'ఈ చర్చలతో కిమ్‌లో మార్పు రాదు': ఉత్తర కొరియా కళాకారులు

ఉత్తర కొరియా కళాకారుడు

ఫొటో సోర్స్, BBC/HEATHER CHEN

ఫొటో క్యాప్షన్, 'కిమ్ జోంగ్‌ను ఎందుకు అంత ప్రముఖంగా చూపిస్తున్నారు? శాంతి చర్చలతో కిమ్‌లో మార్పు రాదు'
    • రచయిత, హీదర్ చెన్, మింజి లీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఇటీవల దక్షిణ కొరియా వెళ్లి ఆ దేశాధ్యక్షుడితో భేటీ అయిన ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్- ఉన్, తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలకూ ఓకే చెప్పారు.

దాంతో అంతర్జాతీయ రాజకీయ నేతల్లో ఒకరిగా కిమ్‌ పేరు వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచ శాంతి కోసం ఆయన ఓ అడుగేశారన్న అభిప్రాయం చాలామందిలో ఏర్పడింది.

అయితే, ఉత్తర కొరియా నుంచి తప్పించుకుని దక్షిణ కొరియాకు వచ్చిన ఇద్దరు కళాకారులు మాత్రం 'కిమ్ చేస్తున్నదంతా నటన' అని విమర్శిస్తున్నారు.

"సింగపూర్‌లో శాంతి చర్చలు మా నిరంకుశ పాలకుడు కిమ్‌ను మార్చలేవు" అని అంటున్నారు.

ఉత్తర కొరియాలోని హ్వాంఘాయ్ ప్రావిన్సుకు చెందిన చిత్రకారుడు సాంగ్ బ్యెయోక్ కొన్నేళ్లపాటు ఆ దేశ భావజాల వ్యాప్తికోసం ప్రచారకర్తగా పనిచేశారు.

అమెరికా, జపాన్‌లకు వ్యతిరేకంగా, కిమ్ కుటుంబాన్ని కీర్తిస్తూ, వారి పాలనను పొగుడుతూ ఆయన అద్భుతమైన చిత్రాలు గీసేవారు.

ట్రంప్, కిమ్

ఫొటో సోర్స్, SONG BYEOK

ఫొటో క్యాప్షన్, సాంగ్ బ్యెయోక్ గీసిన చిత్రం

2002లో ఆయన ఉత్తర కొరియా నుంచి పారిపోయి దక్షిణ కొరియాకు వచ్చారు.

"ప్రపంచంలో ఉత్తర కొరియా ప్రభుత్వం, అక్కడి పాలకులే గొప్ప అన్నట్టుగా చిత్రాలు వేయాల్సి వచ్చేది. ఆ అద్భుతం చిత్రాలకు మాత్రమే పరిమితం. మేం రోజూ అనేక చిత్రహింసలు ఎదుర్కోవాల్సి వచ్చేది. చనిపోవడమే మేలు అన్నట్టుగా ఉండేది. కిమ్ పాలనలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. అయినా ఇప్పుడు ఆయన్ను పెద్ద నాయకుడిగా చూపిస్తుంటే మాకు చాలా బాధ కలిగిస్తోంది. ఓ నిరంకుశ పాలకుడిని గొప్పగా చూపిస్తున్నారు, ఆయన పాలనకు రంగులద్దుతున్నారు. అది చాలా పొరపాటు" అని సాంగ్ బ్యెయోక్ అన్నారు.

ఉత్తర కొరియా నుంచి తప్పించుకుని వచ్చిన మరో కళాకారుడు 30 ఏళ్ల చోయ్ సీయాంగ్- గుక్ దక్షిణ కొరియాలోని గంగ్నమ్ జిల్లాలో ఉంటున్నారు.

ఈయన గతంలో ఉత్తర కొరియాలో కార్టూనిస్టుగా పనిచేసేవారు. 2012లో కుటుంబంతో సహా ఉత్తర కొరియా నుంచి పారిపోయి దక్షిణ కొరియాకు వచ్చారు.

ఉత్తర కొరియా కళాకారుడు

ఫొటో సోర్స్, BBC/HEATHER CHEN

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన చోయ్ సియాంగ్ దక్షిణ కొరియాలో ఉంటున్నారు.

"ఉత్తర కొరియా నుంచి వచ్చి కిమ్ జోంగ్- ఉన్‌ని ప్రశంసిస్తూ మాట్లాడేవాళ్లను చూస్తుంటే నాకు పట్టలేని కోపం వస్తుంది. నేను, నా కుటుంబం ఉత్తర కొరియాలో అనేక చిత్రహింసలు ఎదుర్కొన్నాం. మాలాగా ఆ ఇబ్బందులు పడని కొద్దిమంది మాత్రమే అలా మాట్లాడతారు" చోయ్ సీయాంగ్ అన్నారు.

‘‘అంతర్జాతీయ నాయకులతో కలిసి కిమ్ పరేడ్‌లో పాల్గొంటున్న ఫొటోలు చూస్తుంటే మాకు చిర్రెత్తుకొస్తోంది. ఉత్తర కొరియాలో దిగజారిన తన ఇమేజ్‌ను తిరిగి పెంచుకునేందుకు, జనాల దృష్టిని మళ్లించేందుకే కిమ్ ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. దేశం విడిచి ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితులు ఏర్పడటం వల్లనే ఆయన శాంతిచర్చలంటూ నటిస్తున్నారు" అని చోయ్ తీవ్రంగా ఆరోపించారు.

కిమ్

ఫొటో సోర్స్, CHOI SEONG-GUK

ఫొటో క్యాప్షన్, చోయ్ సియాంగ్ గీసిన కిమ్ జోంగ్- ఉన్ చిత్రం

"ట్రంప్ ప్రపంచంలోనే ఓ బలమైన దేశాన్ని పాలిస్తున్నారు. మానవత్వం పట్ల ఆయనకో అవగాహన ఉంది. తాజా సదస్సు విషయంలో ఆయనకో వ్యూహం ఉంది అనుకుంటున్నాను. ఆయన ఉత్తర కొరియాను నిర్లక్ష్యం చేయరని ఆశిస్తున్నాను" అని ఆయన అభిప్రాయపడ్డారు.

మరి ఏదో ఒక రోజు సురక్షితమైన ఉత్తర కొరియాకు తిరిగి వెళ్లాలని మీకు అనిపిస్తోందా? అని అడిగితే.. 'యెస్' అంటూ సాంగ్ బ్యెయోక్ ఉత్సాహంగా సమాధానమిచ్చారు.

"మా స్వదేశానికి వెళ్లాలని ఉంది. మా దేశ రాజధాని ప్యోంగ్యాంగ్‌లో‌లో చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి అక్కడి ప్రజలకు తెలిజెప్పాలని ఉంది. అది నా జీవితాశయం. అలా జరగాలని ఆశిస్తున్నా" అని ఆయన చెప్పారు.

ఉత్తర కొరియా కళాకారుడు

ఫొటో సోర్స్, BBC/HEATHER CHEN

ఫొటో క్యాప్షన్, తిరిగి మా స్వదేశం(ఉత్తర కొరియా) వెళ్లి చిత్ర ప్రదర్శన నిర్వహించాలన్నది తన జీవితాశయమని కాళాకారుడు సాంగ్ బ్యెయోక్ అంటున్నారు.

"సింగపూర్‌లో ట్రంప్, కిమ్‌ల శిఖరాగ్ర సదస్సు, మా దేశంలో మౌలిక మార్పులకు తొలి అడుగు అవుతుందని ఆశిస్తున్నాం" అని ఆయన ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)