పగలు లాయర్లు... రాత్రుళ్లు బార్‌లో ‘డ్రాగ్’ డాన్సర్లు

మగవాళ్లే ఆడవాళ్లలా దుస్తులు, మేకప్ వేసుకొని ప్రదర్శనలు చేసేవాళ్లను డ్రాగ్ ప్రదర్శకులంటారు. దిల్లీలోని ఇద్దరు లాయర్లు ఇలా డ్రాగ్ ప్రదర్శకులుగా మారి తమలోని స్త్రీ లక్షణాలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తున్నారు. వాళ్లలో ఒకరు ఇక్షాకు, మరొకరు ఆయుష్మాన్.
ఈ డ్రాగ్ ప్రదర్శకుల సంస్కృతి విదేశాల్లో చాలాకాలంగా ఉంది. భారత్‌లో మాత్రం దీనికంత ప్రాచుర్యం లేదు. కానీ, ఇలా మారడం వల్ల తమలో దాగున్న స్త్రీత్వాన్ని స్వేచ్ఛగా బయటపెట్టే అవకాశం లభిస్తోందని వారు చెబుతున్నారు.
ఇక్షకు, ఆయుష్మాన్‌లను మొదట చూసినప్పుడు వాళ్లు ఆడవాళ్లలా మేకప్ వేసుకుంటే అంత అందంగా కనిపించరేమో అనిపిస్తుంది. కానీ, ఒక్కసారి వాళ్లు రెడీ అయ్యాక, ఆడవాళ్ల వేషంలోనే వాళ్లు మరింత అందంగా ఉన్నారనిపిస్తుంది.
మగవాళ్లు పూర్తిగా అమ్మాయిల్లా తయారై ప్రదర్శనలు ఇస్తే వాళ్లను ‘డ్రాగ్ క్వీన్’ అంటారు. అదే ఆడవాళ్లు మగవాళ్లలా తయారైతే వాళ్లను ‘డ్రాగ్ కింగ్’ అంటారు. ఈ యువ లాయర్లు ఇద్దరూ ఇలా ‘డ్రాగ్ క్వీన్’లా జీవించడాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఇదేదో ఇలా దుస్తులు ధరించి ఇంటింటికీ వెళ్లి డబ్బులు అడిగే పని అనుకుంటే పొరబాటే. వీళ్లు దిల్లీలో కొన్ని హైక్లాస్ పబ్‌లు, బార్‌లలో మాత్రమే ఇలా ‘డ్రాగ్ క్వీన్స్’గా ప్రదర్శనలిస్తారు.

‘నేను పగటి పూట మానవ హక్కుల లాయర్‌ని. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఆఫీసులో ఉంటా. కానీ రాత్రులు మరో అందమైన జీవితాన్ని కూడా ఆస్వాదిస్తున్నా.
డ్రాగ్ ప్రదర్శన వల్ల నాలోని స్త్రీత్వాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం లభిస్తోంది. దీని వల్ల నాకెలాంటి ఇబ్బందీ కలగట్లేదు. మేం యూట్యూబ్‌లో వీడియోలు చూసి సొంతంగా మేకప్ వేసుకోవడం నేర్చుకున్నాం. మా దుస్తుల్ని మేమే డిజైన్ చేసుకుంటాం.

యువకులుగా ఉన్నప్పుడు మాలోని స్త్రీ లక్షణాలను అంగీకరించడం మాకు కొంచెం కష్టంగా ఉండేది. మమ్మల్ని చూసి అందరూ వెక్కిరిస్తారని భయమేసేది. మేము చేసే పని సమాజానికి, ముఖ్యంగా ఎల్జీబీటీ సమాజానికి చాలా అవసరం. ఎల్జీబీటీల భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తపరిచేందుకు మా ప్రదర్శన ప్రోత్సహిస్తుందని వాళ్లంటారు.
నా తల్లిదండ్రులు నాపైన ఎన్నడూ ఆంక్షలూ విధించలేదు. అయినా నా డ్రాగ్ ప్రదర్శనల గురించి వాళ్లతో చర్చించడానికి ఆలోచిస్తాను’ అంటూ తన గురించి చెప్పారు ఆయుష్మాన్.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









