అభిప్రాయం: మీ బ్యాంకు మునిగిపోతే.. మీ కొచ్చే నష్టం

బ్యాంకు

ఫొటో సోర్స్, Getty Images

రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్‌ఎ ప్రకారం 2018లో భారతీయ బ్యాంకులు గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా నష్టాలు మూటగట్టుకున్నాయి.

భారతీయ బ్యాంకులు ఈ ఏడాది మార్చి వరకూ లక్షా 44 వేల కోట్ల రూపాయలు మునిగిపోయినట్టు ఏజెన్సీ చెబుతోంది.

ఇందులో 83 శాతం డబ్బు ప్రభుత్వ బ్యాంకులకు చెందిందే. ఇది గత ఏడాదితో పోలిస్తే 62 శాతం ఎక్కువ.

బ్యాంకులు మునిగిపోతే, ఆ ప్రభావం సామాన్యులపై ఎలా ఉంటుంది. తెలుసుకోవడానికి బీబీసీ ప్రతినిధి కులదీప్ మిశ్రా ఆర్థిక వ్యవహారాల నిపుణులు అశుతోష్ సిన్హాతో మాట్లాడారు.

ఐసీఆర్ఏ గణాంకాల ప్రకారం బ్యాంకుల ప్రస్తుత పరిస్థితి ఎన్‌పీఏ(నాన్ పెర్ఫామింగ్ ఎసెట్స్) కంటే పెద్ద ప్రమాదంలో పడింది. దీనిని "రైట్ ఆఫ్" అంటారు.

సాధారణంగా చెప్పాలంటే, ఒక బ్యాంకు ఈ ఏడాది మార్చి వరకు రుణాలుగా ఇచ్చిన 1.44 లక్షల కోట్ల రూపాయలు ఇక తిరిగి రావు అని నిర్ణయించడం. అంటే అంత మొత్తానికి ఆ బ్యాంకు మునిగిపోయింది. అదే ఎన్‌పీఏలో డబ్బులు తిరిగి వస్తాయనే ఆశలు పెట్టుకోవచ్చు.

ఈ నష్టాల్లో ప్రభుత్వ బ్యాంకులకు 83 శాతం భాగం ఉంది. ఈ ప్రభావం నేరుగా సామాన్యులపై పడుతుంది. ఎవరైనా ఏదైనా లోన్ తీసుకోడానికి బ్యాంకుకు వెళ్తే, వారికి రుణం దాదాపు దొరకదు. లేదా కష్టంగా దొరుకుతుంది.

ఎందుకంటే ప్రభుత్వ బ్యాంకుల్లో ఇప్పుడు రుణాలు ఇవ్వడానికి అసలు డబ్బులే లేవు.

ఏ బ్యాంకు అయినా, అది ఎలాంటి రుణాలు ఇస్తోంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటే మీరు మీ బ్యాంకులో ఒక లక్ష రూపాయలు జమ చేశారని అనుకుందాం. కానీ బ్యాంకు ఆ లక్ష రూపాయలను తన దగ్గర ఉంచుకోదు. అది దాన్ని అప్పుగా వేరే వాళ్లకు ఇస్తుంది.

బ్యాంకు

ఫొటో సోర్స్, Getty Images

సాధారణంగా ఎవరైనా జమ చేసే మొత్తానికి బ్యాంకులు నాలుగు శాతం వడ్డీ చెల్లిస్తాయి. కానీ తాము రుణం ఇచ్చిన వారి నుంచి మాత్రం దానికంటే ఎక్కువ వడ్డీ తీసుకుంటాయి. అది హోమ్ లోన్ అయితే సుమారు 8.5 శాతం, కంపెనీలకు లోన్ అయితే అంతకంటే ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. తక్కువ రేటింగ్ ఉన్న కంపెనీలకు అయితే వడ్డీ రేటు 11 నుంచి 12 శాతం ఉంటుంది. రుణ గ్రహీతలను బట్టి ఈ వడ్డీ రేట్లు మారుతుంటాయి.

నాలుగు శాతం వడ్డీ చెల్లించే మొత్తానికి 12 శాతం వడ్డీ రాబట్టడం ద్వారా బ్యాంకులు లాభాలు ఆర్జిస్తాయి. దీనిని "నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్" అంటారు.

ఇలా రుణాలుగా బయటకు ఇచ్చిన డబ్బులు తిరిగి వచ్చినపుడు, ఆ డబ్బును బ్యాంకులు మళ్లీ వేరే వారికి లోన్ ఇస్తాయి. మీకు కూడా నాలుగు శాతం వడ్డీ ఇస్తుంటాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకుల పరిస్థితి దీనంగా మారింది.

ఉదాహరణకు మనం ఐడీబీఐ బ్యాంకు విషయానికే వస్తే అందులో ప్రభుత్వం వాటా చాలా ఉంది. ఆ బ్యాంకులో మొత్తం ఎన్‌పీఏ సుమారు 30 శాతం ఉంది. అదే ప్రైవేటు బ్యాంక్ అయిన కొటక్ మహింద్రా బ్యాంకు ఎన్‌పీఏ ఒక్క శాతం కూడా ఉండదు. అంటే, ఒక ప్రైవేటు బ్యాంకుతో పోల్చి చూసినపుడు ప్రభుత్వ బ్యాంకు ఎన్‌పీఏ సుమారు 30 శాతం ఎక్కువ ఉంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు నడవడం చాలా కష్టం. వంద రూపాయల్లో 30 రూపాయలు తిరిగి రానప్పుడు బ్యాంకుల మనుగడ కష్టం అని అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.

బ్యాంకు

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వ పథకాలతో ఉద్యోగాలపై ప్రభావం

మీకు గుర్తుండే ఉంటుంది, ఈసారి బడ్జెట్లో రైతులకు సులభ వాయిదాలలో రుణాలు ఇవ్వాలని అనుకుంటున్నట్టు ప్రభుత్వం చెప్పింది. లోన్లు ఇచ్చే స్థితిలో ప్రభుత్వ బ్యాంకులు లేనప్పుడు ఈ రుణాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?

బ్యాంకులు మునిగిపోవడం వల్ల భారతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై మరో రకం ప్రభావం పడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా పరిశ్రమలకు దాదాపు 45 శాతం వాటా ఉంది. ఈ పరిశ్రమలన్నీ లక్ష నుంచి ఐదు లక్షల రుణాలతో నడుస్తుంటాయి. కానీ బ్యాంకులు దీన స్థితిలో ఉన్నప్పుడు వాటికి డబ్బు దొరకడం కష్టమైపోతుంది. చిన్నతరహా పరిశ్రమలు దేశంలో చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. బ్యాంకులు వీటికి లోన్ ఇవ్వకపోతే ఉద్యోగాలు కూడా ఉండవు.

బ్యాంకు

ఫొటో సోర్స్, Getty Images

బ్యాంకులు ఎలాంటి పరిస్థితుల్లో "రైట్ ఆఫ్" చేయాల్సి వస్తుంది?

బ్యాంకులు రుణం ఇచ్చినపుడు వారికి సమర్పించిన కేవైసీ సరిగా ఉండకపోవడం. దానిని సరిగా నింపకపోవడం. అంటే ఇచ్చిన రుణానికి బ్యాంకు కచ్చితమైన సెక్యూరిటీ గ్యారంటీ తీసుకోకపోవడం వంటి సందర్భాల్లో రైట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది.

ఇదే మార్కెట్లో ప్రైవేటు బ్యాంకులు కూడా ఉన్నాయి. కానీ, అవి లాభాల్లో ఎలా నడుస్తున్నాయి? అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. రుణాలు ఇవ్వడంలో ప్రైవేటు బ్యాంకులు అనుసరించే ప్రమాణాలను కాస్త బాగుంటాయి. వాటిని ప్రభుత్వ బ్యాంకులు కూడా అనుసరించాల్సి ఉంటుంది.

బ్యాంకులు ఎప్పుడు రుణం ఇచ్చినా, దాని కోసం రకరకాల గ్యారంటీలు తీసుకుంటాయి. బ్యాంకులు ఈ గ్యారంటీని సెక్యూరిటైజ్ చేయాల్సుంటుంది. అవి భద్రమైనవే అని గ్యారంటీ తీసుకోవాలి. అంటే బ్యాంకు ఏదైనా కంపెనీకి అప్పు ఇస్తున్నప్పుడు, మొదటి రెండేళ్ల వరకూ అది వడ్డీ వేయకుండా ఉండాలి. కానీ ఆ తర్వాత అంటే 25వ నెల నుంచి ఆ కంపెనీ దగ్గర ఉన్న లాభాల నుంచి రుణ వాయిదా చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంకు

ఫొటో సోర్స్, Getty Images

బ్యాంకులకు అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా ఆలోచించాలి. అసలు బ్యాంకులు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు సామాన్యులు వాటి భారం ఎందుకు మోయాలి?

మీకు గుర్తుండే ఉంటుంది. అదానీ గ్రూప్ ఆస్ట్రేలియాలో మైనింగ్ ప్రాజెక్ట్ కోసం ఎస్‌బీఐ నుంచి సుమారు 6 వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. కానీ అప్పటికే అదానీ గ్రూప్ ఆ బ్యాంక్ నుంచి 72 కోట్ల రూపాయల లోన్ తీసుకుని ఉంది. ఇలాంటి స్థితిలో ఆ సంస్థకు మరింత రుణం ఇవ్వడం అనేది బహుశా సబబు కాదు.

ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో బ్యాంకులు మూసివేయడమే మంచిది. లేందంటే అవి మరింత సమస్యల్లో చిక్కుకుపోతాయి.

బ్యాంకులు రుణం ఇచ్చినపుడు, దానిని సరిగా సెక్యూరటైజ్డ్ చేయలేదు.

బ్యాంకు తన డబ్బును తాను ఎందుకు రికవర్ చేయలేకపోతోంది అనేవి మనం ఆలోచించాలి.

ఏ బ్యాంకులు సరిగా పనిచేయలేదో, వాటిని గట్టున పడేయడానికి మనం మళ్లీ టాక్స్ కడదాం, లేదా డబ్బులు చెల్లిద్దాం అని ఎవరైనా చెబితే, అది అనర్థమే అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)