జీ7లో భారత్ సభ్యదేశం కానప్పటికీ మోదీకి ఆహ్వానం.. ఏడు అత్యంత ధనిక దేశాల ఈ కూటమి ఎందుకంత పవర్‌ఫుల్?

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, ANI

జీ7 సదస్సులో పాల్గొనడానికి ప్రధాని నరేంద్రమోదీ గురువారం ఇటలీ బయలుదేరారు. ఇటలీలో జూన్ 13-15 వరకు జీ7 బృందం 50వ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది.

ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, భారత ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ ఖత్రా వెల్లడించారు.

జీ7 బృందంలో భారత్ లేనప్పటికీ శుక్రవారం జరిగే సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందినట్లు ఆయన చెప్పారు.

మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే.

సదస్సు సందర్భంగా మెలోనీతో మోదీ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.

ప్రస్తుతం గాజా, యుక్రెయిన్‌ యుద్ధాలపై చర్చించడానికి జీ7 దేశాల నాయకులు ఇటలీలో సమావేశం అవుతున్నారు.

జీ7 సదస్సులో ఆఫ్రికా, ఇండో-పసిఫిక్ రీజియన్‌కు చెందిన నాయకులు కూడా పాల్గొంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఆర్థిక సహకారం గురించి చర్చిస్తారు.

వాట్సాప్ చానల్

జీ7 అంటే ఏంటి?

జీ7 అనేది ప్రపంచంలోని అత్యంత ధనిక, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశాల కూటమి.

ఈ దేశాలు ప్రపంచ వాణిజ్యం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం ప్రదర్శిస్తాయి.

జీ7 బృందంలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యునైటెడ్ స్టేట్స్ సభ్య దేశాలు.

1988లో రష్యా ఈ బృందంలో చేరడంతో జీ8గా మారింది. అయితే, 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడంతో ఈ బృందం నుంచి రష్యాను తొలగించారు.

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా గల దేశమైనప్పటికీ చైనా ఎప్పుడూ ఈ బృందంలో సభ్యదేశంగా లేదు.

జీ7 బృందంలోని దేశాలతో పోల్చినప్పుడు చైనా తలసరి ఆదాయం చాలా తక్కువ. కాబట్టి చైనాను అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా పరిగణించడంలేదు.

అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో కూడిన జీ20 గ్రూపులో రష్యా, చైనాలు సభ్యదేశాలుగా ఉన్నాయి.

ఈయూ, జీ7లో సభ్యదేశం కాదు. కానీ, వార్షిక సమావేశానికి హాజరవుతుంది.

జీ 7 మంత్రులు, అధికారులు ఏడాది పొడవునా సమావేశం అవుతారు. ప్రపంచ ఘటనలపై ఒప్పందాలు, ఉమ్మడి ప్రకటనలు వెలువరిస్తారు.

2024 జీ7 సమావేశాలకు ఇటలీ అధ్యక్షత వహిస్తోంది.

జీ7 దేశాధినేతలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2024 ఏప్రిల్‌లో సమావేశమైన జీ7 దేశాల విదేశీ మంత్రులు

ఈ ఏడాదికి ఇటలీ అజెండా ఏంటి?

ఇటలీలోని అపులియాలో జూన్ 13నుంచి 15వరకు 2024 జీ7 సదస్సు జరుగుతుంది.

జార్జియా మెలోని 2022 అక్టోబర్‌లో ఇటలీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఆధ్వర్యంలో జరుగుతున్న తొలి ప్రధాన అంతర్జాతీయ సదస్సు ఇదే.

ఈ సదస్సు యుక్రెయిన్, గాజా యుద్ధాలతో పాటు ఆఫ్రికా, వలసలు, ఆర్థిక భద్రత, కృత్రిమ మేధ (ఏఐ)పై అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై దృష్టి సారించాలని తాము కోరుకుంటున్నట్లు ఇటలీ ప్రభుత్వం తెలిపింది.

యుక్రెయిన్, గాజా యుద్ధాల విషయంలో జీ7 నాయకులు ఏం చేయగలరు?

జీ7 దేశాలు ఇప్పటికే రష్యాపై భారీ ఆంక్షలు విధించాయి. ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థపై విధించిన అతిపెద్ద ఆంక్షల ప్యాకేజీ ఇదే.

అంతర్జాతీయ వాణిజ్యం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి రష్యాను నిరోధించాయి. తమ ప్రాంతాల్లో రష్యాకు చెందిన దాదాపు 300 బిలియన్ డాలర్ల ఆస్తులను స్తంభింపచేశాయి.

స్తంభింపచేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చిన వడ్డీని రుణం రూపంలో యుక్రెయిన్‌కు ఇచ్చే అంశమ్మీద జీ7 దేశాలు ఇప్పుడు పని చేస్తున్నాయని నివేదికలు ఉన్నాయి. వడ్డీ రూపంలో వచ్చే మొత్తం 50 బిలియన్ డాలర్లు ఉండొచ్చు.

గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన ప్రణాళికను జూన్ 3న జీ7 దేశాల నేతలందరూ సమర్థించారు.

జార్జియా మెలోని

ఫొటో సోర్స్, Getty Images

ఆర్థిక భద్రత, ఏఐ ప్రమాదాలను జీ7 ఎలా పరిష్కరిస్తుంది?

2023లో జీ7 సదస్సుకు జపాన్ అధ్యక్షత వహించింది. అంతర్జాతీయ ఆర్థిక భద్రత కోసం ఒక ప్రణాళిక రచించేలా ఈ బృందాన్ని జపాన్ ప్రేరేపించింది.

చైనా, రష్యా వంటి దేశాలు తమ ఆర్థిక బలాన్ని ఉపయోగిస్తూ ఇతరులపై తమ ఇష్టాఇష్టాలను రుద్దకుండా నిరోధించేందుకు యాంటీ కోర్సిన్ ప్యాక్ట్‌ను అప్పుడు జీ7 ఆమోదించింది.

చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి 2023 డిసెంబర్‌లో ఇటలీ బయటకు వచ్చేసింది.

ఈ కార్యక్రమంలో చేరడమే తాము చేసిన అతిపెద్ద పొరపాటు అని మెలోని వ్యాఖ్యానించారు.

ఇటలీ సదస్సులో జీ7 నేతలు, ఆర్థిక భద్రతపై తదుపరి చర్యలు తీసుకోవాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2023లో జపాన్‌లో జరిగిన సదస్సులో .. ప్రపంచవ్యాప్తంగా భద్రమైన, విశ్వసనీయ ఏఐని ప్రచారం చేసేందుకు హిరోషిమా ఏఐ ప్రాసెస్‌ను తీసుకొచ్చారు.

ఇదంతా సమష్టి చర్యల వల్లే జరిగింది.

తాజా సదస్సు ఏఐ భద్రతకు మరిన్ని అంతర్జాతీయ నిబంధనలను రూపొందించడంపై దృష్టి సారించే అవకాశం ఉంది.

జీ7కు ఎలాంటి అధికారాలు ఉంటాయి?

జీ7 బృందం ఎలాంటి చట్టాలను ఆమోదించలేదు. అయితే, జీ7 తీసుకున్న కొన్ని నిర్ణయాలు గతంలో ప్రపంచ స్థాయిలో ప్రభావం చూపించాయి.

ఉదాహరణకు, 2002లో మలేరియా, ఎయిడ్స్‌లపై పోరాటానికి ప్రపంచ నిధిని ఏర్పాటు చేయడంలో జీ7 కీలక పాత్ర పోషించింది.

2021 జీ7 సదస్సుకు ముందు, జీ7 దేశాల ఆర్థిక మంత్రులు బహుళజాతి కంపెనీలు అధిక పన్ను కట్టేలా చేయడానికి అంగీకరించాయి.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయాన్ని అందించాయి. వాతావరణ మార్పులను అరికట్టే చర్యలు తీసుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)