ట్రంప్, కిమ్ భేటీ: అమెరికాతో ‘సరికొత్త సంబంధం’ కోరుకుంటున్న ఉత్తర కొరియా

ఫొటో సోర్స్, Reuters/Getty Images
అమెరికాతో ప్యాంగ్యాంగ్ ‘‘సరికొత్త సంబంధం’’ ఏర్పరచుకునే అవకాశం ఉందని ఉత్తర కొరియా అధికారిక మీడియా సూచించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ చారిత్రక చర్చలు జరుపడానికి ఒక రోజు ముందు ఈ వార్త వెలువడింది.
అమెరికాతో దశాబ్దాల శత్రుత్వం తర్వాత ఉత్తర కొరియా స్వరంలో మార్పును ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
‘‘శాశ్వత శాంతిని కొనసాగించే వ్యవస్థ’’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మంగళవారం జరిగే సదస్సులో తమ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చర్చిస్తారని ఉత్తర కొరియా తెలిపింది.
చారిత్రాత్మకమైన, ఎంతో ఆసక్తిరేకెత్తించిన ట్రంప్, కిమ్‌ల భేటీ జూన్ 12వ తేదీ మంగళవారం సింగపూర్‌లోని సెంటోజా ఐలాండ్ రిసార్ట్‌లో జరగబోతోంది. అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షులు భేటీ కావటం ఇదే తొలిసారి.
ఇరువురు నాయకులూ ఇప్పటికే సింగపూర్ చేరుకున్నారు. వీరిద్దరూ అత్యంత సమీపంలో.. వేర్వేరు హోటళ్లలో బస చేస్తున్నారు. సింగపూర్‌కు చెందిన ఐదు నక్షత్రాల సెయింట్ రెగిస్ హోటల్‌లో కిమ్ బస చేస్తుండగా.. దానికి అర మైలు దూరంలోని షాంగ్రి లా హోటల్‌లో ట్రంప్ దిగారు.
‘‘ప్రపంచమంతా చూస్తోంది’’ అని ఈ సందర్భంగా కిమ్ అన్నారు. ట్రంప్ మాత్రం ఈ సదస్సు పట్ల సానుకూలత ప్రకటించారు. సింగపూర్ ‘‘గాలిలో ఉత్సాహం’’ ఉందంటూ సోమవారం ఉదయం ట్రంప్ ట్వీట్ చేశారు.
అమెరికాతో సంబంధాలు ‘‘సాధారణ స్థాయికి’’ చేరే అవకాశాలున్నాయని ఉత్తర కొరియా దేశ అధికారిక వార్తాపత్రిక ఒక వ్యాసంలో పేర్కొంది.
ఉత్తర కొరియా తన అణ్వాయుధాలను విడిచిపెట్టాలని అమెరికా కోరుతోంది. అయితే, దీనికి బదులుగా ఉత్తర కొరియా ఏం కోరుతుందనేది స్పష్టత లేదు.


ఫొటో సోర్స్, Getty Images
అసాధారణ ఒప్పంద కళ?
జాన్ సోపెల్, బీబీసీ ఉత్తర అమెరికా ఎడిటర్
నేను ఎంతో సాహసించి ఈ మాట అంటున్నాను, సంప్రదాయ రాజకీయాలైతే.. మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో అక్కడికి తీసుకొచ్చేవి కాదు. ట్రంప్ ఒక ఖడ్గాన్ని పట్టుకుని సంప్రదాయ రాయబార వైఖరుల్ని తుత్తునియలు చేయటం వల్లనే మనం ఇక్కడ ఉన్నాం.
ఈ చర్చల కోసం తాను ఎక్కువగా సన్నద్ధం కాలేదని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ఆ అవసరం లేదు కూడా. అయినప్పటికీ, కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ చేపట్టడం అంటే.. దాన్ని ఎలా నిర్వచించాలి, తనిఖీలు ఎలా చేయాలి, ఎప్పట్లోపు ఇదంతా సాధ్యపడుతుంది, దానికి బదులుగా అమెరికా ఎంత ఆర్థిక సాయం చేస్తుంది, భద్రతా హామీలు ఇస్తుంది, ఇంకా ఆంక్షలు ఎంతమేరకు ఎత్తేస్తుంది, ఇంకా, ఇంకా, ఇంకా.. ఇదంతా ఆలోచిస్తే జుట్టు పీక్కునేంత సంక్లిష్టమైన అంశం.
సమావేశానికి హాజరైన అధికారులంతా ఏకాంత గదుల్లోని బల్లలపై మునివేళ్లు చేసే డప్పు శబ్దాలను ఒకసారి మనం ఊహించుకోవచ్చు. భేటీ అనంతరం.. మన కాలంలో శాంతి ఉంటుందా? లేక అంతా నీరుగారిపోయి విమానాశ్రయాలకు తిరుగు ప్రయాణం కట్టాలా? అన్నది తొలుత తెలిసేది వారికే.
ట్రంప్, కిమ్‌ల భేటీ బహుశా సుదీర్ఘమైన ప్రయాణానికి పడిన మొదటి అడుగు కావొచ్చు, కనీసం ఇదొక ప్రారంభం. సంప్రదాయ రాజకీయాలు మనల్ని ఈ మాత్రం దూరానికైనా తీసుకు రాగలిగేవా?
ఎవరితోనైనా కలసిపోగలనా? లేదా? అన్నది తేల్చుకోవడానికి తనకు పట్టే సమయం సాధారణంగా కేవలం ఐదు సెకండ్లేనని ట్రంప్ చెప్పారు. బహుశా వారిద్దరూ కలసిపోవాలని మంచి మనస్సుతో ప్రతిస్పందిద్దాం.


ఫొటో సోర్స్, Reuters
ఉత్తర కొరియా ఏమంది?
దేశ అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ ఈ భేటీపై ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరువురు నాయకులూ కొరియా ద్వీపకల్పం కోసం ఒక ‘‘శాశ్వత, దీర్ఘకాల శాంతిని కొనసాగించే వ్యవస్థ’’పైన, కొరియా ద్వీపకల్పంలో ‘అణు నిరాయుధీకరణ’పైన, ఇరు దేశాలకూ సంబంధించిన ఇతర అంశాలపైనా చర్చిస్తారని పేర్కొంది.
ఒక ‘మారిన శకం’ వచ్చిందని ఆ ప్రకటన తెలిపింది.
అధికారిక పత్రిక 'రొడోంగ్ సిన్‌మున్' ఎడిట్ పేజీలో ఒక వ్యాసాన్ని ప్రచురించింది. అమెరికాతో తన సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా ఉత్తర కొరియా పనిచేస్తుందని సూచించింది.
‘‘గతంలో మనతో విరోధిలా ఉన్న దేశమైనా, మన వైఖరి మాత్రం ఈ దేశం మన స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తే.. మనం చర్చల ద్వారా సాధారణ పరిస్థితులను కోరుకుంటాం’’ అని పేర్కొంది.
వాస్తవానికి ఉత్తర కొరియా అధికారిక మీడియాలో ఆ దేశ నాయకుడి కార్యకలాపాల సమాచారం ఎప్పటికప్పుడు ఇవ్వరు. ఈ సదస్సు గురించి ఇప్పటి వరకూ ప్రముఖంగా ప్రచురించలేదు.
కానీ, రొడోంగ్ ఎడిటోరియల్ మాత్రం ట్రంప్‌ను కలసి చర్చించేందుకు కిమ్ సింగపూర్ వెళ్లారని ఖరారు చేసింది. అలాగే ‘‘కొత్త శకంలో మారుతున్న డిమాండ్లకు అనుగుణంగా కొత్త సంబంధాన్ని ఏర్పరచుకుంటాం’’ అని పేర్కొంది.

మాటల యుద్ధం నుంచి.. శాంతి చర్చల వరకు
2016, 2017లో తన అణు, క్షిపణి పరీక్షలను కొనసాగిస్తూ, మాటల దాడికి దిగిన ఉత్తర కొరియా.. ఇప్పుడు ఇంత దూరం రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.
కానీ దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధమని జనవరిలో కిమ్ సూచించగానే, సయోధ్య ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తర్వాత నెలలోనే దక్షిణ కొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ సంబరాలలో రెండు దేశాలూ కలిసి ఒకే పతాకం కింద కవాతు చేశాయి.
ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-యిన్ మార్చి 27వ తేదీ సమావేశమయ్యారు. దీంతో అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తొలగిపోవడానికి మార్గం సుగమమైంది.
ఏప్రిల్‌లో.. తమతో చర్చలకు రావాలన్న ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించి సంచలనం సృష్టించారు.
అయితే.. అమెరికా, కొరియాల మధ్య మళ్లీ మాటల తూటాలు పేలటంతో ఈ భేటీ జరుగుతుందా అన్న సందేహాలు తలెత్తాయి.
మళ్లీ కిమ్, ట్రంప్ ఇరువురూ భేటీ జరుగుతుందని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
- ఉత్తర కొరియా క్యాలెండర్లలో కనిపించని కిమ్ పుట్టినరోజు
- దక్షిణ కొరియాలో తనిఖీలు చేస్తున్న కిమ్ జోంగ్ ‘మాజీ ప్రియురాలు’
- ఉత్తర కొరియాకు మిత్రదేశాలు ఎన్ని?
- ఉత్తర కొరియాలో ఎక్కువగా తినే స్నాక్స్ ఇవే!
- ప్రభుత్వ ఉద్యోగాలు: పోస్టులు వందల్లో.. దరఖాస్తులు లక్షల్లో
- హార్వర్డ్ గ్రాడ్యుయేట్ల గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యాంశాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









