చిత్రమాలిక : ఈ ఫొటోలు చూస్తే ప్లాస్టిక్ అంటే భయమేస్తుంది!!

నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్.. జూన్ సంచికలో ఆసక్తికరమైన ఫోటోలను ప్రచురించింది. ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రపంచాన్ని ఎలా పొట్లం కట్టేస్తున్నాయో వీటిని చూస్తే అర్థమవుతుంది.

సముద్ర గుర్రం

ఫొటో సోర్స్, JUSTIN HOFMAN / NATIONAL GEOGRAPHIC

ఫొటో క్యాప్షన్, సాధారణంగా సముద్ర గుర్రం.. తరంగాలను ఈదడానికి ఏ గడ్డిపీచునో, ఏ చెత్తనో సాధనంగా తీసుకుంటుంది. కానీ ఇండొనేషియా దీవుల్లోని ఈ సముద్ర గుర్రం మాత్రం, ‘ప్లాస్టిక్ ఇయర్ బడ్’ సాయంతో ఈదుతోంది. ‘‘ఈ ఫోటోలో కనిపించే దృశ్యం భవిష్యత్తులో కనిపించకూడదని కోరుకుంటున్నా’’ అని ఫోటోగ్రాఫర్ అన్నారు.
ప్లాస్టిక్ వలలో చిక్కుకున్న తాబేలు

ఫొటో సోర్స్, JORDI CHIAS / NATIONAL GEOGRAPHIC

ఫొటో క్యాప్షన్, స్పెయిన్ సముద్రంలోని ఈ తాబేలు.. పారవేసిన ఓ ‘ప్లాస్టిక్’ చేపల వలలో చిక్కుకుంది. ఊపిరాడక సతమతమవుతోన్న ఈ తాబేలును ఫోటోగ్రాఫర్ చూసుండకపోతే, ఈపాటికి అది మరణించి ఉండేది!
ప్లాస్టిక్ కవర్‌లో చిక్కుకున్న కొంగ

ఫొటో సోర్స్, NATIONAL GEOGRAPHIC

ఫొటో క్యాప్షన్, ఈ కొంగను చూడండి.. ప్లాస్టిక్ గౌను తొడిగినట్లుంది కదూ.. కానీ జరిగింది వేరు. స్పెయిన్‌లోని ఈ కొంగకు గాలికి ఎగిరొచ్చిన ఓ ప్లాస్టిక్ కవర్ తగులుకుంది. సమయానికి ఈ ఫోటోగ్రాఫరే దీన్ని రక్షించాడు.
ప్లాస్టిక్ మూతలో దాక్కున పీత

ఫొటో సోర్స్, SHAWNMILLER2014

ఫొటో క్యాప్షన్, జపాన్‌ ఒకినవా లోని ఈ పీత.. ఓ ప్లాస్టిక్ బాటిల్ మూతలో దాక్కుంది.
నేషనల్ జియోగ్రాఫిక్ సంచిక

ఫొటో సోర్స్, NATIONAL GEOGRAPHIC

ఫొటో క్యాప్షన్, ప్లాస్టిక్ సమస్య గురించి ఈ సంచిక కట్టుబడి ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రం వెలుపల ఎంత శాతం ఉన్నాయో.. సముద్ర గర్భంలో ఏమేరకు ఉన్నాయో ఈ ఫోటోను చూసి అర్థం చేసుకోవచ్చు. ప్లాస్టిక్ వ్యర్థాలు.. కళ్లకు కనిపించనంత చిన్నవిగా ఉండి సముద్ర జీవులను ప్రమాదం అంచులకు తోస్తున్నాయి.
ప్లాస్టిక్ వ్యర్థాల మధ్య తల్లీ కొడుకు

ఫొటో సోర్స్, RANDY OLSON

ఫొటో క్యాప్షన్, ఢాకా నగరంలోని నదీ తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను (కవర్లు/షీట్స్) కడిగి, వాటిని ఈ మహిళ ఆరబెడుతోంది. నిత్యమూ ఈమె ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో పని చేస్తుంది. చివరికి తన కొడుకు ఆలనా పాలన కూడా ఈ ప్లాస్టిక్ గుట్టల్లోనే! ఈ వ్యర్థాలను ఓ ప్లాస్టిక్ రీసైక్లర్‌కు అమ్ముతారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్లాస్టిక్‌లో 5వ వంతు ప్లాస్టిక్‌ను తిరిగి ఉపయోగిస్తున్నారు. అమెరికాలో 10% కంటే తక్కువ ప్లాస్టిక్‌ను రీ సైకిల్ చేస్తున్నారు.
చెత్తకుప్పలపై హైనాలు

ఫొటో సోర్స్, BRIAN LEHMANN / NATIONAL GEOGRAPHIC

ఫొటో క్యాప్షన్, ఇథియోపియా లోని హరార్‌ చెత్తకుప్పలపై హైనాలు. అడవుల్లో ఉండాల్సిన హైనాలు చెత్తకుప్పల్లో తిరుగుతున్నాయి. తరచూ ఇక్కడకొచ్చే చెత్త లారీల శబ్దం విని పరిగెత్తుకుంటూ ఇక్కడికొస్తాయి. ఈ ప్లాస్టిక్ చెత్తకుప్పల్లోనే తమ ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి.
ప్లాస్టిక్ బాటిళ్లు

ఫొటో సోర్స్, RANDY OLSON / NATIONAL GEOGRAPHIC

ఫొటో క్యాప్షన్, సెంట్రల్ మాడ్రిడ్‌లోని సిబెల్స్ ఫౌంటైన్‌ను ప్లాస్టిక్ బాటిళ్లు కప్పేశాయి. ప్రపంచంలో ప్లాస్టిక్ ప్రభావం ఏమేరకు ఉందో తెలియచెప్పడానికి ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఈ విషయంపై అవగాహన కల్పించడానికి మరో రెండు ఫౌంటైన్లలో 60 వేల ప్లాస్టిక్ బాటిళ్లను నింపేశారు.