చింగ్ షి: ఒక సెక్స్ వర్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రపు దొంగల ముఠాకు నాయకురాలు ఎలా అయ్యారు?

ప్రపంచంలో సముద్రాలను దాటి విస్తరించిన ఎన్నో సామ్రాజ్యాలు చరిత్రలో కలిసిపోవడం మనం చూశాం. కానీ 200 ఏళ్ల క్రితం, దక్షిణ చైనా సముద్రంలో ఒక మహిళ 1800 నావలతో కూడిన సముద్రపు దొంగల ముఠా (పైరేట్స్)కు నాయకత్వం వహించిందంటే ఆశ్చర్యం కలగకమానదు.
చైనీస్ తీరంలో సెక్స్ వర్కర్‌గా పరిచయమై, చాలా ఏళ్ల పాటు చైనీస్, పోర్చుగీస్ వారికి పీడకలగా మారిన ఒక మహిళ చరిత్ర గురించి మీకు తెలుసా?
చరిత్రకారులు ఆమెను ఎన్నో పేర్లతో పిలిచేవారు. జాయి చావో, చింగ్ షి, షి యాంగ్ ఇలా ఆమెకు పలు పేర్లున్నాయి. సెక్స్ వర్కర్, క్రూరత్వం, నిర్దాక్షిణ్యం, దారుణమైన హింస, విచక్షణారహిత శిక్షలకు పెట్టింది పేరుగా ఆమె 1844వరకు జీవించారు.
'చింగ్ షి'గా ప్రాచుర్యం పొందిన ఆమె 1775లో జన్మించారు. చైనా గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సులోని షింక్‌లో నివసించే ఒక మహిళకు ఆమె జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఎవరు? వారు ఏ వంశస్థులు అనే అంశాలను చరిత్రకారులు సేకరించలేకపోయారు.
కానీ చింగ్ షి జీవన విధానం, ఆమె పాటించిన విధానాలు ఆమెకు చరిత్రలో చోటు కల్పించాయి.
18వ శతాబ్ధంలో సముద్ర వాణిజ్యం, పరిశ్రమల వ్యవహారాల్లో కేవలం పురుషుల ప్రాతినిధ్యమే ఉండేది. ఆ కాలంలో పోర్ట్ షిప్స్, బోట్‌లలో సెక్స్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. సెక్స్ పరిశ్రమకు చింగ్ షి ఆరేళ్ల వయస్సులోనే పరిచయమైందని చరిత్రకారులు పేర్కొన్నారు.
జాంగ్ యి అదే సమయంలో సముద్రపు దొంగల నాయకుడిగా ఉండేవారు. వియత్నాంకు చెందిన డే సన్, అతని కజిన్ జాంగ్ కీ లకు మద్దతుగా ఆయన యింగ్ రాజవంశానికి, గుయెన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు. 1700ల్లో జంగ్ కీ పెద్ద దొంగల ముఠా నాయకుడు.
సముద్రపు దొంగతో వివాహం
ఒక దొంగతనం చేసే సమయంలో జాంగ్ యి, చింగ్ షిని చూసి ఇష్టపడ్డారు. తనను వివాహం చేసుకుంటే, తాను దోచే సంపదలో సగభాగం ఇస్తానని మాట ఇచ్చారు.
అప్పటికే వేశ్యగా ఉన్న చింగ్ షి అతని ఒప్పందానికి అంగీకరించారు. 1801లో 26 ఏళ్ల వయస్సులో చింగ్ షికి ఆయనతో పెళ్లి జరిగింది.
పెళ్లి జరిగిన అదే సంవత్సరంలో చైనా, వియత్నాం సరిహద్దుల్లో జాంగ్ యి కజిన్ 'జాంగ్ కీ'ని బంధించిన గుయెన్ బృందాలు అతన్నిమట్టుబెట్టాయి.
దీన్ని అవకాశంగా తీసుకున్న జాంగ్ యి అతిపెద్ద సముద్రపు దొంగల ముఠాకు నాయకుడిగా మారారు. జాంగ్ కీ ఆధ్వర్యంలో ఉన్న సముద్రపు దొంగలను కూడా తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు.
ఈ క్రమంలో జాంగ్ యి, చేపలు పట్టుకునే కుటుంబానికి చెందిన జాంగ్ బో సాయ్ అనే బాలుడిని దత్తత తీసుకొని పెంచుకున్నారు.
చైనీస్ సముద్ర వాణిజ్యంపై చైనీస్, ఫ్రెంచ్, బ్రిటీష్, పోర్చుగీస్ దళాల ఆధిపత్యాన్ని అణిచివేయడానికి, సముద్రపు దొంగల ముఠాలన్నీ ఒకే నాయకత్వం కిందకు రావాలని వ్యూహాలు రచించాయి.

ఫొటో సోర్స్, Getty Images
సముద్రపు దొంగల ముఠాను సమన్వయం చేసిన చింగ్ షి
ఈ ప్రాజెక్టులో చింగ్ షి పాత్ర కీలకం. ఇతర నాయకులతో సంప్రదింపులు, చర్చలు జరపడానికి ఆమె వారధిగా పనిచేశారు. సెక్స్ వర్కర్‌గా ఆమెకున్న పరిచయాలు ఈ ప్రాజెక్టులో ఆమెకు సహాయపడ్డారు.
ఆమె ప్రయత్నాల ఫలితంగా 1805లో చైనా సముద్రానికి చెందిన అన్ని సముద్రపు దొంగల ముఠాలు ఒకే కూటమిగా ఏర్పడ్డాయి.
ఈ కూటమిలోని 6 బృందాలు ఎరుపు, నలుపు, నీలం, తెలుపు, పసుపు, ఊదా రంగు జెండాలను తమ గుర్తులుగా స్వీకరించాయి.
సముద్రపు నిబంధనలకు అనుగుణంగా వారిలో వారు బృందాలుగా విడిపోయారు. ఈ బృందాలన్నీ జాంగ్ యి నాయకత్వం కింద పనిచేయాలని ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
1800ల్లో 70 వేల సముద్రపు దొంగలు, 1200 సాయుధ పడవలతో కూడిన బలమైన సమాఖ్యకు జాంగ్ యి నాయకుడిగా మారారు. చింగ్ షి ఆయనను వెనకుండి నడిపించారు.
ఎరుపు రంగు జెండా దళాన్ని జాంగ్ యి నడిపించగా, రెండో అతిపెద్ద సముద్రపు దొంగల ముఠాకు ఆయన దత్త పుత్రుడు జాంగ్ బో సాయ్ నాయకత్వం వహించారు.
చింగ్ షి- జంగ్ యి దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు. 1803లో జంగ్ యింగ్జీ జన్మించగా.... 1807లో జంగ్ షియాంగ్జీ పుట్టారని చరిత్రకారులు పేర్కొన్నారు. కానీ మరికొందరు ఆ జంటకు పిల్లలు లేరని చెబుతుంటారు.
రెండో బిడ్డ జన్మించిన కొన్ని నెలలకే ఒక ప్రయాణంలో 42 ఏళ్ల వయస్సులో జంగ్ యి అనూహ్యంగా మరణించారు.
తన భర్త మరణించగానే సమాఖ్య నాయకత్వాన్ని మరొకరికి అప్పగించేందుకు చింగ్ షి సుముఖత వ్యక్తం చేయలేదు. దత్త పుత్రుడు జాంగ్ బోతో పాటు ఆమె నాయకత్వ బాధ్యతల్ని తీసుకున్నారు.
తప్పుడు సంబంధం
ఆ సమయంలో పైరేట్ బృందానికి ఒక మహిళ నాయకత్వం వహించడానికి చట్టం అనుమతించలేదు. సముద్రపు పరిశ్రమలు, నేవీ షిప్‌లలో మహిళలు భాగస్వాములైతే సముద్రుడు తాము నడిపే పడవలకు హాని తలపెడతాడని, దురదృష్టాన్ని కలిగిస్తాడని నాటి కాలపు ప్రజలు గట్టిగా నమ్మేవారు.
అందుకే పైరేట్ ఫెడరేషన్ కెప్టెన్‌గా జాంగ్ బో సాయ్‌ని ఎన్నుకోవడానికి, ఇతర పైరేట్ గ్రూపుల ఆమోదాన్ని చింగ్ షి కోరారు.
ఆ తర్వాత తాను చెప్పింది వినే తోలుబొమ్మలా జాంగ్ బో సాయ్‌ని చింగ్ షి మార్చివేశారు. జాంగ్ యి మరణించక ముందు నుంచే, పెంపుడు తల్లి అయిన చింగ్ షి, జాంగ్ బోల మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉన్నట్లు రుజువు కాని చారిత్రక రికార్డులు పేర్కొన్నాయి.
పైరేట్ ఫెడరేషన్ నామమాత్రపు అధిపతిగా జాంగ్ బో సాయ్ ఉండగా... సమాఖ్య సుప్రీం అధికారిగా చింగ్ షి ఎదిగారు. ఆమె నాయకత్వంలో పైరేట్ గ్రూప్స్ ఆర్మీ తరహాలో కార్యకలాపాలను ప్రారంభించాయి. స్వీయ క్రమశిక్షణ కోసం అందరికీ నిబంధనలు రూపొందించారు. నాయకత్వానికి విధేయంగా ఉండటాన్ని తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి క్రూరమైన శిక్షలను అమలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
క్రూరమైన శిక్షలు
పైరేట్ గ్రూపుకు చెందిన సభ్యుడెవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే అతనికి శిక్షగా చెవిని కోసి వేసేవారు. అతన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి చంపివేసేవారు.
సముద్రంలోని పడవల్లో లేదా తీరప్రాంత గ్రామాల్లో చోరీ చేసిన విలువైన బంగారం, వజ్రాలను కచ్చితంగా ప్రభుత్వ ఖజానాకు తరలించాలి. అవి చోరీ చేసిన సభ్యునికి పదింట్లో రెండు వంతుల ధనాన్ని కేటాయిస్తారు. ఈ కేటాయింపులకు మించి అదనంగా వస్తువు కానీ ధనం కానీ ఆ సభ్యుడు తీసుకున్నట్లయితే దాన్ని నేరంగా పరిగణించి అతన్ని చంపివేస్తారు.
గ్రామాలను దోచుకోవడానికి వెళ్లిన దొంగలు అక్కడి మహిళలను హింసించరాదు, వారిపై అత్యాచారాలకు పాల్పడకూడదు.
ప్రతీ గ్రామంలో జైలుకు వెళ్లిన మహిళల జాబితాను రూపొందిస్తారు. జైల్లో ఖైదీలుగా ఉన్న మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారికి మరణశిక్షను విధించేవారు.
కొంతమంది చరిత్రకారులు మాత్రం ఈ నిబంధనలన్నీ జాంగ్ బో రూపొందించారని, వాటిని చింగ్ షి అమలు చేశారని చెబుతారు.

ఫొటో సోర్స్, Alamy
సముద్ర యుద్ధాలు, హింసాత్మక దాడులు
1808లో చింగ్ షి చేతిలో తోలుబొమ్మగా మారిన జాంగ్ బో, పెర్ల్ నదీతీర గ్రామాలను దోచుకోవాలనే ఆశయంతో, హైమెన్ నగర తీరంలోని జనరల్ బ్రిగేడ్ లిన్ కుయోలింగ్ నావిక దళాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
అప్పటివరకు సామ్రాజ్యాలకు చెందిన నౌకలను సముద్రపు దొంగలు లక్ష్యంగా చేసుకోలేదు. కానీ ఆ దాడిలో 35 చైనా యుద్ధ నౌకలు నాశనమయ్యాయి.
దీని తర్వాత సముద్రపు దొంగలు వ్యూన్ ద్వీపం ఉత్తర భాగంలోని హైమెన్ నగరంపై దాడి చేశారు. ఆ యుద్ధంలో తాము ఓడిపోయినట్లు లెఫ్టినెంట్ కల్నల్ లిన్ ఫా ఒప్పుకున్నారు.
చింగ్ షీ గ్రూపు తమను తాము ఆర్మీగా, తిరుగులేని శక్తిగా భావించుకున్న రోజులవి. అందుకే తెలిసో, తెలియకో ప్రభుత్వ దళాలతో ఘర్షణ పడ్డాయి.
పలు దేశాల నావిక దళాల ఆగ్రహం
1809లో ధవన్‌షాన్ ద్వీపం సమీపంలో యింగ్ రాజవంశానికి చెందిన ప్రావిన్షియల్ కమాండర్ సూన్ గ్వాన్‌ము నాయకత్వంలోని 100 యుద్ధనౌకలు, నావిక దళాలు పైరేట్ గ్రూప్‌ను అడ్డగించాయి.
ఈ దాడి గురించి పైరేట్స్ ముందే సన్నద్ధంగా ఉన్నారు. తమ దళాలను వచ్చి కాపాడుకోవాల్సిందిగా చింగ్ షికి కమాండర్ సందేశాన్ని పంపారు.
ఈ ప్రభుత్వ నావికా దళాలను చుట్టిముట్టిన ఎరుపు, తెలుపు రంగు జెండాలున్న పైరేట్స్ గ్రూపులు అకస్మాత్తుగా వారిపై దాడి చేశాయి. దీన్ని ఊహించలేకపోయిన సూన్ గ్వాన్‌ము బృందం వారికి ఎదురు తిరగలేక అక్కడి నుంచి పారిపోయింది.
అయినప్పటికీ ఆ దాడిలో తెలుపు రంగు జెండా పైరేట్స్ బృందం నాయకుడు లియాంగ్ చనిపోయారు. ఆయన ఆధ్వర్యంలోని సిబ్బంది కూడా మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ దళాలకు చెందిన 25 పడవలు ఈ దాడిలో నాశనమయ్యాయి.
తెలుపు రంగు జెండా బృందాన్ని కోల్పోయాక జాంగ్ బో సాయ్ ఆధ్వర్యంలోని ఎరుపు రంగు దళం, నలుపు రంగు పైరేట్ దళాలు కలిసి పెర్ల్ నదీ సమీపంలోని ప్రభుత్వ, వాణిజ్య పడవల్ని ధ్వంసం చేశారు.
జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన ఆ ఆపరేషన్‌లో 1000 మంది మరణించారు. పెర్ల్ నదీ తీర గ్రామాల్లోని 2000 మంది ప్రజలు కూడా ఈ ఘర్షణల్లో చనిపోయారు.
తీర ప్రాంత గ్రామాల్ని ఈ పైరేట్ దళాలు దోచుకున్నాయి. అక్కడి సంపదను తీసుకొని, వందలాది మంది ప్రజల్ని జైళ్లలో బంధించారు. 500 పైరేట్స్ పడవలతో ఆ ప్రాంతంలో దోపిడిని చింగ్ షి ఒక్కరే పర్యవేక్షించారు.
సముద్రపు దొంగలను నిర్మూలించడానికి చైనాలోని యింగ్ సామ్రాజ్యం పోర్చుగీస్ సహాయాన్ని కోరింది.
పోర్చుగీసు పాలిత తైమూర్ గవర్నర్ ప్రాంతాన్ని కూడా పైరేట్స్ ఆక్రమించుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూస్తోన్న పోర్చుగీస్ దళాలు అదును చూసి చింగ్ షి బృందంపై దాడికి దిగాయి. పడవల మరమ్మతు కోసం చింగ్ షి బృందం డంగ్ చుంగ్ బే ఏరియా ప్రాంతానికి వచ్చినట్లు తెలుసుకున్న పోర్చుగీస్ దళాలు వారిని చుట్టుముట్టాయి. వారికి మద్దతుగా సున్ గ్వాన్‌ము 93 పడవలతో చింగ్ షి దళాన్ని ముట్టడించారు. చైనీస్ పైరేట్స్ కూడా ఈ దాడిలో భాగమయ్యాయి.
రెండు వారాలకు పైగా జరిగిన ఈ ఘర్షణల్లో ఒక ప్రావిన్షియల్ షిప్ ధ్వంసమైంది. ఈ ఘర్షణల్లో సున్ గ్వాన్‌ము ఒక కొత్త వ్యూహాన్ని అనుసరించారు. తన పడవలకు నిప్పంటించి వాటితో పైరేట్స్ షిప్స్‌ను ఢీకొట్టి వాటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.
అలా ఆయన 43 పడవలకు నిప్పంటించి వాటిని పైరేట్స్ వైపు పంపించారు. కానీ బలమైన గాలుల కారణంగా అవి దారి తప్పడంతో ఆయన అనుకున్న లక్ష్యం సరిగా నెరవేరలేదు.
ఆ దాడిలో చింగ్ షి పడవలకు ఎలాంటి నష్టం కలగలేదు. కానీ 43 మంది పైరేట్స్ మరణించారు. ఈ యుద్ధాలను చైనా చరిత్రలో '' బ్యాటిల్ ఆఫ్ ద టైగ్ మౌత్''గా పిలుస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
లొంగిపోయిన వారికి నేవీ ర్యాంకులు
ప్రభుత్వ దళాలతో ఘర్షణల్లో ప్రాణాలను పణంగా పెట్టడం ప్రమాదకరమని భావించిన నలుపు రంగు జెండా పైరేట్స్ దళం నాయకుడు గువో బొడాయ్, జాంగో బో సాయ్, చింగ్ షి ప్రణాళికలతో సహకరించడానికి నిరాకరించారు.
1810 జనవరిలో ఆయన లియాంగ్వాంగ్‌కు లొంగిపోయారు. దీంతో ఆయనను సబ్ లెఫ్టినెంట్ ర్యాంక్ హోదాతో సత్కరించారు.
ప్రభుత్వ దళాలతో కుమ్మక్కైన తర్వాత గువో బొడాయ్... పైరేట్ల ఆహారం, ఇంధనం, ఆయుధాల సరఫరా తదితర సమాచారాన్ని బ్రిటీష్, పోర్చుగీసు, చైనీస్ దళాలకు చేరవేశారు. దీంతో పైరేట్లకు అత్యవసరమైన ఆహారం, ఇతర వస్తువుల సరఫరా నిలిచిపోయింది.
పైరేట్ గ్రూపులతో ఘర్షణ తమకు చేటు చేస్తుందని భావించిన యింగ్ రాజవంశీయలు చింగ్ షి గ్రూపులతో రాజీ ఒప్పందం చేసుకోవాలని ప్రణాళిక వేశారు.
మరోవైపు తమకు సరఫరా నిలిచిపోవడంతో బలహీనపడిన చింగ్ షి బృందం మరో అవకాశం లేకపోవడంతో వారి ఒప్పందానికి అంగీకరించింది. ఈ చర్చలకు బాయ్ లింజ్ నాయకత్వం వహించారు.
చివరకు 1810 ఏప్రిల్ 20న తమ 17000 మంది పైరేట్లు, 226 పడవలు, 1300 గ్రెనేడ్ లాండర్లు, 2700 ఆయుధాలతో కలిసి జాంగ్ బో, చింగ్ షి ప్రభుత్వ దళాలకు లొంగిపోయారు.
ఆ తర్వాత యింగ్ రాజవంశం జాంగ్ బోకు 20-30 పడవలను కేటాయించడంతో పాటు లెప్టినెంట్ హోదాను అందజేసింది.
దత్త పుత్రుడిని పెళ్లి చేసుకునేందుకు అనుమతి
ఆ తర్వాత తన భర్త దత్త పుత్రుడైన జాంగ్ బో సాయ్‌ని వివాహం చేసుకునేందుకు అనుమతించాలని రాజ్యాధినేతను చింగ్ షి అభ్యర్థించారు. ఆమె కోరినట్లుగానే ఆమెకు అనుమతి లభించింది.
ప్రభుత్వ సర్వీసులో చేరిన కొన్ని నెలల వ్యవధిలోనే చైనా జలాల్లో నిలిచి ఉన్న 'వు షైర్' నాయకత్వంలోని నీలం రంగు జెండా పైరేట్ గ్రూప్ తుడిచిపెట్టుకుపోయింది.
చింగ్ షి-జాంగ్ బో సాయ్ జంటకు జాంగ్ యులిన్ అనే కొడుకుతో పాటు 1813లో ఒక కుమార్తె జన్మించింది.
36 ఏళ్ల వయస్సులో 1822లో జాంగ్ బో మరణించారు. ఆ తర్వాత చింగ్ షి తన సొంత ప్రాంతమైన గ్వాంగ్‌డాంగ్‌కు తిరిగి వచ్చి అక్కడ క్యాసినోతో పాటు సెక్స్ పరిశ్రమను నెలకొల్పారు.
అనేక దేశాల మిలిటరీ కమాండర్లకు నిద్రను దూరం చేసిన చింగ్ షి, 69 ఏళ్ల వయస్సులో నిద్రలోనే కన్నుమూసినట్లు చరిత్రలో ఎన్నో కథనాలు వెల్లడిస్తున్నాయి.
సెక్స్ వర్కర్ చేసిన కుట్రల కథగా చింగ్ షి జీవితాన్ని వర్ణిస్తారు.
అదే సమయంలో కొందరు చరిత్రకారులు మాత్రం, అనేక సామ్రాజ్యాలలో అశాంతికి కారణమైన ఆమె ధైర్యం... ఒక మహిళ తలుచుకుంటే చరిత్రను తిరిగి రాయగలదు అనే సందేశాన్ని అప్పట్లో ప్రపంచానికి తెలియజేసిందని అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- పది వేళ్లతో 400 సంఖ్య వరకూ లెక్కించే అరుదైన భారతీయ పద్ధతి మీకు తెలుసా?
- ఆయుష్మాన్ భారత్ కంటే మోదీ ప్రతిష్టను పెంచే పథకాలపై ప్రచారాలకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టిందా?
- అఫ్గానిస్తాన్: మహిళలపై టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలు ప్రయోగించిన తాలిబాన్లు
- చంద్రంపాలెం హైస్కూల్: ‘కార్పొరేట్ స్కూల్ మాన్పించి ఈ సర్కారు బడికి పంపిస్తున్నారు’
- కిసాన్ మహా పంచాయత్: భవిష్యత్ కార్యాచరణపై రైతు సంఘాల దృష్టి
- 'మగతోడు లేకుండా మీరెందుకు బయటికొచ్చారు?'
- తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న కొత్తరకం కరోనావైరస్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












