ప్రెస్‌రివ్యూ: పాడైన రూ.2000 నోటును తీసుకోని బ్యాంకులు

ఫొటో సోర్స్, Getty Images
వినియోగదారు చినిగిన లేదా పాడైపోయిన రూ.2000 నోటును తీసుకెళ్తే చాలా వరకు బ్యాంకులు ఈ నోటును తీసుకుని దీనికి సరిపడా నోటును లేదా నోట్లను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని ఈనాడు రాసింది. రూ.2,000 నోట్లు చినిగితే ఏం చేయాలనే దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నుంచి ఇప్పటిదాకా స్పష్టమైన మార్గదర్శకాలు బ్యాంకులకు రాకపోవడమే దీనికి కారణం.
'ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(నోట్ రీఫండ్) రూల్స్-2009 ప్రకారం రూ.50 పైన ఉన్న అన్ని చినిగిన, పాడైన నోట్లకు ఒకే నిబంధనలు వర్తిస్తాయి. చినిగిన నోటులోని పెద్ద భాగం ఎంత మేర ఉందనే దాన్ని బట్టి ఇచ్చే విలువ ఉంటుంది. ఉదాహరణకు రూ.50 విషయానికొస్తే చినిగిన నోటులో అతిపెద్ద భాగం కనీసం 70 చ.సెం.మీ. ఉంటే పూర్తి మొత్తాన్ని ఇవ్వాలి. ఇంతకంటే తక్కువ ఉంటే సగం విలువ మాత్రమే దక్కుతుంది. ఈ నిబంధనలన్నీ నవంబరు 8, 2016 కంటే ముందు నాటివి.
పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్‌బీఐ కొన్ని నిబంధనలను సవరించింది. 2017 జులై 3న జారీచేసిన ఆ నిబంధనల ప్రకారం- పాడైపోయిన నోట్ల నిర్వచనాన్ని విస్తరించారు. 'పాడైపోయిన నోటు' అంటే సాధారణ వాడకం వల్ల నోటు పాతబడిపోయినా లేదా ఒక నోటు రెండుగా చినిగిపోయిన పక్షంలో అవసరమైన ఫీచర్లు ఉంటే మాత్రం బ్యాంకులు స్వీకరించాలి. అంటే ఇక్కడ పాడై పోయిన నోటు అంటే అన్ని నోట్లూ అని అర్థమే కదా. బ్యాంకులు మాత్రం రూ.2000 తప్ప అని అన్వయించుకుంటున్నాయి.
పెద్ద నోట్ల రద్దు తర్వాత విడుదల చేసిన కొత్త నోట్లను చూస్తే పాత నోట్ల కన్నా చిన్నవిగా(రూ.100 తప్ప) ఉన్నాయి. నిబంధనల్లోనేమో చినిగిన నోటు పరిమాణాన్ని బట్టి మార్పిడిని సూచించారు. ఈ కారణం వల్ల కూడా బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి.

ఫొటో సోర్స్, TWITTER/@ncbn
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికను అవకాశంగా మలచుకోవాలని ప్రాంతీయ పార్టీల నిర్ణయం
బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలన్నీ తమ ఐక్యతను చాటేందుకు త్వరలో జరిగే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికను ఒక అవకాశంగా మార్చుకోవాలని నిర్ణయించాయని, దిల్లీలో శనివారం జరిగిన నలుగురు ముఖ్యమంత్రుల ఆంతరంగిక సమావేశంలో ఈ అభిప్రాయానికి వచ్చారని ఈనాడు రాసింది.
ప్రతిపక్షాలన్నీ కలిస్తే గట్టి పోటీ ఇవ్వగలమని, అన్నీ కలిసొస్తే ఎన్‌డీఏ అభ్యర్థిని ఓడించే అవకాశమూ ఉందన్న భావన వీరి సమావేశంలో వ్యక్తమైంది. ప్రతిపక్షాల అభ్యర్థి గెలిచినా గెలవకపోయినా బీజేపీకి మాత్రం అంత తేలిగ్గా గెలుపు లభించకుండా చూడాలన్న నిశ్చయానికి వచ్చారు.
ఎన్డీయే, యూపీయే కూటముల్లో లేని రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చే దిశగా శనివారం మరో కీలక ముందడుగు పడింది.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ ధోరణిని వ్యతిరేకిస్తున్న ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, మమతా బెనర్జీ, పినరయి విజయన్, కుమారస్వామి శనివారం రాత్రి ఏపీ భవన్‌లో ప్రత్యేకంగా సమావేశమవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరు చర్చించారు.
హైదరాబాద్: మనో వైకల్యంతో ఉన్న ఇద్దరు చిన్నారులను చంపేసిన మేనమామ
మనో వైకల్యంతో ఉన్న 12 ఏళ్ల కవలలు ఇద్దరిని వారి మేనమామ గొంతు పిసికి చంపేశాడని పోలీసులను, కుటుంబ సభ్యులను ఉటంకిస్తూ ఆంధ్రజ్యోతి తెలిపింది. హైదరాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని చెప్పింది.
కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని మిర్యాలగూడలో ఉంటున్న శ్రీనివాసరెడ్డి, లక్ష్మి దంపతుల సంతానం సృజన, విష్ణువర్దన్‌రెడ్డి పుట్టుకతోనే మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు.
హైదరాబాద్‌లో ఉంటున్న లక్ష్మి సోదరుడు ముత్తన మల్లికార్జున్‌రెడ్డి అవసరమైనప్పుడు పిల్లలను చికిత్స కోసం హైదరాబాద్‌లోని మానసిక చికిత్సాలయానికి తీసుకెళ్లేవాడు. అతడు శుక్రవారం హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు వచ్చాడు.
''పిల్లలకు ఈత నేర్పుతానని మల్లికార్జున్ అక్కాబావలను నమ్మించి వారిని బస్సులో హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. సాయంత్రం చైతన్యపురి సత్యనారాయణపురంలో తాను అద్దెకు ఉంటున్న ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే తన స్నేహితుడు వివేక్‌రెడ్డికి ఫోన్‌చేసి పిల్లలను దిగబెట్టేందుకు కారు తీసుకొని తన గదికి రావాలని సూచించాడు. రాత్రి స్నేహితుడు వచ్చేలోపు ఇద్దరినీ గొంతు పిసికి హత్య చేశాడు. హార్పిక్ తాగి చిన్నారులిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ స్నేహితుడిని నమ్మించాడు. అతడి సాయంతో ఇద్దరినీ కారులోకి చేర్చాడు. ఇదంతా సీసీ ఫుటేజీలో చూసిన ఇంటి యజమాని మహేశ్.. మల్లికార్జున్‌ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలిచ్చాడు. అనుమానించిన ఆయన వెంటనే పోలీసులకు ఫోన్‌చేశాడు'' అని ఆంధ్రజ్యోతి తెలిపింది.
పోలీసులు అక్కడికి చేరుకొని చిన్నారులు చనిపోయినట్లుగా గుర్తించారు. ఇంతటి దారుణానికి ఎందుకు పాల్పడ్డావని అడిగితే.. ''పుట్టినప్పటి నుంచి మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలు మా అక్కకు రోజురోజుకు భారమవుతున్నారు. మా అక్క కష్టం తీర్చేందుకే వారిద్దరిని చంపేశాను'' అని చెప్పాడు.

ఫొటో సోర్స్, RANDY OLSON / NATIONAL GEOGRAPHIC
తెలంగాణ: పట్టణాల్లో ప్లాస్టిక్ వినియోగంపై సంపూర్ణ నిషేధం
తెలంగాణలోని పట్టణాల్లో ప్లాస్టిక్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించిందని 'నమస్తే తెలంగాణ' రాసింది. తొలుత ప్రభుత్వ కార్యాలయాల నుంచే ప్లాస్టిక్ వినియోగంపై నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులకు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ లేఖలు రాశారు. ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించాలన్న మంత్రి కేటీ రామారావు(కేటీఆర్) ఆదేశాలను తప్పకుండా పాటించాలని స్పష్టంచేశారు.
ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనలు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ సంచులను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదని అరవింద్ కుమార్ సూచించారు.
మున్సిపల్ కార్యాలయాల్లో ప్లాస్టిక్ సీసాల్లో తాగునీరు, ఒకేసారి వాడే స్ట్రాలు, ప్లాస్టిక్ టీ కప్పులు/కంటెయినర్లు, 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వస్తువులు, ఒకేసారి వాడే ప్లాస్టిక్‌లను నిషేధించారు.
ఆఫీసుల్లో సమావేశాలు జరిగినప్పుడల్లా ప్లాస్టిక్ సీసాలను వినియోగించకుండా, వాటి బదులు స్టీలు, సిరామిక్ గ్లాసులను వాడేలా చర్యలు తీసుకోవాలని అరవింద్ కుమార్ ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
- మీ బ్యాంకు మునిగిపోతే.. మీ కొచ్చే నష్టం
- ఈ ఫొటోలు చూస్తే ప్లాస్టిక్ అంటే భయమేస్తుంది!!
- #BBCSpecial : ప్లాస్టిక్ ఆవులు! ‘మారాల్సింది మనుషులే.. నోరులేని జీవాలు కాదు’
- #FIFA2018: ఫుట్‌బాల్ క్రీడాకారుల మూఢవిశ్వాసాలు, అలవాట్లు, ఆచారాలు
- ‘భారత యువత గుండె బలహీనమవుతోంది’
- అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తే ఉత్తర కొరియాలో సామాన్యుడికి ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








