ఆ పట్టణంలో క్రికెట్‌ను ఎందుకు నిషేధించారు?

- రచయిత, సోఫియా బెతిజా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటలీలోని ఎడ్రియాటిక్ తీరంలో సూర్యుడు నిప్పులు కక్కుతుంటే, బంగ్లాదేశ్‌కు చెందిన స్నేహితుల బృందం ఓ చిన్న కాంక్రీట్ పిచ్‌పై క్రికెట్ ప్రాక్టీస్ చేస్తోంది. ట్రియెస్ట్ విమానాశ్రయం సమీపంలో ఉన్న మోనఫల్కొనే పట్టణంలో వారు క్రికెట్ ఆడకుండా మేయర్ నిషేధం విధించారు.
ఒకవేళ పట్టణంలో ఆడేందుకు ప్రయత్నిస్తే 100 యూరోలు (సుమారు 9,330 రూపాయలు) జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.
‘‘మేం మోనఫల్కొనేలో ఆడేందుకు వెళ్తే, మమ్మల్ని ఆపేందుకు అక్కడ పోలీసులు సిద్ధంగా ఉంటారు’’ అని టీమ్ కెప్టెన్ మియా బప్పీ చెప్పారు.
ఓ పార్కులో తమ జాతీయ క్రీడ ఆడుతూ పోలీసులకు చిక్కిన బెంగాలీ టీనేజర్ల గ్రూపు వైపు ఆయన చూపించారు. తమను సెక్యూరిటీ కెమెరాలు చిత్రీకరిస్తున్నాయనే విషయం తెలియక, వారు ఆడుకుంటుంటే పోలీసుల గస్తీ బృందం వచ్చి వారి ఆటను ఆపేసి, జరిమానా విధించింది.
‘‘వారు క్రికెట్ ఇటలీ ఆట కాదంటారు. కానీ మీకో నిజం చెబుతాను.. కేవలం మేం విదేశీయులం కావడమే దీనికి కారణం’’ అని మియా చెప్పారు.
క్రికెట్‌పై నిషేధం పట్టణంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్రిక్తతలను పెంచినట్టయింది.


‘‘చరిత్రను తుడిచేస్తున్నారు’’
మోనఫల్కొనే ఇటలీలోని మిగిలిన పట్టణాల కంటే సాంస్కృతిక వైవిధ్యంతో ఉంటుంది. ఈ పట్టణ జనాభా 30 వేలు. అందులో విదేశీయులే ఎక్కువ. వారిలో ఎక్కువ మంది బంగ్లాదేశీ ముస్లింలే. వీరంతా 1990లో భారీ క్రూయిజ్ నౌకల నిర్మాణం కోసం వచ్చారు.
దీనివల్ల మోనఫల్కొనే సంస్కృతి ప్రమాదంలో పడిందని మేయర్ అన్నా మరియా సిసింట్ భావిస్తున్నారు. ఆమె ఫార్‌రైట్ లీగ్ పార్టీకి చెందినవారు.
‘‘మన చరిత్రను తుడిచేస్తున్నారు. ప్రతిదీ దారుణంగా మారుతోంది’’ అని ఆమె నాతో చెప్పారు.
మోనఫల్కొనేలో పాశ్చాత్య దుస్తులు ధరించే ఇటాలియన్లు సల్వార్ కమిజ్, హిజాబ్ ధరించే బంగ్లాదేశీయులతో కలిసిపోతారు. అక్కడ బంగ్లాదేశ్ రెస్టరెంట్లు, హలాల్ దుకాణాలు, దక్షిణాసియా కమ్యూనిటీ ప్రజలు ఎక్కువగా ఉపయోగించే సైకిల్ మార్గాల నెట్‌వర్క్‌లు కూడా ఉన్నాయి.
సిసింట్ తన రెండు పర్యాయాల పదవీకాలంలో బంగ్లాదేశీయులు టౌన్‌స్క్వేర్‌లో కూర్చోవడానికి ఉపయోగించే బెంచీలను తొలగించారు. బీచ్‌లలో ముస్లిం మహిళలు ధరించే దుస్తులకు వ్యతిరేకంగా మాట్లాడారు.
క్రికెట్‌పై నిషేధం విషయానికి వచ్చినప్పుడు ‘‘కొత్త పిచ్‌ల నిర్మాణానికి డబ్బుకానీ, సరిపడా స్థలం కానీ లేవు. పైగా క్రికెట్ బంతులు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి’’ అని ఆమె అన్నారు.
బంగ్లాదేశీయులు తమ జాతీయక్రీడను ఆడుకోవడానికి అనుమతిని నిరాకరించినట్టు ఆమె బీబీసీకి చెప్పారు. పైగా దానివల్ల వచ్చే ‘‘ప్రయోజనం ఏమీ లేదు’’ అని తెలిపారు.
‘‘వారు ఈ పట్టణానికి, మా కమ్యూనిటీకి ఇచ్చింది శూన్యం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘వారు మోనఫల్కొనే బయటకు వెళ్ళి ఎక్కడైనా హాయిగా క్రికెట్ ఆడుకోవచ్చు’’ అని తెలిపారు.
ముస్లింల పట్ల తన వైఖరి కారణంగా చంపుతామనే బెదిరింపులను ఆమె ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమె 24 గంటలూ పోలీసుల రక్షణలో ఉంటున్నారు.

‘నౌకల నిర్మాణానికి వచ్చారు’
మియా బప్పీ, ఆయన సహచర క్రికెటర్లు యూరప్‌లోనే అతిపెద్ద, ప్రపంచంలో అతిపెద్దవాటిలో ఒకటైన ఫిన్‌కంటియరి నౌకాశ్రయంలో నౌకల నిర్మాణం కోసం ఇటలీకి వచ్చారు.
అయితే, ఈ కంపెనీ తరచూ విదేశీ కార్మికులకు మార్కెట్ స్థాయి కంటే తక్కువ వేతనాలు చెల్లిస్తోందని మేయర్ ఆరోపిస్తున్నారు. ఇంత తక్కువ జీతానికి ఏ ఇటాలియన్ కూడా పనిచేయడానికి ఇష్టపడరని ఆమె వాదిస్తున్నారు.
అయితే షిప్ యార్డు డైరెక్టర్ క్రిస్టియానో బజారా మాత్రం కంపెనీ, దాని కాంట్రాక్టర్లు చెల్లించే జీతాలు ఇటలీ చట్టాలకు లోబడే ఉన్నాయని చెబుతున్నారు.
‘‘మాకు శిక్షణ పొందిన కార్మికులు దొరకడం లేదు. యూరప్‌లో షిప్‌యార్డ్‌లో పనిచేసేందుకు యువత ఇష్టపడటం లేదు’’ అని ఆయన చెప్పారు.
ఇటలీ కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. ఈ సమస్యను అధిగమించడానికి ఇటలీకి 2050 నాటికి 2,80,000 మంది విదేశీ కార్మికులు అవసరమని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
మోనఫల్కొనేలో రెండు ఇస్లామిక్ కేంద్రాలలో సామూహిక ప్రార్థనలను మేయర్ నిషేధించిన తర్వాత ఉద్రిక్తతలు తలెత్తాయి.
‘‘ఒకే భవంతిలో 1900 మంది ప్రార్థనలు చేస్తున్న దిగ్భ్రాంతి కలిగించే ఫోటోలు ప్రజలు నాకు పంపుతున్నారు. పట్టణంలోని రెండు ఇస్లామిక్ కేంద్రాలలో ఇలాగే పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. పేవ్‌మెంట్‌పై అనేక బైక్‌లు ఉన్నాయి. ప్రతిరోజూ ఐదుసార్లు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తారు. రాత్రిపూట కూడా చేస్తారు. ఇది స్థానికులకు చాలా ఇబ్బంది కలిగిస్తోంది’’ అని సిసింట్ చెప్పారు.
ఇస్లామిక్ కేంద్రాలు మతపరమైన ప్రార్థనల కోసం ఉద్దేశించినవి కావని, వాటిని ఏర్పాటు చేయడం తన పని కాదని ఆమె అన్నారు.

‘మా పనేమిటో మాకు తెలుసు’
ఇటలీ చట్టాల ప్రకారం అధికారిక హోదా కలిగిన 13 మతాలలో ఇస్లాం లేదు. దీంతో ప్రార్థనా కేంద్రాల నిర్మాణం సమస్యాత్మకంగా మారింది.
మేయర్ నిర్ణయం ముస్లిం కమ్యూనిటీపై తీవ్రప్రభావం చూపిందని మోనఫల్కొనేలోని బంగ్లాదేశీయులు చెప్పారు.
‘‘ఇటలీని బెంగాలీలు ఇస్లామీకరణ చేస్తారని మేయర్ అనుకుంటున్నారు. కానీ మా పనేమిటో మాకు తెలుసు’’ అని 19 ఏళ్ళ మెహిలీ చెప్పారు.
ఆమె ఢాకాకు చెందినవారు. కానీ ఇటలీలో పెరిగారు. పాశ్చాత్య దుస్తులు ధరిస్తారు. అనర్గళంగా ఇటాలియన్ భాష మాట్లాడతారు.
తన బెంగాలీ వారసత్వం కారణంగా వీధులలో వేధింపులకు గురయ్యానని ఆమె చెప్పారు.
‘‘మేం ఎటువంటి ఇబ్బందులకు కారణం కాదు. మేం పన్నులు చెల్లిస్తున్నాం. కానీ మేం ఇక్కడ ఉండాలని వారు అనుకోవడం లేదు’’ అని ’’ అని మియా బప్పీ చెప్పారు.
బంగ్లాదేశీయుల జీవనశైలి స్థానిక ఇటాలియన్లతో సరితూగదని మేయర్ విశ్వాసం.
ఇస్లామిక్ సెంటర్లలో సామూహిక ప్రార్థనలను నిషేధిస్తూ పురపాలక సంఘం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు రద్దు చేసింది.
అయితే, ఇటలీ వెలుపల "ఐరోపా ఇస్లామీకరణ" అనే తన పిలుపుపై ప్రచారాన్ని కొనసాగిస్తామని మోనఫల్కొనే మేయర్ స్పష్టం చేశారు.
ఇప్పుడు యూరోపియన్ పార్లమెంటుకు ఎన్నికైన ఆమె త్వరలోనే తన సందేశాన్ని బ్రస్సెల్స్‌కు తీసుకెళ్లే అవకాశం ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














