#గమ్యం: క్రియేటివిటీ ఉంటే డిజైనింగ్ రంగంలో అవకాశాలకు ఆకాశమే హద్దు
- రచయిత, అనిల్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం. కొన్ని వారాలుగా ఇంజనీరింగ్, మెడికల్ సైన్సెస్‌కు సంబంధించిన రంగాల్లో విద్య, ఉపాధి అవకాశాల గురించి తెలుసుకున్నాం.
ఈ వారం నుంచి ఇంటర్ లేదా ఆ పైన సైన్స్, మ్యాథ్స్ చదవకపోయినా మంచి ఉద్యోగావకాశాల్ని కల్పించే రంగాలు ఏమున్నాయో తెలుసుకుందాం. దీనిలో భాగంగా ఈ వారం ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ డిజైనింగ్ రంగం గురించి వివరిస్తున్నారు... Careers360.com ఛైర్మన్ మహేశ్వర్ పేరి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ చేయండి.
ప్రస్తుతం చదువు అంటే ఇంజనీరింగ్, ఉద్యోగం అంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అన్నట్లుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణం. కానీ కొంత మందికి సైన్స్, మ్యాథ్స్‌పై ఆసక్తి ఉండదు. వారికి కూడా ఎన్నో మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్నాయి. అలాంటి రంగాల్లో ఒకటి ఫ్యాషన్ అండ్ డిజైనింగ్.

ఫొటో సోర్స్, NIFT
అవగాహన లేమి
చాలామందికి డిజైనింగ్ అంటే చాలా తప్పుడు అభిప్రాయం ఉంటుంది. కానీ ఇది ఎంత కీలకమైన రంగం అంటే... నిత్యజీవితంలో మనం ఉపయోగించే ప్రతి వస్తువు వెనక ఒక డిజైనర్ ఉంటారు. ప్రెషర్ కుక్కర్ నుంచి ఉపగ్రహాల వరకూ, మనం వేసుకునే బట్టలు, షూ, ఉపయోగించే పెన్నూ, పుస్తకం, బ్యాగులూ... ఇలా ఒకటేమిటి అన్నింట్లోనూ డిజైనింగ్ ఉంటుంది. వాటికోసం డిజైనర్లు ఉంటారు. వారు నిరంతరం ప్రొడక్ట్‌లో కొత్తదనం చూపించడానికి తపిస్తూనే ఉంటారు.
అందువల్ల ఈ రంగంలో ఉద్యోగావకాశాలకు ఎప్పటికీ లోటు ఉండదు. దీనిపై అవగాహన లేక ఎక్కువమంది ఈ రంగంవైపు మొగ్గు చూపరు. కానీ సృజనాత్మకత ఉన్నవారికి ఇది చాలా మంచి రంగం.
రిటైల్ రివల్యూషన్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ రంగానికి ప్రాధాన్యం చాలా పెరగబోతోంది. షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్, ఈ-కామర్స్ విస్తరిస్తోంది. ప్రతి కంపెనీ తమ ఉత్పత్తుల్లో కొత్తదనాన్ని కోరుకుంటోంది. అలా చేస్తేనే వినియోగదారుణ్ని ఆకట్టుకోగలమనేది ప్రతి సంస్థ బలంగా నమ్ముతోంది. అందుకే నేడు మార్కెట్లో వివిధ రకాల ఉత్పత్తులు, రకరకాల డిజైన్లు.

ఫొటో సోర్స్, NID
ప్రముఖ విద్యాసంస్థలు
భారత్‌లో 20, 25 సంవత్సరాల క్రితం ఫ్యాషన్ టెక్నాలజీపై ఎలాంటి విద్యాసంస్థలూ లేవు. కానీ మాల్స్ సంస్కృతి ప్రారంభమైన తర్వాత ఫ్యాషన్ అండ్ డిజైనింగ్‌పై కోర్సులను అందించడానికి ఎన్నో మంచి విద్యాసంస్థలున్నాయి.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ క్యాంపస్‌లు భారత్‌లో మూడు ఉన్నాయి. అవి... అహ్మదాబాద్, కురుక్షేత్ర, విజయవాడల్లో ఉన్నాయి. ఈ సంస్థ బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీలు అందిస్తోంది. దీనిలో ప్రవేశానికి ఎన్ఐడీడీఏటీ అనే ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. సాధారణంగా సుమారు 5వేల మంది ఈ పరీక్ష రాస్తుంటారు. కానీ ఈ మూడు బ్రాంచిలలో ఎక్కడ ప్రవేశం లభించినా చాలా మంచి అవకాశాన్ని పొందినట్లే. ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో కూడా ఓ క్యాంపస్ ఉంది కాబట్టి తెలుగు విద్యార్థులు దీనికి ప్రయత్నించవచ్చు.

ఫొటో సోర్స్, NIFT
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్‌టీ)
మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ అనగానే ఉత్తమ సంస్థ ఐఐఎం, ఇంజనీరింగ్‌కు ఐఐటీ అని ఎలా చెప్తామో, ఫ్యాషన్ అనగానే నిఫ్ట్‌ను చెప్పవచ్చు. దీనిలో ప్రవేశానికి కూడా ఓ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం దాదాపు 25వేలమంది ఈ పరీక్ష రాస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 16 క్యాంపస్‌లలో మొత్తం 2370 సీట్లుంటాయి. ఈ రెండు సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నెలకొల్పినవి. వీటికి సంబంధించిన వ్యవహారాలన్నీ భారత ప్రభుత్వంలో సంబంధిత మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది.

ఫొటో సోర్స్, FDDI
ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌డీడీఐ)
దిల్లీతో పాటు దేశవ్యాప్తంగా 12 క్యాంపస్‌లు ఉన్నాయి. లెదర్ టెక్నాలజీపై ఈ సంస్థ కోర్సులను అందిస్తోంది. ప్రధానంగా ఫుట్‌వేర్ ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ శిక్షణ లభిస్తుంది. ఈ సంస్థకు ఈ మధ్యే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనే ఓ ప్రత్యేక హోదా కూడా లభించింది.
ఐఐటీ-బాంబే, గువాహటి, హైదరాబాద్, కాన్పూర్, దిల్లీ వీటన్నింట్లో కూడా డిజైన్ కోర్సులున్నాయి. కానీ ఈ రంగానికి సంబంధించి బాంబే ఐఐటీని ఉత్తమ సంస్థగా చెప్తారు. ఇక్కడ 105 సీట్లున్నాయి. దీనిలో ప్రవేశానికి యూసీడ్ అనే పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, NITW
వరంగల్‌లో నిట్‌లో డిజైనింగ్ కోర్సులు
వరంగల్‌లోని ఎన్ఐటీ కూడా డిజైనింగ్‌పై కోర్సులు అందిస్తోంది.
ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునేవారికి అహ్మదాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సీఈపీటీ) చాలా మంచి విద్యా సంస్థ.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని ఓ స్వయంప్రతిపత్తి (అటానమస్) విద్యాసంస్థ కూడా డిజైన్ అండ్ ఫ్యాషన్ కోర్సులందిస్తోంది.
సాధారణంగా అన్ని యూనివర్సిటీల్లోనూ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్‌పై కోర్సులు ఉన్నాయి. పర్ల్ అకాడమీ, సృష్టి ఇన్‌స్టిట్యూట్ వంటి ఎన్నో ప్రైవేట్ సంస్థలు కూడా దీనిపై శిక్షణనందిస్తున్నాయి.
ఫ్యాషన్ అండ్ డిజైనింగ్‌పై కోర్సు చేస్తే... మంచి సంస్థలో ఉద్యోగం దొరకడానికి అవకాశాలు ఎక్కువ అనేది సుస్పష్టం.
మీకు ఉద్యోగం చేయడానికి ఆసక్తి లేకపోయినా... ఇంట్లో కూర్చొని కూడా డిజైన్లను రూపొందించి కంపెనీలకు అందించవచ్చు. ఎంట్రప్రన్యూర్‌గా మారవచ్చు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











