సింగపూర్: అత్యధిక సమయం ప్రయాణించే నాన్‌స్టాప్ విమానం ఇదే

ఫొటో సోర్స్, Airbus
సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థ అక్టోబరు నుంచి ప్రపంచంలోకెల్లా అత్యధిక సమయం నాన్‌స్టాప్‌గా ప్రయాణించే విమానాన్ని తిప్పనుంది. ఈ ఎయిర్‌బస్ విమానం సింగపూర్ నుంచి అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఉన్న నెవార్క్ వరకు మధ్యలో ఎక్కడా ఆగకుండా దాదాపు 19 గంటలపాటు ప్రయాణిస్తుంది.
ప్రస్తుతం అత్యధికంగా 17.5 గంటలు నాన్-స్టాప్‌గా ప్రయాణించే విమానం పశ్చిమాసియా దేశమైన ఖతార్‌లో ఉంది. ఇది ఖతార్‌లోని దోహా, న్యూజిలాండ్‌లోని ఆక్లండ్ మధ్య తిరుగుతుంది.
ఖతార్ విమానం తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్వాంటస్‌కు చెందిన విమానం ఉంది. ఇది ఆస్ట్రేలియాలోని పెర్త్, బ్రిటన్ రాజధాని లండన్ మధ్య తిరుగుతుంది. మార్చిలో సేవలు ప్రారంభించిన ఈ విమానం మధ్యలో ఎక్కడా ఆగకుండా 17 గంటలపాటు ప్రయాణిస్తుంది.

ఫొటో సోర్స్, EPA
ఇంతకుముందు అత్యధిక సమయం ప్రయాణించే నాన్‌స్టాప్ విమానం సింగపూర్ పేరిటే ఉండేది. ఎయిర్‌బస్ ఏ340-500 విమానం 2004 నుంచి 2013 వరకు సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయం, నెవార్క్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య రాకపోకలు సాగించేది.
చమురు ధరల్లో పెరుగుదల, ఇతర కారణాల వల్ల వ్యయభారం ఎక్కువై అప్పట్లో ఈ సర్వీసును సింగపూర్ ఎయిర్‌లైన్స్ రద్దు చేసింది. ఈ సర్వీసుకు వాడిన విమానాలను తయారీదారైన ఎయిర్‌బస్‌కు తిరిగి ఇచ్చేసింది.
అత్యంత సుదూర ప్రయాణానికి అనువుగా ఎయిర్‌బస్ ఏ350-900 విమానానికి మార్పులు చేసి కొత్త విమానాన్ని అభివృద్ధి చేసింది. ఈ 'ఏ350-900 యూఎల్‌ఆర్ (అల్ట్రా లాంగ్ రేంజ్)' విమానం వాణిజ్యపరంగా తమకు అనుకూలంగా ఉంటుందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ భావిస్తోంది. సింగపూర్-నెవార్క్ ప్రయాణానికి అనువైన రీతిలో ఈ విమానాన్ని ఎయిర్‌బస్ రూపొందించింది.
ఎయిర్‌బస్ దీర్ఘశ్రేణి మోడళ్లలో ఏ350-900 యూఎల్‌ఆర్ ఒకటి. ఈ విమానాల గురించి సింగపూర్‌లో ఎయిర్‌బస్ అధికార ప్రతినిధి సీన్ లీ మాట్లాడుతూ-ప్రపంచంలోకెల్లా అత్యధిక దూరం ప్రయాణించగల విమానాలు ఇవేనన్నారు.
''మధ్యలో ఎక్కడా ఆగకుండా 9,700 నాటికల్ మైళ్ల దూరం వరకు ఈ విమానాలు ప్రయాణించగలవు. ప్రయాణ సమయం గరిష్ఠంగా 20 గంటలపైనే ఉంటుంది. ప్రస్తుత ఇంధన వ్యవస్థను 24 వేల లీటర్ల ఇంధనం అదనంగా పట్టేలా మార్చడం వల్ల ఇది సాధ్యమవుతోంది'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Airbus
సీట్లెన్ని?
ఏ350-900 యూఎల్ఆర్‌లో 67 బిజినెస్ క్లాస్, 94 ప్రీమియం ఎకానమీ సీట్లు కలుపుకొని 161 సీట్లు ఉంటాయి. ఎకానమీ సీట్లు ఉండవు.
ఎకానమీ సీట్లు కూడా ఏర్పాటు చేస్తే మరింత మంది ప్రయాణికులు ఎక్కుతారని, అప్పుడు విమాన భారం అధికమవుతుందని ఆన్‌లైన్ ప్రచురణ సంస్థ 'ఫ్లైట్‌గోబల్'కు చెందిన ఎలిస్ టేలర్ వ్యాఖ్యానించారు.
ఈ విమానం ప్రీమియం సర్వీసు అని, టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయని సింగపూర్ ఎయిర్‌లైన్స్ స్వయంగా చెబుతోందని ఆయన తెలిపారు.
అమెరికా, సింగపూర్ మధ్య వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నందున మార్కెట్ పరిధి పెరుగుతోందని, సింగపూర్-నెవార్క్ మధ్య సర్వీసును లాభదాయకంగా నడిపేందుకు అవసరమైనంత గిరాకీ ఉందని టేలర్ తెలిపారు.
మార్పులు ఏమిటి?
ఏ350-900తో పోలిస్తే ఏ350-900 యూఎల్ఆర్ విమానాల్లో ప్రయాణికులకు 'జెట్‌ల్యాగ్'ను తగ్గించేలా లైటింగ్‌ను మార్చారు. సీలింగ్ కొంచెం ఎక్కువ ఎత్తులో ఉంది. కిటికీలు పెద్దగా ఉన్నాయి.
ఇంధన ట్యాంకు సామర్థ్యాన్ని పెంచడమే అతి పెద్ద మార్పు అని విమానయాన సంస్థలకు రేటింగ్ ఇచ్చే వెబ్‌సైట్ ఎయిర్‌లైన్స్‌రేటింగ్.కామ్ ఎడిటర్-ఇన్-చీఫ్ జెఫ్రీ థామస్ చెప్పారు.
సింగపూర్-నెవార్క్ నాన్-స్టాప్ విమానం టికెట్ ధరలు చాలా ఎక్కువ. ప్రీమియం టికెట్ ప్రారంభ ధర దాదాపు 1,649 డాలర్లు. ప్రారంభ స్థాయి బిజినెస్ టికెట్ ధర దీనికి రెట్టింపు కన్నా ఎక్కువ.
క్వాంటస్ సన్‌రైజ్: కలిసి పనిచేస్తున్న ఎయిర్‌బస్, బోయింగ్
'క్వాంటస్ సన్‌రైజ్' అనే ప్రాజెక్టులో భాగంగా ఎయిర్‌బస్, బోయింగ్ అత్యధిక దూరానికి 300 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల విమానం తయారీ కోసం కృషి చేస్తున్నాయి. ఇది ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి లండన్‌కు, అమెరికాలోని న్యూయార్క్ నుంచి సిడ్నీకి ఏకబిగిన ప్రయాణం చేస్తుంది.
నాన్‌స్టాప్‌గా 21 గంటల కన్నా ఎక్కువ సమయం ప్రయాణించే విమానాల అవసరం ఏర్పడదని జెఫ్రీ థామస్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, భూమి మీద ఒక ప్రాంతం నుంచి మరే ప్రాంతానికైనా గరిష్ఠంగా 21 గంటల్లో చేరుకోవచ్చని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








