‘మేల్ సెక్స్ వర్కర్‌గా నేను ఎందుకు మారాల్సి వచ్చిందంటే...’ - #HisChoice

'నువ్వు ఎక్కడ నిలబడ్డావో నీకు తెలుస్తోందా? ఇది శరీరంతో వ్యాపారాలు జరిగే చోటు - ట్రాన్స్‌జెండర్ హెచ్చరిక.
నేను, అంటే ఒక మగవాణ్ని.. రంగురంగుల బల్బులు వెలుగుతున్న చోట నన్ను నేనే అమ్ముకోవడం కోసం నిలబడి ఉన్నాను - నా సమాధానం.
"ఆ తెలుసు. కానీ నేను డబ్బు కోసం ఏదైనా చేస్తాను" అని చెప్పాను.
నా ఎదురుగా మధ్య వయసులో ఉన్న స్త్రీ.. కాదు కాదు ట్రాన్స్‌జెండర్.. నన్ను అదోలా చూసింది.
'నీలో చాలా పొగరు ఉంది. ఇది ఇక్కడ పనిచేయదు' అంది.
అలా నిలబడినప్పుడు నా మనస్సాక్షి మరణించిందని నాకు అనిపించింది. నేను ఎలాంటి కుటుంబం నుండి వచ్చానంటే మా వాళ్లు ఎవరూ నేను ఇలాంటి పని చేస్తానని ఊహించలేరు. కానీ నా అవసరాలు నన్ను ఈ వైపు తోసాయి.
నేను ''ఎంతసేపు వేచి ఉండాలి? రేపు నాకు ఆఫీసు ఉంది'' అన్నాను.
ఆ ట్రాన్స్‌జెండర్ 'పోయి ఆఫీసు పని చేసుకో మరి. ఇక్కడేం చేస్తున్నావ్?' అంది.
ఈ జవాబు విని నేను నిశ్శబ్దమైపోయాను. కొద్ది సేపట్లోనే నేను ఆ శరీరాల మార్కెట్‌లో కొత్త వస్తువుగా మారిపోయాను.
ఆ ట్రాన్స్‌జెండర్ మృదువుగా, "నీ ఫొటోలు పంపాలి. లేకపోతే నీతో ఎవరూ మాట్లాడరు" అంది.
ఇది విని నాకు ఆందోళన కలిగింది. మా బంధువులు ఎవరైనా నా ఫొటోలు చూస్తే నా భవిష్యత్ ఏమౌతుంది?
ఆ ట్రాన్స్‌జెండర్ వ్యక్తి కుడి, ఎడమ, ముందు నుంచి నా ఫొటోలు తీసుకుంది.
ఆ ఫొటోలను వాట్సాప్ ద్వారా ఎవరికో పంపింది.
'కొత్త వస్తువు, రేటు ఎక్కువ. తక్కువ రేటువి కావాలంటే చెప్పండి, వేరే వాళ్లకు పంపుకుంటాం' అని మెసేజ్ పెట్టింది.
నా మీద బేరం మొదలైంది. ఎనిమిది వేల నుంచి ప్రారంభమై, ఐదు వేల వద్ద ఫిక్స్ అయింది.
ఇదంతా ఏదో సినిమాలో కాదు. నా విషయంలో జరుగుతోంది. అదంతా నాకు చాలా విచిత్రంగా అనిపించింది.
నేను జీవితంలో మొదటిసారి ఇలాంటి పని చేయబోతున్నాను. భావోద్వేగాలు, ప్రేమ లేకుండా ఒక కొత్త వ్యక్తితో ఇలా చేయడం ఎలా ఉంటుంది?

నేను పసుపు రంగు టాక్సీలో కూర్చుని, కోల్‌కతాలో ధనికులు ఉండే ప్రాంతంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించాను. ఆ ఇంట్లో ఒక పెద్ద ఫ్రిజ్, వైన్ సీసాలు ఉన్నాయి.
ఆమె ఓ 32-34 సంవత్సరాల వివాహిత.
ఆమె మాటలు ప్రారంభించింది."నేను చేరరాని చోటుకు చేరాను. నా భర్త గే. అమెరికాలో ఉంటాడు. అతని వల్ల ఏమీ కాదు. విడాకులు కూడా తీసుకోలేను. విడాకులు తీసుకున్న స్త్రీని ఎవరు వివాహం చేసుకుంటారు? నాక్కూడా కోరికలు ఉంటాయిగా'' అంది.
మేము ఇద్దరం త్రాగటం ప్రారంభించాం. ఆమె హిందీ పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. మేము భోజనాల గది నుండి బెడ్‌రూమ్‌కి వెళ్ళాము.
అప్పటివరకు నాతో ప్రేమ మాట్లాడిన ఆమె, పని పూర్తి కాగానే డబ్బు ఇచ్చి"ఇక నడువు'' అంది. ఆమె నాకు టిప్ కూడా ఇచ్చింది.
నా కష్టాలు కోల్‌కతాకు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నా ఇంటి వద్ద మొదలయ్యాయి.
మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నేను పుట్టాక మా నాన్న ఉద్యోగం పోయింది. ఎంబీయే చేయాలనేది నా కల. కానీ కుటుంబ సమస్యల కారణంగా బలవంతంగా ఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది. కోల్‌కతాలో ఉద్యోగం వచ్చింది.
కానీ నా కుటుంబ బాధ్యతలు పెరగడంతో నాకు డబ్బు అవసరాలు పెరిగాయి. దీంతో నేను ఇంటర్నెట్‌లో శోధించడం మొదలుపెట్టాను.
ఇంటర్నెట్ నాకు మేల్ ఎస్కార్ట్, జిగోలో కావడానికో మార్గం చూపింది. ఇలాంటివి నేను సినిమాలలో కూడా చూసాను. జిగోలోల కోసం కొన్ని వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. మొదట నా ప్రొఫెల్ వాటిలో పెట్టడానికి భయపడ్డా, అవసరాల రీత్యా చివరికి పెట్టాల్సి వచ్చింది.
నేను కలుసుకున్న స్త్రీలలో విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులు, ఒంటరి అమ్మాయిలు ఉన్నారు. వాళ్లలో ఎక్కువ మంది నన్ను మనిషిగా చూసేవాళ్లు కాదు. బెడ్ రూంలోకి వెళ్లక ముందు వరకు వాళ్లంతా నాతో చాలా చనువుగా మాట్లాడతారు. కానీ బయటకు రాగానే వాళ్ల ప్రవర్తన మారిపోతుంది.
బెడ్‌రూం నుంచి బైటికి రాగానే, 'ఇక్కడి నుంచి వెళ్లిపో ఇక', 'డబ్బులు తీసుకుని బయలుదేరు'.. ఇలాంటి మాటలు వినవస్తాయి.
కొన్నిసార్లు తిట్లు కూడా.
ఈ సమాజం మా నుంచి ఆనందం పొందుతుంది కానీ మమ్మల్నే వ్యభిచారులు అంటూ తిట్లు కూడా తిడుతుంది.

ఈ పనిలో 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న మహిళ ఒకరు కూడా నాకు పరిచయమయ్యారు. అది జీవితంలో నాకో కొత్త అనుభవం.
రాత్రంతా ఆమె నన్ను 'బాబూ, బాబూ' అంటూ నాతో తన కొడుకుతో మాట్లాడినట్లే మాట్లాడింది.
చివరగా, ''ఈ పని నుంచి వీలైనంత త్వరగా తప్పుకో బాబూ. ఇది మందిచి కాదు'' అని కూడా అంది.
ఉదయం వచ్చేస్తుంటే బడికి వెళ్తున్న కుమారుడికి ఇస్తున్నట్లే నాకు డబ్బు కూడా ఇస్తుంటే నాకు దు:ఖం వచ్చింది.
ఒకరోజు నేను చేస్తున్నపని మీద నా మీద నాకే అసహ్యం కలిగి, నేను బాగా తాగి మా అమ్మకు ఫోన్ చేశాను.
''నేను ఇంత డబ్బు ఎలా పంపుతున్నానో మీరు ఎప్పుడూ అడగలేదు. కానీ ఇక్కడ నేనేం చేస్తున్నానో తెలుసా? వ్యభిచారం'' అన్నాను.
మా అమ్మ, ''నోరు ముయ్యి. తాగి నోటికి వచ్చినట్లు మాట్లాడకు '' అని ఫోన్ పెట్టేసింది.
మా అమ్మకు నేను నిజం చెప్పినా తను నమ్మలేదు.
ఆ రాత్రి నేను చాలా ఏడ్చాను. నా విలువ కేవలం డబ్బు వరకేనా?
ఆ వ్యాపారంలో చాలాసార్లు వింత వింత వ్యక్తులు కలిశారు. శరీరం మీద వాళ్ల గుర్తులు వదిలి వెళ్లారు. ఆ బాధను మరో జిగోలో మాత్రమే అర్థం చేసుకోగలడు.
చాలా రోజుల తర్వాత నేను ఎంబీయే పూర్తి చేసి, కోల్‌కతాకు దూరంగా మరో నగంరలో ఒక మంచి ఉద్యోగంలో చేరాను.
అక్కడ నా గతం గురించి ఏమీ తెలీని కొత్త స్నేహితులు దొరికారు. ఈ విషయాల గురించి నేను ఎవరికీ చెప్పలేను.
(బీబీసీ ప్రతినిధి వికాస్ త్రివేది ఒక జిగోలోతో జరిపిన సంభాషణ ఆధారంగా. ఈ కథను చెప్పిన వ్యక్తి అభ్యర్థనపై అతని వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం.)
ఇవి కూడా చదవండి:
- రఫేల్ యుద్ధ విమానాల వివాదం: అసలు ఒప్పందం ఏంటి? వివాదం ఎక్కడ? తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు
- ఇది కొత్త ప్రేమ ఫార్ములా
- చైనాలో 'బస్ పూలింగ్'.. ప్రయాణికుల చెంతకు బస్సు
- ఈ ఆరు సూత్రాలనూ పాటిస్తే.. హాయిగా నిద్రపోవచ్చు
- సిక్కిం: ఎత్తయిన పర్వతాల్లో అత్యంత అందమైన విమానాశ్రయం
- నన్ రేప్ కేసు: కేరళలో చర్చిలపై విశ్వాసం తగ్గుతోందా?
- ఐఫోన్ ఎక్స్ఎస్ : ఈ-సిమ్ అంటే ఏమిటి? ఇది ఎందుకు ఉపయోగపడుతుంది?
- బ్రిటన్: సెక్స్ కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న యువత
- ‘భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్న భారతీయులు’
- సెక్స్‌లో ఎంతసేపు పాల్గొన్నా భావప్రాప్తి కలగకపోవడానికి కారణమేంటి? ఇది వ్యాధి లక్షణమా?
- సెక్స్ అడిక్షన్: కోరికలు ఎక్కువగా ఉంటే వ్యాధిగా భావించాలా?
- సౌదీ అరేబియా: మహిళతో కలిసి టిఫిన్ తిన్నందుకు వ్యక్తి అరెస్ట్
- చంద్రునిపై సాయి ముఖం: ఎందుకు అలా కనిపిస్తుంది?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








