ఈమె తెలంగాణలో తొలి గిరిజన మహిళా పైలట్

వీడియో క్యాప్షన్, అజ్మీరా బాబీ: నింగిని తాకిన ‘లక్ష్యం’
    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'కలలను వెంటాడడమే వాటిని సాకారం చేసుకునేందుకు మార్గమని' తెలంగాణ రాష్ట్ర తొలి గిరిజన మహిళా పైలట్ అజ్మీరా బాబీ అన్నారు.

ఏవియేషన్ రంగంలోకి రావడానికి కారణాలు, ఎదురైన అనుభవాలను ఆమె బీబీసీతో పంచుకున్నారు.

తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన బాబీ.. సోషియాలజీ, హ్యూమన్ రిసోర్సెస్‌లో డిగ్రీ చేసి ఎంబీఏ పూర్తి చేశారు. ఏవియేషన్ రంగాన్ని ఎంచుకోవడానికి కారణాలు వివరిస్తూ, దుబాయ్‌లో ఉండే తన మేనత్తకి వీడ్కోలు చెప్పడానికి మొదటిసారి ఎయిర్ పోర్ట్‌కి వెళ్లానని, అప్పుడే ఆకాశంతో తనకి ఏదో దగ్గర అనుబంధం ఉందని అనిపించిందని చెప్పారు. ఆ రోజే విమానంలో పనిచేయాలని నిర్ణయించుకున్నానని బాబీ తెలిపారు.

''మా కుటుంబంలో, దగ్గర బంధువులలో ఎవరూ ఈ రంగంలో లేరు, మార్గదర్శకంగా నిలిచేవారు కూడా లేకపోవడం పెద్ద సవాలుగా మారింది. దీంతో నా కలని నెరవేర్చుకునేందుకు చాలా శ్రమించా. నా పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా దృఢచిత్తంతో ముందుకు వెళ్లా''నని ఆమె చెప్పారు.

అజ్మీరా బాబీ

ఫొటో సోర్స్, AZMEERA

'తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం'

సవాళ్లను ఎదుర్కోవడం తనకి ఇష్టమని చెబుతూ, అమ్మాయిలు అనగానే ప్రభుత్వ ఉద్యోగాలు, టీచర్లు, డాక్టర్లు , ఐఏఎస్ ఆఫీసర్లో అవ్వమని ఇంటిల్లో ప్రోత్సహిస్తారు కానీ, తాను మాత్రం అందరికన్నా భిన్నంగా అవ్వాలని ఆలోచించేదానినని బాబీ అన్నారు.

''ఎంబిఏ చేశాక ఒక రోజు కేబిన్ క్రూ సిబ్బంది కోసం ఒక ఎయిర్ లైన్స్ ఇచ్చిన ప్రకటన చూసి అప్లై చేశా, తొలి ప్రయత్నంలోనే ఎయిర్ హోస్టెస్‌గా ఎంపికయ్యా. అదే నా లక్ష్యాన్ని సాధించడంలో మొదటి మెట్టు'' అని పేర్కొన్నారు.

ఎయిర్ హోస్టెస్ అనగానే చాలా కుటుంబాలు భిన్న అభిప్రాయాలతో తమ పిల్లలు ఈ రంగం ఎంచుకోవడానికి ఒప్పుకోవని, కానీ తల్లితండ్రులకు తమ పిల్లలపై నమ్మకం ఉండాలని అన్నారు.

'ప్రతి విజయం వెనుక కష్టం'

ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్నప్పుడే పైలట్ శిక్షణకు ఎంపికయ్యానని.. మొదటిసారి ఆకాశంలోకి ఎగిరినప్పుడు కిందకి చూస్తే చాలా భయం వేస్తుందని, కానీ ఆ భయం వదిలితేనే శిక్షణ పూర్తి చేయగలమని బాబీ అన్నారు.

ఒకసారి శిక్షణలో ఉండగా, తన విమానం డోర్ కాస్త తెరుచుకుందని, ఆ క్షణం చాలా భయం వేసిందని, భయపడితే తన కల నెరవేరదని తనకి తానే చెప్పుకుని పట్టుదలతో శిక్షణ పూర్తి చేశానని చెప్పారు.

'ప్రతి విజయం వెనుక కష్టం ఉంటుందని, కానీ ఆ కష్టం తర్వాత వచ్చే ఆనందం చాలా బాగుంటుందని' అన్నారు.

అజ్మీరా బాబీ

ఫొటో సోర్స్, AZMEERA

'ప్రతిభను అడ్డుకోలేరు'

మనలోని ప్రతిభను ఎవరూ అడ్డుకోలేరని బాబీ చెప్పారు. ఈ రంగంలోకి వచ్చినప్పుడు పెద్దగా సవాళ్లు ఎదురుకాలేదని అన్నారు. అయితే కులం కొన్ని సార్లు తన ప్రయాణంలో అవరోధం గా నిలిచిందని వివరించారు.

''ఎవరినైనా పని విషయంలో ఎదుర్కోవడం కాస్త కష్టం గా ఉంటుంది. కానీ, ప్రతిభను ఎవరూ అడ్డుకోలేరు'' అని అభిప్రాయపడ్డారు.

తల్లితండ్రులు, స్నేహితులు, తెలంగాణ ప్రభుత్వం తనకి చాలా సహకారం అందించారని చెప్పారు.

'ఈ రంగంలోకి రావాలంటే..'

ఏవియేషన్ రంగంలోకి రావాలనుకునేవారికి మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో ప్రావీణ్యం అవసరం అని బాబీ సూచించారు.

డైరెక్టర్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ ప్రతి మూడు నెలలకు ఒకసారి వివిధ సబ్జెక్టులలో పరీక్షలు నిర్వహిస్తుందని, పరీక్షలు పాస్ అయిన తర్వాత ఫ్లైయింగ్ క్లబ్‌లో చేరితే బాగుంటుందని. లేకపోతే, ఫ్లైయింగ్ లైసెన్స్ పోయే అవకాశాలు ఉంటాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)