#గమ్యం: మంచి ర్యాంకు రాకపోవడం కూడా మీకు మంచిదే కావచ్చు

ఫొటో సోర్స్, iStock
- రచయిత, అనిల్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.
గత నెల రోజుల్లో దాదాపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలూ వచ్చేశాయి.
ఐఐటీలు, ఎన్ఐటీల్లోని 30 వేల ఇంజనీరింగ్ సీట్లకోసం 12 లక్షల మంది పోటీపడ్డారు. అంటే 97.5 శాతం మందికి సీటు దొరకలేదు.
అలాగే 13.5 లక్షల మంది సుమారు 50 వేల మెడికల్ సీట్లకోసం పోటీపడ్డారు. అంటే 96.3 శాతం మందికి వైద్యవిద్యలో ప్రవేశం దక్కలేదు.
2 లక్షల మంది ఐఐఎంలలో ఎంబీఏ ప్రవేశాల కోసం పోటీపడితే 2 వేల మందికే సీట్లు దొరుకుతాయి. అంటే కేవలం 1 శాతం మంది మాత్రమే అర్హత సాధిస్తారు. 99 శాతం మంది తిరస్కరణకు గురవుతారు.
మీలో చాలామంది ఈ 96, 97, 99శాతం మంది విద్యార్థుల్లో భాగం.
కానీ ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలలో సీటు దొరక్కపోతే అక్కడితో ఇంక భవిష్యత్ అంధకారమైపోయినట్లేనా?
కోరుకున్న విద్యాసంస్థల్లో సీటు దక్కించుకోలేని విద్యార్థులు ఏం చేయవచ్చో వివరిస్తున్నారు... Careers360.com ఫౌండర్ అండ్ ఛైర్మన్ మహేశ్వర్ పేరి.
మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.
భారతీయ విద్యావిధానం ఎలా పనిచేస్తుందంటే... పిల్లల్ని (అభ్యర్థుల్ని) తిరస్కరిస్తూ వాళ్లలోనుంచి కొంతమందిని ఎంపిక చేసుకుంటుంది. ఓ పరీక్షలో 97శాతం మంది అర్హత సాధించడం లేదు అంటే వీరంతా విఫలమైనవాళ్లు, పరిజ్ఞానం లేనివాళ్లని కాదు. పరీక్ష రోజున ఎవరు బాగా తమ జ్ఞానాన్ని ఉపయోగించగలుగుతారో వారే ఆరోజు విజేత. ఇది విద్యార్థులంతా అర్థం చేసుకోవాలి.
ఇంకా ఎన్నో అవకాశాలున్నాయి. మీ కెరియర్ ఇప్పుడే మొదలైంది. ఇంజనీరింగే మీ లక్ష్యమైతే... ఇంకా చాలా అవకాశాలున్నాయి. కానీ ఏదోలా ఇంజనీరింగే చేయాలనుకోవడం సరికాదు. మంచి విద్యాసంస్థలో అవకాశం వస్తే తప్పకుండా చేరండి. డిగ్రీ పూర్తి చేయండి. మన దేశంలో కాలేజీల్లో దాదాపు 35లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. కానీ 20 లక్షలకు మించి విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరడం లేదు. అంటే దాదాపు 15 లక్షల సీట్లు మిగిలిపోతున్నాయి. కాబట్టి మీరు ఎంపిక చేసుకున్న కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తే అది మీ భవిష్యత్తుకు ఎంతవరకూ సహకరిస్తుందనేది కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి.
మీరు అనుకున్న కోర్సులో సీటు దొరక్కపోతే చింతించాల్సిన అవసరం లేదు. ఆ కోర్సుకు అనుబంధంగా ఎన్నో కోర్సులు నేడు అందుబాటులో ఉన్నాయి. వీటిపై చాలామందికి అవగాహన తక్కువ, కానీ ఈ కోర్సులు చేసిన వారికి రానున్న రోజుల్లో ఎంతో డిమాండ్ ఉండబోతోంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

ఫొటో సోర్స్, Getty Images
ఉదాహరణకు మీరు ఎంబీబీఎస్‌లో చేరాలనుకున్నారు, కానీ మీకు సీటు రాలేదు. అంతమాత్రాన మీ ఆశలన్నీ నీరుగారిపోయాయి అనుకోవాల్సిన అవసరం లేదు. వైద్య విద్యకు అనుబంధంగా దాదాపు 20 కోర్సులున్నాయి. వాటిపై దృష్టిపెట్టండి. అగ్రికల్చరల్ సైన్స్, మైక్రో బయాలజీ, డెంటల్ సైన్సెస్, నర్సింగ్, బయో కెమిస్ట్రీ, ఆప్టిమెట్రీ, క్లినికల్ టెక్నాలజీ, మెడికల్ లాబ్ టెక్నాలజీ వంటి భవిష్యత్ కోర్సులపై దృష్టి పెట్టండి. ఆ రంగాల్లో మీ కెరియర్‌కు బాటలు పరచుకోండి.
అలాగే ఇంజనీరింగ్‌లో మీకు మంచి కాలేజీలో అవకాశం రాలేదనుకోండి. అది మీ మంచికే అనుకోండి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, యానిమేషన్, డేటా అనాలిసిస్, ఫ్యాషన్ టెక్నాలజీ, పాలిమర్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, గేమ్ డిజైన్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్... ఇలా ఎన్నో కోర్సులున్నాయి. వీటిని ఓసారి పరిశీలించండి.

అలాగే ఆడియాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, బయోకెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటిక్స్, సోనోగ్రఫీ, ఫుడ్ టెక్నాలజీ... ఇలా దాదాపు 100 కోర్సులు ఎంపీసీ, బైపీసీ చదివిన విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్ చేయలేకపోతున్నామని బాధపడకుండా వీటిలో చేరడంపై ఆలోచించవచ్చు. ఇవి బీటెక్ లేదా బీఈతో సమానం కాకపోయినా కూడా డిగ్రీతో సమానమే అవుతాయి. ఈ రంగాల్లో నిపుణులకు కూడా ఎంతో డిమాండ్ ఉంది.

అలాగే కామర్స్ విద్యార్థులు కూడా కొన్ని సర్టిఫికేషన్లు చేయవచ్చు. వారికి కూడా యాక్చూరల్ సైన్సెస్, బీబీఏ, ఫైనాన్షియల్ ప్లానింగ్, చార్టర్డ్ అకౌంటెంట్, హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ టూరిజం, అర్బన్ ప్లానింగ్... ఇలా ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
వీటన్నింటికీ ఎన్నో మంచి విద్యాసంస్థలున్నాయి. వీటిలో సీట్లు కూడా సులభంగా దొరుకుతాయి.
పోటీపరీక్షల్లో విజయం సాధించిన 3 లేదా 4 శాతం మంది గొప్పవారు కాదు, 96 లేదా 97 శాతం మంది ఫెయిల్ అయ్యారని కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ 97 శాతం మందిలో కొందరు పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చేమో, ఆ 3 శాతం మంది ఐఐటీలు, ఐఐఎంలు వీరి కంపెనీల్లోనే పనిచేయవచ్చేమో!
కాబట్టి భవిష్యత్తును బంగారుబాటగా మలుచుకోవడంపై దృష్టి సారించండి.
ఆల్ ది బెస్ట్.
ఇవి కూడా చదవండి:
- #గమ్యం: డీఆర్డీవోలో సైంటిస్టు ఉద్యోగం పొందడం ఎలా?
- #గమ్యం: బార్క్‌లో సైంటిస్టు అయితే మీ భవిత బంగారమే
- #గమ్యం: ఇస్రోలో సైంటిస్ట్ కావాలంటే ఇదే మార్గం
- #గమ్యం: బ్యాంకింగ్ రంగ ఉద్యోగాలకు కంప్లీట్ గైడ్
- #గమ్యం: క్రియేటివిటీ ఉంటే అవకాశాలకు హద్దే లేదు!
- దివ్య సూర్యదేవర: ఒకప్పుడు డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డారు.. నేడు రూ.లక్షల కోట్ల కంపెనీని చక్కబెడుతున్నారు
- రాషిద్ ఖాన్: పాకిస్తాన్లో క్రికెట్ నేర్చుకున్నా.. భారతీయుల ద్వారా ప్రేమించటం నేర్చుకున్నా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









