‘మా ఆయనకు తీరిక లేదు, నేను వేరే మగాళ్లతో చాట్ చేస్తాను!'

ఫొటో సోర్స్, Getty Images
ఆ రోజు నా ఫేస్‌బుక్ అకౌంట్ తెరవగానే వచ్చిన మెసేజ్ చూసి షాక్ అయ్యా. అతనెందుకు నాకు మెసేజ్ చేసినట్లు? అప్పుడు మా ఆయన ఇంట్లో లేరు. ఒంటరిగా ఉన్నా కూడా ఆ మెసేజ్ చూశాక ఆందోళనతో చుట్టుపక్కల చూశా. ఆ క్షణాన నన్ను చూసి నాకే నవ్వొచ్చింది. అలా నవ్వుకుంటూనే ఆ మెసేజ్‌ను చదివా.
'హాయ్, నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నా?' అని అతను మెసేజ్ పెట్టాడు. దాన్ని నవ్వుతూ కాసేపు తెరిపార చూశా. దానికి సమాధానం ఇవ్వాలా లేక వదిలేయాలా అనేది నేనింకా తేల్చుకోలేదు.
ఓ అపరిచిత వ్యక్తి మెసేజ్‌కు నేనెందుకు సమాధానం ఇవ్వకూడదు? నా భర్తకు ఈ విషయం తెలిస్తే ఏమవుతుంది? ఆయన ఎలా స్పందిస్తారు? అసలు ఆయన ఆలోచనలు రాగానే నాకు కోపం వచ్చింది.
మా వారు నా పట్ల చూపుతున్న ఉదాసీనతే ‘హాయ్’ అనే ఓ అపరిచితుడి సందేశం కూడా నన్ను తడబాటుకు గురిచేసేలా చేసింది. నా జీవితం ఇంకోలా ఉంటే ఇలాంటి మెసేజ్‌లను కచ్చితంగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ, నా పరిస్థితి వేరు. అందుకే కోపంతో అతని మెసేజ్‌కు ‘హాయ్’ అంటూ రిప్లై ఇచ్చాను.
‘నా జీవితంలోకి ఆకాశ్ వచ్చాక..‘
అతని పేరు ఆకాశ్. తన గురించి నాకేం తెలియదు. కానీ, ఏ మాత్రం ఆలోచించకుండానే అతని ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను ఆమోదించాను. కొన్ని కారణాల వల్ల నేను ఎయిర్ హోస్టెస్ అనే భ్రమల్లో అతనున్నాడు.
అతనికి నిజం చెప్పాల్సింది కానీ, ఎయిర్ హోస్టెస్ అనే ఆలోచన నాకు బాగా నచ్చింది.
నేను చాలా అందంగా ఉండేదాన్నని చిన్నప్పటి నుంచి అంటుండేవారు. పాల మీగడ రంగు శరీరంతో, బాదం లాంటి కళ్లతో, చాలా చక్కగా ఉండేదాన్నంటారు. నేను చూడటానికి ఆకర్షణీయంగానే కనిపిస్తాను.
‘నన్ను పట్టించుకునే తీరిక మావారికి లేదు‘
మా ఇంట్లో వాళ్లు నా పెళ్లికి తొందర పెట్టారు. వారు చూసిన మొదటి వ్యక్తినే నాకిచ్చి కట్టబెట్టారు. నా ఇష్టాయిష్టాలు, కోరికల గురించి అతనికి ఏమాత్రం పట్టింపు లేదు.
ప్రేమతో మా ఆయన నన్ను దగ్గరకు తీసుకుంటారని, అప్పడప్పుడు నా కోసం స్వయంగా టీ పెట్టి ఇస్తారని ఊహించుకున్నాను. కానీ, మావారు ఓ యంత్రంలాంటివారు. ఉదయాన్నే లేస్తారు. పనికి వెళ్తారు. ఆలస్యంగా ఇంటికి వస్తారు. తినగానే వెళ్లి పడుకుంటారు.
అతను అంత బిజీగా ఎందుకుంటాడో నాకర్థం కాదు. కనీసం భార్యను ప్రేమగా పలకరించే సమయం కూడా ఆయనకు లేదా? ఒక్క క్షణం కౌగిలించుకొని ప్రేమతో చూసే తీరిక కూడా అతనికి లేదా?
మా ఆయనకు అలాంటి భావాలే లేవా లేక భార్యను ప్రేమగా చూస్తే తన అహం దెబ్బతింటుందని అనుకుంటారా? తెలియదు. మా మధ్య సెక్స్ ఉంటుంది కానీ, అందులో శృంగారం ఉండదు. రతికి ముందు ఎలాంటి కామోద్దీపన చర్యలు మా మధ్య లేవు.
నేను ఎంత అందంగా కనిపించినా, ఇంటిని ఎంత బాగా చక్కదిద్దుతున్నా ఆయన నుంచి ఒక్కటంటే ఒక్క ప్రశంసకు కూడా నోచుకోలేదు. ఆకాశ్ నుంచి ఇంకో మెసేజ్ రావడంతో మా వారి ఆలోచనల నుంచి బయటకొచ్చాను. తను నా ఫొటో చూడాలనుకుంటున్నాడు.
ఇంటర్నెట్ అనేది నాకు తెలియని ఓ బ్రహ్మపదార్థం. నా ఫేస్‌బుక్ అకౌంట్ కూడా మా వారే తెరిచారు. ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను ఎలా ఆమోదించాలి. మెసేజ్‌లకు ఎలా రిప్లై ఇవ్వాలి అనేది కూడా ఆయనే నేర్పారు.
కాకపోతే నా ప్రొఫైల్ ఫొటో పెట్టలేదు. అలా పెట్టే ఫొటోలను కొందరు డౌన్‌లోడ్ చేసి ఆశ్లీల వెబ్‌సైట్‌లలో పెడతారని ఓ సారి వినడంతో అప్పటి నుంచి కాస్త భయంగానే ఉంది.
కానీ, ఆకాశ్ మాత్రం ఫొటో కోసం పోరు పెడుతున్నాడు. అలాంటి సమయంలో టాపిక్ మార్చడానికి ప్రయత్నించేదాన్ని. తనను నిరుత్సాహపర్చడానికి నేను ఎయిర్ హోస్టెస్ కాదని కూడా చెప్పాను.
కానీ, వింటే కదా.. నా ఫొటో కోసం మరింత పరితపించేవాడు. అతనికి పంపాలన్నా నా దగ్గర ఫొటో ఉంటే కదా.. ఒక్క మంచి ఫొటో కూడా లేదు.

ఫొటో సోర్స్, Alamy
ఆకాశ్‌కు పెళ్లైంది. తనకు మూడేళ్ల బాబు ఉన్నట్లు చెప్పాడు. ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఆకాశ్ పని చేస్తున్నాడు. ఉద్యోగం మీద విదేశాలకు వెళ్తుంటాడు. తరచుగా పార్టీలకు హాజరవుతుంటాడు.
పార్టీలలో అమ్మాయిలు బహిరంగంగా మద్యం సేవించడం, పొగ తాగడం గురించి కూడా నాకు చెప్పాడు. ఆకాశ్ చెప్పేవన్నీ నాకు కొత్తగా అనిపించాయి. అతని మాటలు వింటే ఓ అద్భుత ప్రపంచాన్ని కిటికీ అద్దాల నుంచి చూసిన అనుభూతి కలిగింది.
ఆకాశ్ భార్య కూడా అతనిలాగే పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తోందట. ఆమె చాలా బిజీగా ఉంటుందని, తామిద్దరం కలసి గడిపే తీరిక కూడా ఉండదని అతను నాతో చెప్పాడు. తన భార్య విషయంలో ఒకసారి కలత చెందిన విషయాన్ని కూడా ఆకాశ్ నాతో పంచుకున్నాడు.
ఓ ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి ఫోన్ చేస్తే వాళ్లావిడ బిజీగా ఉన్నానని చెప్పిందట. దీంతో ఆకాశ్ బాగా అప్‌సెట్ అయ్యాడట. మా వారితో నాకూ ఇలాంటి అనుభవాలే ఎదురవుతుంటాయి.
రోజూ మేం చాటింగ్ చేసేవాళ్లం. ఆ సమయం చాలా ఆనందంగా గడిచేది. అతనితో చాటింగ్ కోసం ఇంటి పనులు కూడా త్వరగా పూర్తి చేసి మధ్యాహ్నం వేళకు తన మెసేజ్ కోసం వేచి చూసేదాన్ని.
‘ఫోటో పంపనందుకు బ్లాక్ చేశాడు‘
వెబ్‌క్యామ్ ఆన్ చేయవా అని ఓ రోజు ఆకాశ్ అడిగాడు. దీంతో నేను ఉలిక్కిపడి ఆఫ్‌లైన్‌కి వెళ్లాను. ఆ రోజు నేను కనీసం స్నానం కూడా చేయలేదు. నన్ను అలా చూస్తే ఏం చేయను? కానీ, ఆ తర్వాత ఫొటో అయినా పంపవా అంటూ రోజు పోరుపెడుతూనే ఉన్నాడు.
దీంతో అతడ్ని ఎలా సంభాళించాలో తెలియక తన నుంచి తప్పించుకోవడం ప్రారంభించా. మేం రోజూ చాట్ చేసే సమయంలో ఆన్‌లైన్‌కు వెళ్లడమే మానేశాను. కొన్ని రోజుల తర్వాత తను నన్ను బ్లాక్ చేశాడు.
మా మధ్య ఎలాంటి బంధం లేదు. కానీ, ఆకాశ్ దూరమవడం నా జీవితానికి వెలితిగా అనిపించింది.
నన్ను బ్లాక్ చేసినందుకు ఆకాశ్ మీద కంటే నా మీదే నాకే ఎక్కువ కోపం వచ్చింది. ఒకరి మీద ఆధారపడి బతుకుతున్నానే అనిపించింది. నాకంటూ ఓ ఉద్యోగం ఎందుకు లేదు? నాకు సొంత జీవితం లేదా? ఉద్యోగం ఉంటే నాకు ఇష్టమొచ్చినట్లు ఉండగలనా? అనిపించింది.
ఆకాశ్ ఘటన తర్వాత ఓ వారం పాటు ఫేస్‌బుక్ జోలికి కూడా వెళ్లలేదు. తనతో చాటింగ్ అనుభూతులు కొన్నాళ్లు నన్ను వెంటాడాయి. కానీ, మన కళ్ల ముందు కనిపించకపోతే అవి మన మది నుంచి కూడా వెళ్లపోతాయి. ఆకాశ్ కూడా అలానే వెళ్లిపోయాడు.
కాలం గడిచింది. అతనితో చాటింగ్ విషయాలు ఎప్పుడైనా గుర్తొస్తే మాత్రం అనుకోకుండానే ఆ రోజంతా నా మోములో నవ్వులు వికసిస్తాయి.

‘చాటింగ్ చేశా.. మోసం చేయలేదు‘
నా ఆన్‌లైన్ అనుబంధంతో ఎక్కువగా లాభపడింది మా ఆయనే కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే, ఆయన నా కోసం ఏం చేయకుండానే చాలా రోజులు నేను ఆనందంగా గడిపాను. మా మధ్య లోపించిన అనుబంధాన్ని ఆకాశ్ తన చాటింగ్‌తో పరిపూర్ణం చేశాడు.
నేనేం తప్పు చేయలేదు. మా వారిని మోసం చేయలేదు. వివాహేతర సంబంధం పెట్టుకోలేదు. కేవలం ఓ అపరిచితుడితో చాట్ చేశానంతే. భార్యగా నా బాధ్యతలు మోస్తున్నప్పటికీ మహిళగా నాకంటూ కొన్ని కలలు, కోరికలు ఉంటాయనే విషయం తన సహచర్యంలో ఉన్నప్పుడు గుర్తించగలిగాను.
'వాళ్లతో చాటింగ్ కొత్త ఉత్సాహానిచ్చింది'
మళ్లీ ఆకాశ్‌తో ఆన్‌లైన్ అనుబంధాన్ని కొనసాగించాలా వద్దా అనే సందిగ్ధత ఎదురైంది. ఓ రోజు ఫేస్‌బుక్‌లో చాలా మంది ప్రొఫైల్స్ చూశా. అందంగా ఉన్న ఒకరి ప్రొఫైల్ చూశా. ఎందుకు చేశానో నాకు తెలియదు కానీ, అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టా. దీంతో అతను స్పందించాడు.
'నీకు పెళ్లైంది కదా ఎందుకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టావు'? అని అడిగాడు. పెళ్లైన అమ్మాయిలు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టకూడదా? అని అడిగా. అప్పటి నుంచి అతనితో చాటింగ్ మొదలుపెట్టా. ఇప్పటికీ మేం టచ్‌లోనే ఉన్నాం.
అతనొక్కడే కాదు. ఇంకో అబ్బాయికి అలానే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టా. సెలబ్రెటీలతో దిగిన ఫొటోలను అతను ఫేస్‌బుక్‌లో పెట్టుకున్నాడు. అతని గురించి తెలుసుకుంటే బాగుటుందనిపించింది. నా ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను తను కూడా ఆమోదించాడు. ఇప్పుడు నా జీవితం సంపూర్ణంగా, ఉత్సాహంగా గడుస్తున్నట్లు అనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
‘నా కూతురుకు నా పరిస్థితి రావొద్దు‘
కొన్నాళ్లకు నేను గర్భవతినయ్యాను. నా కూతురు రాకతో జీవితమంతా మారిపోయింది. వేరే పని చేసే తీరిక కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మా పాప వయసు మూడేళ్లు. ఎవరితోనైనా చాటింగ్ చేద్దామని ఫోన్ పట్టుకుంటే నా కూతురు ఎత్తుకోవా అంటూ అడుగుతుంది. ఫోన్‌లో కార్టూన్ వీడియోలు చూడాలని మారాం చేస్తుంది.
దానితో వేగలేక ఒక్కోసారి చిరాకేస్తుంది. ఇంకోసారి అసలు నేను తల్లినేనా అని ఆశ్చర్యపోతుంటా. భార్యగా, తల్లిగా ఉండటమే నాకు రాసిపెట్టి ఉందేమో అనిపిస్తుంది. అందుకే, ఇదే పరిస్థితి నా కూతురుకు ఎదురుకావొద్దని నిర్ణయించుకున్నా.
నా బిడ్డ తన కాళ్ల మీద తాను నిలబడేలా పెంచాలనుకుంటున్నా. అప్పడు నా లాగా కాకుండా తన కిష్టమైనట్లుగా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటుంది.
(ఈశాన్య భారత్‌కు చెందిన ఓ మహిళ తన నిజ జీవితగాథను బీబీసీ ప్రతినిధి ప్రగ్యా మానవ్‌తో పంచుకోగా, సీనియర్ ప్రతినిధి దివ్య ఆర్య దీనిని అక్షరబద్ధం చేశారు. ఆ మహిళ విజ్ఞప్తి మేరకు ఆమె పేరును రహస్యంగా ఉంచుతున్నాం.)
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








