ఫాదర్స్ డే: తండ్రి కావాలని తపించిపోతున్నా. ఎందుకంటే..

- రచయిత, సింధువాసిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీలోని కోట్లా ముబారక్ పూర్ ప్రాంతంలోని ఒక చిన్న గదిలో ఒక పాత ఫ్యాన్ ఫుల్ స్పీడుతో తిరుగుతోంది. ఫ్యాను గాలికి వంటింట్లో గ్యాస్ ఆరిపోబోయింది. మంటకు అడ్డుగా ఒక పళ్లాన్ని పెట్టిన దుర్గాసింగ్, గడప దగ్గర కూర్చుని మాట్లాడ్డం మొదలు పెట్టారు.
38 ఏళ్ల దుర్గాసింగ్ తండ్రి కావాలనే కోరికతో ఉత్తరప్రదేశ్ బారాబంకీ జిల్లా నుంచి దిల్లీ వచ్చారు. పెళ్లైన ఐదారేళ్ల తర్వాత కూడా పిల్లలు పుట్టకపోవడంతో ఆయన గ్రామం వదిలి దిల్లీ రావాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం పెళ్లై 16 ఏళ్లవుతున్నా, దుర్గా సింగ్ కోరిక ఇంకా తీరలేదు.
పిల్లల కోసం ఆయన ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. గుళ్లూ, గోపురాల్లో పూజలు, వ్రతాలూ చేశారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.
"పెళ్లైనప్పుడు నా వయసు 20-22 ఏళ్లు, నా భార్య పూనమ్ వయసు 18-19 ఉండొచ్చు. పెళ్లైన మూడేళ్ల వరకూ మాకు దిగులు లేదు. కానీ ఐదారేళ్ల తర్వాత కాస్త బాధ కలిగింది" అని ఆయన చెప్పారు.
మొదట దుర్గా సింగ్ బారాబంకీలోని ఒక ఆస్పత్రిలో డాక్టర్ దగ్గరికి వెళ్లాడు. "మందులు చాలా ఖరీదైనవి, అయినా మేం చికిత్స కొనసాగించాం. ప్రయోజనం లేకపోవడంతో లక్నోలోని ఒక ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ కూడా ఎలాంటి ఫలితం దక్కలేదు. దాంతో మాకు తెలిసినవారు దిల్లీకి వెళ్లమని చెప్పారు" అని ఆయన తెలిపారు.

పిల్లల కోసం అపరిచిత నగరంలో..
అలా ఒక బిడ్డ కావాలనే తపనతో దుర్గా సింగ్, పూనమ్ తమ గ్రామం నుంచి దిల్లీ లాంటి అపరిచిత నగరానికి చేరుకున్నారు. దిల్లీలో వాళ్లు కోట్లా ప్రాంతంలో ఒక గది అద్దెకు తీసుకుని కాపురం ప్రారంభించారు. దుర్గాసింగ్ గార్డ్ ఉద్యోగంలో కుదిరాడు. ఉద్యోగం చేస్తూనే చికిత్స కోసం డబ్బులు పొదుపు చేస్తున్నారు.
"ఢిల్లీలో మేమిద్దరం బతకాలి, కొన్ని డబ్బులు ఇంటికి పంపించాలి, చికిత్స కోసం కూడా పొదుపు చేయాలి. అంత సంపాదించాలంటే చాలా కష్టపడాలి. వారానికి ఒక రోజు సెలవు దొరుకుతుంది. ఆ రోజంతా ఆస్పత్రిలో గడిచిపోతుంది" అని దుర్గాసింగ్ గుర్తు చేసుకుంటారు.
దుర్గాసింగ్ ఆస్పత్రిలో ఎంత సేపు గడుపుతారు అనేది ఆయన నోటి నుంచి తరచూ వినిపించే ఫెలోపియన్ ట్యూబ్స్, యుటెరస్, సిమన్ లాంటి పదాలను బట్టే అంచనా వేయచ్చు. ఆయన సప్ధర్‌జంగ్ నుంచి లేడీ హార్డింగ్ వరకూ ఎన్నో ఆస్పత్రుల చుట్టూ చక్కర్లు కొట్టారు. ఏళ్ల తరబడి వేచి చూశారు. ఈరోజుకీ అదే చేస్తున్నారు.
"ఒక డాక్టర్ మాకు ఐవీఎఫ్ ట్రై చేయమని సలహా ఇచ్చారు. కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచించలేకపోతున్నా, ఎందుకంటే దానికి చాలా ఖర్చవుతుంది" అంటారు దుర్గాసింగ్.
పిల్లలు కావాలన్న కోరికతో ఆయన ఇప్పటివరకూ 8-9 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.

ఒక బాబా మాయలో చిక్కుకున్నప్పుడు
ఇవన్నీ చేస్తూనే ఆయన ఒక బాబా మాయలో కూడా చిక్కుకున్నారు.
"బాబా నన్ను 20 వేలు అడిగాడు. రెండు నెలల్లో ఫలితం లేకపోతే మొత్తం డబ్బులు తిరిగి ఇచ్చేస్తానన్నాడు. నేను ఆయనకు 20 వేలు ఇచ్చా, రెండు నెలల వరకూ ఆయన చెప్పిన పూజలన్నీ చేస్తూ వచ్చా. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. దాంతో నా డబ్బు తిరిగి ఇవ్వమని అడిగా. మొదట ఆయన నన్ను బెదిరించాలని చూశాడు. కానీ నేను నా స్నేహితుడితో వెళ్లి గట్టిగా అడగడంతో డబ్బులు తిరిగి ఇచ్చేశాడు" అని చెప్పాడు.
"నేను చాలాసార్లు ఏడ్చాను. ఇప్పుడు కూడా నాకు, పూనమ్‌కు దిగులుగా అనిపిస్తుంది. కానీ మేం ఇద్దరం ఒకర్నొకరు ఓదార్చుకుంటాం. అవును.. మా జీవితంలో వచ్చిన ఈ కష్టం కచ్చితంగా ఒక పెద్ద లోటే. కానీ ఆ ప్రభావం మేం ఎప్పుడూ మా బంధంపై పడనివ్వలేదు" అని గుర్తు చేసుకున్నారు దుర్గాసింగ్.
ఆయన చెబుతున్నది విని పూనమ్ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. "అంటే మా మధ్య గొడవలు ఉండవని కాదు, కానీ, మాకు పిల్లలు లేరని మాత్రం మేం ఎప్పుడూ గొడవ పడం. మా తలరాతకు మేం ఒకరినొకరం నిందించుకోం" అని ఆమె అన్నారు.
కొంతమందైతే వేరే పెళ్లి చేసుకోమని దుర్గాసింగ్‌కు సలహా ఇవ్వాలనుకున్నారు. "రెండో పెళ్లి చేసుకోమని వారు నేరుగా నాతో చెప్పలేకపోయారు. ఎందుకంటే నేను అలాంటి పని చేయనని వాళ్లకు తెలుసు. అలా చెబితే వాళ్లనే తిడతానని భయపడతారు, పూనమ్ మనసు ఎప్పటికీ బాధపెట్టలేను నేను" అంటారాయన.

ఎప్పుడైనా ఎవరైనా తండ్రి కాలేకపోయారని మిమ్మలి అవమానించారా?
"నా వెనక చాలా మంది ఎన్నో అనుకుంటూ ఉంటారు. అందులో సందేహం లేదు. ఒకసారి నా ముందే అన్నారు. మా పొరుగు వాళ్లతో మాకు ఒకసారి గొడవైంది. మాటామాటా పెరిగినప్పుడు, ఆయన 'ఇలా అయితే ఎప్పటికీ తండ్రి కాలేవని' అన్నాడు. అది విని నేను చాలా బాధపడ్డా. నా భార్య అయితే ఏడ్చేసింది" అన్నారు దుర్గా సింగ్.
"కొన్ని సార్లు చాలా కోపం కూడా వస్తుంది. స్నేహితులు, బంధువులు, ఇంట్లో వాళ్లు, అంతా అడుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఫోన్లో, ఒక్కోసారి నేరుగా కలిసినప్పుడు ‘ఏంటి విషయం, శుభవార్త ఏమైనా ఉందా’ అంటారు. శుభవార్త ఏదైనా ఉంటే నేనే చెబుతాగా!! కానీ తర్వాత ఆలోచిస్తా. అందులో తప్పేముంది, అడుగుతున్నారు అంతేగా అనిపిస్తుంది."
సమాజంలో ఎప్పుడూ మాతృత్వం గురించే చర్చ జరుగుతుంది, కానీ తండ్రిని చేర్చరు. మహిళల్లాగే, పురుషులకు తండ్రి కావాలనే కోరిక ఉండదా?
దుర్గా సింగ్ ఇలా సమాధానమిస్తున్నారు.. ‘‘అలా ఏమీ కాదు. పురుషులు పైకి మాట్లాడరు. కానీ, లోలోపల మాత్రం వారు చాలా బలంగా కోరుకుంటుంటారు. తండ్రి కాలేకపోతున్నాననే బాధ పురుషుల్లో ఎంత ఉంటుందో, ఎలా ఉంటుందో నన్నడగండి చెబుతాను. ‘పిల్లలు లేని మీకేం తెలుసు ఇతరుల పిల్లల గురించి’ అంటూ కొందరు మాట్లాడటం నేను విన్నాను. కానీ, నేను ఇతరుల పిల్లల డైపర్లు మార్చాను, వారు టాయిలెట్‌కు వెళితే శుభ్రం కూడా చేశాను.’’
‘‘ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు ఉండి ఉంటే అందరికీ తెలిసేలా చాలా ఘనంగా పార్టీ ఇచ్చేవాడిని. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా నాకు తేడా ఏం లేదు. ఎవరో ఒకరు.. నా పిల్లలైతే చాలు’’ అని ఆయన అన్నారు.
పిల్లల్ని మంచి స్కూలులో చదివించాలని, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు నేర్పించాలని, మంచి ఉద్యోగం చేయించాలని.. ఇలా ఆయన చాలా కలలు కంటున్నారు. ‘‘పేదరికం కారణంగా నా తండ్రి నన్ను చదివించలేకపోయారు. కానీ, నేను మాత్రం నా పిల్లల్ని తప్పకుండా చదివిస్తాను. నాకు దక్కనివన్నీ వాళ్లకు దక్కేలా చూస్తాను’’ అంటూ ఆయన భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, iStock
తండ్రి కావటం అంత తప్పనిసరి ఎందుకు?
మనవాళ్లు ఎవరో ఒకరు ఉండాలి కదా అంటారాయన. ‘‘పిల్లలు కలిగితే.. నన్ను ‘మన’ అనుకునే వారు ఎవరో ఒకరు నా వద్ద ఉన్నారనిపిస్తుంది. పిల్లలు లేకపోతే నేను చనిపోయిన తర్వాత నా పేరు ఈ ప్రపంచం నుంచి చెరిగిపోతుంది. పిల్లో, పిల్లోడో ఉంటే అందరూ అంటుంటారు కదా ‘వీళ్లు దుర్గా సింగ్ పిల్లలు’ అని.’’
కానీ, పిల్లలు లేని వాళ్లకు కూడా జీవితం ఉంది కదా?
‘‘అవును కచ్చితంగా ఉంది. ఒకవేళ పిల్లలు పుట్టకపోయినా మేం ఇద్దరం కలసి జీవిస్తాం. కానీ, పిల్లలు పుడితే మాత్రం మరింత సంతోషంగా బతుకుతాం. ఎవరో ఒకరు మా ఒడిలోకి రావాలి.. వస్తారు.’’
తిరిగి వెళ్లిపోతుండగా దుర్గాసింగ్ నిదానంగా ఇలా అన్నారు.. ‘‘నేను ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టలేదు. నాకేం తెలుసు పై వాడికి మనసు కరగట్లేదు. మీకు ఎవరైనా మంచి డాక్టర్ తెలిస్తే చెప్పండి. నేను ఇప్పటికీ ఆశ వదులుకోలేదు.’’
ఇవి కూడా చదవండి:
- “పిల్లల్ని కనడం తప్పనిసరి కాదు.. అది నా ఇష్టం”
- #HerChoice: 'నలుగురు పిల్లల్ని కని అలసిపోయి ఆపరేషన్ చేయించుకున్నా.. భర్తకు చెప్పకుండా!'
- అధ్యయనం: ‘గర్భిణులు ఈ మాత్రలు వాడితే.. పుట్టబోయే పిల్లలకు పిల్లలు పుట్టరు..!’
- చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకెళ్లి చైనాలో అమ్ముకుంటున్నారు
- ‘మిస్.. మీ బడి పాఠాలతో నేను గుడ్డిదాన్ని అవుతున్నా’
- క్రమశిక్షణా లేక సృజనాత్మకతా? విద్యార్థులకు ఏది ముఖ్యం?
- #FIFA2018: ఫుట్‌బాల్ క్రీడాకారుల మూఢవిశ్వాసాలు, అలవాట్లు, ఆచారాలు
- #గమ్యం: మంచి ర్యాంకు రాకపోవడం కూడా మీకు మంచిదే కావచ్చు
- రక్తదానం, అవయవదానాలు సరే.. అండదానం తెలుసా!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








