తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల్లో 60 మంది విద్యార్థుల ఆత్మహత్య
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ తెలుగు
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత రెండు నెలల్లో 60మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని బాలల హక్కుల సంస్థ నివేదిక చెబుతోంది. పోటీ తీవ్రంగా ఉండే ఐఐటీలు, మెడికల్ కాలేజీలలో సీట్ల కోసం వివిధ కోచింగ్ సెంటర్లలో చదువుతున్న విద్యార్థులే ఎక్కువగా ఈ ఘోరానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
17 ఏళ్ల సచిన్ ఓ జూనియర్ కాలేజీలో చదువుతున్నాడు. సెప్టెంబరులో ఆత్మహత్యకు ప్రయత్నించి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు ఇంట్లోనే ఉంటున్నాడు. అతని గొంతు ఇంకా భయంతో వణుకుతోంది. తాను చదివిన జూనియర్ కాలేజీలో జీవితం నరక ప్రాయంగా ఉండేదంటాడు సచిన్.
''పరీక్షల్లో ఫెయిలైతే మమ్మల్ని తీవ్రంగా అవమానించేవారు. బాగా చదివేవాళ్ల పట్ల పక్షపాతంగా వ్యవహరించేవారు'' అని చెబుతాడు సచిన్.
ఒక క్లాసుకూ మరో క్లాసుకూ మధ్య కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు స్నేహితులతో కాస్త నవ్వుతూ మాట్లాడటం కూడా ఇక్కడ క్రమశిక్షణ తప్పడమే.
అలా మాట్లాడినందుకే సచిన్‌ని ముగ్గురు ఉపాధ్యాయులు వేరే గదిలోకి తీసుకెళ్లారు. క్రమశిక్షణ లేదంటూ అతడిని ముగ్గురూ కలిసి కొట్టారు.
కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని బెదిరించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోయిన సచిన్ తరువాత ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
''పరీక్షల్లో మార్కుల కోసం విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పెడతారు. తగినంత విరామం లేకుండా రోజంతా మమ్మల్ని క్లాసుల్లో ఉంచుతారు. పదే పదే అడిగితే ఎప్పుడో ఓసారి ఆటలకు సమయమిస్తారు'' అంటాడు ఆ కుర్రాడు.
బాలల హక్కుల సంఘం లెక్కల ప్రకారం గత రెండు నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 మంది విద్యార్థులు చనిపోయారు.
"కాలేజీల చదువుల ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య లేఖల్లో రాశారు" అని చెప్పారు బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత రావు.
ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల కోసం జరిగే పరీక్షల్లో పోటీ చాలా ఎక్కువ. 2017వ సంత్సరంలో రెండు రాష్ట్రాల నుంచి మెడికల్ పరీక్షలు రాసిన లక్షా 50 వేల మందిలో 3 వేల మందికే సీట్లు వచ్చాయి. ఈ జాతీయ స్థాయి పరీక్ష కోసం దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు కోచింగ్ కేంద్రాల్లో చేరారు.
ఉదయం 9 నుంచి 4 వరకూ కాలేజీల్ని నిర్వహించాల్సి ఉండగా, ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకూ క్లాసులు జరుగుతున్నాయి. కాలేజీల్లో కనీస పరిశుభ్రత, సరిపడా టాయిలెట్లు కూడా ఉండవు. ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించినందుకు తెలంగాణ ప్రభుత్వం 146 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు నోటీసులిచ్చింది.
కాలేజీలలో నెలకొన్న పరిస్థితులపై ఇటీవల తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. 'విద్యార్థులకు తగిన సమయం దొరక్క ఒత్తిడిలో ఉన్నారని గుర్తించాం' అని ఆయన వ్యాఖ్యానించారు.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి చక్రపాణి నాయకత్వంలో విద్యార్థుల ఆత్మహత్యలపై అధ్యయనం కోసం ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ 2017 మేలో నివేదిక ఇచ్చింది. కోచింగ్ సెంటర్లలో పరీక్షల సంఖ్య తగ్గించాలనీ, రోజూ యోగా క్లాసులు లేదా ఆటలకు సమయం ఇవ్వాలనీ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇంకా అమలు చేయాల్సి ఉంది. కానీ ఈ విచారణ కమిటీలు వేయడం కొత్తేమీ కాదు. 2007లో ఏపీ ప్రభుత్వం నీరదా రెడ్డి కమిటీని నియమించింది
'విద్యార్థులను ఎవరో కిడ్నాప్ చేసి కాన్‌సెంట్రేషన్ క్యాంపుల్లో పెట్టినట్లుగా ఉంది' అని ఆ కమిటీ వ్యాఖ్యానించింది.
విద్యార్థుల ఉద్యమం
ప్రైవేటు కాలేజీలను నియంత్రించాలంటూ విద్యార్థి సంఘాలు చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నాయి. కాలేజీ యాజమాన్యాలు మాత్రం విద్యార్థుల అవసరాలు తీరుస్తున్నామనే చెబుతున్నాయి. కాలేజీలు విద్యార్థులను ఒత్తిడి చేయవని శ్రీ చైతన్య విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డీన్ వి కుమార్ అంటున్నారు. పిల్లలు, తల్లిదండ్రులే చాలా పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటున్నారని ఆయన చెప్పారు.
"విద్యార్థుల ఆశయాలకు, వారు పెట్టే శ్రమకు పొంతన కుదరకపోవడం వలన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని" పేర్కొన్నారు. ''మేం చర్చను స్వాగతిస్తాం. కానీ, కాలేజీలు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయంటే ఒప్పుకోం" అని ఆయన అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
డి వరుణ్ తేజ చౌదరికి జేఈఈలో 9వ ర్యాంకు వచ్చింది. ఐఐటి మద్రాస్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుతున్నందుకు సంతోషంగా ఉందంటూనే, దీన్ని సాధించడం కోసం చాలా ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందని చెబుతున్నారు వరుణ్.
కోచింగ్ కేంద్రాల బ్రాంచీలు తెలంగాణ మొత్తం ఉన్నప్పటికీ, కేవలం కొన్ని కాలేజీల విద్యార్థులు మాత్రమే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారని అంటున్నారు వరుణ్. మిగిలిన చోట్లతో పోలిస్తే ఎక్కువ సక్సెస్ రేటున్న కాలేజీల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉండటమే దానికి కారణమట.
"అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ సిలబస్‌ను చదవడం తెలివైన పిల్లలకే చాలా కష్టంగా ఉంటే, మరి ఓ మోస్తరుగా చదివే విద్యార్థుల పరిస్థితి ఏమిటి?" అని వరుణ్ ప్రశ్నిస్తారు.
తల్లితండ్రుల ఒత్తిడి
నేటి చదువులు విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంచడం పోయి ర్యాంకుల సాధనే లక్ష్యంగా సాగుతున్నాయని, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అంటున్నారు. విద్య వ్యాపారంగా, లాభాపేక్షే పరమావధిగా మారినపుడు ఇలాంటి సమస్యలు రావడం సహజమని, పోటీ అందులో ఒకటని ఆయన అన్నారు.
"తక్షణ అవసరం సహకారం కానీ, పోటీ కాదు. చర్చలు విజ్ఞాన సముపార్జనకు తోడ్పడతాయి. కానీ నేటి విద్యా విధానం ప్రచారంగా మారిపోయింది" అంటారాయన.
రోజుకు కనీసం ఆరుగురు విద్యార్థులకైనా కౌన్సిలింగ్ చేస్తానని చెబుతున్నారు హైదరాబాద్‌కి చెందిన మానసికవేత్త నిరంజనా రెడ్డి.
"విద్యార్థులు తమకు తాము చాలా పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటున్నారు. తల్లిదండ్రులేమో పిల్లలకు రెండే లక్ష్యాలున్నాయి అనుకుంటున్నారు" అంటారామె.

తక్షణం అన్ని కాలేజీల్లో కౌన్సిలర్లను నియమించాలని తెలంగాణ ఇంటర్ బోర్డు ఆదేశించింది. తాము తీర్చుకోలేని కలలు తీర్చే సాధనాలుగా పిల్లలను మార్చవద్దని కూడా బోర్డు విజ్ఞప్తి చేస్తోంది.
కానీ చాలా మంది తల్లిదండ్రులు మాత్రం ఒక పేరున్న కాలేజీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ వస్తే చాలన్న ఉద్దేశంతో ఉన్నారు. పిల్లలను శక్తికి మించి ఇబ్బంది పెట్టడం లేదంటూనే, వారు చాలా బాగా చదవాలని తల్లిదండ్రులు ఆశ పడుతున్నారు.
''కష్టపడకుండా ఏదీ రాదు. మా అబ్బాయి సాయంత్రాలు ఆలస్యంగా కాలేజీలో ఉంటే, అతనికి వచ్చే డౌట్లను తీర్చుకోవడానికి, ఇంకా బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది'' అంటున్నారు ప్రైవేట్ కాలేజీ గేటు బయట కొడుకు కోసం ఎదురు చూస్తున్న గౌరీ శంకర్ అనే వ్యక్తి. ఈ వయసులో చదువు ప్రధానం కాకపోతే ఇక జీవితంలో ఎలా గెలుస్తారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఒత్తిడి తట్టుకోలేక గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన సచిన్ ఇప్పటికీ మంచంపైనే ఉన్నాడు. ఇంజినీర్ అవ్వాలన్న తన కలను ఎప్పటికైనా తీర్చుకోవాలని ఆశపడుతున్నాడు. సిలబస్ రివైజ్ చేసి పరీక్షలకు సిద్ధమవ్వడంపైనే ఫోకస్ పెట్టానంటున్నాడు ఆ అబ్బాయి.
(సచిన్ పేరు మార్చాం)
మా ఇతర కథనాలు:
- ఎడిటర్స్ కామెంట్: తెలుగు సభలు తేల్చిందేమిటి?
- గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
- ముద్రగడతో బీబీసీ ఇంటర్వ్యూ: బాబు గారూ ఆనాడు కాపు ఆందోళనకి మద్దతిచ్చారు..మరి డబ్బెంత ఇచ్చారు?
- హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎందుకు వాయిదా పడింది?
- నిద్ర గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు
- చైనాలో ఈ ఐదేళ్లలో వచ్చిన మార్పులివే!
- ‘అమెరికాలో రెట్టింపైన భారతీయ విద్యార్థులు’
- కాలేజీ పాఠమట.. కట్నంతో లాభమట!
- ప్రేమ - శృంగారం - వైకల్యం
- మీ ద్వేషమే మీకు రక్ష!!
- ఇది కొత్త ప్రేమ ఫార్ములా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









