సిత్రాలు సూడరో: "జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు.. కాబోయే ముఖ్యమంత్రి జగనే"

ఫొటో సోర్స్, fb/narasimhamthota/YSJAGAN
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీల్లో చేరికలు, బయటకి వెళ్లిపోవడాలు ఊపందుకున్నాయి. ఇవాళ ఒకపార్టీలో ఉన్న నేత, రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియడంలేదు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీలు మారుతున్న నాయకులు గతంలో ప్రత్యర్థి పార్టీల నాయకుల గురించి ఏమన్నారు? ఇప్పుడు అదే పార్టీలో చేరిన తర్వాత ఏమంటున్నారు? చూద్దాం.
తోట నరసింహం: అప్పుడేమన్నారు? ఇప్పుడేమన్నారు?
ఎంపీ తోట నరసింహం బుధవారం టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరారు.
2018 కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ ఆందోళనలు జరుగుతున్న సమయంలో ఎన్‌టీవీ ఛానెల్‌తో తోట నరసింహం మాట్లాడారు.
కేంద్ర మంత్రిమర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు మంత్రులుగా ఉన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఏం ఇవ్వబోతున్నారన్న విషయం చంద్రబాబుకు ముందే తెలిసి ఉంటుంది. కానీ, ఆయన తనకేమీ తెలియదంటున్నారని జగన్ విమర్శించారు. దీనిపై మీరేమంటారు? అని ఎంపీ తోట నరసింహంను ఆ ఛానెల్ ప్రతినిధి అడిగారు.
అందుకు తోట నరసింహం స్పందిస్తూ... "జగన్ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు. కానీ, పాపం ఆయన ఎన్నటికీ అవ్వరు. ఆయన తెలియక మాట్లాడుతున్నారు.. ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు కదా. చట్టసభల్లో అధికారంలోకి రాలేదు, ఇక రాలేరు కూడా. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆయన మాట్లాడుతున్నారు" అని బదులిచ్చారు.

ఫొటో సోర్స్, fb/ysjagan
వైఎస్ జగన్మోహన్ సమక్షంలో బుధవారం వైసీపీలో చేరిన తర్వాత తోట నరసింహం మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే సీఎం వైఎస్ జగనే అన్నారు.
"జగన్ నాయకత్వంలో పనిచేస్తాం. 3,750 కిలోమీటర్ల పాదయాత్ర చేయడమంటే చిన్న విషయం కాదు. రాష్ట్ర సమస్యలు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. ఆయన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే అందరికీ న్యాయం జరుగుతుంది. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి" అని తోట నరసింహం వివరించారు.

ఫొటో సోర్స్, FACEBOOK
గౌరు చరితా రెడ్డి: అప్పుడేమన్నారు? ఇప్పుడేమన్నారు?
కర్నూలు జిల్లా పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త గౌరు వెంకటరెడ్డి తాజాగా టీడీపీలో చేరారు.
వైసీపీలో ఉన్నప్పుడు చరితారెడ్డి జనవరిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద విమర్శలు చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ పని చేయకుండా మహిళలను మోసం చేశారన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం మహిళలను నట్టేట ముంచుతోందని ఆరోపించారు. పావలా వడ్డీకి రుణాలచ్చి మహిళలను ఆదుకున్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. జగన్ అదే దారిలో నడుస్తున్నారని చెప్పారు.
అగ్రిగోల్డ్ చావులకు టీడీపీ ప్రభుత్వానిదే బాధ్యత అని చరితారెడ్డి వ్యాఖ్యానించారు. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని అన్నారు.
తాజాగా టీడీపీలో చేరిన తర్వాత మాత్రం, తమ నియోజకవర్గంలో చంద్రబాబు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేశారని ఆమె ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి:
- ఫేస్బుక్లో ప్రకటనలకు టీడీపీ, వైసీపీ ఎంత ఖర్చు చేస్తున్నాయి?
- అవినీతిలేని స్వచ్ఛమైన పాలన అందిస్తా: 'సమర శంఖారావం'లో జగన్
- అందరికీ సొంత ఇల్లు అన్న మోదీ హామీ ఎంతవరకు నెరవేరింది?
- బోయింగ్ 737 మాక్స్ 8 విమానం ఏంటి? ఈ విమానాలు ఎందుకు కూలిపోతున్నాయి?
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
- బాల్యవివాహాలను అరికట్టేవారికే నా ఓటు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









