అవునా.. 1975కు ముందువారితో పోలిస్తే మన తెలివి తక్కువేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బీబీసీ ముండో
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
కొన్ని దశాబ్దాల కిందటితో పోల్చితే మన మేధస్సు తగ్గిపోతోందా?
డెన్మార్క్, బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాల్లో నిర్వహించిన అధ్యయనాలు అదే విషయాన్ని చెబుతున్నాయి.
కిందటి తరాలతో పోల్చితే ప్రస్తుత ప్రజల్లో ఐక్యూ స్థాయి తక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
అప్పుడూ, ఇప్పుడు ప్రజల్లో ఐక్యూ స్కోర్‌లను విశ్లేషించడం ద్వారా ఈ విషయం బయటపడింది.
నార్వేలోని రాగ్నర్ ఫ్రిచ్ ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ జరిపిన అధ్యయనంలోనూ అలాంటి ఫలితాలే కనిపించాయి.
1975కి ముందు జన్మించిన వారితో పోల్చితే, తర్వాత జన్మించిన నార్వే ప్రజల్లో ఐక్యూ స్థాయి తగ్గిపోయిందని ఈ అధ్యయనంలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఇలా మేధస్సును కొలిచే పరీక్షల ఫలితాల్లో అద్భుతమైన పెరుగుదల నమోదైంది.
కానీ, గడచిన 4 దశాబ్దాలలో అనుకోని మార్పులేవో చోటుచేసుకున్నాయని, ఆ ప్రభావం ప్రజల మేధస్సుపై ప్రభావం చూపిందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
ఈ పరిణామాల వెనుక పర్యావరణ, జన్యువులతో సంబంధంలేని అంశాలు ఉన్నాయని తెలిపారు.
విద్యావ్యవస్థలో, జీవన విధానంలో మార్పులొచ్చాయి. చేసే ప్రతి పనులూ మారాయి. పుస్తకాలు చదవడం తగ్గిపోయింది, ఇంటర్నెట్‌లో గడపడం ఎక్కువైపోయింది. ఈ మార్పులన్నీ మనిషి మేధస్సుపై ప్రభావం చూపుతున్నాయన్నది పరిశోధకుల అభిప్రాయం.
మరి నిజంగానే నూతన సాంకేతికతలు, సౌకర్యాలు మన మెదళ్ల ఆలోచనా శక్తిని కట్టడి చేస్తున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
"పై అధ్యయనాలు ప్రధానంగా ఐక్యూ టెస్టుల ఫలితాల ఆధారంగా జరిగాయి. ఐక్యూ పరీక్ష అంటే, అందులో అంకగణితం, పదజాలం, కంటికి కనిపించే తార్కిక ప్రశ్నలు ఉంటాయి. ఆ టెస్టుల ఫలితాల్లో తగ్గుదలను పరిశోధకులు గుర్తించారు. అది ప్రజల్లో మేధోశక్తి క్షీణిస్తోందన్న విషయాన్ని సూచించవచ్చు" అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన న్యూరోసైకాలజిస్టు ప్రొఫెసర్. క్యాథెరిన్ పోసిన్ వివరించారు.
అయితే, దాన్ని పూర్తిగా మేధస్సులో తగ్గుదలగానే చెప్పలేమని పోసిన్ అన్నారు. ఎందుకంటే, ప్రస్తుతం మేధస్సును చూపే పద్ధతులు మారిపోయాయని ఆయన తెలిపారు.
"సమాజంలో క్రమంగా నేర్చుకునే విధానంలో, తమ మేధస్సును వినియోగించి చేసే పనుల్లోనూ మార్పులు వచ్చాయి. కానీ, ఐక్యూ టెస్టుల్లో మేధస్సును కొలిచేందుకు ఈ మార్పులను పరిగణనలోకి తీసుకోవట్లేదు" అని పోసిన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు.. ఈ అధ్యయనాలు ఎక్కువ అభివృద్ధి సాధించిన దేశాల్లోనే జరిగాయి. అక్కడ సాంకేతికత కూడా విస్తృతంగా ఉంది. ఆ దేశాల్లోనే ప్రజల మేధస్సు తగ్గుతోందని తేలింది.
సాంకేతికంగా, ఆవిష్కరణల పరంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, టెక్నాలజీ వాడకం తక్కువగా ఉన్న దేశాల్లోనూ ఇలాంటి అధ్యయనాలు జరిగితే అప్పుడు ఓ స్పష్టమైన అవగాహనకు రావచ్చని పోసిన్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








