రొహింజ్యా సంక్షోభం: ‘వ్యభిచార గృహానికి అమ్మేశాక.. నేను ఆడుకోవడం మర్చిపోయా’

ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని మయన్మార్ నుంచి వలస పోయిన రొహింజ్యా శరణార్థులకు మరో నరకం ఆహ్వానం పలికింది.
టీనేజీ వయసు దాటని రొహింజ్యా బాలికలు వ్యభిచార గృహాలకు తరలిపోతున్న ఉదంతాలు బీబీసీ పరిశోధనలో వెలుగు చూశాయి.
శరణార్థి శిబిరాల్లోని మహిళలకు, బాలికలకు కొంత మంది మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. రొహింజ్యాల నిస్సహాయతను బ్రోకర్లు అవకాశంగా తీసుకుంటున్నారు.
బంగ్లాదేశ్‌కు వచ్చే విదేశీయుల్లో అమ్మాయిలతో గడపాలనుకునేవారికి రొహింజ్యా బాలికలు అంగడి సరుకుల్లా అందుబాటులోకి వస్తున్నారు.
పై చిత్రంలో ఉన్న అమ్మాయి పేరు అన్వారా. వయసు 14. మయన్మార్ దాడుల్లో తన కుటుంబ సభ్యులందర్నీ చంపేశారు. ఒక్కరు కూడా మిగల్లేదు. అన్వారా ప్రాణభయంతో సహాయం కోరుతూ బంగ్లాదేశ్ వైపు పరుగులు తీసింది.
''నేను బంగ్లాదేశ్‌కు వస్తున్నపుడు దారిలో ఓ వ్యాన్ వచ్చి నా ముందు ఆగింది. అందులో ఓ ఆడమనిషి.. నన్ను తనతోపాటే రమ్మంది. చేయడానికి ఏదైనా పని ఇప్పిస్తానని, జీవితం బాగుంటుందని చెప్పింది.''
కానీ అలా జరగలేదు. అన్వారాను ఆ మహిళ దగ్గరలోని ‘కాక్స్ బజార్’ పట్టణానికి తీసుకుపోయింది.
''నన్ను తీసుకుపోయిన కొన్ని రోజులకే ఆ మహిళ.. ఇద్దరు అబ్బాయిలను నావద్దకు పంపింది. వాళ్లిద్దరూ కత్తి చూపి నన్ను బెదిరించారు. నేను ఒప్పుకోకపోతే పొట్టపై కొట్టారు. చివరికి నా ఇష్టం లేకుండానే వాళ్లు నాతో బలవంతంగా సెక్స్ చేశారు.''

శరణార్థి శిబిరాల్లో నిస్సహాయులైన ఆడపిల్లలకు, మహిళలకు విదేశాల్లో ఇంటి పని, వంట పని ఇప్పిస్తామని నమ్మమబలికి, బ్రోకర్లు వారిని ఈ ఉచ్చులోకి లాగుతున్నారు.
మసూదా అనే 14 ఏళ్ల బాలిక.. తనను ఏవిధంగా రవాణా చేశారో బీబీసీకి వివరించింది.
''ఒక మహిళ నాదగ్గరకు వచ్చి, తనతో వస్తే పని ఇప్పిస్తానని మాయమాటలు చెప్పింది. కానీ.. ఆమె నన్ను వ్యభిచారంలోకి దింపుతుందని నాకు ముందే తెలుసు. మయన్మార్‌లో ఉన్నపుడే నన్ను రేప్ చేశారు. అమ్మానాన్నలు, నా అన్నచెల్లెళ్లు అందరూ అదృశ్యమయ్యారు. నాదగ్గర డబ్బుల్లేవు. ఆ మహిళతోపోవడం తప్ప, నాకు వేరే మార్గం లేదు. ఒకప్పుడు అన్నచెల్లెళ్లతో బాగా ఆడుకునేదాన్ని. ఇప్పుడు ఆడుకోవడం కూడా మర్చిపోయా.''
ప్రస్తుతం మసూదా స్థానికంగా వున్న ఓ స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంది.
తమ పిల్లలు వ్యభిచారం ఉచ్చులో కూరుకుపోయారని కొంతమంది తల్లిదండ్రులు దు:ఖపడుతుంటే, మరికొందరు ఎక్కడో ఒకచోట కనీసం ప్రాణాలతో ఉన్నారుకదా..! అని ఊపిరి పీల్చుకుంటున్నారు.

బంగ్లాదేశ్ వెళ్లిన బీబీసీ రిపోర్టర్లు.. పర్యాటకులమని చెప్పి కాక్స్ బజార్ పట్టణానికి వెళ్లారు. లైంగిక వాంఛ తీర్చుకోవడానికి చిన్నవయసు ఆడపిల్లలు ఎక్కడ దొరుకుతారు? అంటూ.. హోటళ్లు, సముద్ర తీరంలోవుండే కాటేజీ యజమానులతో విచారించారు.
48 గంటల్లోగా.. స్థానిక బ్రోకర్ల ఫోన్ నంబర్లు దొరికాయి. వారిని సంప్రదించి, మీ దగ్గర రొహింజ్యా చిన్నపిల్లలు ఉన్నారా? అని అడిగితే, ''మాదగ్గర చాలా మంది చిన్న పిల్లలున్నారు. కానీ మీకు రొహింజ్యాలే ఎందుకు కావాలి? వాళ్లు అంత బాగుండరు కదా..'' అని ఒకరన్నారు.
మాకు 13-17 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలు కావాలని బ్రోకర్లను అడిగితే.. చాలా మంది పిల్లల ఫోటోలను చూపించారు. వారు వద్దంటే.. మాకు చూపించడానికి వాళ్ల దగ్గర ఇంకా చాలా ఫోటోలున్నాయి.
ఈ తతంగాన్నంతా రహస్యంగా చిత్రించిన వీడియో ఫుటేజ్‌ను, ఇతర ఆధారాలను పోలీసులకు చూపించాం. అందులో ఓ బ్రోకర్‌ను ఒక పోలీసు అధికారి ఠక్కున గుర్తుపట్టాడు. అమ్మాయిలను తారుస్తున్నవారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఓ పోలీసు బృందం మాతో కలిసింది.

ఫోటోల్లోని అమ్మాయిల్లో చిన్నవయసున్న ఇద్దరు పిల్లల్ని ఎంచుకుని, వారిని పట్టణంలోని ఓ ప్రముఖ హోటల్‌కు పంపమని బ్రోకర్‌కు చెప్పాం. ఈలోగా రహస్య చిత్రీకరణకు ఏర్పాట్లు చేసుకున్నాం.
ఆ హోటల్ పార్కింగ్ వద్ద బ్రోకర్ కోసం వేచివున్నాం. పోలీసులు కూడా పక్కనే దాక్కుని నిఘా ఉంచారు.
అంతలో ఓ ఆటో వచ్చింది. అందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. బ్రోకర్ రాకుండా ఆటో డ్రైవర్‌ను తోడు ఇచ్చి అమ్మాయిలను పంపాడు. ముందుగానే మాట్లాడుకున్న డబ్బును ఆ డ్రైవర్‌కు ఇచ్చాం.
''ఈ రోజు మాకు నచ్చితే.. రేపు మరికొందరిని అడుగుతాం. పంపుతారా?'' అని డ్రైవర్‌ను అడిగితే.. వాడు సరేనన్నట్లు తలూపాడు. ఇంతలో పోలీసులు వచ్చి ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రహస్యంగా చిత్రించిన వీడియో
ఆటోలో వచ్చిన అమ్మాయిలిద్దరికీ రక్షణ కల్పించేందుకు శిశు సంరక్షణ అధికారులు ముందుకొచ్చారు. వారితో వెళ్లడానికి 15 ఏళ్ల అమ్మాయి అంగీకరించింది. కానీ మరొక అమ్మాయి మాత్రం.. నిరాకరించింది.
ఈ అమ్మాయిలు పేదరికం, వ్యభిచారం మధ్య నలిగిపోయి ఉన్నారు. ఈ పని చేయకపోతే వారి కుటుంబం బతకడం కష్టమవుతోందని వారు చెప్పారు.
రొహింజ్యా అమ్మాయిలను బంగ్లాదేశ్‌లోని ఢాకాతోపాటుగా, భారత్‌లోని కోల్‌కతా, చిట్టగాంగ్, నేపాల్‌లోని కఠ్మాండూలకూ తరలిస్తున్నారు. కోల్‌కతాకు తరలించాక, అక్కడ వీరికి భారతీయ గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. ఆ విధంగా వారు చివరకు తమ అస్తిత్వాన్నే కోల్పోతున్నారు.

చిన్నపిల్లలతో ఏవిధంగా సెక్స్ చేయాలి? అనే సమాచారంతో ఇంటర్నెట్లో చాలా వెబ్‌సైట్లున్నాయి. చిన్నపిల్లలను ఎలా లొంగదీసుకోవాలి? ముఖ్యంగా ఎవ్వరికీ దొరక్కుండా రొహింజ్యాల పిల్లలకు ఎట్లా ఎరవేయాలి? అన్న విషయాలను పూస గుచ్చినట్లు వివరిస్తూ ఓ వ్యక్తి ఇంటర్నెట్లో పోస్ట్ కూడా పెట్టాడు.
వేలాదిగా వలస వస్తున్న రొహింజ్యా మహిళలకూ, బాలికలకూ ఎరవేస్తూ బంగ్లాదేశ్‌లోని బ్రోకర్ల, అక్రమ రవాణాదారుల మాఫియా క్రమక్రమంగా బలపడుతోంది.
(ఇందులోని బాధితుల పేర్లను మార్చడం జరిగింది)
ఇన్వెస్టిగేటివ్ ప్రొడ్యూసర్ : శ్యామ్ పిరాంటీ
ఇన్వెస్టిగేటివ్ కన్సల్టాంట్ : నిక్ ఊల్లీ
ప్రెజెంటర్ : మిషల్ హుసేన్
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జాకీ మార్టెన్స్
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









