దివ్య సూర్యదేవర: ఒకప్పుడు డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డారు.. నేడు రూ.లక్షల కోట్ల కంపెనీని చక్కబెడుతున్నారు

ఫొటో సోర్స్, John F. Martin/General Motors
బీకాం, ఎంకాం చదివితే ఏమవ్వొచ్చు? మన కష్టానికి అదృష్టం కూడా తోడైతే మరో దివ్య సూర్యదేవర కావొచ్చు!!
దివ్య చదివింది కూడా బీకామే. యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్‌లో ఆమె చదువుకున్నారు. బీకాం తర్వాత ఎంకాం చదివారు. ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో చేరి ఎంబీఏ పట్టా పొందారు. ఆమె ఛార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ఛార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) కూడా.
39 ఏళ్ల దివ్య ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. అమెరికాలో దిగ్గజ కంపెనీల్లో ఒకటైన జనరల్ మోటార్స్ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా ఆమె నియమితురాలయ్యారు. సెప్టెంబర్ ఒకటి నుంచి ఆమె ఈ బాధ్యతలు నిర్వహిస్తారు.
ప్రస్తుతం ఆమె అదే కంపెనీలో కార్పొరేట్ ఫైనాన్స్ విభాగంలో ఉపాధ్యక్షురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
పదమూడేళ్ల కిందట ఆమె జనరల్ మోటార్స్ కంపెనీలో చేరారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చారు.
‘‘మా ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి పలు హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన దివ్య అనుభవం, నాయకత్వం గత కొన్నేళ్లుగా దృఢమైన వ్యాపార ఫలితాలు సాధించిపెట్టాయి’’ అని జనరల్ మోటార్స్ ఛైర్మన్, సీఈఓ మేరీ బర్రా చెప్పారు.
2013 నుంచి 2017 వరకు జనరల్ మోటార్స్ సీఈఓగా పనిచేసినప్పుడు దివ్య సూర్య దేవర ఆ కంపెనీకి చెందిన దాదాపు రూ.5.78 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలను చక్కగా నిర్వర్తించారు. కంపెనీ ఆర్థిక వ్యూహాల్లో ఆమె కీలకంగా వ్యవహరించారు.
కంపెనీ ఆర్థిక ప్రణాళికలు, పెట్టుబడిదారులతో సంబంధాలను చక్కబెట్టడంతో పాటు ప్రత్యేక ప్రాజెక్టుల బాధ్యతలను కూడా ఆమె చేపట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకంత ప్రత్యేకం?
ఫార్చ్యూన్ 500 సీఎఫ్ఓల్లో మహిళలు 64 మంది మాత్రమే (2016 నివేదిక ప్రకారం). అంటే 12.5 శాతం.
పైగా, ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ప్రైవేటు కంపెనీల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న మహిళల శాతం చాలా తక్కువ. అలాంటిది దివ్య అధికారికంగా సీఎఫ్ఓ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఫార్చ్యూన్ టాప్ 10 కంపెనీల్లో ఒకటైన జనరల్ మోటార్స్‌లో తొలి రెండు అత్యున్నత స్థానాల్లోనూ.. (చైర్మన్, సీఈఓ మేరీ బర్రా, సీఎఫ్ఓగా దివ్య) మహిళలే ఉంటారు. ఈ కంపెనీలో తొలి ఛైర్మన్, సీఈఓ మేరీ బర్రా కాగా, తొలి సీఎఫ్ఓ దివ్య సూర్యదేవర కానున్నారు.
దివ్య సూర్యదేవర గురించి మరికొంత..
దివ్య చిన్నతనంలోనే ఆమె తండ్రి చనిపోయారు. విద్యా రుణాల సహాయంతోనే ఆమె చాలావరకు చదువుకున్నారు. 25 ఏళ్ల వయస్సులోనే జనరల్ మోటార్స్ ఉపాధ్యక్షురాలి హోదా చేపట్టారు.
ఆమె భర్త రాజ్ సూర్యదేవర. వీరికి ఒక కుమార్తె. దివ్య కుటుంబం న్యూయార్క్‌లో నివసిస్తుంది. ఆమె మాత్రం డెట్రాయిట్‌లో పనిచేస్తున్నారు. వారాంతాల్లో కుటుంబంతో గడుపుతున్నారు.
జనరల్ మోటార్స్‌కు ముందు ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్, యూబీఎస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేశారు.
22 ఏళ్ల వయస్సులో ఎంబీఏ చదివేందుకు ఆమె తొలిసారి అమెరికా వెళ్లారు. 2002లో ప్రపంచ బ్యాంకు సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు దివ్య ఎంపికయ్యారు.

ఫొటో సోర్స్, dhivya.suryadevara/facebook
‘‘అమ్మ పెంపకం.. ఆమె విశ్వాసం వల్లే’’
‘‘నా బాల్యం చాలా వరకు చెన్నైలోనే గడిచింది. చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారు. ముగ్గురు కూతుళ్లను పెంచే భారం మా అమ్మపైనే పడింది. అయినప్పటికీ మాకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకూడదని, ముఖ్యంగా చదువు విషయంలో ఎలాంటి అవరోధాలూ ఉండకూడదని ఆమె గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆమె మాపై చాలా విశ్వాసం ఉంచేది. ఆ అంచనాల వల్లనే మేం అత్యుత్తమంగా పనిచేయటం నేర్చుకున్నాం. ఏదీ అంత సులభంగా లభించదని కూడా ఆమె ద్వారానే మాకు అర్థమైంది. నువ్వు కోరుకునేది ఏదైనా సరే.. దాని సాధించాలంటే నువ్వు చాలా కష్టపడి పనిచేయాలి’’ అని రియల్ సింపుల్ మేగజీన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దివ్య సూర్యదేవర చెప్పారు.
తనను సవాల్ చేసే, సంక్లిష్టమైన పనులను తాను ఇష్టపడేదానినని ఆమె తెలిపారు.
అమెరికాలో చదువుకునేప్పుడు దివ్య వద్ద సరిపడినంత డబ్బు ఉండేది కాదు. దీంతో స్నేహితులే ఆమెను తమతో పాటు విహార యాత్రలకు తీసుకెళ్లేవారు. ‘(చదువు పూర్తయ్యే వరకు) నా జీవితమంతా అప్పుల్లోనే గడిచింది’ అని ఆమె అంటారు. ‘విద్యా రుణాల సహాయంతోనే నేను చదువుకున్నాను. ఒకవైపు ఆ రుణాలు తీర్చాలి. మరోవైపు ఉద్యోగం వెతుక్కోవాలి. అలాంటి ఒత్తిళ్ల మధ్యే నేను యూబీఎస్‌లో చేరాను’ అని చెప్పారు.
అలాంటి ఒత్తిళ్ల నుంచి వచ్చిన ఆమె తదనంతర కాలంలో రూ.లక్షల కోట్ల విలువైన కంపెనీ ఆర్థిక కలాపాలను చూసే కీలక వ్యక్తిగా ఎదగడం స్ఫూర్తిదాయకం.

ఫొటో సోర్స్, John F. Martin/General Motors
ఖాళీ సమయం కూతురితోనే.. తను కూడా ‘అమ్మలాగే’
దివ్య కుటుంబంతో గడిపేది వారాంతాలు, సెలవు రోజుల్లోనే. ఖాళీ సమయం దొరికితే తన కూతురితోనే గడుపుతానని ఆమె అంటారు. అదే తనకు ముఖ్యమని చెబుతారు. ‘‘అమ్మ ఏం చేస్తే నేనూ అదే చేస్తా’’ అని తన కూతురు అంటుంటుందని తెలిపారు.
ఇలా.. ఒకవైపు కుటుంబం, మరోవైపు కార్యాలయ పనులను సమన్వయం చేసుకోవటం.. ఏది ముఖ్యమో తెలుసుకుని, దానికి ప్రాధాన్యత ఇవ్వటమే కీలకమని అంటారు. అయితే, ఈ క్రమంలో.. ‘ఎవరికో ఏదో ఒక విధానం బాగుందని మీరు కూడా దాన్నే అనుకరించవద్దు. మీకు సరిపోయేలాగా పనుల్ని సమన్వయం చేసుకోండి’ అని ఆమె సూచించారు.
ఇవి కూడా చదవండి:
- ఇంటర్వ్యూ: హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్త ఈవిడే
- ‘ట్రంప్ నిర్ణయం అమలైతే భర్తతోపాటు వెళ్లే భార్యలు అమెరికాలో ఉద్యోగం చేయలేరు’!
- ఈమె తెలంగాణలో తొలి గిరిజన మహిళా పైలట్
- ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి!
- అనుమానం లేదు.. ఆడవాళ్లే శక్తిమంతులు!
- రక్తదానం, అవయవదానాలు సరే.. అండదానం తెలుసా!
- 'ఆడదానివి... ఆటో నడుపుతావా?' అని హేళన చేశారు!
- బోయింగ్ 777 పిన్న పైలెట్.. బెజవాడ అమ్మాయే
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- తల్లి గర్భానికి కోతలు ఎందుకు పెరుగుతున్నాయి?
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!
- ప్రసవం: సిజేరియన్ కన్నా సహజకాన్పుతోనే శిశువుకు మేలు
- ఈ ఇంజెక్షన్ తీసుకుంటే 3 నెలలు గర్భం రాదు
- క్రికెట్ కిట్ కొనడానికి కష్టపడ్డ మిథాలీ.. ఇప్పుడు పారితోషికంలో టాప్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








