టీమిండియా: స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమికి కారణాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విమల్ కుమార్, స్పోర్ట్స్ జర్నలిస్ట్
- హోదా, బీబీసీ హిందీ
స్వదేశంలో తిరుగులేని రికార్డుతో ఉన్న టీమిండియాకు న్యూజిలాండ్ చేతిలో పరాభవం ఎదురైంది. పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌పై కివీస్ జట్టు 113 పరుగుల తేడాతో గెలిచింది. మొత్తం మూడు టెస్టుల ఈ సిరీస్‌లో ఇప్పటికే న్యూజిలాండ్ వరుసగా రెండు టెస్టులను గెలుచుకుంది.
గడిచిన 36 ఏళ్లలో న్యూజిలాండ్‌కు భారత్‌లో ఒక్క టెస్టు కూడా గెలిచిన చరిత్ర లేదు. అలాంటి జట్టు 12 ఏళ్లుగా సొంతగడ్డపై 18 సిరీస్‌లను గెలిచిన టీమిండియాను కంగుతినిపించింది. విచిత్రం ఏమిటంటే ఇదే న్యూజిలాండ్ జట్టు శ్రీలంక చేతిలో ఇటీవల రెండు టెస్టుల సిరీస్‌ను కోల్పోయింది.
తాజాగా న్యూజిలాండ్ పుణె టెస్టు మ్యాచ్ గెలుపుతో సొంతగడ్డపై టీమిండియా విజయాల పరంపరకు బ్రేక్ పడింది. ఈ ఓటములకు ముందు భారత జట్టు స్వదేశంలో 12 ఏళ్లపాటు 18 సిరీస్‌ల్లో వరుస విజయాలు సాధించింది.
కానీ ఇది క్రికెట్. అత్యుత్తమ ఆటగాళ్లకు కూడా ఓటమి తప్పదనే భావనను ఎప్పటికప్పుడు కలిగించే ఆట.
బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా..అంతకన్నా మెరుగైన పిచ్ ఉన్న పుణెలో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తడబడుతూనే ఆడింది.
ప్రస్తుత తరం భారత బ్యాట్‌మెన్లకు స్పిన్ బౌలర్లను ఎదుర్కొనే టెక్నిక్, టెంపర్మెంట్ లేదనే వాదనను యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ తప్పని రుజువు చేశారు.
కానీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు కూడా సొంతగడ్డపై సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరభ్ గంగూలీ వంటి ఆటగాళ్లలా స్పిన్ ఆడే నైపుణ్యం లేదనే అభిప్రాయం ఉంది.


ఫొటో సోర్స్, Getty Images
భారత బ్యాటర్లు స్పిన్ ఆడలేకపోతున్నారా?
విదేశీ పిచ్‌లపై అనేక టెస్టుమ్యాచ్‌లు ఆడినతర్వాత, స్వదేశంలో మెరుగైన స్పిన్నర్లను ఎదుర్కోవడం అంత తేలిక కాదని మాజీ బ్యాట్స్‌మెన్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
కానీ ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏంటంటే.. విరాట్ కోహ్లీ వంటి లెజెండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో నిరంతరం తడబడడాన్ని ఏ లాజిక్‌తో సమర్థించగలం అని.
2021 నుంచి భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచుల్లో 23 ఇన్నింగ్స్‌ల్లో 20 సార్లు కోహ్లీ స్పిన్నర్ల చేతిలో ఔట్ అయ్యాడని గణాంకాలు చెబుతున్నాయి. పుణెలో జరిగిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ, మిచెల్ శాంట్నర్ కోహ్లీని పెవిలియన్ బాట పట్టించాడు. నిజానికి మిచెల్ శాంట్నర్ కివీస్ జట్టులో న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో రెగ్యులర్‌గా ఏమీ ఆడడం లేదు.
గత నాలుగేళ్లలో కోహ్లీ భారత్‌లో ఆడిన 15 టెస్ట్ మ్యాచ్‌లు, 25 ఇన్నింగ్స్‌లలో చేసింది ఒక సెంచరీ మాత్రమే. అంతేకాదు...ఈ సమయంలో అతని సగటు 48 నుంచి 32కి పడిపోయింది.
ఈ లెక్కలు కోహ్లీకి, అతని అభిమానులకు కచ్చితంగా నిరాశ కలిగించేవే.
కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యంత క్లిష్టస్థితిని ఎదుర్కొంటున్నాడు.
బంగ్లాదేశ్ సిరీస్ నుంచి పుణె టెస్టు వరకు ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ నమోదుచేసింది ఒకే ఒక్క అర్ధ సెంచరీ. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్ ఆటతీరు టీమిండియాకు ఆందోళనకరంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
55ఏళ్లలో 2 టెస్ట్ మ్యాచ్‌లే గెలిచిన న్యూజిలాండ్
కివీస్‌తో సిరీస్‌ను కోల్పోయినందుకు రోహిత్, కోహ్లీలను మాత్రమే నిందించలేం.
బౌలింగ్ విభాగానికొస్తే భారత గడ్డపై తొలిసారి రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా జోడీ సాధారణ ఆటతీరు కనబర్చింది. వారిద్దరూ వికెట్లు తీయడంలో ఇబ్బంది పడడమే కాదు....పర్యటక జట్టుకు ధారాళంగా పరుగులు ఇచ్చారు.
మూడేళ్ల తర్వాత తొలి టెస్టు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ మొత్తం 11 వికెట్లు పడగొట్టాడంటే.. ఈ సిరీస్‌లో స్పిన్నర్లు ఎంత పేలవమైన ఆటతీరు ప్రదర్శించారో అర్ధంచేసుకోవచ్చు.
భారత్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్‌ను న్యూజిలాండ్ తరఫున 1969లో గ్రాహం డౌలింగ్ గెలుపొందాడు. నాగ్‌పూర్‌లో ఆ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత 1988లో జాన్ రైట్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించాడు.
గత 55 ఏళ్లలో కేవలం 2 టెస్టులు మాత్రమే గెలిచిన కివీస్ జట్టును కేవలం రెండు వారాల్లోనే 2 టెస్టులు గెలిచేలా చేశాడు కొత్త కెప్టెన్ టామ్ లాథమ్. ఇప్పుడతను వైట్ వాష్ కోసం ఎదురుచూస్తున్నాడు. 3-0తో సిరీస్ విజయం సాధించాలని భావిస్తున్నాడు.
2021లో భారత్‌ను ఓడించడం ద్వారా న్యూజిలాండ్ తొలిసారిగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలిచినప్పటికీ... టెస్టు సిరీస్‌లో భారత్‌ను భారత్‌లోనే ఓడించడం బహుశా అంతకంటే పెద్ద విజయంగా కివీస్ జట్టు పరిగణించవచ్చు.
4,339 రోజుల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటమిని రుచి చూడడం భారత్‌కు చిన్న విషయం కాదు. క్రికెట్ చరిత్రలో పటిష్ట జట్లుగా భావించే ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లకు వరుసగా 10 టెస్టు సిరీస్‌లను గెలుచుకున్న రికార్డు ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
కలలో సైతం ఊహించని విజయం
రాబోయే కొన్ని వారాలపాటు ఈ ఓటమిని రోహిత్, గౌతమ్ గంభీర్ విశ్లేషించుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ఎంపిక చేసినా, భారత క్రికెట్‌లో మార్పుల పర్వం మొదలైందనే విషయాన్ని కోచ్ గౌతమ్ గంభీర్ గ్రహించాలి.
వైట్ బాల్ క్రికెట్‌లో వన్డే సిరీస్ లో శ్రీలంక జట్టు అనుభవజ్ఞులైన భారత జట్టును ఓడించగా, ఆ తర్వాత బంగ్లాదేశ్ కూడా చెన్నైలో తొలుత టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టింది.
కానీ , న్యూజిలాండ్‌తో జరిగిన ఈ ఓటమి బహుశా టెస్టు క్రికెట్‌లో స్వర్ణయుగాన్ని ఆస్వాదించిన జట్టులోని ముఖ్యమైన ఆటగాళ్ల కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు కనిపిస్తోంది.
ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, అజింక్య రహానె, చతేశ్వర్ పుజారా, ఇప్పుడు మహ్మద్ షమీ టెస్ట్ క్రికెట్‌కు కొన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నారు. రాబోయే నెలల్లో మరో ఇద్దరు ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు కూడా ఆటకు వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది.
ఏడాది తర్వాత టీమ్ఇండియా హోమ్ సిరీస్ ఆడనుంది. అప్పటికి జట్టులో రోహిత్, కోహ్లీ,అశ్విన్, జడేజా కలిసి కనిపిస్తారని ఎవరూ నమ్మకంగా చెప్పలేని పరిస్థితి.
ఇక న్యూజిలాండ్ జట్టును మెచ్చుకోవాలి. ముఖ్యంగా శాంటర్న్ సాధించిన ఘనతను చెప్పుకోవాలి. వైట్‌బాల్ ప్లేయర్‌గా పేరొందిన సాంట్నర్ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు పడగొట్టాడు.
న్యూజిలాండ్‌కు కూడా ఈ విజయం కల నిజం కావడం కంటే పెద్దది కావచ్చు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














