తెలంగాణ: మొదటి ఎన్నికల్లో నెహ్రూను మించిన మెజార్టీ సాధించిన తెలుగు ఎంపీ

ఫొటో సోర్స్, Getty Images
స్వతంత్ర భారతంలో జరిగిన మొట్టమొదటి లోక్‌సభ (1951-52) ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత జవహర్‌లాల్ నెహ్రూను మించిన మెజార్టీతో ఒక తెలుగు నేత గెలుపొందారు. అంతేకాదు, దేశంలోనే ఆ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు పొందిన లోక్‌సభ అభ్యర్థిగా కూడా రికార్డు సృష్టించారు.
ఆయన ఎవరో కాదు.. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావినారాయణ రెడ్డి.
హైదరాబాద్ రాష్ట్రంలోని నల్గొండ నియోజకవర్గం నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు.
అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలో 17 ఏకసభ్య నియోజకవర్గాలు, నాలుగు ద్విసభ్య నియోజకవర్గాలు ఉండేవి. ద్విసభ్య నియోజకవర్గాలకు ఇద్దరు చొప్పున సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు.

ఫొటో సోర్స్, fb/loksabha1
నల్గొండ కూడా అప్పుడు ద్విసభ్య నియోజవర్గంగానే ఉండేది. ఇక్కడ రావినారాయణ రెడ్డితో పాటు పోటీ చేసిన, సుకం అచ్చాలు విజయం సాధించారు. ఇద్దరూ పీడీఎఫ్ అభ్యర్థులే.
1952 మార్చి 27 పోలింగ్ జరిగింది. రావి నారాయణ రెడ్డికి 3,09,162 ఓట్లు పోలవ్వగా, సమీప ప్రత్యర్థి పీ.భాస్కర్ రావు మీద 2,22,280 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ కమ్‌జౌన్‌పూర్(పశ్చిమ) ద్విసభ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జవహర్‌లాల్ నెహ్రూకు 2,33,571 ఓట్లు పడ్డాయి.
తొలి లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు పొందిన ఎంపీతో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని అప్పట్లో నిర్ణయించారు.
దాంతో, నెహ్రూ కంటే అధిక ఓట్లు సాధించిన రావి నారాయణరెడ్డి చేతులమీదుగా ఢిల్లీలోని పార్లమెంట్ భవనం ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, Getty Images
మరో విషయం ఏమిటంటే, అదే సమయంలో భువనగిరి శాసనసభ స్థానం నుంచి కూడా ఆయన పోటీ చేసి విజయం సాధించారు.
అయితే, ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. 1957 నుంచి 1962 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుడిగా పనిచేసి, 1962లో రెండోసారి పార్లమెంటుకు వెళ్లారు.
నల్లగొండ జిల్లా (ప్రస్తుతం యాదాద్రి జిల్లా)లోని భువనగిరి మండలం బొల్లేపల్లిలో 1908 జూన్ 5న జన్మించిన రావినారాయణ రెడ్డి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు.
ఇవి కూడా చదవండి:
- సిత్రాలు సూడరో: "జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు.. కాబోయే ముఖ్యమంత్రి జగనే"
- ఆవలింత ఎందుకు వస్తుంది, ఎవరైనా ఆవలిస్తే మీకూ ఆవలింత ఎందుకు వస్తుంది
- ఫేస్బుక్లో ప్రకటనలకు టీడీపీ, వైసీపీ ఎంత ఖర్చు చేస్తున్నాయి?
- అవినీతిలేని స్వచ్ఛమైన పాలన అందిస్తా: 'సమర శంఖారావం'లో జగన్
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








