చంద్రబాబు పాలనకు ఏపీ ప్రజలు ఇచ్చిన రేటింగ్ ఎంత? జనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఏడీఆర్ సర్వే ఏం చెప్తోంది?

ఫొటో సోర్స్, TDP.Official/facebook
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రాధాన్యతలను అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లు కనబడుతోందని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) సంస్థ ఒక సర్వే నివేదికలో పేర్కొంది. ఓటర్లు అత్యంత ప్రాధాన్యంగా పేర్కొన్న టాప్ 10 అంశాలలో ప్రభుత్వం పనితీరు పేలవంగా ఉందని విశ్లేషించింది.
ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తమ ప్రధాన సమస్యలుగా చెప్తున్న పది ప్రాధాన్య అంశాలలో ప్రభుత్వ పనితీరుకు మొత్తం 5 పాయింట్లలో సగటు 3 పాయింట్ల కన్నా తక్కువ పాయింట్లే లభించాయని వివరించింది.
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ RA అస్టేరిస్క్స్ కంప్యూటింగ్ అండ్ డేటా సొల్యూషన్స్ ప్రెవేట్ లిమిటెడ్ (RAAC)తో కలిసి 2018 అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఓటరు సర్వే నిర్వహించినట్లు వెల్లడించింది. ఇది దేశంలోనే అతి పెద్ద ఓటరు సర్వే కావచ్చునని పేర్కొంది.
ఓటర్లు తమ దైనందిన జీవితాలను ప్రభావితం చేసే అంశాలుగా వేటిని భావిస్తారు? ఆ సమస్యల పరిష్కారానికి ఓటర్లు తమ ప్రభుత్వాలు చేస్తున్న కృషి తో సంతోషంగా ఉన్నారా? అని తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించామని వివరించింది.

ఫొటో సోర్స్, Facebook/Election Commission of India
నిర్దిష్ట పాలనా సమస్యలపై ఓటర్ల ప్రాధాన్యతలు, ఆ అంశాలపై ప్రభుత్వ పనితీరుకు ఓటర్లు ఇచ్చే రేటింగ్, ఎన్నికల్లో ఓటింగ్ ప్రవర్తనను ప్రభావితం చేసే అంశాలను గుర్తించటం ఈ సర్వే ప్రధాన లక్ష్యాలుగా చెప్పింది.
దేశంలోని 534 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ సర్వే చేశామని.. 2,73,487 మంది ఓటర్లు పాల్గొన్నారని ఏడీఆర్ తెలిపింది. దేశ వ్యాప్త నివేదికతో పాటు రాష్ట్రాల వారీగా సర్వే ఫలితాలను విశ్లేషిస్తూ సోమవారం నివేదికలు విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నివేదికలో.. సర్వే ప్రశ్నావళిలోని 31 అంశాలలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అత్యంత ముఖ్యమైనవిగా పేర్కొన్న 10 పాలనా సమస్యలను విశ్లేషించింది. రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంటరీ నియోజకవర్గాలలో సుమారు 12,500 మంది ఓటర్లు ఈ సర్వేలో పాల్గొన్నట్లు చెప్పింది.

ఏడీఆర్ ఓటరు సర్వేలో వెల్లడైన ముఖ్యమైన అంశాలు ఇవీ...
రాష్ట్రంలో ప్రధాన సమస్యలు.. ఉపాధి, తాగు నీరు, ఆరోగ్యం
-ఆంధ్రప్రదేశ్ సర్వే 2018 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా చూసినపుడు.. మెరుగైన ఉపాధి అవకాశాలు (46.14 %), తాగు నీరు (45.25 %), మెరుగైన ఆస్పత్రులు/ప్రాధకమిక ఆరోగ్య కేంద్రాలు (31.40 %) ఓటరు ప్రాధాన్యతలలో అగ్రస్థానంలో ఉన్న మూడు అంశాలు.
-మెరుగైన ఉపాధి అవకాశాల విషయంలో ప్రభుత్వ పనితీరుకు సర్వేలో పాల్గొన్న ఓటర్లు ఐదు మార్కులకు గాను 2.10 మార్కులే ఇచ్చారు. ఇక తాగు నీరు విషయంలో 2.04 మార్కులు, ఆరోగ్య రక్షణ విషయంలో 2.72 మార్కులు ఇచ్చారు. ఇవి మొత్తం సగటు కన్నా తక్కువ రేటింగ్.

గ్రామాల్లో.. సాగు నీరు, సేద్యానికి సబ్సిడీ, వ్యవసాయ విద్యుత్
- అయితే.. గ్రామీణ ప్రాంతంలో ఓటర్ల ప్రాధాన్యతలు వ్యవసాయానికి నీటి లభ్యత (48 %), విత్తనాలు / ఎరువులకు వ్యవసాయ సబ్సిడీ (46 %), వ్యవసాయ విద్యుత్ (44 %) అగ్ర స్థానంలో ఉన్నాయి.
- ఈ మూడు అంశాలపై ప్రభుత్వ పనితీరుకు.. సాగు నీటి లభ్యత విషయంలో 2.13 మార్కులు, విత్తనాలు/ఎరువుల మీద వ్యవసాయ సబ్సిడీ అంశంలో 1.99 మార్కులు, వ్యవసాయ విద్యుత్ విషయంలో 2.19 మార్కులు ఇచ్చారు ఓటర్లు. ఈ రేటింగ్స్ కూడా సగటు కంటే తక్కువే.
- అంతేకాదు.. గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన ఉపాధి అవకాశాలు అందించడంలో (2.08 మార్కులు), తాగునీరు అందించటంలో (2.12 మార్కులు) కూడా ప్రభుత్వానికి సగటు కన్నా తక్కువ రేటింగే లభించింది.

పట్టణాల్లో.. ఉపాధి, తాగు నీరు, కాలుష్యం
- ఇక పట్టణ ఓటర్లు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తున్న అంశాలు.. మెరుగైన ఉపాధి అవకాశాలు (58%), తాగు నీరు (55%), వాయు / నీటి కాలుష్యం (53%).
- పట్టణ ఓటర్ల ప్రాధాన్యతలలో ప్రభుత్వ పనితీరుకు.. మెరుగైన ఉపాధి అవకాశాల విషయంలో 2.13 మార్కులు, తాగు నీటి విషయంలో 1.91 మార్కులు, వాయు / నీటి కాలుష్యం విషయంలో 2.19 మార్కులు వచ్చాయి.
- అలాగే.. పట్టణ ప్రాంతంలో ప్రభుత్వ పనితీరుకు ధ్వని కాలుష్యం విషయంలో 1.96 మార్కులు, ట్రాఫిక్ రద్దీ అరికట్టడంలో 1.98 మార్కులు లభించాయి. ఇది కూడా సగటు కంటే తక్కువ రేటింగే.

ఓటర్ల ప్రాధాన్యతలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందా?
‘‘ఆంధ్ర ప్రదేశ్ సర్వే రిపోర్టు 2018 ప్రకారం రాష్ట్రంలో ఓటర్ల ప్రాధాన్యతలను అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లు కనబడుతోంది. దాదాపు ఓటరు ప్రాధాన్యత అంశాలలోని టాప్ 10 అంశాలలో ప్రభుత్వం పనితీరు పేలవంగా ఉంది’’ అని ఏడీఆర్ నివేదిక పేర్కొంది.
ఈ విశ్లేషణ ప్రభుత్వానికి, శాసన సభ్యులకు కొన్ని కీలకమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని చెప్పింది.
‘‘మౌలికవసతులు, సాంఘిక మరియు ఆర్ధిక అభివృద్ధి వంటి వివిధ రంగాలలో ప్రజా విధానాలకు సంబంధించిన నిర్ణయాలు సమాజంలోని కొన్ని వర్గాలకు అనుకూలంగా చేస్తున్నారా?’’ అన్నది అందులో ఒక ప్రశ్నగా చెప్పింది.

ఓటర్ల ప్రాధాన్యతల ప్రకారం ప్రభుత్వం బడ్జెట్ ఖర్చులు, కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందా?
మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలపై రాజకీయ పార్టీలను మరింత జవాబుదారీగా ఎలా చేయగలం?
సమాజం లోని నిమ్న వర్గాలకు ఉపాధి, మంచి ఆరోగ్య సంరక్షణ, తాగునీటి వసతులు అందించడానికి ఎటువంటి విధానపరమైన మార్పులు చేయాలి?
...అనే అంశాలపై చర్చ జరగాల్సి ఉందని ఏడీఆర్ పేర్కొంది.

ఏడీఆర్ సర్వే మెథడాలజీ ఇదీ...
ప్రభుత్వం నుండి ఓటర్లు ఏం ఆశిస్తున్నారనే అంశం మీద మెరుగైన అంచనా తెచ్చుకోవటంతో పాటు.. పాలనకు సంబంధించిన అంశాలపై పరిశోధనతో కూడిన చర్చ, చర్యలకు సంబంధించిన అగాధాన్ని పూరించటానికి ఈ సర్వే ప్రయత్నమని ఏడీఆర్ వివరించింది.
‘‘ఈ సర్వే ని ఉత్తమమైన శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి నిర్వహించడం జరిగింది’’ అని చెప్పింది. జనాభాలో గ్రామీణ - పట్టణ నివాసం, లింగం, కులం, మతం, ఆదాయ వర్గాల వారీగా తగిన ప్రాతినిధ్యం ఉండే విధంగా 18 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళను ఈ సర్వే కోసం ఎంపిక చేసినట్లు తెలిపింది.
సర్వే లో పాల్గొన్న వారిలో 61 % మంది గ్రామీణ ప్రాంతాల నుండి, 39 % పట్టణ ప్రాంతాల నుండి ఉన్నారని; 62 % మంది పురుషులు, 38 % మంది మహిళలు; 72 % మంది జనరల్, 7 % ఓబీసీ, 16 % ఎస్‌సీ, 5% ఎస్‌టీ వర్గాల ప్రజలు ఉన్నారని చెప్పింది.
సర్వే నిష్పాక్షికంగా ఉండేలా ప్రతి జాగ్రత్త తీసుకున్నామని, సర్వే ఖచ్చితత్వం 95 శాతమని పేర్కొంది.
ఈ సర్వే ఏ ప్రభుత్వ లేదా రాజకీయ పార్టీ లేదా వ్యక్తిగత లేదా ఏ ఇతర సంస్థ లేదా సంస్థను అభినందిస్తూ లేదా విమర్శించే ప్రయత్నం కోసం చేసింది కాదని ఏడీఆర్ స్పష్టంచేసింది.
పథకాల అమలు తీరుపై పూర్తి సంతృప్తిగా ఉన్నారు: వై బి రాజేంద్రప్రసాద్, టీడీపీ ఎమ్మెల్సీ
‘‘ఏపీలో ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ప్రతి కుటుంబానికి కనీస ఆదాయం 10వేలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అందరికీ తోడ్పాటు అందిస్తోంది.
పథకాల అమలు తీరు మీద ప్రజలు పూర్తి సంతృప్తి గా ఉన్నారు.
ప్రభుత్వం నిత్యం టెక్నాలజీ సహాయంతో అమలు తీరుని పర్యవేక్షిస్తోంది.
ఆర్టిజీఎస్ ఆధ్వర్యంలో పారదర్శకత ప్రదర్శిస్తోంది. ఐవీఆరెస్ ద్వారా జనం నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని దానికి అనుగుణంగా చేపడుతున్న చర్యలతో సంతృప్తి శాతం పెరుగుతోంది.
అయినా దానిని గుర్తించకుండా ఇచ్చే నివేదికలు అర్థం లేనివి. జనం వాటిని హర్షించరు’’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఇవికూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








