జమ్మూ కశ్మీర్ పోలీసు హత్య: ఒడిలో పాప.. ఒంట్లో తుపాకీ తూటాలు

- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి, శ్రీనగర్ నుంచి
జమ్ము కశ్మీర్‌లో మిలిటెంట్ల దాడులు, ఇతర హింసాత్మక ఘటనల కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 40 మంది అధికారుల్ని కోల్పోయింది జమ్ము కాశ్మీర్ పోలీస్ విభాగం.
గురువారం అపహరణకు గురైన నలుగురు పోలీసుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిని కిడ్నాప్ చేసిన గ్రామానికి కిలోమీటరు దూరంలో వారి మృతదేహాలు లభించాయి.
ఈ ఘటనకు బాధ్యులం తామేనంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు సంబంధించినదిగా భావిస్తున్న ట్విట్టర్ హ్యాండిల్ పేర్కొంది. మరోవైపు ఈ ఘటన తర్వాత పోలీసులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తల్ని కేంద్ర హోం శాఖ ఖండించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
ఓ వైపు స్థానికుల మానవహక్కుల్ని హరిస్తున్నారంటూ పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతుంటే .. మరోవైపు అదే పోలీసులు అనేక సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
వంటగదిలో ఉన్న పోలీస్ అధికారి మహ్మద్ అష్రఫ్ దార్‌ను మిలిటెంట్లు కాల్చి చంపినప్పుడు ఆయన చేతుల్లో ఏడాదిన్నర వయసున్న ఆయన బిడ్డ కూడా ఉంది. తుపాకీ కాల్పుల మోత వినగానే ఆయన తండ్రి ఒక్కసారిగా తన కుమారుడు ఉన్న గదిలోకి పరుగెత్తారు.
ఆ సంఘటన గురించి మహ్మద్ అష్రఫ్ తండ్రి గులామ్ ఖదర్ దార్ నాకు ఇలా చెప్పారు.. ‘‘అష్రఫ్‌పై తుపాకీ గురిపెట్టిన ఆగంతకులు, బిడ్డ మెడపై కత్తి పెట్టారు. బిడ్డ అష్రఫ్ ఒళ్లోనే ఉంది. అష్రఫ్‌ను వాళ్లు కాల్చి చంపారు. దీంతో పాప రక్తంలో తడిసిపోయింది. ఆమెను నేనే తీశాను. అష్రఫ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ప్రాణాలతో ఉన్నాడేమోనని తిప్పి చూశాను. కానీ అప్పటికే మరణించాడు.’’
జమ్ము కాశ్మీర్ పోలీసు విభాగంలో సుమారు లక్ష మంది పోలీసు ఉద్యోగులున్నారు. ఉగ్రవాద నిరోధక విభాగంలో పనిచేసే స్పెషల్ పోలీస్ అధికారులు కూడా వారిలో భాగమే. ఇలాగే తమపై దాడులు కొనసాగుతూ పోతే ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లాల్సి వస్తుందని కొందరంటున్నారు.

ప్రత్యేక పోలీసు అధికారి జావేద్ అహ్మద్‌ను మొదట ఉద్యోగం వదిలెయ్యాలని మిలిటెంట్లు బెదిరించారు. మసీదులో బహిరంగ ప్రకటన చేస్తున్న సమయంలో ఆయనపై కాల్పులు జరిపారు.
‘‘నేను ఇంట్లోంచి ఓ దుకాణానికి వెళ్లాను. నాపై కాల్పులు జరిపారు. తుపాకీతో కాల్చారు. ఆ బుల్లెట్ నా కాలిని తాకింది. నేను ఎస్పీవోనని చెప్పాను. పది రోజులుగా ఇంట్లోనే ఉన్నానని కూడా చెప్పాను’’ అని జావేద్ అహ్మద్ చెప్పారు.
‘మీరు మసీదుకి వెళ్లిన విషయం కూడా చెప్పారా..?’
‘‘క్షమాపణ కోరేందుకే నేను మసీదుకు వెళ్లాను. ఇకపై ఎస్పీవోగా పని చెయ్యబోనని ప్రకటన కూడా చేశాను. ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లోనే కూర్చుంటానని చెప్పాను.’’
‘ఆ విషయం మీరు ఎవరికి చెప్పారు..?’
‘‘శుక్రవారం ప్రార్థనల సందర్భంగా అక్కడ కొందరున్నారు. వాళ్ల ముందే మేం ఈ విషయాన్ని చెప్పాం.’’
‘మీరు రాజీనామా చేశారన్న విషయం మిలిటెంట్లకు ఎలా తెలుస్తుంది..?’
‘‘ఆ విషయాన్ని మసీదులోని మైకుల్లో చెబుతాం.’’

ఈ దాడులు జరిగినప్పటికీ, సీనియర్ అధికారులు మాత్రం పరిస్థితి అంతా బాగానే ఉందని చెబుతున్నారు. అయితే మిలిటెంట్లు ఇంత దారుణంగా వ్యవహరించడానికి కారణం గతంలో మిలిటెంట్ల పట్లా, వారి కుటుంబాల విషయంలోనూ అధికారులు వ్యవహరించిన తీరేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా వాళ్లు జన జీవన స్రవంతిలో కలవలేకపోతున్నారు. దాంతో ఈ ప్రతీకార చక్రం కొనసాగుతునే ఉంది.
దీనిపై రిటైర్డ్ డీఐజీ ఎఎం వటాలీ మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటనలు ఇక్కడ పని చేస్తున్న వారి మనోస్థైర్యాన్ని ఏ విధంగానూ దెబ్బతియ్యవు. వారంతా స్థానికులు. ఈ రకమైన ఉగ్రవాదాన్ని 1988 నుంచీ చూస్తూనే ఉన్నారు. ప్రధానమైన సమస్య ఏంటంటే వాళ్లు ఆయుధాల్ని వదిలిపెట్టి సామాన్య జీవనం గడుపుదామనుకున్నా, పోలీసులు వాళ్లను విడిచిపెట్టరు. అందుకే వాళ్లు తిరిగి మిలిటెంట్లుగా మారిపోతున్నారు. తండ్రీకొడుకులు కూడా తుపాకీ పట్టుకున్న కేసులున్నాయి. సరైన పునరావాస విధానం ఇక్కడ చాలా అవసరం’’ అన్నారు.
అటు పోలీసులూ, ఇటు మిలిటెంట్లూ ఇద్దరూ కశ్మీరీ సమాజం నుంచి వచ్చినవారే. అందుకే రెండు వైపుల నుంచి దాడులు జరుగుతుంటాయి.

పోలీసులు తమ ఆవేదనను, సవాళ్లను పంచుకునేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ కెమెరా ముందుకు రావాడనికి మాత్రం సిద్ధంగా లేరు.
మరోవైపు, కశ్మీర్ పోలీసులు అత్యంత సాహసం గలవారనీ, వృత్తి పట్ల నిబద్ధత కల్గిన వారనీ కశ్మీర్ ఐజీపీ ఎస్.పి. పనీ బీబీసీతో చెప్పారు. ఇలాంటి సవాళ్లు ఎదురైనప్పుడు చట్టానికి కట్టుబడి, తగిన విధంగా స్పందించామని ఆయన అన్నారు. తమ వాళ్ల త్యాగాల పట్ల గర్వంగా ఉన్నామని ఇవే తమకు మరింత స్థైర్యాన్ని ఇస్తాయని పలీ తెలిపారు.
తాజా హింసాత్మక ఘటనల నేపథ్యంలో... భారత్-పాకిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రుల మధ్య త్వరలో న్యూయార్క్‌లో జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్టు సెప్టెంబర్ 21వ తేదీన భారత్ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ యువత మిలిటెన్సీ బాట ఎందుకు పడుతోంది?
- కశ్మీర్: హిందూ ముస్లింలను ఒక చోటికి చేరుస్తున్న కళా ప్రదర్శన
- కఠువా అత్యాచారం: ‘దేశంలో అసలు మానవత్వం ఉందా?’
- పాకిస్తాన్‌తో చర్చలను రద్దు చేసుకున్న భారత్
- రఫేల్ యుద్ధ విమానాల వివాదం: అసలు ఒప్పందం ఏంటి? వివాదం ఎక్కడ? తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు
- రఫేల్ డీల్: అంబానీ సంస్థను.. ‘భారత ప్రభుత్వమే ప్రతిపాదించింది. మాకు ఇచ్చిన వారిని తీసుకున్నాం’
- ఈ ఆరు సూత్రాలనూ పాటిస్తే.. హాయిగా నిద్రపోవచ్చు
- నన్ రేప్ కేసు: కేరళలో చర్చిలపై విశ్వాసం తగ్గుతోందా?
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









