ఆంధ్రప్రదేశ్‌: కర్నూలు, తిరుపతిలో ఏర్పాటుకానున్న డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ఏంటి?

సీఐఐ సదస్సు, విశాఖపట్నం, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ

ఫొటో సోర్స్, I&PR VIZAG

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

విశాఖలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ. 13,25,716 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

వివిధ పరిశ్రమలు, సంస్థలతో జరిగిన 613 ఒప్పందాల ద్వారా 16 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.

రెండు రోజుల సదస్సులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంయుక్తంగా వర్చువల్ విధానంలో కర్నూలులో డ్రోన్ సిటీ.. శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో స్పేస్ సిటీలకు శంకుస్థాపన చేశారు.

స్పేస్, డ్రోన్ రంగాలలో పని చేస్తున్న సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఈ సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకుంది.

దేశంలోనే ఈ తరహా సిటీలు తొలిసారి ఏపీలోనే ప్రారంభిస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ రెండు సిటీలు వికసిత్ భారత్ 2047కు ఎంతో కీలమని గోయల్ చెప్పారు.

అసలు డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ అంటే ఏమిటి? అక్కడ ఏం జరుగుతుంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సీఐఐ సదస్సు, విశాఖపట్నం, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ

ఫొటో సోర్స్, I&PR VIZAG

ఫొటో క్యాప్షన్, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీతో రాష్ట్రంలో కొత్త శకం మొదలవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.

కర్నూలులో డ్రోన్ సిటీ..

డ్రోన్ సిటీని కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఏర్పాటు చేయబోతున్నారు.

డ్రోన్ల తయారీ, టెస్టింగ్, శిక్షణ, పరిశోధన... ఇలా అన్నీ కూడా 'ఆల్ ఇన్ వన్ ప్లేస్' అంటే డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని అంశాలు ఒకే చోట ఉండే హబ్. దానినే డ్రోన్ సిటీగా పిలుస్తున్నారు.

"కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ నిర్మాణం కాబోతోంది. డ్రోన్ సిటీలో టెస్టింగ్-సర్టిఫికేషన్ సెంటర్లు ఉంటాయి. ఇందులో 25 వేల మందికి శిక్షణ ఇచ్చేలా వసతులు కల్పిస్తాం. డ్రోన్ సిటీ ఏర్పాటుతో 40 వేలకు పైగా ఉద్యోగావకాశాలు వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 50 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాం" అని పీయూష్ గోయల్ చెప్పారు.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు (CoE) అనేవి డ్రోన్ రంగంలో అత్యున్నత నైపుణ్యం అందించే ప్రత్యేక హబ్‌లుగా చెప్పొచ్చు. ఇవి శిక్షణ, పరిశోధన, పరీక్షలు, కొత్త ఉత్పత్తుల అభివృద్ధి అన్నింటినీ ఒకే చోట కలిపిన అధునాతన కేంద్రాలుగా చెబుతున్నారు.

డ్రోన్ సిటీ వివరాల గురించి చెబుతూ, ఆపరేషన్ సిందూర్‌లో వాటి ప్రాధాన్యతను పీయూష్ గోయల్ గుర్తు చేశారు.

సీఐఐ సదస్సు, విశాఖపట్నం, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ

ఫొటో సోర్స్, I&PR VIZAG

ఫొటో క్యాప్షన్, సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలు

డ్రోన్ ట్యాక్సీలు కూడా..

వ్యవసాయం, మ్యాపింగ్, పరిశ్రమల అనాలిసిస్ వంటి రంగాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు.

"ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్, ట్రాఫిక్‌ మానిటరింగ్‌వంటి అంశాల్లో ఊహించని మార్పులను చూడవచ్చు. ఇప్పటీకే ఏపీలో పోలీసులు ఏర్పాటు చేసిన ఈగల్ వంటి సంస్థలు డ్రోన్లతో మాదక ద్రవ్యాలు, గంజాయి తోటలను గుర్తించి నాశనం చేయడం చూస్తున్నాం" అని డ్రోన్ల తయారీ రంగంలో పని చేస్తున్న అభినవ్ బీబీసీతో చెప్పారు.

"త్వరలో రాష్ట్రంలో డ్రోన్ ట్యాక్సీలు అభివృద్ధి చేస్తాం. వీటి కోసం ప్రత్యేకమైన డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అవసరం అవుతుంది. దీనికి కేంద్రం సాయం అందించాలి" అని సీఎం చంద్రబాబు అన్నారు.

డ్రోన్ సిటీ కోసం ఆల్ గోబోటిక్స్, ఆకిన్ అనలిటిక్స్, సెన్స్ ఇమేజ్, ఎయిర్ స్పేస్ వంటి సంస్థలు ఏపీ ప్రభుత్వంతో ఏంవోయూ కుదుర్చుకున్నాయి.

సీఐఐ సదస్సు, విశాఖపట్నం, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ

ఫొటో సోర్స్, I&PR VIZAG

ఫొటో క్యాప్షన్, పలువురు పారిశ్రామిక వేత్తలు ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్నారు.

శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో స్పేస్ సిటీ..

డ్రోన్ సిటీతో పాటు స్పేస్ సిటీకి కూడా సీఐఐ సదస్సులో వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో స్పేస్ సిటీలు ఏర్పాటు కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

స్పేస్ సిటీతో అంతరిక్ష రంగంలో పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.

శాటిలైట్ డిజైనింగ్ నుంచి రాకెట్ టెస్టింగ్ వరకు జరిగిన ప్రతి పని కూడా ఒకే గొడుగు కింద జరిగే క్యాంపస్‌ను 'స్పేస్ సిటీ' అంటున్నారు.

శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో స్పేస్‌సిటీలు స్థాపించడం ద్వారా అంతరిక్ష పరిశోధన రంగంలో పెట్టుబడులు సాధించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

శ్రీ సత్యసాయి జిల్లాలో హైదరాబాద్‌-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను ఆధారంగా చేసుకుని ఇస్రో సహకారంతో, తిరుపతిలో షార్‌ సమన్వయంతో స్పేస్‌సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.

అలాగే సత్యసాయి జిల్లాలో మరో స్పేస్ సిటీని కూడా నిర్మించనున్నారు. ఇది రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ స్టార్టప్ ఇన్‌క్యుబేషన్ కేంద్రంగా ఉంటుంది. ఈ రెండు స్పేస్ సిటీలు రూ. 25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

సీఐఐ సదస్సు, విశాఖపట్నం, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ

ఫొటో సోర్స్, TDP

ఫొటో క్యాప్షన్, సీఐఐ సదస్సుకు ముందు ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా పెట్టుబడుల అంశంపై దిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం, పెట్టుబడిదారులకు ఇదో మంచి అవకాశమని ఆయన అన్నారు.

ఒప్పందాలు అమలైతే మంచిదే.. కానీ

"సీఐఐ సదస్సులు ఇప్పటీ వరకు దేశంలో 30 వరకు జరిగాయి. కానీ వాటిలో కుదిరిన ఒప్పందాల్లో ఎన్ని అమలైయ్యాయనే కచ్చితమైన రిపోర్ట్ ఎక్కడా దొరకదు. అదొక అందమైన ఈవెంట్‌లా జరుగుతూ ఉంటుంది" అని సీనియర్ జర్నలిస్ట్ ప్రభాకర్ శర్మ బీబీసీతో అన్నారు.

"ఆ ఈవెంట్‌లో జరిగిన ఒప్పందాలు కుదుర్చుకున్న వారు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించేందుకు వెంటనే ఆసక్తి చూపించకపోవచ్చు. నేను నాలుగు సీఐఐ సదస్సులను జర్నలిస్టుగా కవర్ చేశాను. సదస్సుల్లో జరిగిన ఒప్పందాలు కనీసం 10 శాతం వాస్తవ రూపంలోకి వచ్చినా రాష్ట్ర అభివృద్ధికి తిరుగుండదు."

సీఐఐ సదస్సు, విశాఖపట్నం, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ

ఫొటో సోర్స్, I&PR VIZAG

ఫొటో క్యాప్షన్, సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలు

"సీఐఐ సదస్సులు విశాఖలోనే నాలుగు జరిగాయి. కానీ వాటి ఫలితాలపై పెద్దగా మాట్లాడలేం.

కానీ, ఈసారి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ హడావిడితో సీఐఐ సదస్సులో జరిగిన ఒప్పందాల్లో 50 శాతం వరకు అమలయ్యే అవకాశముందని అనిపిస్తోంది" అని ఐటీ టెక్నాలజీ నిపుణులు, సింబయోసిస్ ఐటీ సంస్థల అధినేత నరేష్ అభిప్రాయపడ్డారు.

ఒప్పందాల కంటే.. వాటిని వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు పెట్టుబడిదారులను ఆకర్షించే మౌలిక సదుపాయాల కల్పన అవసరం. ఉదాహరణకు విశాఖలో 200 రోడ్లకి ప్రపోజల్స్ ఉన్నాయి. వాటిలో 14 రోడ్ల పనులు జరుగుతున్నాయి. అవి కూడా సరైన సమయంలో పూర్తై పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించేలా ఉండాలని నరేష్ బీబీసీతో అన్నారు.

సీఐఐ సదస్సు, విశాఖపట్నం, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ

ఫొటో సోర్స్, facebook.com/amarnath.gudivada

ఫొటో క్యాప్షన్, గత సదస్సుల్లో పాల్గొన్న వారే మళ్లీ వచ్చి ఒప్పందాలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అన్నారు.

అవే కంపెనీలు మళ్లీ, మళ్లీ ఒప్పందాలు: అమర్నాధ్

సీఐఐ సదస్సుల్లో జరిగిన ఒప్పందాల్లో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ వంటివి గ్రౌండ్ అయి పనులు జరుగుతున్నాయి. మిగతా వాటి గురించి త్వరలోనే రియల్ టైమ్ డేటా రిలీజ్ చేస్తామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు.

"మూడున్నరేళ్లలో మా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఎక్కువ భాగం వాస్తవ రూ పంలోకి తెస్తామని చెప్పగలం" అని పల్లా శ్రీనివాసరావు అన్నారు.

సదస్సులో జరిగేవి ఒప్పందాలు మాత్రమేనని, వాటిని వాస్తవ రూపంలో తీసుకుని వచ్చినప్పుడే విలువ ఉంటుందనే విషయం గుర్తించాలని పరిశ్రమల శాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ బీబీసీతో అన్నారు.

అయితే, ఇప్పుడు జరిగిన ఒప్పందాల్లో గతంలో జరిగిన సీఐఐ సదస్సుల్లో అప్పటి ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలే ఉన్నాయని, అవి మళ్లీ మళ్లీ సదస్సులకు వచ్చి ఒప్పందాలు చేసుకుంటున్నాయని గుడివాడ అమర్నాధ్ చెప్పారు.

"ఇలాంటి పెట్టుబడుల సదస్సుల్లోనే ఒప్పందాలు చేసుకునేందుకు పారిశ్రామికవేత్తలు ఎందుకు ఆసక్తి చూపుతారంటే...పెట్టుబడుల సదస్సుల్లో ప్రభుత్వాలు సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో రాయితీలు, ఇతర సౌకర్యాలను పరిశ్రమలకు, పెట్టుబడిదారులకు కల్పిస్తూ ఒప్పందాలు చేసుకుంటుంది. వాటిని అందిపుచ్చుకునేందుకు పరిశ్రమలు వస్తాయి. భవిష్యత్తులో పరిశ్రమలు పెట్టినప్పుడు ఆ పరిశ్రమలు రాయితీలు, సౌకర్యాలు వాడుకునే అవకాశం ఉంటుంది" అని గుడివాడ అమర్నాధ్ బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)