పర్సును వెనక జేబులో పెట్టుకుంటే వెన్నుకు ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, భరత్ శర్మ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీరు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నగదు, విజిటింగ్ కార్డులు, ఫొటోలు, డ్రైవింగ్ లైసెన్సు లాంటివి అన్నీ పెట్టేసి పర్సును కుక్కేస్తుంటారా? దానిని వెనక జేబులో పెట్టుకుని, సుదీర్ఘ సమయం కూర్చుంటుంటారా? ఇలా చేయడం ఆరోగ్యంపై ఏమైనా ప్రభావం చూపుతుందా అని ఎప్పుడైనా ఆలోచించారా?
పర్సును వెనక జేబులో పెట్టుకుని కొద్దిసేపే కూర్చుంటే ఫర్వాలేదుగాని రోజంతా లేదా ఎక్కువసేపు కూర్చుంటే నడుము కింది భాగంలో నొప్పి వచ్చే ఆస్కారముంది.
మందంగా ఉన్న పర్సును ఇలా పెట్టుకుని అధిక సమయం కూర్చోకూడదని 'మెన్స్ హెల్త్' పత్రికలో ప్రచురితమైన ఒక కథనంలో కెనడాలోని 'స్పైన్ బయోమెకానిక్స్ ఆఫ్ యూనివర్శిటీ ఆఫ్ వాటర్‌లూ'కు చెందిన ప్రొఫెసర్ స్టువర్ట్ మెక్‌గిల్ చెప్పారు. పర్సు పెట్టుకొనే తీరుకూ వెన్నునొప్పికి మధ్య సంబంధాన్ని గుర్తించేందుకు ఆయన ఒక అధ్యయనం చేశారు.
మందంగా ఉన్న పర్సును వెనక జేబులో పెట్టుకుని ఎక్కువ సేపు కూర్చుంటే నిటారుగా ఉండాల్సిన వెన్నుపాము ఆకృతి మారిపోయే ఆస్కారం ఉంటుంది. వెన్నుపాము ఆకృతిలో మార్పు నాడులపై ఒత్తిడి కలిగిస్తుంది. ఏ నాడులపై ఒత్తిడి పడితే వాటితో ముడిపడిన భాగాలకు నాడీ సంకేతాల ప్రసారంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఇది సమస్యలకు దారితీస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇలా కూర్చోవడం వల్ల సయాటిక్ నాడి ఒత్తిడికి గురవుతుంది. సయాటిక్ నాడి నడుం నుంచి కింది భాగానికి నాడీ సంకేతాలను తీసుకెళ్తుంది. ఈ నాడి ఒత్తిడికి గురైతే నడుము కింది భాగం, తుంటి కీలు వద్ద నొప్పి వస్తుంది. అది పాదం చివరి వరకు పాకొచ్చు.
దిల్లీలోని ప్రైమస్ హాస్పిటల్‌కు చెందిన ఎముకల వైద్య నిపుణుడు కౌశల్ కాంత్ మిశ్ర ఈ అంశంపై బీబీసీతో మాట్లాడుతూ- వెన్నుపాము సాధారణంగా ఉంటే పర్సు వెనక వైపు పెట్టుకోవడం వల్ల సమస్య ఉండదన్నారు. అలాగని సుదీర్ఘ సమయం వెనకే పెట్టుకొని కూర్చొంటే సయాటికా నాడి సంబంధ సమస్య రావొచ్చని తెలిపారు. దీనివల్ల కలిగే నొప్పి మొదలైన చోటే ఉండిపోదని, ఇతర శరీర భాగాలకూ పాకుతుందని చెప్పారు.
మందంగా ఉన్న పర్సును ప్యాంటు ముందు జేబులో పెట్టుకోవడం కూడా పరిష్కారం కాదు. అలా పెట్టుకుంటే ముందు వైపు ఇబ్బంది రావొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నొప్పిని తప్పించుకొనే దారేది?
- సాధ్యమైనంత వరకు ముందు జేబులో పెట్టుకొనేందుకు అనువైన పర్సును లేదా మనీక్లిప్‌ను వాడాలి.
- పర్సుకు మీరు వాడే వాహనం తాళం చెవిని అనుసంధానించి చూడండి. అలా చేస్తే పర్సును వెనక జేబులో పెట్టుకొని కూర్చున్నప్పుడల్లా తాళం చెవి మీకు గుచ్చుకుంటుంది, అప్పుడు మీరు పర్సు చేతిలోకి తీసుకోవడమో, ముందు జేబులోకి మార్చుకోవడమో చేస్తారు.
- మీరు వేసుకొనే ప్యాంటు వెనక జేబులకు గుండీలు ఉంటే వాటిని పెట్టుకోండి. దీనివల్ల పర్సును వెనక జేబులో పెట్టుకొనే అలవాటు తగ్గిపోతుంది.
- వీలైతే దళసరి పర్సులను పూర్తిగా పక్కన పెట్టేసి చిన్నపాటి కార్డు హోల్డర్ వాడటం అలవాటు చేసుకోండి. ఈ కార్డు హోల్డర్‌ను, నగదును ముందు జేబులో పెట్టుకోండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








