BBC Exclusive: అమెరికాలో సెక్స్ రాకెట్.. టాలీవుడ్‌పై నీలి నీడలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు యువతులను, హీరోయిన్లను అమెరికా రప్పించి షికాగో కేంద్రంగా నడిపిస్తున్న ‘సెక్స్ రాకెట్’ గుట్టును పోలీసులు రట్టు చేశారు.
దీనిని నిర్వహిస్తున్న ఓ తెలుగు జంటను అరెస్ట్ చేశారు. "హీరోయిన్లు, యాంకర్లు అందుబాటులో ఉన్నారు... ఆలస్యం చేస్తే దొరకరు" అంటూ వారు విటులను ఆకర్షించే వారని అమెరికా ఫెడరల్ పోలీసులు తమ అభియోగ పత్రాల్లో పేర్కొన్నారు.
అమెరికాలోని వివిధ తెలుగు, ఇతర భారతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే పేరుతో టాలీవుడ్ నుంచి ఆర్టిస్టులను రప్పించి వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఫెడరల్ పోలీసులు ఆరోపించారు.
కిషన్ మోదుగుముడి (34) అనే వ్యక్తి ఈ సెక్స్ రాకెట్ సూత్రధారి అని.. అతడి భార్య చంద్రకళ పూర్ణిమ మోదుగుమూడి ఈ రాకెట్‌లో భాగస్వామి అని హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్ఎస్ఐ) స్పెషల్ ఏజెంట్ బ్రియాన్ జిన్ పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన నార్తరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇలినాయీ కోర్టుకు క్రిమినల్ కంప్లయింట్ సమర్పించారు.
కిషన్ మోదుగుమూడికి.. శ్రీరాజ్ చెన్నుపాటి, రాజు అనే మారు పేర్లు ఉన్నాయని, చంద్రకళ పూర్ణిమ మోదుగుమూడికి ‘విభా, విభా జయం’ అనే మార్లు ఉన్నాయని పేర్కొన్నారు.
క్రిమినల్ కంప్లెయింట్ కాపీని బీబీసీ సంపాదించింది. మొత్తం 42 పేజీలున్న ఆ ఫిర్యాదులో.. భారతదేశం నుంచి రప్పించిన యువతులను ‘సెక్స్ రాకెట్’ బాధితులుగా పేర్కొన్నారు. వారి వివరాలు వెల్లడించలేదు. ‘బాధితురాలు ఎ, బి, సి, డి, ఇ’ అని అందులో ప్రస్తావించారు.
దర్యాప్తు అధికారులు ‘బాధితుల’తో పాటు.. పలువురు ‘విటుల’ను కూడా ప్రశ్నించారు. వ్యభిచార కార్యకలాపాలు, లావాదేవీలకు సంబంధించిన ‘పద్దులు/డైరీల’ను కూడా నిందితుల ఇంటిలో సోదాల్లో లభ్యమయినట్లు ఫిర్యాదులో తెలిపారు.
ఏయే నటిని ఎప్పుడెప్పుడు ఎవరెవరి దగ్గరకు పంపించారో, అక్కడ ఏమేం చేశారో, ఎంతెంత ముట్ట చెప్పారో... అన్ని వివరాలను భార్యాభర్తలు డైరీలో పొందుపర్చినట్టు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ రాకెట్ గుట్టు ఎలా బయటపడింది?
స్పెషల్ ఏజెంట్ బ్రియాన్ జిన్ తన అఫిడవిట్‌లో వివరించిన ప్రకారం.. షికాగోలోని ఓ‘హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2017 నవంబర్ 20వ తేదీన దిల్లీ నుంచి వచ్చిన ఒక విమానంలో ఒక యువతి (‘ఇండివిడ్యువల్ ఎ’ అని ఫిర్యాదులో ప్రస్తావించారు) దిగారు.
ఆమె అమెరికా సందర్శన కోసం దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి బి1/బి2 తాత్కాలిక వీసా పొందారు.
ఆమె విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులకు సమర్పించిన పత్రంలో.. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (టీఏఎస్‌సీ) 2017 నవంబర్ 18వ తేదీన జరిగే ఒక కార్యక్రమంలో తనను సన్మానిస్తున్నారని, ఆ కార్యక్రమంలో పాల్గొనటానికి తాను వచ్చానని చెప్పినట్టుగా ఉంది.
ఆ పత్రంతో జతపరిచిన సూచనల్లో.. ‘’... ఈ సినీ నటి కాలిఫోర్నియాలో జరిగే తెలుగు అసోసియేషన్ స్టార్ నైట్ కార్యక్రమంలో పాల్గొంటారు.. పది రోజులు ఉంటారు ...’’ అని పేర్కొని ఉంది.
అయితే.. ఆ యువతికి వీసా ఇవ్వటానికి ఆధారమైన పత్రంలో పేర్కొన్న కార్యక్రమం నవంబర్ 18వ తేదీ కాగా.. ఆ తర్వాత రెండు రోజులకు ఆమె అమెరికా రావటం.. ఆమె కాలిఫోర్నియాకు కాకుండా షికాగో రావటంతో ఇమిగ్రేషన్ అధికారులు అనుమానించారు.
దీనిపై ప్రశ్నించగా.. తాను ఇప్పుడు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) నిర్వహిస్తున్న వేరే సమావేశంలో పాల్గొనటానికి వచ్చానని చెప్పారు.
ఇలినాయీ లోని ష్కామ్‌బర్గ్‌లో 2017 నవంబర్ 25వ తేదీన జరుగబోయే సదస్సులో ఆమె అతిథిగా పాల్గొంటారని చెప్తున్న ఒక లేఖను ఆ యువతి ఇమిగ్రేషన్ అధికారులకు అందించారు.

ఆ నటి తమకు తెలియదన్న అమెరికా తెలుగు సంఘాలు
అధికారులు టీఏఎస్‌సీ ప్రెసిడెంట్‌ను సంప్రదించగా.. నవంబర్ 18వ తేదీన కాలిఫోర్నియాలో తాము ఒక సదస్సును నిర్వహించామని.. అది పూర్తయిందని చెప్పారు.
అలాగే.. ఆ నటి ఎవరో తనకు తెలియదని, ఆమె తమ కార్యక్రమానికి అతిథి కూడా కాదని ఆయన చెప్పారు.
ఆ తర్వాత అధికారులు.. నాట్స్ ప్రతినిధులను కూడా సంప్రదించారు. వారు.. కూడా ఆ నటి తమకు తెలియదని.. నవంబర్ 25వ తేదీన తాము ఎలాంటి సదస్సూ నిర్వహించటం లేదని చెప్పారు.
ఆమె చూపిన పత్రంలో పేర్కొన్న ‘రినయసాన్స్ కన్వెన్షన్ సెంటర్’ను కూడా సంప్రదించి ఆ తేదీన అక్కడ ఏ కార్యక్రమమూ లేదని అధికారులు నిర్ధారించుకున్నారు.
దీంతో ఆ నటి అమెరికా రాకకు కారణం గురించి అధికారులు ప్రశ్నించారు. టీఏఎస్‌సీ, నాట్స్ నుంచి వచ్చినట్లు చెప్తున్న ఆ రెండు లేఖలనూ తనకు ‘రాజు’ అనే పరిచయస్తుడు అందించారని ఆమె తెలిపారు. అతడు తనకు ఇండియాలో పరిచయమని చెప్పారు.
అమెరికా ప్రయాణానికి విమానం టికెట్, హోటల్ రూమ్‌కు అతడే డబ్బులు చెల్లించాడని.. నిర్ధారణ పత్రాలను ఈమెయిల్ ద్వారా పంపించాడని ఆమె వివరించారు. అతడు తనను విమానాశ్రయం వద్ద పికప్ చేసుకోవాల్సి ఉందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజు అనే వ్యక్తి గురించి తనకు పెద్దగా తెలియదని.. అమెరికాలో ఒక సంస్థ కోసం పనిచేస్తున్నాడని మాత్రమే విన్నానని ఆమె పేర్కొన్నారు.
తనవద్ద ఉన్న అతడి కాంటాక్ట్ నంబర్‌ను, అతడి [email protected] అనే ఈమెయిల్ ఐడీని అధికారులకు అందించారు.
ఈ వివరాల ఆధారంగా అధికారులు పరిశోధించగా.. ‘‘కిషన్ మోదుగుమూడి అనే వ్యక్తి శ్రీరాజ్ చెన్నుపాటి అనే పేరుతో సినిమా ఆర్టిస్టులను వ్యభిచారంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నాడని.. అతడు నకిలీ వీసాలపై యువతులను అమెరికా తీసుకెళ్లి సెక్స్ రాకెట్ నడుపుతున్నారని, అతడు విభా జయంతో కలిసి షికాగోలో ఈ బిజినెస్ నిర్వహిస్తున్నాడని అభిజ్ఞవర్గాలు తెలిపాయి’’ అని చెప్తున్న ఒక కథనం ఇంటర్నెట్‌లో తమకు లభ్యమయిందని దర్యాప్తు అధికారి ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు.
నిందితుడి ఫోన్ నంబర్ ఆధారంగా పరిశోధన
ఈ నేపథ్యంలో సదరు యువతికి అమెరికాలో ప్రవేశం నిరాకరించి.. ఆమె వీసాను రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు.
ఆ యువతి అందించిన ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీల ఆధారంగా పరిశోధించగా.. అవి ‘కిషన్ మోదుగుమూడి’ అనే వ్యక్తికి సంబంధించినవని వెల్లడైందని ఫిర్యాదులో వివరించారు. ఫిర్యాదులో వివరించిన ప్రకారం.. అతడికి [email protected] అనే మరో ఈ-మెయిల్ ఐడీ కూడా ఉందని గుర్తించారు.
ఈ రెండు ఈ-మెయిల్ ఐడీల ద్వారా.. షికాగోలోని అతడి నివాసాన్ని గుర్తించారు.


నెవార్క్ విమానాశ్రయంలో మరో నటి...
నెవార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2017 డిసెంబర్ 26వ తేదీన ముంబై నుంచి వచ్చిన ఒక విమానం నుంచి దిగిన మరో యువతిని (’బాధితురాలు - ఎ’ గా పేర్కొన్నారు) కూడా ఇమిగ్రేషన్ అధికారులు ప్రశ్నించినట్లు దర్యాప్తు అధికారి తెలిపారు.
ఫిర్యాదులో వివరించిన అంశాల ప్రకారం.. అమెరికాలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇవ్వటం కోసం ఆమె వచ్చారని, మూడు నెలల పాటు ఆమె అమెరికాలో ఉంటారని ఆమె వీసా చెప్తోంది.
ఆమె ‘‘ఒక నటి.. ఓ తెలుగు కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొంటారు’’ అని ఆ వీసా సూచనలు పేర్కొన్నాయి.
ఆ నటి ప్రయాణ రికార్డులను పరిశీలించగా.. ఆమె 2017 అక్టోబర్ 6న షికాగో వచ్చారని.. 2017 నవంబర్ 13 వరకూ అమెరికాలో ఉన్నారని తెలిసింది.
విమానాశ్రయంలో అధికారులు ప్రశ్నించగా.. ‘రాజు గారు’ అనే వ్యక్తి తనకు వీసా దరఖాస్తులో సాయం చేశాడని చెప్పారు.
టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లో.. కొత్త సంవత్సర సంబరాల్లో హాలీవుడ్ డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వటానికి వెళుతున్నట్లు ఆ నటి పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'బలవంతంగా వ్యభిచారంలోకి దించారు...'
ఇంతకుముందు ‘‘రాజు గారు’’ పెన్సిల్వేనియాలో నిర్వహించిన ఒ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చానని ఆ నటి ఇమిగ్రేషన్ అధికారులకు చెప్పారు.
ఆ కార్యక్రమంలో పాల్గొనేటపుడు తనను బలవంతం చేసి వ్యభిచారంలోకి దించారని ఆమె వెల్లడించినట్లు ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు.
అయితే.. తాను వాస్తవంగా వ్యభిచారం చేయలేదని.. కానీ కస్టమర్లను ఒక గదిలో అరగంట పాటు కలిశానని.. బయటకు వెళ్లే మార్గం చెప్పాల్సిందిగా ఆ కస్టమర్లను కోరేదానినని ఆమె చెప్పినట్లు ఆ ఫిర్యాదులో తెలిపారు.
ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. ఆ పని చేసినట్లు ‘విభా’కు చెప్తే ఆమెకు తిరుగు ప్రయాణం టికెట్లు ఇస్తారని ఆ కస్టమర్లు తనకు సూచించినట్లు ఆ నటి వివరించారు.
ఇంతకుముందు తాను అమెరికా వచ్చినపుడు నాలుగు వేర్వేరు నగరాలకు వెళ్లానని ఆ యువతి తెలిపారు. మూడు నగరాల్లో వ్యభిచారం కోసం తన గదికి విటులను పంపారని, విభా తనతో పాటు ఆ నగరాలకు వచ్చిందని ఆమె చెప్పారు.
ఈ పర్యటనల మధ్యలో షికాగోలోని ఒక ఇంట్లో తనను ఉంచినట్లు ఆ నటి వెల్లడించారు.
ఆమె వెల్లడించిన వివరాల ఆధారంగా.. ఆమెకు కూడా అమెరికాలో ప్రవేశాన్ని నిరాకరించి.. ఆమె వీసాను రద్దు చేసినట్లు ఫిర్యాదు పత్రంలో వివరించారు.

బాధితులకు బెదిరింపు ఫోన్ కాల్స్...
అనంతరం దర్యాప్తులో భాగంగా ఈ యువతిని దిల్లీలోని అమెరికా దౌత్య భద్రతా విభాగం అధికారులు విచారించారు. వారు చూపిన ఫొటోల్లో ‘కిషన్ మోదుగుమూడి’ అనే వ్యక్తే.. తమకు తెలిసిన ‘రాజు’ అని సదరు నటి గుర్తించినట్లు ఆ ఫిర్యాదులో వెల్లడించారు.
అమెరికాలో తన వీసాను రద్దు చేసిన తర్వాత.. తాను ఇండియా తిరిగి వచ్చాక.. కిషన్ మోదుగుమూడి తనకు ఫోన్ చేశాడని..అమెరికాలో చీకటి బిజినెస్ వ్యవహారాలను ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని కూడా ఆమె చెప్పినట్లు తెలిపారు.
చెప్తే ప్రాణాలతో ఉండవని బెదిరించినట్టు పేర్కొన్నారు.. తన కుటుంబం వివరాలు, చిరునామా ఉన్న పాస్‌పోర్టు కాపీ అతడి వద్ద ఉందని కూడా హెచ్చరించాడని ఆమె చెప్పినట్లు పోలీసు అధికారులు ఈ పత్రంలో పేర్కొన్నారు.
అమెరికా వెళ్లినపుడు తనను షికాగోలోని అతడి అపార్ట్‌మెంటుకు తీసుకెళ్లారని.. అక్కడి నుంచి బయటకు పంపించేవారు కాదని.. ఎక్కడికైనా వెళ్లాలంటే ఎవరో ఒకరిని కాపలాగా పంపించేవారని ఆమె వెల్లడించినట్లు ఆ పత్రంలో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
దర్యాప్తులో మరికొందరు ‘బాధితుల’ వివరాలు వెల్లడి...
అమెరికా వెళ్లటానికి వీసా దరఖాస్తులో భాగంగా సమర్పించిన రెండు లేఖల కాపీలను కూడా ఆమె అందించారు. అవి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపీఏడీ) ల పేరుతో.. ఆమెను అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు చెప్తున్న లేఖలు.
తానా, టీపీఏడీలను అమెరికా అధికారులు సంప్రదించగా.. ఆ లేఖలు నకిలీవని వారు చెప్పినట్టు ఫిర్యాదు పత్రంలో తెలిపారు.
అమెరికా దర్యాప్తు అధికారుల పరిశోధనలో 2016, 2017 సంవత్సరాల్లో కిషన్ మోదుగుమూడి ద్వారా మరికొందరు యువతులు (బాధితురాలు బి, సి, డి, ఇ అని ఉటంకించారు) కూడా అమెరికా వచ్చినట్లు గుర్తించినట్లు ఫిర్యాదులో తెలిపారు.
ఒక యువతి (బాధితురాలు - బి) ఒక తెలుగు అసోసియేషన్ కార్యక్రమం కోసం 2017 డిసెంబర్ 24న అమెరికాలోని షికాగో వచ్చారని.. ఆమె 2018 జనవరి 9వ తేదీ మధ్యాహ్నం షికాగో నుంచి తిరుగుప్రయాణం కావాల్సి ఉందని గుర్తించారు. నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు.
వీసా గడువు ముగిసినా అమెరికాలోనే కిషన్, విభా...
నిజానికి నిందితుడు కిషన్ మోదుగుమూడి తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాత కాదని ఏవో కొన్ని చిత్రాలకు కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
అతడు అమెరికా వీసా పొందటం కోసం 2014లో రెండుసార్లు ప్రయత్నించినట్లు దర్యాప్తులో గుర్తించారు. అయితే అతడు సమర్పించిన పత్రాలు నకిలీవి కావటంతో ఒకసారి తిరస్కరించినట్లు ఫిర్యాదు పత్రంలో తెలిపారు.
అతడికి 2015లో వీసా లభించిందని.. ఆ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన అతడు షికాగో వచ్చాడని తెలిపారు. అతడు అమెరికాలో ఉండటానికి 2015 అక్టోబర్ 5వ తేదీ వరకే గడువు ఉందని.. కానీ అతడు తిరిగి వెళ్లలేదని అమెరికా దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
అలాగే.. చంద్రకళ మోదుగుమూడి కూడా 2015 ఆగస్టు 11న షికాగో వచ్చారని.. ఆమె 2016 ఫిబ్రవరి 10వ తేదీ వరకూ అమెరికాలో ఉండటానికి వీసా లభించిందని తెలిపారు. ఆ వీసా గడువును పొడిగించాలని ఆమె దరఖాస్తు చేసుకోవటంతో.. ఆగస్టు 8వ తేదీ వరకూ పొడిగించినట్లు వివరించారు.
ఆగస్టులో ఆమె మరోసారి వీసా గడువు పెంపుకోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు తిరస్కరించారని.. అయినా ఆమె తిరిగి వెళ్లలేదని చెప్పారు.
ఈ ఏడాది జనవరి 23వ తేదీన.. కిషన్, చంద్రకళలను అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారన్న కారణంతో యునైటెడ్ స్టేట్స్ బోర్డర్ పెట్రోల్ (యూఎస్‌బీపీ) అధికారులు ఒహాయోలోని టిఫిన్ వద్ద అరెస్ట్ చేశారని ఆ పత్రంలో తెలిపారు.
ఇమిగ్రేషన్ కస్టడీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీన వారిని పూచీకత్తు మీద విడుదల చేశారని.. వారి ఇమిగ్రేషన్ కేసు నవంబర్‌లో విచారణకు రావలసి ఉందని వివరించారు.

ఫోన్లలో ఫొటోలతో విటులతో బేరాలు...
సెక్స్ రాకెట్ వ్యవహరంలో దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరి 16వ తేదీన నిందితుల ఇళ్లలో దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహించినట్లు ఫిర్యాదు పత్రంలో వివరించారు.
ఇంట్లో 70 కండోమ్‌లు, నకిలీ నివాస గుర్తింపు కార్డులు, అమెరికన్ తెలుగు అసోసియేషన్ పేరుతో ఉన్న నకిలీ లేఖలు, పలు విజిటింగ్ కార్డులు, డైరీలు, పద్దులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఆ డెయిరీలు, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నాలుగు సెల్‌ఫోన్లను పరిశీలించి, విశ్లేషించగా.. భారతదేశం నుంచి రప్పించిన యువతులతో వారు సెక్స్ రాకెట్ నడుపుతున్న తీరు బయటపడిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఒక్కసారి సెక్స్ కోసం 1,000 డాలర్లు, రెండు సార్లకు 2,000 డాలర్లు చెల్లించాలని.. 100 డాలర్లు టిప్ ఇవ్వాలనే బేరసారాలు అందులో సాగాయి. సినీ నటి, యాంకర్ వంటి వారు కొద్ది రోజులే అందుబాటులో ఉంటారని కూడా ఆ సంభాషణల్లో చెప్పారు.
ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు, ఎవరెవరితో ఈ కార్యకలాపాలు నిర్వహించిందీ.. ఎంత చెల్లించిందీ ఆ డెయిరీల్లో పేర్లతోను, సంకేతాల రూపాల్లోను నమోదు చేసి ఉన్నట్లు చెప్పారు.
సెల్‌ఫోన్లలో విటులను సంప్రదించటం.. వారికి తమ వద్ద ఉన్న ఆర్టిస్టుల ఫొటోలు పంపించి.. బేరాలు ఆడిన సంభాషణలు లభ్యమైనట్లు వివరించారు. అందులో కొన్ని సంభాషణలను కూడా ఫిర్యాదు పత్రంలో వివరించారు.
అందులోని వివరాల ఆధారంగా ఒక కస్టమర్‌ను ప్రశ్నించి మరిన్ని వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు.
దర్యాప్తులో లభించిన అనేక సాక్ష్యాల ఆధారంగా నిందితులు కిషన్, చంద్రకళలు.. వ్యభించారం కోసం భారతదేశం నుంచి యువతులను రప్పించారని విశ్వసించవచ్చునని ఆ పత్రంలో పేర్కొన్నారు.
నిందితులను ఏప్రిల్ 29వ తేదీన అరెస్ట్ చేసి ఇలినాయి కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వారిపై విచారణ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
- #గ్రౌండ్‌రిపోర్ట్: ఉద్దానం.. ‘వీళ్లు ఎందుకు చనిపోతున్నారో ఎవరికీ స్పష్టంగా తెలీదు’
- ఈ గ్రామస్తులు మరుగుదొడ్లు ఎందుకు వద్దంటున్నారు?
- నీళ్లు లేవని టీ ఇవ్వడం లేదు.. ఇదెక్కడో కాదు, భారత్‌లోనే
- అత్యధిక సమయం ప్రయాణించే నాన్‌స్టాప్ విమానం ఇదే
- భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. స్వలింగ సంపర్కురాలైనందుకు కక్ష
- అవునా.. 1975కు ముందువారితో పోలిస్తే మన తెలివి తక్కువేనా?
- అమెరికా: తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేస్తున్న ట్రంప్. ఎందుకు?
- ‘ఆసియా-అమెరికన్ల పట్ల హార్వర్డ్ యూనివర్సిటీ వివక్ష’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








