ఐఫోన్ టెన్ ఎస్ : ఈ-సిమ్ అంటే ఏమిటి? ఇది ఎందుకు ఉపయోగపడుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
యాపిల్ తాజాగా తీసుకొచ్చిన కొత్త ఐఫోన్ మోడళ్లలో ఉండే ఒక టెక్నాలజీపై చాలా మందిలో ఆసక్తి నెలకొంది. అదే 'ఈ-సిమ్(eSIM)'. ఇంతకూ 'ఈ-సిమ్' అంటే ఏమిటి? ఇప్పుడున్న సిమ్‌లకు, దీనికి తేడా ఏమిటి? ఈ సిమ్‌తో ప్రయోజనమేంటి?
ఈ-సిమ్ అంటే 'ఎంబెడెడ్ సిమ్'. ఇదో ఎలక్ట్రానిక్ సిమ్ కార్డు.
ప్రస్తుతం మనం వాడుతున్న సిమ్ కార్డులు ప్లాస్టిక్ సిమ్ కార్డులు. ఈ-సిమ్ టెక్నాలజీలో సిమ్ కార్డు భౌతిక రూపంలో ఉండదు. అయితే చిన్న చిప్ రూపంలో ఉండే ఈ-సిమ్‌ను స్మార్ట్ ఫోన్‌లో ఎంబెడ్ చేస్తారు. ఇది తీయడం వీలుకాదు. ఇది నానో సిమ్ కన్నా చిన్నగా ఉంటుంది. ఈ-సిమ్ పనిచేయాలంటే అందుకు అనువైన నెట్‌వర్క్ ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images
తేలిగ్గా మార్చుకోవచ్చు
ఈ-సిమ్ ఉంటే మరో నంబరు వాడాలనుకున్నప్పుడు ఫోన్‌లో సిమ్ ట్రేను తెరవాల్సిన అవసరం ఉండదు. ఒకే కార్డుపై రెండు ఫోన్ నంబర్లు కలిగి ఉండేందుకు ఈ-సిమ్ వీలు కల్పిస్తుంది. వ్యాపార, ఉద్యోగ అవసరాల కోసం ఒక నంబరును, వ్యక్తిగత అవసరాలకు ఇంకో నంబరును వాడుకోవచ్చు. అయితే ఏకకాలంలో ఒక నంబరునే వాడేందుకు వీలుంటుంది.
వాయిస్, డేటా ప్లాన్లు వేర్వేరుగా తీసుకోవచ్చు.
వేరే దేశం వెళ్లినప్పుడు అవసరమైతే డేటా రోమింగ్ సిమ్‌ను కూడా వాడుకోవచ్చు.
నెట్‌వర్కులను మార్చుకోవడం, నంబర్లు మార్చి వాడటంలోనే కాదు ఈ-సిమ్‌తో ఇతరత్రా ప్రయోజనాలూ ఉన్నాయి. సరైన సాఫ్ట్‌వేర్ ఉంటే ఈ-సిమ్‌లను 'రీరైట్' చేయొచ్చు. ఫోన్ కాల్‌తో ఆపరేటర్‌ను త్వరగా, తేలిగ్గా మార్చుకోవచ్చు. సిమ్‌కార్డును భౌతికంగా రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉండదు.

ఫొటో సోర్స్, Getty Images
పూర్తిగా కొత్త టెక్నాలజీనా?
ఈ-సిమ్‌ను 2016లో సామ్‌సంగ్ గేర్ ఎస్2 3జీ మోడల్‌లో వాడారు.
యాపిల్ వాచ్ 3లోనూ దీనిని వాడారు. ఈ-సిమ్‌లు బాగా చిన్నవిగా ఉండటంవల్ల, స్మార్ట్ వాచీల్లాంటి చిన్నపాటి డివైస్‌లలో ఎక్కువగా ఉపయోగపడతాయి.
గూగుల్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 2లోనూ ఈ-సిమ్ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ఫోన్ కావాలి, కానీ ఈ-సిమ్ వద్దా?
యాపిల్ కొత్తగా తీసుకొచ్చిన ఐఫోన్ టెన్ ఎస్, టెన్ ఎస్ మాక్స్ మోడళ్లను భౌతిక సిమ్ కార్డు స్లాట్‌తో విక్రయిస్తారు. ఈ ఫోన్లు కావాలిగాని, ఈ-సిమ్ వద్దు అనుకుంటే దీనిని వాడకుండా ఉండొచ్చు. దీనిని వాడటానికి వీలుకాకపోయినా, ఇబ్బంది ఉండదు.
ఏ దేశంలోనైనా వాడొచ్చా?
ఈ-సిమ్ 'గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్(జీఎస్‌ఎంఏ)' ఆధారిత టెక్నాలజీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్ నెట్‌వర్కుల సమూహమే జీఎస్‌ఎంఏ.
జీఎస్‌ఎంఏ ఆధారిత టెక్నాలజీ కావడం వల్ల ఈ-సిమ్‌ను ఎక్కడైనా వాడొచ్చని చెప్పొచ్చు. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే మాత్రం దీనిని అన్ని దేశాల్లో వాడలేం.
ఆస్ట్రియా, భారత్, కెనడా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, జర్మనీ, హంగేరీ, స్పెయిన్, యూకే, అమెరికాల్లో మాత్రమే నెట్‌వర్క్‌లు ఈ-సిమ్‌ను సపోర్ట్ చేస్తాయి. అదీ అన్ని నెట్‌వర్కులు కాదు.

ఫొటో సోర్స్, Getty Images
మీరు ఈ 10 దేశాల వెలుపల ఉంటుంటే, భౌతిక సిమ్‌కార్డు అవసరమయ్యే పక్షంలో ఐఫోన్ టెన్ ఎస్, టెన్ ఎస్ మాక్స్ మోడళ్లలో ఉండే డ్యూయల్ సిమ్ సామర్థ్యం ఉపయోగపడుతుంది.
చైనాలో అయితే రెండు భౌతిక సిమ్‌కార్డులు పెట్టేందుకు వీలుగా ఈ మోడళ్లలోని సిమ్‌ట్రేలో మార్పులు చేశారు.
ఇవి కూడా చదవండి:
- రఫేల్ డీల్: అంబానీ సంస్థను.. ‘భారత ప్రభుత్వమే ప్రతిపాదించింది. మాకు ఇచ్చిన వారిని తీసుకున్నాం’
- ఫ్యాషన్ ప్రపంచంలో జుట్టు లేకుండా మోడలింగ్ చేయడం సాధ్యమా?
- GROUND REPORT: జమ్మూ కశ్మీర్ పోలీసు హత్య: ఒడిలో పాప.. ఒంట్లో తుపాకీ తూటాలు
- అపర కుబేరులు వార్తా పత్రికలను ఎందుకు కొంటున్నారు?
- ఫోన్ స్కామ్: మొబైల్ ఫోన్లు హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు
- ఆస్ట్రేలియా: స్ట్రాబెర్రీ పండ్లలో సూదులు ఎందుకు దాస్తున్నారు?
- యాపిల్ కంపెనీ విలువ రూ.68,61,000,00,00,000
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








