ఈ తెగలో వ్యభిచారం ఓ ఆచారం, ఇక్కడ అమ్మాయి పుడితే సంబరాలు చేసుకుంటారు

భారత్‌లో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో అమ్మాయి వద్దు, అబ్బాయే పుట్టాలి అని కోరుకునేవారు చాలామందే ఉంటారు. కానీ హీనా పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులు సంబరాలు చేసుకున్నారు. కానీ ఈ సంబరాలు మంచి పని కోసం కాదు.
హీనా... మధ్యప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో నివసించే బచ్చారా తెగకు చెందిన మహిళ.
ఈ తెగలోని కుటుంబాల్లో పుట్టిన మొదటి అమ్మాయిని పది పన్నెండేళ్ల వయసు వచ్చేసరికి వ్యభిచారంలోకి దింపుతారు. ఈ ఆచారం శతాబ్దాల నుంచి కొనసాగుతోంది. ఆ అమ్మాయికి వయసైపోగానే, ఆమె సోదరిని ఈ వృత్తిలోకి లాగుతారు.
తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. వ్యభిచారం ద్వారా ఈ మహిళలు సంపాదించిన డబ్బుతోనే కుటుంబంలోని పురుషులు తమ జీవితం గడుపుతారు. కొన్ని చోట్ల, ఈ అమ్మాయిల తండ్రి లేదా సోదరుడే విటులను తీసుకువచ్చే పని కూడా చేస్తారు.
ఈ తెగలో పెళ్లిళ్లు కూడా వింతగా జరుగుతాయి. అమ్మాయి కుటుంబం భారీ వరకట్నాన్ని కోరుకుంటుంది.

"నా ముందున్న అవకాశాలేంటి?"
హీనా పుట్టినప్పటి నుంచే తనను తమ తెగ ఆచారాన్ని దృష్టిలో ఉంచుకుని పెంచారు. మైనర్‌గా ఉండగానే ఆమెను వ్యభిచార వృత్తిలోకి దింపారు. "నన్ను బలవంతంగా పడుపు వృత్తిలోకి దింపేనాటికి నా వయసు 15. చదువు మానేసి, మా అమ్మ, అమ్మమ్మల మార్గంలోనే నేనూ బతుకుతున్నా" అని హీనా బీబీసీకి చెప్పారు.
ప్రతిరోజూ గ్రామాల్లో నివసించే ధనవంతుల దగ్గర నుంచి ట్రక్కు డ్రైవర్ల వరకూ.. ఎందరో విటులు ఆమె దగ్గరకు వస్తూంటారు.
"18 ఏళ్లు వచ్చేసరికి, నేను చేస్తున్నది ఎంత తప్పుడు పనో అర్థమైంది. చాలా కోపం వచ్చింది. కానీ నాకిప్పుడు ఏం అవకాశాలున్నాయి? వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదించకపోతే నా కుటుంబం ఎలా బతుకుతుంది?"
సంచార జాతికి చెందిన ఈ బచ్చారా తెగ ప్రజలు చాలా పేదరికంలో ఉంటారు. సాధారణంగా వీరు గ్రామీణ ప్రాంతాల్లోను, హైవేల పక్కన ట్రక్కు డ్రైవర్లు ఆగేచోట నివసిస్తుంటారు. ఈ తెగలోని కుటుంబాల ఆర్థిక స్థితి మహిళలపైనే ఆధారపడి ఉంటుంది.
"ఈ వృత్తిలో ఉన్నవారిలో మూడొంతుల్లో ఒకవంతు మైనర్లే" అని ఓ స్థానిక ఎన్జీఓ కార్యకర్త ఆకాశ్ చౌహాన్ తెలిపారు.

వీరి జీవితం ఎలా ఉంటుంది?
ఖిలవాడీ (ఆడుకునేవారు) అని పిలుచుకునే ఈ తెగలోని బాలికలు ఒంటరిగా లేదా బృందాలుగా నులకమంచాలపై కూర్చొని అబ్బాయిలకోసం ఎదురుచూస్తూంటారు. వీరికి సంబంధించిన వ్యవహారాలు చూసేందుకు దగ్గరలోనే ఉన్న ఓ చిన్న దుకాణాల వద్ద కుటుంబ సభ్యుడెవరో ఒకరు ఉంటారు.
వీరితోనే విటులు తమ సంభాషణలు జరుపుతారు. సాధారణంగా ఒక్కొక్కరి నుంచి వీరికి వచ్చేది రూ.100 నుంచి రూ.200 ఉంటుంది.
కన్యగా ఉండే బాలికలకైతే ఎక్కువ డబ్బులు అంటే దాదాపు రూ.5000 వరకూ కూడా ఇవ్వడానికి సిద్ధపడతారని కొందరు స్థానికులు చెబుతున్నారు.
"పగటివేళలో రోజుకు నలుగురైదుగురు పురుషులు వస్తారు. రాత్రి వేళల్లో మేమే దగ్గరలోని హోటళ్లకో మరో ప్రదేశానికో వెళ్తాం. ఈ వృత్తి వల్ల వ్యాధులు సోకే ప్రమాదం ఎప్పుడూ పొంచే ఉంటుంది" అని హీనా చెబుతున్నారు.
ఇలా వచ్చే ఆరోగ్య సమస్యలపై 2000 సంవత్సరంలో 'ది హిందూ' ఓ కథనం రాసింది. ఈ తెగకు చెందిన 5500 మంది రక్త నమూనాలను పరీక్షిస్తే వాటిలో 15% మందికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలిందని ఆ కథనంలో పేర్కొంది.

ఈ వృత్తిలోని కొందరు ఖిలవాడీలకు పిల్లలు కూడా పుడుతున్నారు. కొన్ని సంవత్సరాల్లోనే హీనా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఆ తర్వాత ఆమెను మరింతగా కష్టపడి పనిచేయమని ఒత్తిడి పెరిగింది.
"చాలామంది అమ్మాయిలు పిల్లలు పుట్టాక కూడా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. పిల్లల పోషణ కోసం మరింతగా కష్టపడాలంటూ వీరిపై ఒత్తిడి పెరుగుతోంది" అని హీనా తెలిపారు.
సెక్స్ వర్కర్‌గా ఉంటూ తమ తెగలోని అబ్బాయిని పెళ్లిచేసుకోవడం ఇక్కడ నిషేధం.
ఓ స్థానిక ఎన్జీఓ సాయంతో ఈ ఆచారంపై హీనా పోరాటం చేస్తోంది.
"ఈ దురాచారానికి బలైన అమ్మాయి మాత్రమే దీనిలోని బాధను అర్థం చేసుకోగలదు. అదెలా ఉంటుందో నాకు తెలుసు. ఈ ఆచారాన్ని అంతం చేయడానికి నేను ప్రయత్నిస్తున్నా" అని హీనా అంటున్నారు.
ఈ సామాజిక ఆచారం ఎలా మొదలైందనే దానిపై ఎన్నో సిద్ధాంతాలున్నాయి. ఈ సంచారజాతి డబ్బులు సంపాదించడానికి ఎన్నో ఇబ్బందులు పడి, చివరికి వ్యభిచారాన్ని దానికి పరిష్కారంగా ఎంచుకుంది అనేది వాటిలో ఒకటి.

చట్టం ఏం చెబుతోంది?
భారత్‌లో చాలా కుటుంబాల్లో మగ సంతానమే కావాలని కోరుకోవడం వల్ల స్త్రీ, పురుష నిష్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. కానీ ఇక్కడ సమస్య మరొకటి.
"ఈ తెగలో దాదాపు 33000 మంది జనాభా ఉంటే, వీరిలో 65శాతం మంది మహిళలు" అని ఆకాశ్ చౌహాన్ తెలిపారు. ఈ ప్రాంతానికి బాలికల అక్రమ రవాణా కూడా ఇక్కడ మహిళల జనాభా ఎక్కువ ఉండటానికి ఓ కారణం.
"గత కొన్ని నెలల్లో ఈ ప్రాంతంలో దాదాపు 50 మంది మైనర్లను మేం రక్షించాం. వారిలో రెండేళ్ల శిశువు కూడా ఉంది. ఆ చిన్నారిని సంరక్షణ కేంద్రానికి పంపించాం. ఇలాంటి దాడులు మేం తరచుగా నిర్వహిస్తున్నాం. కానీ తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం సామాజిక స్పృహ పెరిగినప్పుడే అంతమవుతుంది" అని పోలీస్ సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ సింగ్ బీబీసీతో అన్నారు.
12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష విధించేలా ఇటీవలే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఓ చట్టం అమల్లోకి తెచ్చింది.
అలాగే 18ఏళ్ల లోపువారితో లైంగికసంబంధం పెట్టుకునేవారికి జైలుశిక్షను పెంచుతూ కూడా నిర్ణయం తీసుకుంది. కానీ ఇవేమీ తగిన ఫలితాలనివ్వడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
పరిష్కారాలేంటి?
బచ్చారాల్లో వ్యభిచారాన్ని అరికట్టేందుకు 1993లో జబాలి అనే ఓ పథకాన్ని ప్రారంభించారు. కానీ ఇది ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు.
"ఈ పథకం అమలుకు ఎన్జీవోలు సాయం చేయాలని కోరుతూ ప్రతి సంవత్సరం ప్రకటనలిస్తున్నాం. కానీ అర్హులైన వారెవరూ ముందుకురావడం లేదు" అని మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర మహాజన్ తెలిపారు.
జబాలి పథకం ముఖ్యంగా ఈ మహిళలకు విద్య, ఆరోగ్యంపై అవగాహన కల్పించి వారికి పునరావాసం కల్పించడంపై ప్రధానంగా దృష్టిసారిస్తుంది. అయితే ప్రభుత్వం సాయం చేసినా, చెయ్యకపోయినా మార్పైతే నెమ్మదిగా జరుగుతోంది.
ఈ తెగలోని కొందరు యువతీయువకులు తమ తెగ సంప్రదాయాన్ని పక్కనెపెట్టి వేరే ప్రదేశాల్లో విద్య, ఉద్యోగావకాశాలను వెతుక్కుంటున్నారు.
స్థానికంగా ఉన్న కొన్ని సంస్థలు కూడా వారికి కొంత సహాయాన్నందిస్తున్నాయి.

ఇప్పుడు హీనా కూడా 2016లో తనను కాపాడిన అలాంటి ఓ సంస్థలో భాగమే.
"అమ్మాయిలకు ఇంకా ఎన్నో అవకాశాలున్నాయనే విషయాన్ని వారికి తెలియజేస్తున్నాను. ఈ వృత్తి నుంచి బయటపడేందుకు వారికి అవసరమైన మద్దతునందిస్తున్నా. నేనేం చెయ్యగలనో అంతా చేస్తా" అంటున్నారు హీనా.
మైనర్లకు చదువు చెప్పేందుకు ఈ ఎన్జీఓ స్థానికంగా ఓ శిక్షణ కేంద్రాన్ని కూడా నడుపుతోంది.
"ఈ బాలికలందరూ బలవంతంగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. ఎందుకంటే వారికి ఇతర ఉపాధి అవకాశాలేమీ లేవు. చదువు మాత్రమే వారిని వ్యభిచార వృత్తి నుంచి దూరం చేయడానికి సాయపడుతుంది" అని హీనా చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి.
- ‘వ్యభిచార గృహానికి అమ్మేశాక.. నేను ఆడుకోవడం మర్చిపోయా’
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- ‘నిర్భయ’లపై మళ్లీ మళ్లీ అత్యాచారం
- షికాగో సెక్స్ రాకెట్: 'వ్యభిచారం ఈనాటిది కాదు.. సినీరంగాన్ని నిందించటం సరికాదు'
- నేను వేశ్యగానే ఉంటా : వ్యభిచార వృత్తిలో కొనసాగే హక్కు కోసం పోరాడిన మహిళ
- మొదటి ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూను మించిన మెజార్టీ సాధించిన తెలుగు ఎంపీ
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








