌ను మనల్ని చంపేసే జబ్బులా చూడకుండా దానిని ఒక దీర్ఘకాలిక వ్యాధిలా భావించవచ్చు. హైబీపీ, గుండె సమస్యలకు మనం ఎలా చికిత్స తీసుకుంటామో దానికి కూడా అలాగే చేయవచ్చు".
బ్రెస్ట్ కేన్సర్ సర్వైవల్ రేట్ కూడా గత 40 ఏళ్లుగా పెరుగుతూ వస్తోంది. మాక్‌మిలన్ కాన్సర్ సపోర్ట్ ప్రకారం 1970లో పది మందిలో ఐదుగురు మహిళలు మాత్రమే వ్యాధి గుర్తించిన ఐదేళ్ల తర్వాత కూడా బతికేవారు.
కానీ ఇప్పుడు పది మందిలో 8 మంది ప్రాణాపాయం తప్పించుకుంటున్నారు.

ఫొటో సోర్స్, KRIS HALLENGA
పదేళ్ల నాటి క్రిస్ ఇప్పుడు లేదు
కేన్సర్ మొదట్లోనే గుర్తించడం వల్ల బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్టేజ్ ఫోర్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోలిస్తే, స్టేజ్ వన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పది మందిలో తొమ్మిది మంది మహిళలు ఐదేళ్లకు పైనే జీవించవచ్చు.
క్రిస్ లాంటి రోగులు ఊహించిన దానికంటే ఎక్కువ కాలం బతకగలుగుతారు. వాళ్లను "లాంగ్ టైం సర్వైవర్స్" అంటుంటాం.
ఇంకా సజీవంగా ఉన్నాననే విషయాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి క్రిస్ ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 19న తన కోప్పాఫీల్ ఉద్యోగులకు సెలవు కూడా ఇస్తారు.
ఈ ఏడాది ఆమె తన స్నేహితులు, కుటుంబంతో పార్టీకి ప్లాన్ చేస్తున్నారు.
గత పదేళ్లుగా క్రిస్ చాలా మారారు. కానీ, ఆమెలో సానుకూల దృక్పథం మాత్రం అలాగే ఉండిపోయింది.
"నాకు వ్యాధి రాక ముందే ఆత్మవిశ్వాసంతో ఉండేదాన్ని. అందుకే నాకు కేన్సర్ ఉందని చెప్పిన ఆ రోజు క్రిస్ నాకు కనిపించదు. తను నాకిప్పుడు చాలా వింతగా కనిపిస్తుంది. కానీ పదేళ్లు అంటే సహజంగా మనలో చాలా మార్పులు వస్తాయి కదా" అంటారు క్రిస్.

ఫొటో సోర్స్, KRIS HALLENGA
ఆత్మవిశ్వాసం పెంచేలా వీడియో
ఇప్పుడు యువతులుగా ఉన్న వారు మధ్య వయసుకు రాగానే ఆస్పత్రులకు వెళ్లి తమ వక్షోజాలను పరీక్షించుకున్నప్పుడే తన ఉద్దేశం నెరవేరినట్లు అవుతుందని క్రిస్ చెబుతారు.
బ్రెస్ట్ కేన్సర్ వచ్చే ప్రమాదం 30 ఏళ్ల ముందు నుంచీ ఉంటుంది. అప్పుడు దాదాపు 0.05 శాతం లేదా 2 వేల మందిలో ఒకరికి ఉంటుంది. 50 ఏళ్ల వయసులో అది 2 శాతానికి చేరుతుంది. బ్రిటన్‌లో 70 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురిలో ఒకరికి బ్రెస్ట్ కేన్సర్ గుర్తిస్తున్నారు.
'కోప్పాఫీల్' సీఈవోగా చాలా ఏళ్ల క్రితమే తప్పుకున్న క్రిస్ ఇప్పటికీ తన చారిటీ కోసం పార్ట్ టైమ్ పనిచేస్తుంటారు. ఆమె లండన్ నుంచి కార్న్‌వాల్ వెళ్లిపోయారు. అక్కడ తన కవల సోదరితో కలిసి ఉంటున్నారు.
గత ఏడాది చివర్లో ఆమె ఒక మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించారు. మహిళలల్లో తమ శరీరం గురించి ఆత్మవిశ్వాసం పెంచడానికి చేసిన ఈ వీడియోలో ఆమె తన టాటూతో కనిపించి చాలా మందిలో స్ఫూర్తి నింపారు.
"నేను అందులో నా టాటూ కనిపించేలా ఉండే డ్రెస్ వేసుకున్నా. అది దాచుకోవడం వల్ల నేను ఆ వీడియోలో కనిపించి ప్రయోజనం ఏముంటుంది"? అన్నారు క్రిస్.

ఫొటో సోర్స్, KRIS HALLENGA
చావుబతుకుల మధ్య బ్యాలెన్స్
"కేన్సర్ ఉన్నా లేకున్నా అందరిలా కనిపించాలని మహిళలు చాలా ఒత్తిడికి గురవుతారు. కానీ ఈ వీడియో తర్వాత వాళ్లకు నేనొక సందేశం ఇచ్చాను. ఈరోజు నేను నా వక్షోజం తొలగించిన ప్రాంతాన్ని అందరికీ కనిపించేలా చేశాను. అక్కడ కవర్ చేయాలని నేను అసలు అనుకోలేదు. అది నాకు చాలా బాగా అనిపించింది" అన్నారు.
ఎదపై ఉన్న టాటూలో తాడుపై నడిచే కళాకారిణి లాగే తను కూడా ఆరోగ్య పరిస్థితిని, మిగతా జీవితాన్ని బ్యాలెన్స్ చేయాలని క్రిస్ చూస్తున్నారు. ఎంతోకాలం అది సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు.
"కానీ, మనం అన్ని సార్లూ దాన్ని పూర్తిగా బ్యాలెన్స్ చేయలేం. ముఖ్యంగా కేన్సర్ మళ్లీ పెరిగితే, నేను నా ప్రాణాలే కోల్పోవచ్చు".
"కానీ గతంలో ఎన్నో కష్టాలను చూసిన నేను జీవితంలో ఇప్పటికే చాలా చేశానని తెలుసు. నేను సాధించినవి చూస్తే నాకు ఆనందంగా, గర్వంగా ఉంటుంది. అవే నన్ను మరణానికి భయపడకుండా చేస్తున్నాయి. అసలు నాకు అలాంటి ఒత్తిడే ఉండదు" అంటారు క్రిస్
ఇటీవల తన కేన్సర్ మళ్లీ తిరగబెట్టినట్టు క్రిస్‌కు తెలిసింది. ప్రస్తుతం ఆమె తనకు అవసరమైన చికిత్స తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో పురుషుల కన్నా మహిళలకే ఎక్కువగా క్యాన్సర్! ఎందుకు?
- ఆమె చనిపోతే రెండో బాలిక కూడా చనిపోతారు
- అఘోరాలు ఎవరు... ఎందుకలా శవాల మధ్య గడుపుతారు...
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- డేటింగ్ చేయడానికి కూడా లీవులు ఇస్తారా...
- పదేళ్లుగా కోమాలో ఉన్న మహిళ ప్రసవం... మగ నర్సుని అరెస్ట్ చేసిన పోలీసులు
- ప్రియాంకా గాంధీని 'భయ్యాజీ' అని ఎందుకంటారు
- ఈ బాలుడు పడుకుంటే.. అతని ప్రాణానికే ముప్పు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









