నేను వేశ్యగానే ఉంటా : వ్యభిచార వృత్తిలో కొనసాగే హక్కు కోసం పోరాడిన మహిళ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరస్పాండెంట్
అది 1958 మే 1.. అలహాబాద్‌లోని కోర్టు గది. అందరి కళ్లూ ఆమెనే చూస్తున్నాయి.
24 ఏళ్ల వయసున్న ఆ మహిళ పేరు హుస్నాబాయి. న్యాయమూర్తి జగదీశ్ సహాయ్‌కి ఆమె తానెవరో చెబుతోంది.
'నేనొక వేశ్యను' అన్న ఆమె మాట కోర్టు హాల్‌లో ప్రతిధ్వనిస్తుంటే అంతా ఆమెనే చూస్తూ చెవులు రిక్కించి విన్నారు.
అక్రమ మానవ రవాణాను నిషేధిస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టం చట్టబద్ధతను ప్రశ్నిస్తూ ఆమె పిటిషన్ వేశారు.
తనకు జీవనాధారమైన వృత్తిని కాదనడం ద్వారా కొత్త చట్టం సంక్షేమ రాజ్య ఉద్దేశాన్నే నీరుగార్చిందని ఆమె న్యాయమూర్తి ఎదుట తన వాదన వినిపించారు.

ఇతర నగరాల్లోనూ కేసులు
పౌర సమాజం నుంచి వ్యభిచారిణులను వెలేసిన తరుణంలో రోడ్డున పడ్డ మహిళలను వచ్చి చూడాలంటూ ఆమె న్యాయమూర్తులను ఒత్తిడి చేశారు.
1951 నాటికి దేశంలో 28,000 మంది వ్యభిచార వృత్తిలో ఉన్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళలు కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇస్తే మహాత్మాగాంధీ వాటిని స్వీకరించడానికి నిరాకరించడంతో పాటు వారందరినీ ఆ వృత్తి మానుకుని రాట్నం వడికే పని చేసి పొట్ట పోషించుకోమని సూచించారు.
ఇక హుస్నాబాయి విషయానికొస్తే ఆమె వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరికీ తెలిసింది లేదు. ఆమెకు సంబంధించిన వివరాల కోసం వెతికినా ఎక్కడా ఆమె చిత్రం కూడా దొరకదు. తెలిసిందంతా... ఆమె వరుసకు సోదరి అయిన ఒక మహిళ, తనపై ఆధారపడే ఇద్దరు తమ్ముళ్లతో కలిసి నివసించేవారని మాత్రమే. వారంతా ఆమె సంపాదనపైనే ఆధారపడి బతికేవారు.
ఇప్పుడు యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన చరిత్ర పరిశోధకుడు 'రోహిత్ డె' తన పుస్తకంలో ఆమె కథ రాస్తుండడంతో ఆమె చర్చలోకొచ్చారు. తన వృత్తిని చట్టబద్ధంగా కొనసాగించుకోవడానికి ఆమె పోరాడిందంటూ రోహిత్ 'ఏ పీపుల్స్ కాన్సిస్టిట్యూషన్: లా అండ్ ఎవ్రీడే లైఫ్ ఇన్ ద ఇండియన్ రిపబ్లిక్' పేరిట తీసుకొస్తున్నపుస్తకంలో పేర్కొన్నారు.
అయితే, పాత రికార్డులు, చరిత్రలో ఎక్కడా ఆమె గురించి లేకపోవడంతో కోర్టు రికార్డులపై ఆధారపడి ఆయన హుస్నాబాయి కథను రాశారు.
హుస్నాబాయి పిటిషన్ అప్పట్లో అందరిలో ఉత్సుకతను, ఆసక్తిని రేకెత్తింది.
అలహాబాద్‌లో వేశ్యావృత్తిలో ఉన్న వందలాది మంది మహిళలు, అక్కడి 'డ్యాన్సింగ్ గర్ల్స్ యూనియన్' ఆమె పిటిషన్‌కు మద్దతిచ్చాయి.
అంతేకాదు.. దిల్లీ, బాంబే, పంజాబ్ కోర్టుల్లోనూ ఇలాంటి పిటిషన్లు దాఖలయ్యాయి.
అప్పటి బొంబాయిలో బేగమ్ కళావత్ అనే వ్యభిచారిణిని ఒక స్కూలు సమీపంలో ఆమె తన వేశ్యావృత్తి సాగిస్తోందన్న కారణంతో నగరం నుంచి బయటకు పంపించగా ఆమె.. తన సమానత్వపు హక్కుకు, స్వేచ్ఛకు భంగం కలిగించారంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

రాజ్యాంగ సభలోని మహిళలు ఏమన్నారంటే..
అప్పట్లో కొత్తగా తీసుకొచ్చిన ఈ చట్టం వేశ్యావృత్తిలో ఉన్నవారిని ఆందోళనలోకి నెట్టేసింది. దాంతో వారు తమ వద్దకు వచ్చే విటులు, స్థానిక వ్యాపారుల నుంచి నిధులు సేకరించి ఆ చట్టానికి వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో పోరాటం చేశారు.
అంతేకాదు, దిల్లీలో పార్లమెంటు ముందు సుమారు 75 మంది నిరసన తెలిపారు కూడా.
తమ వృత్తిని అణచివేయడానికి ప్రయత్నం చేస్తే తమ నిరసన అన్ని ప్రాంతాలకూ విస్తరించే అవకాశముందని వారు పార్లమెంటు సభ్యులను హెచ్చరించారు.
ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడేందుకు వందల మంది కలిసి సంఘాలుగా ఏర్పడ్డారు.
కోల్‌కతాలో ఈ వృత్తి సాగిస్తున్నవారంతా.. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
అయితే, పార్లమెంటులోని అప్పటి మహిళా ఎంపీలు, సామాజిక కార్యకర్తలు ఈ చట్టం కావాల్సిందేనని పట్టుబట్టారు.
హుస్నాబాయి దాఖలు చేసిన పిటిషన్, అలాంటివే మరికొన్ని పిటిషన్లను కొత్త గణతంత్ర రాజ్య ప్రగతిశీల అజెండాపై జరుపుతున్న దాడిగా చాలామంది అభివర్ణించారు.
మహిళలు ఈ వృత్తిని తమకు తాముగా ఎంచుకోరని.. పరిస్థితుల కారణంగా బలవంతంగా ఈ వృత్తిలోకి వస్తారని అప్పటి రాజ్యాంగ సభలోని మహిళా సభ్యులు వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
కోర్టు కొట్టేసింది
అప్పటి పరిణామాలపై రోహిత్ తన పుస్తకంలో.. ఇదంతా జాగ్రత్తగా చూస్తే, ఇదేమీ వ్యక్తిగతంగా ఒక్కరు చేసిన న్యాయపోరాటం కాదని.. దేశవ్యాప్తంగా ఈ వృత్తిలో ఉన్న కొందరు సంఘటితంగా చేసిన పోరాటమని పేర్కొన్నారు. అయితే, వారు దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్లలేకపోయారని అభిప్రాయపడ్డారు.
కొత్త చట్టం కారణంగా హక్కులేమీ కోల్పోవడం లేదని చెబుతూ హుస్నాబాయి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అయితే, హుస్నాబాయిని అలహాబాద్ నుంచి బయటకు పంపించడం కానీ, ఆమెపై క్రిమినల్ కేసులు మోపడం కాని జరగలేదు. ఆ కేసును కొట్టేసిన సమయంలో న్యాయమూర్తి సహాయ్ 'తరలింపుపై ఆమె వాదనలు వాస్తవాలే' అని చెబుతూనే అంతకుమించి తానేమీ చెప్పలేనన్నారు.
చివరకు సుప్రీంకోర్టు కొత్త చట్టం రాజ్యాంగబద్ధమైనదేనని చెబుతూ వేశ్యావృత్తిలో ఉన్నవారు నియంత్రణ లేకుండా హక్కులు పొందలేరని స్పష్టం చేసింది.
(రోహిత్ డె రాసిన 'ఏ పీపుల్స్ కాన్సిస్ట్యూషన్: ది ఎవ్రీడే లైఫ్ ఆఫ్ లా ఇన్ ది ఇండియన్ రిపబ్లిక్' పుస్తకాన్ని అమెరికాలో ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. భారత్‌లో పెంగ్విన్ ఇండియా దీన్ని ప్రచురించింది.)
ఇవి కూడా చదవండి:
- సూర్యుడు సరిగ్గా మీ ఎదురుగా ఉదయించడం ఎప్పుడైనా చూశారా?
- #లబ్‌డబ్బు: గోల్డెన్ వీసా అంటే ఏంటి? ఇది పొందడం ఎలా?
- ఎన్టీఆర్: సోలోపాటల్లో ‘సదా స్మరామి’
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- మహారాష్ట్ర: మనుషుల్ని చంపి తింటున్న పులి
- బిగ్ బాస్: పోటీదారులను ఎలా ఎంపిక చేస్తారు? నిబంధనలేంటి?
- జోసెఫ్ విర్షింగ్: బాలీవుడ్‌తో ప్రేమలో పడ్డ జర్మన్ సినిమాటోగ్రాఫర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














