షుజాత్ బుఖారీ హత్య కేసు మిస్టరీగానే మిగిలిపోతుందా?

ఫొటో సోర్స్, Aparna Alluri
- రచయిత, అనురాధ భాసిన్
- హోదా, బీబీసీ కోసం
‘రైజింగ్ కశ్మీర్ ఎడిటర్ షుజాత్ బుఖారీని ముగ్గురు గుర్తుతెలియని సాయుధులు కాల్చి చంపారు’... గురువారం సాయంత్రం టీవీలో ఈ ఫ్లాష్ న్యూస్ చూడగానే.. నిలువెల్లా వణుకు.. నిశ్చేష్టత.
ఇది నిర్ఘాంతపరిచే పెను విషాదం. కేవలం ఒక వృత్తి సహచరుడిని కోల్పోయినందుకే కాదు. అతడి కుటుంబానికి తీరని నష్టం జరిగినందుకే కాదు. అతడిని ఎంతగానో ప్రేమించే అతడి భార్య, ఇద్దరు పిల్లలకు పూడ్చని లోటు అయినందునే కాదు. అతడి గళాన్ని అంతం చేసే ఉద్దేశం వల్ల కూడా.. ఇది దిగ్భ్రాంతికరమైన విషాదం.
షుజాత్ బుఖారీ ఒక శాంతి స్వరం. కశ్మీర్‌లో ఒక ముఖ్యమైన గళం. ఇక్కడి సంక్షోభంపై ఒక పాత్రికేయుడిగా పరితపించారు. శాంతి ప్రయత్నాలపై అవిశ్రాంతంగా కృషి చేశారు. శాంతిని పెంపొందించటానికి ప్రాధాన్యమిచ్చారు. వినూత్నంగా ఆలోచించి సూచనలు చేశారు.
ఆయన హత్యకు గురయ్యారు. ఇది భావప్రకటనా స్వేచ్ఛను హత్య చేసే ప్రయత్నం. పత్రికాస్వేచ్ఛను హరించే ప్రయత్నం. శాంతి ప్రయత్నాలకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం.

ఫొటో సోర్స్, Getty Images
రంజాన్ సుహృద్భావంలో భాగంగా భారత ప్రభుత్వం ఏకపక్షంగా ప్రకటించిన కాల్పుల విరమణ ముగిసే సమయంలో.. ఈ కాల్పుల విమరణను పొడిగిస్తారని, శాంతి చర్యలేవో ఆరంభిస్తారని ఆశిస్తున్న తరుణంలో జరిగిందీ ఈ దారుణ హత్య.
ఈ హత్య జరిగిన రోజే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఒక నివేదిక విడుదల చేసింది. కశ్మీర్‌లో హింస మీద, అక్కడి దురాగతాల మీద యూఎన్ మొట్టమొదటి నివేదిక అది. ఇండియా, పాకిస్తాన్ ఇరు దేశాలనూ బోనులో నిలబెట్టింది. ఆ నివేదిక వచ్చిన రోజే ఈ హత్య జరిగింది.
ఆయనను హత్యచేసిన వారి అసలు లక్ష్యమేంటి? ఇప్పుడే నిర్దిష్టంగా చెప్పటం కష్టం. అతడి ధైర్యసాహసాల మీద చేసిన దాడా? లేక శాంతికి తూట్లు పొడిచే విశాల పన్నాగంలో ఆయననొక పావుగా బలిచేశారా?
ఇఫ్తార్ సమయానికి కొంచెం ముందుగా ఆఫీస్ నుంచి బయలు దేరారు బుఖారీ. రెసిడెన్సీ రోడ్‌లో రద్దీగా ఉండే ప్రెస్ ఎన్‌క్లేవ్ వెలుపల కారులో కూర్చున్నారు. హంతకులు మోటార్‌బైక్ మీద వచ్చారు. బుఖారీ మీదా ఆయన అంగరక్షకులు ఇద్దరి మీదా కాల్పులు జరిపారు. వారు కూడా చనిపోయారు. ఈ సంఘటన చాలా ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
హంతకులు జనసమ్మర్థ ప్రాంతంలో ఆయనపై ఎలా కాల్పులు జరపగలిగారు? ఆపైన అంత సులభంగా ఎలా తప్పించుకోగలిగారు?
కశ్మీర్ ఒక సంక్షుభిత ప్రాంతం. ఇక్కడ సాధారణంగా భద్రతా సిబ్బంది భారీగా మోహరించి ఉంటారు. ఏ తుపాకీ కాల్పుల శబ్దమైనా వెంటనే వారు అప్రమత్తమవుతారు. తక్షణం రంగంలోకి దిగుతారు.
కానీ ఈ హంతకులను ఎవరూ గుర్తించలేదు. కాల్పుల తర్వాత కూడా జాప్యం జరిగిందని చెప్తున్నారు. బుఖారీని, ఆయన బాడీగార్డులను ఆస్పత్రికి తరలించటం ఆలస్యమైందని కూడా కొందరు అంటున్నారు.
ఈ అంశాలన్నిటి మీదా నిష్పాక్షిక దర్యాప్తు అవసరం. కానీ అలాంటి దర్యాప్తు జరుగుతుందా? సత్యం హతమైన హింస కేసుల చరిత్ర కశ్మీర్‌లో ఎంతో ఉంది. అటువంటి ఎన్నో కేసుల్లో సత్యాన్ని బతికించేందుకు పోరాడుతున్న సైనికుడు బుఖారీ. ఎంతో మంది పెంచి పోషిస్తున్న ఆ వికృత హింసాత్మక మూకకు ఆయనే స్వయంగా బలయ్యారు. ఇది మరో విషాదం.

ఫొటో సోర్స్, Getty Images
సంక్షోభం అనేది కొందరి స్వార్థ ప్రయోజానాల కోసం పెంచి పోషిస్తున్న ఓ వ్యవస్థ. వారు పాలకవర్గం లోపలా వెలుపలా ఉంటారు. శాంతి కోసం జరిగే ఎంత అల్ప ప్రయత్నాన్నైనా తుంచేయటానికి సిద్ధంగా ఉంటారు. అందుకోసం ఎంత దూరమైనా వెళతారు.
ఆయన చేస్తున్న కృషా? వేరే లక్ష్యం ఉందా? షుజాత్‌ను హత్య చేయటానికి కారణమేదైనా.. ఈ పని చేసింది శాంతి విద్రోహులే. సాహస స్వరాలను వ్యతిరేకించే శత్రువులే. వివేకానికి విజ్ఞతకు విరోధులే.
కశ్మీర్ ఓ సంక్షుభిత ప్రాంతం. అంతులేని హింసా విష వలయం.. అదుపుచేయలేని రాకాసిలా అనునిత్యం జీవితాలను హరిస్తోంది. ఇక్కడ శాంతికాముకులు, పాత్రికేయులు ఎంత ప్రమాదంలో ఉన్నారో ఈ హత్య మరోసారి చాటుతోంది.
కశ్మీర్ వివాదం ఎంతో సంక్లిష్టమైనది. పాత్రికేయులు, శాంతికాముకులు అందరికీ ఎన్నో రకాలుగా ఎన్నో సవాళ్లు విసురుతోంది. అటు పాలక వర్గాలు.. ఇటు ప్రభుత్వేతర శక్తులు.. ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ మీడియా నలిగిపోతోంది. ఇరువైపుల నుంచీ ఒత్తిళ్లు.. బెదిరింపులు. ఇది కత్తి మీద సామే.

ఫొటో సోర్స్, Getty Images
కల్లోలమైన 1990ల్లో పాత్రికేయుల ఆఫీసుల మీద, ఇళ్ల మీద దాడులు, హత్యలు నిత్యకృత్యం. మిలిటెంట్ గ్రూపులు పదే పదే విధించే నిషేధాలు ఒకవైపు.. భద్రతా సంస్థల నిరంతర వేధింపులు ఇంకోవైపు. సాయుధ సిబ్బంది చేతుల్లో పాత్రికేయుల నిర్బంధాలు, భౌతికదాడులు.. వారి ఇళ్లపై దాడులు సర్వసాధారణంగా ఉండేవి. అతి తక్కువ కాలంలోనే కశ్మీరీ మీడియా స్వభావాన్ని గుర్తుపట్టలేనంతగా మార్చేశాయి.
మరోవైపు.. సెన్సార్ కత్తెర. మెడలు వంచే ఎత్తుగడలు. ఆర్థిక వనరులను స్తంభింపచేయటం. విభిన్న స్వార్థపర శక్తులు తమ అనుకూల పంధా అనుసరించేలా చేయటానికి ఎన్నో పద్ధతులు ప్రయోగించాయి.
ఈ హత్య గత మూడు దశాబ్దాల్లో చాలా కేసులను గుర్తుచేస్తోంది. 1990లో శ్రీనగర్‌లో దూరదర్శన్ కేంద్రం స్టేషన్ డైరెక్టర్ లాసా కౌల్ హత్యకు గురయ్యారు. కశ్మీర్‌లో మీడియాకు సంబంధించిన ఒక వ్యక్తిని హత్య చేసిన మొదటి ప్రధాన సంఘటన అది. ఆ దూరదర్శన్ కేంద్రం నుంచి కొన్ని సంవత్సరాల పాటు వార్తా ప్రసారాలు ఆగిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
అల్‌సఫా ఎడిటర్ మొహమ్మద్ షాబాన్ వకీల్‌ను కూడా 1991లో కాల్చి చంపారు. మరో ఎడిటర్ గులామ్ రసూల్, దూరదర్శన్ కరెస్పాండెంట్ సయ్యాదియాన్‌లూ హత్యకు గురయ్యారు.
2003లో స్థానిక న్యూస్ ఏజెన్సీ నాఫా (ఎన్ఏఎఫ్ఏ) ఎడిటర్‌ను శ్రీనగర్‌లోని ప్రెస్ ఎన్‌క్లేవ్‌లో.. ఆఫీసు కూడా అయిన అతడి ఇంట్లోనే హత్య చేశారు.
అదే ప్రాంతంలో.. బీబీసీ సీనియర్ కరెస్పాండెంట్ యూసుఫ్ జమీల్‌కు పార్సిల్ బాంబు వచ్చినపుడు.. ఏఎన్ఐ ఫొటోగ్రాఫర్ ముస్తాక్ అలీ చనిపోయారు. జమీల్ ఆఫీస్‌లో కూర్చుని ఉన్న ముస్తాక్ అలీ.. అక్కడికి వచ్చిన ఆ పార్శిల్ బాంబును పరిశీలిస్తుండగా అది పేలిపోయింది.
అప్పటికే యూసుఫ్ అలీకి ఇరువైపుల నుంచీ ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ఆయన కూడా ఆ పేలుడులో గాయపడ్డారు. ఏడాది పాటు కశ్మీర్ వెలుపల ఉండాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
మరో ఏడాది తర్వాత.. కశ్మీర్ టైమ్స్ అప్పటి శ్రీనగర్ బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్ట్ జాఫర్ మిరాజ్‌ను గుర్తు తెలియని సాయుధులు అపహరించి కాల్పులు జరిపారు. ఆయన తీవ్రంగా గాయపడ్డా దాడి నుంచి కోలుకున్నారు.
ఈ కేసులన్నిటిలో.. దర్యాప్తు ఎన్నడూ ఒక దరికి చేరలేదు. షుజాత్‌ను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే ప్రశ్న కూడా అలాగే ఓ మిస్టరీలా మిగిలిపోతుందా?
అంతకంటే ముఖ్యమైనది.. ఈ హింసా వలయంలో మీడియా, ప్రెస్ ఇలాగే ప్రమాదంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటుందా? ఈ హత్య వెనుక లక్ష్యం శాంతికి తూట్లు పొడవటమే అయితే.. ప్రభుత్వం శాంతి ప్రయత్నం నుంచి, కాల్పుల విరమణను పొడిగించటం నుంచి వెనుదిరగటం ద్వారా.. ఆ విద్రోహుల వ్యూహానికి అనుగుణంగా నడుస్తుందా?
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








