ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు

సాధారణ ఎన్నికలు 2019

ఫొటో సోర్స్, KTRTRS/facebook

ఆంధ్రప్రదేశ్‌ ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోండి. అందుకు ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది.

ఓటు లేనివారికి మార్చి 15లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

ఈనెల 23న ఓటర్ల తుది జాబితాను వెల్లడిస్తామని చెప్పారు. ఈలోపే అర్హులందరూ జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలన్నారు.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత.. గోపాలకృష్ణ ద్వివేది ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ఇక కొత్త ఓటర్ల నమోదుకు మాత్రమే అవకాశం ఉందని, ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఓట్ల తొలగింపునకు అవకాశం లేదని ఆయన వెల్లడించారు.

ఈనెల 15లోగా ఆన్‌లైన్‌లో అయినా, ఆఫ్‌లైన్‌లోనైనా ఓటు నమోదు దరఖాస్తు చేసుకోవచ్చని ద్వివేదీ చెప్పారు.

ఓటరు గుర్తింపు కార్డులు లేకున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని వెల్లడించారు. జాబితాలో పేరున్న వారందరికీ ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తామన్నారు.

ఓటు

ఫొటో సోర్స్, Getty Images

జాబితాలో పేరు ఉన్నా.. ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే ఏం చేయాలి?

ఓటరు జాబితాలో పేరు ఉండి.. ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే.. ఈ కింది పత్రాల్లో వేటినైనా ఉపయోగించుకుని ఓటు వేసే వీలుంటుంది.

  • ఆధార్ కార్డు
  • పాస్‌పోర్ట్
  • పాన్ కార్డు
  • డ్రైవింగ్ లెసెన్స్
  • బ్యాంక్ పాస్‌బుక్
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు
  • ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు
  • మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ) జాబ్ కార్డు
  • జాతీయ జనాభా రిజిస్ట్రేషన్ కింద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డు
  • కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు
  • ఎన్నికల యంత్రాంగం జారీచేసిన అధీకృత ఫొటో ఓటరు స్లిప్

ఓటరు జాబితాలో పేరు ఉండి.. పై గుర్తింపు పత్రాలు ఉన్న వారు.. తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)