ప్రపంచ రికార్డులు సృష్టించిన పీఎస్‌ఎల్వీ రాకెట్ వరుస వైఫల్యాలు.. స్పేస్ మార్కెట్‌లో భారత్ ఆశలను దెబ్బతీస్తాయా?

ఫొటో సోర్స్, ISRO
- రచయిత, శంకర నారాయణన్ సుడలై
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇస్రో వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) జనవరి 12న పీఎస్‌ఎల్‌వీ-సీ62 ద్వారా మొత్తం 16 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే ప్రయోగాన్ని నిర్వహించింది. వీటిలో ఈఓఎస్-ఎన్1 ఉపగ్రహం కూడా ఉంది.
కానీ, రాకెట్ పనితీరులో ఒక లోపం తలెత్తిందని ఇస్రో తెలిపింది. రాకెట్ వెళ్లాల్సిన మార్గం నుంచి పక్కకు తప్పుకుందని వెల్లడించిన ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహిస్తామని చెప్పారు.
కిందటేడాది మే నెలలో ఇస్రో ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ61 ప్రాజెక్టు కూడా విఫలమైంది. దీంతో పీఎస్‌ఎల్‌వీ రాకెట్లకు ఇది వరుసగా రెండో వైఫల్యమని నిపుణులు భావిస్తున్నారు.


ఫొటో సోర్స్, ISRO
పీఎస్ఎల్వీ ప్రపంచ రికార్డు
ఇస్రో ఇప్పటివరకు పీఎస్‌ఎల్‌వీ రాకెట్లతో 63 మిషన్లు పూర్తి చేసింది. చంద్రయాన్-1, మంగళ్‌యాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్), సూర్యుడిని పరిశోధించే ఆదిత్య ఎల్-1 వంటి కీలక మిషన్లలో ఇస్రో పీఎస్‌ఎల్‌వీ రాకెట్లనే ఉపయోగించింది. 2017లో ఒకే మిషన్‌లో 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి ప్రపంచ రికార్డు సృష్టించింది.
ఇస్రో ఎంతో విలువైనదిగా భావించే పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ఇప్పుడు వరుస వైఫల్యాలను ఎదుర్కొంది.
ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ61మిషన్ 2025 మే 18న విఫలమైంది. ఇస్రో చరిత్రలో దీన్ని అత్యంత అరుదైన వైఫల్యాల్లో ఒకటిగా పరిగణిస్తారు. దాదాపు 8 నెలల విరామం తర్వాత, ఇప్పుడు (జనవరి 12) పీఎస్‌ఎల్‌వీ రాకెట్ మరోసారి గమ్యాన్ని చేరుకోలేకపోయింది.
కానీ, ఈ సమస్య ఇక్కడితోనే ముగియదని మొహాలీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ టి.వి. వెంకటేశ్వరన్ అన్నారు.
కిందటేడాది మే నెలలో చేపట్టిన సీ61 ప్రయోగం ఎందుకు విఫలమైందో ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియరాలేదని ఆయన బీబీసీకి చెప్పారు.
'మామూలుగా ఏ రాకెట్ ప్రయోగం జరిగినా, అది విజయవంతమైనా లేదా విఫలమైనా దాని పనితీరుపై లోతైన విశ్లేషణ జరుగుతుంది. గతంలో ఏదైనా ప్రాజెక్టు విఫలమైతే దానిపై ఇచ్చే 'ఫెయిల్యూర్ అసెస్‌మెంట్ రిపోర్ట్' చాలా పారదర్శకంగా ఉండేది.
‘‘పీఎస్‌ఎల్‌వీ-సీ61 ప్రాజెక్టుకు సంబంధించిన ఫెయిల్యూర్ అసెస్‌మెంట్ రిపోర్టును ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపారు. కానీ, ఇప్పటికీ దాన్ని బహిరంగంగా విడుదల చేయలేదు. ఆ ప్రయోగం ఎందుకు విఫలమైందో అసలు కారణాలు ఇప్పటికీ ప్రజలకు తెలియవు’’ అని వెంకటేశ్వరన్ వివరించారు.

ఫొటో సోర్స్, ISRO
ప్రపంచ మార్కెట్‌పై ఇస్రో గురి
భారత అంతరిక్ష రంగ నియంత్రణ సంస్థ ఇన్-స్పేస్ రాబోయే పదేళ్ల కోసం ఒక భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
'ప్రపంచ అంతరిక్ష మార్కెట్‌లో 2033 నాటికి భారత్ వాటాను 8 శాతానికి పెంచడం. తద్వారా భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను 44 బిలియన్ డాలర్లకు చేర్చడమే మా లక్ష్యం' అని తన భవిష్యత్ ప్రణాళికల్లో ఇన్ -స్పేస్ పేర్కొంది.
ప్రపంచ అంతరిక్ష మార్కెట్‌లో 2023 నాటికి భారత్ వాటా 2 శాతంగా ఉందని, భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ 8.4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఇన్-స్పేస్ వెల్లడించింది.
ప్రభుత్వ మద్దతు బలంగా ఉండటం, సాంకేతిక అభివృద్ధి, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ద్వారా ఈ లక్ష్యం సాధ్యమవుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) అభిప్రాయపడింది.
'అంతర్జాతీయ మార్కెట్‌ను ఆకర్షించాలని చూస్తున్న తరుణంలో ఇస్రో గర్వంగా భావించే పీఎస్‌ఎల్‌వీ రాకెట్ రెండుసార్లు విఫలం కావడం ఇస్రోకు ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్‌లో పీఎస్‌ఎల్‌వీ రాకెట్ విశ్వసనీయత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది' అని వెంకటేశ్వరన్ అభిప్రాయపడ్డారు.
పీఎస్‌ఎల్‌వీకి ఇప్పుడు తగిలిన ఎదురుదెబ్బల నుంచి పాఠాలు నేర్చుకొని తర్వాతి ప్రయోగాలను మరింత పకడ్బందీగా నిర్వహిస్తామని వార్తా ఏజెన్సీ ఏఎన్‌ఐతో శాస్త్రవేత్త సువేందు పట్నాయక్ అన్నారు.
పీఎస్‌ఎల్‌వీ-సీ62 ప్రాజెక్టు ప్రయోగంలో ఏం జరిగింది?
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి జనవరి 12న ఉదయం 10:18 గంటలకు పీఎస్‌ఎల్‌వీ- సీ62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
దాదాపు అరగంట తర్వాత, రాకెట్ విచలనం చెందిందని అంటే వెళ్లాల్సిన మార్గం నుంచి పక్కకు తప్పుకుందని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ తెలిపారు.
'పీఎస్ఎల్‌వీ రాకెట్‌లో మొత్తం 4 దశలు ఉంటాయి. మూడో దశ చివరకు వచ్చేసరికి లోపం తలెత్తింది. దీంతో రాకెట్ ప్రయాణ పథం మారుతున్నట్లు గ్రహించాం' అని విలేఖరులతో చెప్పారు.

ఫొటో సోర్స్, ISRO
పీఎస్ఎల్వీ రాకెట్ ఎలా పని చేస్తుంది?
పీఎస్‌ఎల్‌వీ రాకెట్ నాలుగు దశల్లో పనిచేస్తుందని డాక్టర్ టి.వి.వెంకటేశ్వరన్ చెప్పారు.
'రైలు బోగీలు ఒకదానితోఒకటి ఎలా అనుసంధానమై ఉంటాయో, అలా పీఎస్‌ఎల్‌వీ కూడా 4 రాకెట్ల కలయిక. ప్రయోగించడానికి రాకెట్ సిద్ధంగా ఉన్నప్పుడు, కింద నుంచి పైకి వరుసగా పీఎస్1, పీఎస్2, పీఎస్3, పీఎస్4 అనే నాలుగు విభాగాలు అనుసంధానమై ఉంటాయి. ఇందులో పీఎస్1, పీఎస్3లలో ఘన ఇంధనం ఉంటుంది. మిగతా రెండింటిలో ద్రవరూప ఇంధనం నింపుతారు' అని ఆయన వివరించారు.
'పీఎస్1లో ఉండే ఘనరూప ఇంధన రాకెట్, భూమి నుంచి గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి లేవడానికి కావాల్సిన ప్రొపల్షన్‌ను అందిస్తుంది. ఈ దశలో నిశ్చల స్థితిలో ఉన్న రాకెట్ థ్రస్ట్‌ను అందుకొని పైకి కదులుతుంది. అయితే ఈ దశలో భూమి నుంచి కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకే రాకెట్ ఎగరగలదు' అని ఆయన వివరించారు.
'పీఎస్2లో ద్రవ ఇంధనం ఉంటుంది. రాకెట్ ఏ దిశలో వెళ్లాలనే అంశాన్ని ఇది నిర్ణయిస్తుంది. అలాగే, రాకెట్ ఏ కక్ష్యలోకి వెళ్లాలో కూడా ఈ దశలోనే ఖరారవుతుంది.దీని తర్వాత మూడో దశలో మళ్లీ ఘన ఇంధనాన్ని ఉపయోగించుకొని అంతరిక్షంలో రాకెట్ మరింత ఎత్తుకు వెళుతుంది.చివరిదైన నాలుగో దశలో ద్రవ ఇంధనం ఉంటుంది. ఇది ఉపగ్రహాలను వాటి నిర్దేశిత కక్ష్యలో కచ్చితంగా ప్రవేశపెట్టేలా చేస్తుంది' అని వెంకటేశ్వరన్ తెలిపారు.

ఫొటో సోర్స్, ISRO
మూడో దశలో తలెత్తిన సమస్య
పీఎస్‌ఎల్‌వీ-సీ62 ప్రాజెక్టులో రాకెట్ మూడో దశ వరకు అనుకున్న విధంగానే ముందుకు సాగిందని వెంకటేశ్వరన్ చెప్పారు.
ఈ దశకు చేరుకున్నాక ఒక పెద్ద సమస్య ఎదురైనట్లు తెలిపారు.
ఆవిరి పీడనం తగినంత లేకపోవడమే ఈ సమస్య రావడానికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారని పేర్కొన్న వెంకటేశ్వరన్, దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని సులభంగా వివరించే ప్రయత్నం చేశారు.
'గాలితో నిండిన బెలూన్ మూతిని తెరిస్తే అది వ్యతిరేక దిశలో వేగంగా వెళ్తుంది. కానీ, బెలూన్ మూతినివెడల్పుగా తెరిస్తే, గాలి వేగంగా బయటకు వెళ్లిపోయి బెలూన్ వేగం మారొచ్చు. రాకెట్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. రాకెట్ నడుస్తున్నప్పుడు, దాని పొగ బయటకు వచ్చే ముక్కు భాగం (నాజిల్) వద్ద అనుకున్న స్థాయిలో ఒత్తిడి (ప్రెజర్) ఏర్పడలేదు' అని ఆయన వివరించారు.
అయితే నాజిల్ వద్ద ఈ పీడనం సరిగ్గా ఏర్పడకపోవడానికి కారణం ఏమిటనేదే ఇక్కడ అసలు సమస్య.
'నాజిల్ విరిగి ఉండొచ్చు. లేదా పీఎస్3 ఇంధనంలో సమస్య ఉండొచ్చు. అంటే రాకెట్‌లో ఘన ఇంధనాన్ని నింపేటప్పుడు సరైన నిష్పత్తిలో అది లేకపోవచ్చు. అసలైన కారణం ఏమిటనేది ఇస్రో ఇంకా ప్రకటించలేదు' అని వెంకటేశ్వరన్ చెప్పారు.
‘‘అయితే, 2025 మే నెలలో విఫలమైన సీ61 ప్రాజెక్టులో కూడా సరిగ్గా ఇదే మూడో దశలో ఇటువంటి సమస్యే రావడం ఆందోళనకరమని’’ ఆయన అన్నారు.‘‘దీనికి సంబంధించిన నివేదికను బహిరంగంగా విడుదల చేయలేదని’’ కూడా ఆయన తెలిపారు.
‘‘ఒక రాకెట్ ప్రయోగం తర్వాత దానికి సంబంధించిన పూర్తి నివేదిక తయారు చేస్తారు. ఈ నివేదిక ద్వారానే ఇస్రోకు విడిభాగాలు అందించిన వారు నాణ్యమైనవి ఇచ్చారా? ఇస్రోలో తగినంతగా పరీక్షలు చేయకుండానే పంపించారా? ఎవరిది తప్పు? అసలు తప్పు ఎక్కడ జరిగింది? అనేది తెలుసుకోవడం సాధ్యమవుతుంది’’ అని ఆయన వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














