‘ఆసియా-అమెరికన్ల పట్ల హార్వర్డ్ యూనివర్సిటీ వివక్ష’

హార్వర్డ్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ.. ఆసియా-అమెరికన్ల పట్ల వివక్ష చూపుతోందని ఒక స్వచ్ఛంద ఆరోపించింది. అమెరికా విశ్వవిద్యాలయం మీద సదరు సంస్థ కేసు వేసింది.

ఆసియా-అమెరికన్ల కన్నా కొంచెం తక్కువ అర్హతలున్నప్పటికీ శ్వేత జాతి, నల్లజాతి, హిస్పానిక్ దరఖాస్తుదారులకే హార్వర్డ్ వర్సిటీ ప్రాధాన్యం ఇస్తోందని స్టూడెంట్స్ ఫర్ ఫెయిర్ అడ్మిషన్స్ (ఎస్ఎఫ్ఎఫ్ఏ) అనే సంస్థ ఆరోపణ.

'మనిషి నచ్చడం' అనే తరహా వ్యక్తిగత లక్షణాల మీద ఆసియా-అమెరికన్ల దరఖాస్తుదారులకు నిరంతరం తక్కువ ర్యాంకులు ఇస్తోందని చెప్పింది.

అయితే ఈ ఆరోపణను హార్వర్డ్ తిరస్కరించింది. ఆసియా-అమెరికన్ల అడ్మిషన్లు పెరిగాయని చెప్తోంది.

యూనివర్సిటీ వెబ్‌సైట్ ప్రకారం.. ప్రస్తుతం హార్వర్డ్‌లో చేరిన విద్యార్థుల్లో 22.2 శాతం మంది ఆసియన్-అమెరికన్లు ఉన్నారు.

ఆఫ్రికన్-అమెరికన్లు 14.6 శాతం, హిస్పానిక్/లాటినోలు 11.6 శాతం, అమెరికా ఆదివాసీలు/పసిఫిక్ ఐలాండర్లు 2.5 శాతం మంది ఉన్నారు.

శ్వేతజాతి విద్యార్థులు ప్రధానంగా ఉన్న మిగతా అందరూ కలిపిన వర్గం సుమారు 50 శాతంగా ఉన్నారు.

హార్వర్డ్ యూనివర్సిటీ కాలేజీ

ఫొటో సోర్స్, Getty Images

ఎస్ఎఫ్ఎఫ్ఏ ఏం చెప్పింది?

బోస్టన్‌లో శుక్రవారం కోర్టుకు సమర్పించిన ఫిర్యాదులో.. ‘‘హార్వర్డ్ యూనివర్సిటీ జాతి సమతుల్య చర్యలు చేపడుతోందని, జాతి అనే అంశాన్ని సానుకూల అంశం (ప్లస్ ఫ్యాక్టర్) కన్నా ఎక్కువగా పరిగణిస్తోందని, జాతి-తటస్థ ప్రత్యామ్నాయాలను పరిశీలించటంలో ఆసక్తి చూపటం లేదని ఆధారాలు చూపుతున్నా’’యని పేర్కొంది.

మైనారిటీ దరఖాస్తుదారులు కాలేజీలో ప్రవేశాలు పొందటానికి దోహదపడేందుకు అమెరికా కోర్టు ఇచ్చిన ‘అఫర్మేటివ్ యాక్షన్’ (వివక్షకు గురయ్యే వారికి రిజర్వేషన్లు) ఆదేశాలను ‘‘ప్లస్ ఫ్యాక్టర్’’ అనే అంశం ప్రస్తావిస్తోంది.

‘‘జాతి అనేది ఒక ముఖ్యమైన అంశమే కాదు.. హిస్పానిక్, ఆఫ్రికన్-అమెరికన్ విద్యార్థులకు ప్రవేశం కల్పించటానికి దానినే ప్రధానంగా పరిగణినలోకి తీసుకుంటున్నట్లు హార్వర్డ్ అంగీకరించదు’’ అని ఎస్ఎఫ్ఎఫ్ఏ చెప్పింది.

హార్వర్డ్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఉదాహరణకు.. ఒక ఆసియా-అమెరికన్‌ విద్యార్థికి ఈ వర్సిటీలో అడ్మిషన్ అవకాశం 25 శాతంగా ఉందనుకుంటే.. అదే విద్యార్థి శ్వేత జాతీయుడైతే 35 శాతం, హిస్పానిక్ అయితే 75 శాతం, ఆఫ్రికన్-అమెరికన్ అయితే 95 శాతం అవకాశం ఉంటుంది’’ అని పేర్కొంది.

మహిళా దరఖాస్తుదారుల లెక్కలను ఎస్ఎఫ్ఎఫ్ఏ అందించలేదు.

స్వయంగా హార్వర్డ్ యూనివర్సిటీయే 2013లో చేపట్టిన స్వీయ పరిశోధనలో ఇదే నిర్ధారణలకు వచ్చిందని.. కానీ ఆ నివేదికను సమాధి చేశారని కూడా ఆ సంస్థ ఆరోపించింది.

హార్వర్డ్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Getty Images

హార్వర్డ్ స్పందన ఏమిటి?

యూనివర్సిటీ ఈ ఆరోపణలను తిరస్కరించింది. ఎస్ఎఫ్ఎఫ్ఏ విశ్లేషణ చాలా రకాలుగా లోపభూయిష్టమని.. కాబట్టి అది తప్పుదారి పట్టించే నివేదికని అభివర్ణించింది.

‘‘సమాచారం, ఆధారాలను సంపూర్ణంగా, సమగ్రంగా విశ్లేషించినపుడు.. ఆసియా-అమెరికన్లు సహా ఏ గ్రూపు దరఖాస్తుదారుల పట్ల అయినా హార్వర్డ్ కాలేజీ వివక్ష చూపదని స్పష్టమవుతుంది. ఆసియా-అమెరికన్ల ప్రవేశాలు గత దశాబ్దంలో 29 శాతం పెరిగాయి’’ అని హార్వర్డ్ ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో తెలిపింది.

ఎస్ఎస్ఎఫ్ఏ - హార్వర్డ్ మధ్య 2014లో మొదలైన న్యాయ పోరాటంలో ఇది తాజా పరిణామం.

‘అఫర్మేటివ్ యాక్షన్’ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను 2016లో అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

తాను శ్వేత జాతీయురాలినైనందున యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ తన దరఖాస్తును తిరస్కరించిందని ఒక శ్వేతజాతి మహిళ చేసిన ఆరోపణను న్యాయమూర్తులు తిరస్కరించారు.

ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మైనారిటీ విద్యార్థుల విషయంలో ‘అఫర్మేటివ్ యాక్షన్’ లేదా ‘సానుకూల పక్షపాతా’న్ని ఉపయోగించటాన్ని కొనసాగించవచ్చునని కోర్టు చెప్పింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)