రుషికొండ భవనాలను ఏం చేస్తారు? సీఎం చంద్రబాబు ఏమన్నారు?

ఫొటో సోర్స్, DPRO, VSP
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖపట్నంలోని రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవన సముదాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు.
టూరిజం డెవలప్‌మెంట్ కోసమే ఈ భవనాలను నిర్మించినట్టు గత ప్రభుత్వంలో నాయకులు అనేకసార్లు చెప్పారని, కానీ ఒక వ్యక్తి స్వార్థం కోసమే రుషికొండ ప్యాలెస్ కట్టారని చంద్రబాబు ఆరోపించారు. బాత్ టబ్ కోసం 36 లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఆయన చెప్పారు.
అయితే, రుషికొండ భవనాలు వ్యక్తుల కోసం నిర్మించినవి కావని, వాటిని ప్రస్తుత ప్రభుత్వం తమకు నచ్చినట్లు వాడుకోవచ్చని వైసీపీ నాయకులు, మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర అన్నారు.


ఫొటో సోర్స్, DPRO, VSP
‘కలలో కూడా ఊహించలేం’- చంద్రబాబు
సీఎం చంద్రబాబు రుషికొండ భవనాల్లో తిరుగుతూ అన్నీ పరిశీలించారు. ఈ భవనాల్లోని హంగులపై గతంలో విపరీతమైన చర్చ జరిగింది. ముఖ్యంగా బాత్ టబ్, షాండ్లియర్లు, భారీ మీటింగ్ హాల్స్, ఖరీదైన లైట్లు, కారిడార్ వంటి వాటి గురించి గతంలో టీడీపీ, జనసేన పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
‘‘రాజులు కూడా ఇలాంటి భవనాలు కట్టుకుంటారని నేను అనుకోవడంలేదు. ఏకంగా 100 కేవీ సబ్‌స్టేషన్, 200 టన్నుల సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేశారు. గతంలో షాండ్లియర్లు చూశాం. ఇక్కడ ఫ్యాన్సీ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఇలాంటివి కలలో కూడా ఊహించలేం” అని చంద్రబాబు అన్నారు.
“గజపతి బ్లాక్‌లో ఆఫీస్ కాంప్లెక్స్ కట్టారు. లగ్జరీగా నిర్మించారు. కళింగ బ్లాక్‌లో 300 మంది కూర్చునేంత పెద్ద కాన్ఫరెన్స్ హాల్ నిర్మించారు. ఇక్కడ కారిడార్ చూస్తే వైట్ హౌస్ కూడా అలా లేదు. ఆ ఫ్యాన్లు చూస్తే ఏం చెప్పాలో తెలియడం లేదు. నేను ఎన్నో దేశాలు తిరిగాను. కానీ, ఈ ప్యాలెస్ చూస్తే నాకు మతిపోయింది” అని చంద్రబాబు అన్నారు.

ఫొటో సోర్స్, DPRO, VSP
ఈ భవనాలను ఏం చేయబోతున్నారు?
రుషికొండ భవనాల నిర్మాణం జరుగుతున్నప్పటి నుంచీ వీటిని దేనికి ఉపయోగిస్తారనే చర్చ జరుగుతూనే ఉంది. అప్పట్లో టీడీపీ, జనసేన నాయకులు ఈ భవనాల నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు ఆ పార్టీల కూటమి ప్రభుత్వమే ఏర్పడటంతో ఈ భవనాలను ఏం చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై శనివారం (02.11.24) రుషికొండ భవనాలను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
“పేదల పేర్లు చెప్పి విలాసవంతమైన భవనాలు కట్టారు. ఈ భవనాలకు పెట్టిన రూ. 500 కోట్లను రోడ్లకు పెట్టి ఉంటే గుంతలు ఉండేవి కాదు. రుషికొండ భవనాలను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తాం. అంతకంటే ముందు, నేరం జరిగిందా లేదా అనేది తేలాలి. రుషికొండ ప్యాలెస్‌లపై చర్చ జరగాలి. ప్రజలు కూడా వచ్చి చూడాలి. ఇలాంటి తప్పులు చేసిన వారిని ఏం చేయాలనే దానిపై చర్చ జరగాల్సి ఉంది. దీనిని ప్రజలకు చూపిస్తే గత ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుంది. ఆ తర్వాత వారి అభిప్రాయాలను కూడా తీసుకుని, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం’’ అని చంద్రబాబు చెప్పారు.

ఫొటో సోర్స్, DPRO, VSP
అవి ప్రజల భవనాలు: వైసీపీ
చంద్రబాబు రుషికొండ భవనాలను పరిశీలించిన అనంతరం చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు, మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర స్పందించారు.
“రుషికొండ భవనాల్లోకి ప్రజలను అనుమతిస్తామని చంద్రబాబు చెప్పడం మంచి ఆలోచనే. ఎందుకంటే, అవి ప్రజల సొమ్ముతో, ప్రజల కోసం కట్టినవే. కాబట్టి ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆ భవనాలు ప్రజలవే. పైగా అవి టూరిజం శాఖ కోసం కట్టినవి. ప్రధానులు, గవర్నర్లు, న్యాయమూర్తులు లాంటి ప్రముఖులు వచ్చినప్పుడు ఉపయోగపడేలా వాటిని నిర్మించారు” అని రాజన్నదొర బీబీసీతో చెప్పారు.
“రుషికొండ భవనాలు వ్యక్తుల కోసం నిర్మించినవి కావు. అవి వైసీపీ ప్రభుత్వం నిర్మించినవి. ప్రస్తుత ప్రభుత్వం వాటిని ఎలా వాడుకోవాలంటే అలా వాడుకోవచ్చు. ఏది ఏమైనా అవి చివరకు ప్రజలకు, ప్రభుత్వాలకు ఉపయోగపడేవిగా ఉండేవే” అని రాజన్నదొర అన్నారు.

ఫొటో సోర్స్, DPRO, VSP
రుషికొండ భవనాల్లో ఏముంది?
ఈ ఏడాది రాష్ట్రంలో ప్రభుత్వం మారడానికి ముందు వరకు ఈ భవనాల లోపలకి ఎవరినీ అనుమతించలేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్, వామపక్ష పార్టీల నాయకులు ఇక్కడికి వచ్చినా లోపలికి అనుమతించలేదు. ఈ భవనాల్లో ఏముందో, ఎలా ఉంటాయో అనేది ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం మారిన తర్వాత... గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకెళ్లి చూపించినప్పుడు తెలిసింది.
మొత్తం 9.88 ఎకరాల్లో కళింగ, వేంగి, గజపతి బ్లాకులుగా రుషికొండపై భవనాల నిర్మాణం జరిగింది. నిజానికి ఇవి కొత్తగా నిర్మించిన భవనాలు కావు.
గతంలో టూరిజం డిపార్ట్‌మెంట్ నిర్వహించిన రిసార్టులనే రూ. 452 కోట్లతో ఆధునికీకరణ చేశారు.
అవసరమైతే సీఎం క్యాంప్ కార్యాలయంగా లేదంటే టూరిజం శాఖ వాడుకునే విధంగా ఈ భవనాలను నిర్మించామని మాజీ మంత్రులు ఆర్కే రోజా, అమర్నాథ్ ఎన్నికలకు ముందు చెప్పారు.

ఫొటో సోర్స్, DPRO, VSP
రుషికొండ భవనాల్లో ఏర్పాట్లు..
- కళింగ బ్లాకులో 400 మందికి తగిన విధంగా అత్యధునిక సౌకర్యాలతో మీటింగ్ రూం
- అలాగే 100 మంది వరకు సరిపడే మరో నాలుగు సమావేశ మందిరాలు
- కళింగ, గజపతి, వేంగి బ్లాకులలో అత్యంత ఆధునికంగా నిర్మించిన గదులు
- చూడగానే కళ్లు మిరిమిట్లు గొలిపే విధంగా ఉన్న ఖరీదైన ఫర్నీచర్
- ఖరీదైన షాండ్లియర్లు
- దాదాపు 500 చదరపు అడుగుల వైశాల్యంతో బాత్రూంలు
- బాత్రుంలలో బంగారం రంగు షవర్లు, కుళాయిలు, టీవీలు
- వినూత్నమైన డిజైన్లతో సీలింగ్ ఫ్యాన్లు, హాళ్లలో బిగ్ స్క్రీన్లు
- ఖరీదైన కుర్చీలు, డిజైన్డ్ గ్లాస్ డోర్లు,ఆటోమేటిక్ కర్టెన్లతో విలాసవంతమైన పడక గదులు
- భవనాల బయట, రోడ్డుపై నుంచి భవనాల వద్దకు చేరుకునే దారిపొడవునా కళ్లు తిప్పుకోలేని ల్యాండ్ స్కేపింగ్
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














