Ind vs Nz: బెంగళూరు టెస్టు ఓటమితో రోహిత్ శర్మ జట్టులో బలహీనతలు బయటపడ్డాయా?

భారత్ వర్సెస్ న్యూజీలాండ్:,బెంగళూరు, ఓటమి, రోహిత్ శర్మ జట్టు, విశ్వసనీయత,సవాల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సంజయ్ కిషోర్
    • హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

సాధారణంగా భారత క్రికెట్ జట్టు వర్షం కోసం మేఘాలను ప్రార్ధించడం చాలా అరుదైన విషయం. ముఖ్యంగా స్వదేశంలో ఆడుతున్నప్పుడు.

2013 నుంచి టీమ్ ఇండియా కేవలం నాలుగు టెస్టు మ్యాచుల్లో ఓడిపోయింది.

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో కివీస్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

36 ఏళ్ల తర్వాత తొలిసారిగా న్యూజీలాండ్ జట్టు భారత్‌లో టెస్టు మ్యాచ్‌ గెలిచింది.

ఇప్పుడు వరుసగా 18 సిరీస్ విజయాల ప్రపంచ రికార్డును కాపాడుకోవడం భారత్‌కు సవాలే.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ‘‘తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అవుతామని అనుకోలేదు. ఆ మ్యాచ్‌లో మాపై న్యూజీలాండ్ ఆధిక్యం ప్రదర్శించింది’’ అని అన్నాడు.

"మేం పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. ఇంతకు ముందు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం. సొంత గడ్డపై ఓడిపోయాం. ఆటలో ఇది సహజం. ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. మేం ఏం చేయాలో మాకు తెలుసు. తరువాత జరిగే రెండు టెస్టుల్లో బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాం." అని రోహిత్ అన్నాడు.

తమ జట్టు సాధించిన ఈ చరిత్రాత్మక విజయంపై న్యూజీలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ చాలా సంతోషంగా ఉన్నాడు.

"మేం బ్యాటింగ్ చేయాలనుకున్నాం. కానీ టాస్ ఓడిపోవడం కూడా మంచిదైనట్లు రుజువైంది. మా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసింది." అని లాథమ్ అన్నాడు.

న్యూజీలాండ్, కెప్టెన్ టామ్ లాథమ్

ఫొటో సోర్స్, Kai Schwoerer/Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్

ఓటముల తర్వాత ఇండియా వచ్చిన కివీస్

సెప్టెంబరులో అఫ్గానిస్తాన్, న్యూజీలాండ్ మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లిన న్యూజీలాండ్ అక్కడ 0-2తో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

మరోవైపు సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగిన భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌ను భారత్ 2-0తో వైట్‌వాష్ చేసింది.

అయితే గత కొన్ని మ్యాచ్‌లలో బ్యాట్ అండ్ బాల్‌ రెండింటితోనూ మంచి పెర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చిన న్యూజీలాండ్ జట్టు, బెంగళూరు టెస్టులో విజయంతో సిరీస్‌ను అద్భుతంగా ప్రారంభించింది.

కొత్త బంతి ముందు భారత బ్యాటింగ్ కుప్పకూలింది. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా మ్యాచ్‌లో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంది.

సొంత మైదానంలో తిరుగులేని రికార్డు ఉన్న భారత క్రికెట్ జట్టుకు ఆదివారం ఉదయం మాత్రం భిన్నమైనదనే చెప్పాలి.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోని పెవిలియన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతం గంభీర్‌తో సహా టీమ్ మొత్తం కూర్చుని టీ, పకోడీలతో రోజంతా వర్షాన్ని ఆస్వాదించాలని భావించారు. కానీ ఇంద్రుడిపై, సూర్యుడు విజయం సాధించాడు.

దాదాపు గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. 107 పరుగుల లక్ష్యం న్యూజీలాండ్‌కు చాలా ఈజీ టార్గెట్.

టెస్టు చరిత్రలో ఒక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 50 కంటే తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యాక టెస్టును డ్రా చేసుకున్న ఘనత ఒక్కసారి మాత్రమే కనిపించింది.

122 సంవత్సరాల కిందట, 1902 మే లో, బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు 36 పరుగులకే ఔట్ అయినప్పటికీ ఆ టెస్ట్‌ను డ్రా చేయగలిగింది.

ఇండియా న్యూజీలాండ్

ఫొటో సోర్స్, ANI

ఇప్పుడు ప్రపంచ రికార్డును కాపాడుకోవడం సవాలు

2013 నుంచి ఇప్పటి వరకు 18 సిరీస్‌లను గెలుచుకోవడం ద్వారా స్వదేశంలో వరుసగా అత్యధిక టెస్టు సిరీస్‌లను గెలుచుకున్న జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ప్రస్తుత సిరీస్‌లో మరో రెండు టెస్టు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.

ఈ రికార్డులో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.

టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయాలన్న భారత్ నిర్ణయం తప్పని తేలింది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తర్వాత దీన్ని అంగీకరించారు.

తప్పుడు నిర్ణయం కారణంగా, టెస్టు క్రికెట్‌లో టీమ్ ఇండియా అత్యంత చెత్త ఆట ఆడిన రోజులను గుర్తుకు తెచ్చింది. బలమైన భారత బ్యాటింగ్ లైనప్‌ చిన్నస్వామి స్టేడియం పిచ్‌పై పేకమేడలా కూలింది.

మ్యాచ్ తొలిరోజు వర్షం పడడం ఇండియాకి కలిసొచ్చింది. రెండో రోజు టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఇదే భారత టీమ్ మేనేజ్‌మెంట్ చేసిన పెద్ద పొరపాటు. పిచ్ పరిస్థితులు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజీలాండ్ ఫాస్ట్ బౌలర్లు భారత జట్టును 46 పరుగులకే పరిమితం చేశారు.

మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లు తీయగా, తొలిసారి భారత్‌లో ఆడుతున్న 23 ఏళ్ల విలియం ఓ రోచె నాలుగు వికెట్లు పడగొట్టాడు. అందులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వికెట్లు కూడా ఉన్నాయి. టెస్టుల్లో 100 వికెట్ల మార్కును హెన్రీ దాటేశాడు.

టెస్టు చరిత్రలో భారత్‌కు 46 పరుగులు మూడో అత్యల్ప స్కోరు కాగా, సొంతగడ్డపై ఇదే అత్యల్ప స్కోరు.

2020లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సేన 36 పరుగులకు ఆలౌట్ అయింది. 1974లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులకు ఆలౌట్ అయింది. అప్పుడు అజిత్ వాడేకర్ కెప్టెన్.

టాస్, బ్యాటింగ్,ఇండియా, న్యూజీలాండ్, బౌలింగ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న నిర్ణయం తప్పని తేలింది.

జట్టు ఎంపికలోనూ పొరపాటు

అనుభవజ్ఞురాలైన టీమ్ మేనేజ్‌మెంట్ పిచ్‌ పరిస్థితులనే అంచనా వేయలేనప్పుడు, జట్టు ఎంపికలోనూ తప్పులు జరుగుతాయి.

ఫామ్‌లో ఉన్న మీడియం పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ తప్పును రోహిత్ శర్మ కూడా అంగీకరించాడు.

‘‘ పిచ్‌పై పచ్చగడ్డి లేదు. మొదటి సెషన్‌లో పిచ్ ఎలా ఉన్నా ఆట కొనసాగుతున్న కొద్దీ అనుకూలిస్తుందని అనుకున్నాం. మేం స్వదేశంలో ఎప్పుడు ఆడినా మొదటి సెషన్ ముఖ్యం. తరువాత స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు" అని రోహిత్ శర్మ అన్నాడు.

"కుల్దీప్‌ని తీసుకురావడానికి కారణం...అతను ఫ్లాట్ పిచ్‌లపై వికెట్లు తీయడమే. కాబట్టి, పిచ్ మునుపటి కంటే ఫ్లాట్‌గా ఉంటుందని మేము ఊహించాం. పిచ్‌ సరిగా లేకపోవడం వల్లే ఇలా జరిగింది. నేను సరిగ్గా అంచనా వేయలేకపోయాను" అని రోహిత్ శర్మ అన్నాడు.


రచిన్ రవీంద్ర, 134 పరుగులు, కివీస్ జట్టు, 356 పరుగులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రచిన్ రవీంద్ర 134 పరుగులు చేసి కివీస్ జట్టుకు 356 పరుగుల ఆధిక్యాన్ని అందించారు.

అద్భుతంగా ఆడిన రచిన్ రవీంద్ర

న్యూజీలాండ్ బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది.

డెవాన్ కాన్వే 91 పరుగులు చేయగా, బెంగళూరుకు చెందిన న్యూజీలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర 134 పరుగులు చేసి కివీస్ జట్టుకు 356 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు.

తొలి ఇన్నింగ్స్ వైఫల్యాలను మరిచిపోయిన భారత బ్యాట్స్‌మెన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు.

రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 35, రోహిత్ శర్మ 52, విరాట్ కోహ్లీ 70 పరుగులు చేశారు. దీని తర్వాత సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్‌లు కలిసి 177 పరుగులు జోడించడంతో భారత్ మ్యాచ్‌ను డ్రా చేసుకుని 122 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తుందని కొడుతుందని అనిపించింది.

కానీ రెండో ఇన్నింగ్స్‌లో కొత్త బంతిని తీసుకున్న తర్వాత, న్యూజీలాండ్ బౌలర్లు 62 పరుగులకే మిగిలిన ఏడు వికెట్లు తీశారు. అనంతరం 107 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది న్యూజీలాండ్.

ఇలాంటి లక్ష్యాన్ని భారత జట్టు గతంలో కాపాడుకోగలిగింది. 2004లో వాంఖడే‌ స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులే చేసినప్పటికీ, ఆ టెస్టును ఆస్ట్రేలియా గెలవలేకపోయింది.

ఆ టెస్టులో ఆసీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకు ఆలౌట్ అయింది. హర్భజన్ సింగ్ ఐదు వికెట్లు, మురళీ కార్తీక్ మూడు వికెట్లు తీశారు. ఆ సమయంలో భారత జట్టుకు రాహుల్ ద్రవిడ్ కెప్టెన్‌.

సర్ఫరాజ్ ఖాన్,రిషబ్ పంత్,177 పరుగులు, భాగస్వామ్యం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సర్ఫరాజ్ ఖాన్,రిషబ్ పంత్ మధ్య 177 పరుగుల భాగస్వామ్యం

సర్ఫరాజ్-పంత్‌ మెరుగైన ఆట, కేఎల్ రాహుల్ వైఫల్యం

అండర్-19 ‌నుంచి టీమ్‌మేట్స్‌గా ఉంటున్న సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్‌లు 35.1 ఓవర్లలో 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

సర్ఫరాజ్ 150 పరుగులు చేశాడు. ఇది అతని తొలి టెస్ట్ సెంచరీ. ఇక ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత జట్టులోకి వచ్చి రోజుకో చరిత్ర సృష్టిస్తున్న రిషబ్ పంత్ ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. 105 బంతుల్లో 99 పరుగులు చేశాడు.

గాయపడిన శుభ్‌మాన్ గిల్ స్థానంలో సర్ఫరాజ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా టూర్‌కు తాను పోటీలో ఉన్నట్లు చెప్పకనే చెప్పాడు.

విరాట్ కోహ్లీతో కలిసి సర్ఫరాజ్ 136 పరుగులు, పంత్‌తో కలిసి 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

సాధారణంగా టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే కేఎల్ రాహుల్‌ను బంగ్లాదేశ్ సిరీస్‌లో 6వ ర్యాంక్‌కు పంపినా అతని అదృష్టం మారలేదు.

బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో అర్ధసెంచరీ సాధించాడు. శనివారం చివర్లో అతను బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికే న్యూజీలాండ్ రెండో బంతి తీసుకుంది. రాహుల్ 16 బంతుల్లో 12 పరుగులు చేయగలిగాడు.

మొత్తం మీద న్యూజీలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. 1988 నవంబర్‌లో చివరిసారిగా న్యూజీలాండ్ భారత్‌లో టెస్టు గెలిచింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)