స్వాతి గీసిన కార్టూన్‌పై ఎందుకీ మండిపాటు?

ఫొటో సోర్స్, Swathi Vadlamudi
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘నువ్వు గౌరీ లంకేశ్ గురించి విన్నావా?’’
‘‘దయచేసి ఈ ల*ని అరెస్ట్ చేయండి.’’
‘‘ఆమె పది మంది తండ్రులకు పుట్టింది. అందుకే ఇలాంటి పోస్టులు చేస్తోంది.’’
సీనియర్ జర్నలిస్ట్ స్వాతి వడ్లమూడిని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో వందల సంఖ్యలో పోటెత్తిన తిట్లూ, బెదిరింపుల్లో ఇవి మచ్చుకు కొన్ని.
ఇంతకన్నా జుగుప్సాకరమైనవీ, రాయలేనివీ ఇంకా మరెన్నో ఉన్నాయి.

ఇంతకూ స్వాతి చేసిన నేరం ఏంటి? ఆమెపై ఈ ట్రోలింగ్ ఎందుకు? ఈ బెదిరింపులు ఎందుకు?
ఎందుకంటే స్వాతి ఓ కార్టూన్ వేశారు. ఆమె ఆ కార్టూన్ వేయడానికి నేపథ్యం ఇటీవల దేశవ్యాప్తంగా రగులుతున్న కఠువా, ఉన్నావ్ రేప్ ఘటనలు.
వారం రోజుల కిందట స్వాతి ఒక కార్టూన్ వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాముడు, సీత మధ్య సంభాషణ రూపంలో వేసిన ఆ కార్టూన్ వైరల్ అయ్యింది.
ఈ కార్టూన్‌లో "నేను మీ భక్తుల చేతిలో కాకుండా రావణుడి చేతిలో అపహరణకు గురైనందుకు సంతోషంగా ఉంది!" అని రాముడితో సీత అంటుంది. ఆమె చేతిలో ఓ దినపత్రిక ఉంటుంది. అందులో ఇటీవలి రేప్ ఘటనల శీర్షికలు కనిపిస్తాయి.
ఫేస్‌బుక్‌లో ఇప్పటి వరకు ఈ కార్టూన్‌ను ఐదు వేల మందికి పైగా షేర్ చేశారు. ట్విటర్‌లో ఎందరో రీట్వీట్ చేశారు. అదే ఆమె మీద తీవ్రస్థాయి ట్రోలింగ్‌కు కారణమైంది.
స్వాతి ప్రస్తుతం ఒక జాతీయ దినపత్రికలో సీనియర్ కరెస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె వృత్తి జర్నలిజమైతే, ప్రవృత్తి సామాజిక, రాజకీయ పరిణామాలపై కార్టూన్ల రూపంలో వ్యంగ్యాస్త్రాలను సంధించటం.
సోషల్ మీడియా వేదికగా స్వాతి క్రియాశీలంగా స్పందిస్తుంటారు. ఆమె కార్టూన్ల రూపంలో సంధించే వ్యంగ్యాస్త్రాలు చాలా సృజనాత్మకంగానూ, ఆవేశపూరితంగానూ ఉంటాయి.

ఫొటో సోర్స్, Swathi Vadlamudi
"కార్టూన్ సందర్భానికి తగినదే!"
ఈ కార్టూన్ వేసిన సందర్భం, నేపథ్యాల గురించి స్వాతి వడ్లమూడి బీబీసీతో వివరంగా మాట్లాడారు.
‘‘కశ్మీర్‌లోని కఠువాలో ఒక ఆలయంలో ఎనిమిదేళ్ల చిన్నారిని కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. యూపీలోని ఉన్నావ్‌లో ఒక ఎమ్మెల్యే తనపై అత్యచారం చేశాడని ఒక బాలిక సీఎం ఇంటి ముందు ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పటికే ఆమె తండ్రి పోలీస్ లాకప్‌లో చనిపోయాడు. అదే యూపీ ప్రభుత్వం ఒక మాజీ కేంద్ర మంత్రి మీద ఉన్న అత్యాచారం కేసును ఉపసంహరించాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి" అని ఆమె చెప్పారు.
"ఈ ఘటనల్లో నిందితులు బీజేపీ నాయకులుగానో లేదా నిందితులకు బీజేపీ కార్యకర్తల మద్దతు ఉండటమో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ నాయకులు కొందరి మీద వచ్చిన అత్యాచార ఆరోపణల జాబితా చాంతాడంత ఉంది’’ అని తెలిపారు.
‘‘వీరందరూ తమను తాము రామభక్తులమని చెప్పుకుంటారు. వీరి నినాదం ‘జై శ్రీరామ్’. మహిళలను తాము మాతృమూర్తిలా గౌరవిస్తామంటారు. స్త్రీలను దేవతలుగా పూజించే సంప్రదాయం తమదని చెప్తుంటారు. మరి మహిళల విషయంలో ఇంత దారుణాలకు పాల్పడుతున్నారు" అంటూ స్వాతి తానీ కార్టూన్ వేయడానికి ముందు ఎలా ఆలోచించారో వివరించారు.
"వీరు తమ దైవంగా చెప్పే రాముడి భార్య సీతను రావణుడు అపహరించాడు కానీ ఆమెను చెరచలేదని రామాయణం చెప్తోంది. అదే సీత రామభక్తులమని చెప్పుకుంటూ మహిళలపై దురాగతాలకు పాల్పడే ఇలాంటి వారి చేతులకు చిక్కితే పరిస్థితి ఎలా ఉండేదోననే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచే ఈ కార్టూన్ పుట్టింది" అంటూ కార్టూన్ వెనకున్న ఆలోచనలు పంచుకున్నారు.
"రామభక్తులమని చెప్పుకుంటూ బాలికలు, మహిళలను చెరబట్టి చెరిచే ఇలాంటి వారికన్నా రావణుడే నయమని సీత పాత్ర ద్వారా చెప్పించటమే ఈ కార్టూన్ ఉద్దేశం’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Swathi Vadlamudi
"దేశం ఇంకా ఇంతగా వెనుకబడి ఉందా?"
తాను ఎదుర్కొంటున్న ట్రోలింగ్, సోషల్ మీడియాలో వస్తున్న బెదిరింపుల పట్ల తన స్పందన ఏంటని స్వాతిని బీబీసీ అడిగి తెలుసుకుంది.
‘‘ఇది చాలా జుగుప్సాకరంగా ఉంది. దేశం ఇంకా ఇంతగా వెనుకబడి ఉందా అనిపిస్తోంది. ఇంకా ఇంతటి స్త్రీ ద్వేషం, ఇంతటి పురుషాహంకారం పాతుకుపోయి ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తోంది. ఆలోచిస్తుంటే రాత్రిళ్లు నిద్రపట్టటం లేదు. ఇంట్లో వాళ్లు భయపడుతున్నారు. ‘నీకెందుకొచ్చిన గొడవ’ అంటున్నారు" అని ఆమె చెప్పారు.
అయితే ట్రోల్స్‌లో చాలా మందివి ఫేక్ అకౌంట్లుగా కనిపిస్తున్నాయని స్వాతి అన్నారు. వారంతా ఒక పార్టీ ఐటీ సెల్ కోసం పనిచేస్తున్న ఏజెంట్లు అయి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
బెదిరింపుల విషయాన్ని ప్రస్తావించినప్పుడు.. "నేను చాలా కాలంగా చూస్తున్నాను. మానసికంగా చాలా ధృడమయ్యాను. చంపేస్తామని బెదిరిస్తే బెదిరిపోయే రకాన్ని కాదు" అని ఆమె అన్నారు.
"కొందరు ‘చార్లీ హెబ్డో తరహాలో ఇక్కడ కూడా జరగాలి’ అని వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఆ ఫ్రెంచ్ మేగజీన్ కార్యాలయంపై దాడిని పత్రికా స్వేచ్ఛ మీద, భావప్రకటనా స్వేచ్ఛ మీద ముస్లిం తీవ్రవాదులు చేసిన దాడిగా వీరందరూ ఖండించారు. కానీ ఇప్పుడు వాళ్లే అలాంటి దాడులు చేయాలంటున్నారు" అని స్వాతి అన్నారు.
తాను ట్రోల్స్ విషయంలో ఫేస్‌బుక్, ట్విటర్‌లకు రిపోర్టు చేశానని స్వాతి తెలిపారు.
దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వ్యక్తిగా, జర్నలిస్టుగా స్పందించకుండా ఎలా ఉండగలనని స్వాతి అన్నారు. తనను ఒకవేళ తనను ఎవరైనా హత్య చేస్తే బాధ్యత ప్రభుత్వానిదే కాదు, దాన్ని ఎన్నుకున్న ప్రజలది కూడా అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Divya Rajagopla/Facebook
మా మార్గదర్శకాలకు భిన్నంగా అయితే ఏమీ లేదు, కానీ...: ఫేస్‌బుక్
ఈ కార్టూన్‌కు వ్యతిరేకంగా కొందరు ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేశారు. అయితే.. తాము ఈ కార్టూన్‌ను సమీక్షించామని, ‘‘ఇది ఫేస్‌బుక్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగానే ఉన్నట్లు గుర్తించాం’’ అంటూ ఫేస్‌బుక్ స్పందించింది.
అయితే.. ‘‘దీనిని ఇన్‌సెన్సిటివ్ (కఠినం) గానూ క్రూయల్ (క్రూరం) గానూ ఉందని పరిగణించవచ్చునని, కాబట్టి ఈ పోస్టును తొలగించటమో లేదంటే ఇటువంటి పోస్టులను షేర్ చేయటాన్ని కొందరు ఆడియన్స్‌కు పరిమితం చేయటాన్నో పరిశీలించండి’’ అని సూచించింది.
అయితే.. ఈ పోస్టును తొలగించాలని ఫేస్‌బుక్ సూచించటం మీద కొందరు యూజర్లు నిరసన వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Swathi Vadlamudi/Facebook
స్వాతికి ఆన్‌లైన్ మద్దతు!
ఇదిలా వుంటే.. స్వాతి గీసి, పోస్ట్ చేసిన ఈ కార్టూన్ మీద సానుకూల స్పందనలు కూడా చాలానే ఉన్నాయి.
వాస్తవ పరిస్థితికి కార్టూన్ అద్దం పడుతోందని కొందరు అభినందించారు. అయితే అలా రీట్వీట్ చేసిన వారి మీద, షేర్ చేసిన వారి మీద కూడా ట్రోలింగ్ జరిగింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
స్వాతి, మరికొందరు సోషల్ మీడియా యూజర్లు ఈ ట్రోలింగ్‌ను కొంత వరకూ అదుపు చేయగలిగారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చాలా మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. సంఘీభావం ప్రకటించారు.
‘‘ఈ ట్రోలింగ్ విషయంలో ఎంతో మంది నాకు మద్దతు తెలిపారు. వారిలో చాలా మంది నాకు తెలియదు. వారిలో హిందూ మతాన్ని ఆచరించేవారు, దైవభక్తులు కూడా ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు. గుర్తింపులకు అతీతంగా మానవత్వం మిగిలే ఉందన్న విశ్వాసం నాకు మళ్లీ కలిగింది’’ అని స్వాతి చెప్పారు.

ఫొటో సోర్స్, nwmindia.org
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
'టైమ్స్ నౌ' జర్నలిస్ట్ అహ్మద్ షబ్బీర్ హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఉన్న స్వాతి కార్టూన్‌ను షేర్ చేశారంటూ హిందూ సంఘటన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 295 (ఎ) కింద ఎఫ్ఐఆర్ (క్రైమ్ నంబర్ 132/2018) నమోదు చేశామని సైదాబాద్ పోలీస్ ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఈ కేసులో స్వాతి వడ్లమూడి పేరును కూడా ప్రతివాదిగా చేర్చాలని తమకు ఫిర్యాదు అందిందని ఆయన బీబీసీకి చెప్పారు.
పోలీసులు కేసు నమోదు చేయటాన్ని నెట్‌వర్క్ ఆఫ్ ఉమన్ ఇన్ ద మీడియా, ఇండియా (ఎన్‌డబ్ల్యూఎంఐ) ఖండించింది. ఆ కార్టూన్ పురాణ దేవతలైన రాముడు, సీతలను ఏ రకంగానూ కించపరచటం లేదనీ, దేశంలో మహిళల అపహరణ, వారి మీద హింస గురించి ఓ ప్రశ్న వేస్తోందని ఆ సంస్థ పేర్కొంది.
ఈ కార్టూన్ వేసిన స్వాతితో పాటు, దానిని షేర్ చేసిన 'టైమ్స్ నౌ' చెన్నై డిప్యూటీ ఎడిటర్ షబ్బీర్ అహ్మద్, మరో కార్టూనిస్ట్ సతీశ్ ఆచార్యలను కూడా లక్ష్యంగా చేసుకుని వేధింపులు, చంపేస్తామనే బెదిరింపులు వస్తున్నాయని ఎన్‌డబ్ల్యూఎంఐ ఆందోళన వ్యక్తం చేసింది.

అప్రజాస్వామికం: టీయూడబ్ల్యుజే
స్వాతిపై బెదిరింపులను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఖండించింది.
"ఈ చర్య భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ఉంది. ఇది అప్రజాస్వామికమైంది. దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి పోలీసులు తీసుకునే చర్యలను ఆపవల్సిందిగా కోరుతున్నాం" అని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్ ఒక ప్రకటనలో కోరారు.

ఫొటో సోర్స్, Swathi Vadlamudi
హిందూ కళ్లతో చూసి మాట్లాడండి: హిందూ సంఘటన్
ఈ కార్టూన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన హిందూ సంఘటన్ అధ్యక్షుడు కరుణసాగర్ కశింశెట్టితో బీబీసీ మాట్లాడింది.
''స్వాతి వడ్లమూడి వేసిన ఆ కార్టూన్ ఉద్దేశం అత్యాచార బాధితురాలికి న్యాయం చేయటం కాదు. హిందూ మనోభావాలను గాయపరచటమే దాని వెనుక ఉద్దేశం. హిందూ సమాజం మొత్తం, రాముని భక్తులు మొత్తం రేపిస్టులని చిత్రీకరించే ప్రయత్నమే ఆ కార్టూన్'' అని ఫిర్యాదుదారు, న్యాయవాది, 'హిందూ సంఘటన్' అధ్యక్షుడు కరుణసాగర్ కశింశెట్టి అన్నారు.
''రాముడు, సీతలను ఆ రకంగా చిత్రీకరించి చూపిస్తే కఠువా బాధితురాలికి న్యాయం జరుగుతుందా? హిందువులంతా రేపిస్టులయితే.. దేశంలో ఎన్నో ఏళ్లుగా చాలా మంది ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. వాళ్లందరూ ఎందుకు రేప్‌కు గురికాలేదు?'' అని ఆయన ప్రశ్నించారు.
''ముస్లింలు పలు ప్రాంతాల్లో పలువురు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అలాగని వీరు ఎప్పుడైనా మొహమ్మద్ ప్రవక్త భక్తులంతా రేపిస్టులని కార్టూన్ వేశారా? హిందువులయితే సహనమున్న వాళ్లు.. ఏమీ చేయలేరని వీళ్లు అనుకుంటున్నారు" అని కరుణసాగర్ అన్నారు.
"వాళ్ల లోపల గూడుకట్టుకున్న హిందూ వ్యతిరేకతను వ్యక్తం చేయటం తద్వారా మోదీని, బీజేపీని టార్గెట్ చేయటం వాళ్ల లక్ష్యం. ఎవరినైనా లక్ష్యం చేసుకోమనండి కానీ.. హిందువుల మనోభావాలను గాయపరచకండి'' అని కరుణసాగర్ అన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








