జీ 7: బహుళజాతి సంస్థలపై పన్ను ఒప్పందాన్ని ట్యాక్స్ నిపుణులు ఎందుకు విమర్శిస్తున్నారు?

జీ-7 సదస్సులో వివిధ దేశాల ఆర్థికమంత్రులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జీ-7 సదస్సులో వివిధ దేశాల ఆర్థికమంత్రులు

రెవెన్యూ ఆర్జించేచోటే బహుళజాతి సంస్థలపై(మల్టీనేషనల్ కంపెనీలపై) పన్నులు వసూలు చేసేందుకు జీ 7 దేశాలు కుదుర్చుకున్న చరిత్రాత్మక ఒప్పందాన్ని ట్యాక్స్ నిపుణులు విమర్శిస్తున్నారు.

వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న చోటే దిగ్గజ టెక్నాలజీ సంస్థల నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేసేందుకు వీలుకల్పించే ఈ ఒప్పందానికి.. లండన్‌లో జరుగుతున్న సమావేశాల్లో శనివారం జీ 7 దేశాల ఆర్థిక మంత్రులు ఆమోదముద్ర వేశారు.

ఈ ఒప్పందాన్ని దిగ్గజ టెక్నాలజీ సంస్థలు స్వాగతించాయి.

అయితే, కార్పొరేషన్ పన్ను కనీస పరిమితి(మినిమమ్ కార్పొరేట్ ట్యాక్స్)ను 15 శాతంగా నిర్దేశించడాన్ని చారిటీ సంస్థ ఆక్స్‌ఫామ్ విమర్శించింది. ఇది చాలా తక్కువని, దీని వల్ల పెద్ద తేడా ఏమీ కనిపించదని వ్యాఖ్యానించింది.

జీ 7 దేశాల ప్రతినిధులు

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, జీ 7 దేశాల ప్రతినిధులు

తాజా ఒప్పందం ప్రకారం.. తాము లావాదేవీలు నిర్వహించే దేశాల్లో బహుళ జాతి సంస్థలు కనీసం 15 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, తక్కువ పన్నులుండే దేశాల్లో ప్రధాన కార్యాలయాలు ఏర్పాటుచేసుకొని, పన్నులు ఎగవేయకుండా భారీ సంస్థలను అడ్డుకోవడానికి ఈ మినిమమ్ కార్పొరేట్ ట్యాక్స్ సరిపోదని చారిటీ సంస్థలు అంటున్నాయి.

''స్విట్జర్లాండ్, సింగపూర్ లాంటి తక్కువ పన్నులు విధించే దేశాల తరహాలో ఈ కనీస పరిమితి ఉంది. ఇదొక వివక్ష పూరిత ఒప్పందం. ఎందుకంటే దీంతో జీ 7 దేశాలకు మాత్రమే లాభం జరుగుతుంది. పేద దేశాలకు జరిగేది నష్టమే''అని ఆక్స్‌ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రియేలా బుచెర్ వ్యాఖ్యానించారు.

మైక్రోసాఫ్ట్, అమెజాన్

ఫొటో సోర్స్, Getty Images

సంస్థలు ఏం అంటున్నాయి?

జీ 7 ఒప్పందాన్ని దిగ్గజ టెక్నాలజీ సంస్థలు స్వాగతించాయి.

''ఈ అంతర్జాతీయ పన్ను సంస్కరణల విధానం విజయవంతం కావాలని మేం కోరుకుంటున్నాం. వేర్వేరు చోట్ల ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వచ్చినా మేం దీన్ని గౌరవిస్తున్నాం''అని ఫేస్‌బుక్‌ ఉపాధ్యక్షుడు నిక్ క్లెగ్ అన్నారు.

అంతర్జాతీయ ట్యాక్స్ వ్యవస్థలో ఈ ఒప్పందంతో సుస్థిరత నెలకొంటుందని ఆశిస్తున్నట్లు అమెజాన్ అధికార ప్రతినిధి చెప్పారు.

''అంతర్జాతీయ పన్ను విధానాలను ఆధునికీకరిస్తూ తీసుకొచ్చిన ఈ ఒప్పందానికి మేం మద్దతు పలుకుతున్నాం. ఈ ఒప్పందానికి తుది రూపు నిచ్చేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేస్తాయని ఆశిస్తున్నాం''అని గూగుల్ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.

జీ 7 దేశాల ప్రతినిధులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జీ 7 దేశాల ప్రతినిధులు

ఏమిటీ ఒప్పందం

లండన్‌లో జరుగుతున్న సమావేశాల్లో మల్టీనేషనల్ కంపెనీలపై పన్నులు వేసేందుకు వీలుకల్పించే ఈ ఒప్పందాన్ని జీ 7 దేశాలు ఆమోదించాయి.

ప్రపంచ వ్యాప్తంగా అమలయ్యే ‘‘కార్పొరేషన్ పన్ను కనిష్ఠ పరిమితి (మినమమ్ రేట్ ఆఫ్ కార్పొరేషన్ ట్యాక్స్)’’ కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంది.

ముఖ్యంగా అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ టెక్నాలజీ మల్టీనేషనల్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ఈ ఒప్పందాన్ని సిద్ధం చేశారు. ఎక్కడైతే విక్రయాలు జరుగుతున్నాయో అక్కడే పన్నులు విధించేందుకు ఈ ఒప్పందంతో అవకాశం ఏర్పడుతుంది. అంటే ప్రధాన కార్యాలయాలు, పేటెంట్ హక్కులు, ట్రేడ్ మార్క్‌లతో పనిలేకుండా.. విక్రయాలు జరిగే చోటే పన్నులు వసూలు చేస్తారు.

ఈ ఒప్పందం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని జర్మనీ ఆర్థిక మంత్రి ఓలాఫ్ ష్కాల్జ్ అన్నారు.

‘’15 శాతం పన్ను విధిస్తే, కరోనా సమయంలో తీసుకున్న రుణాలను హాయిగా చెల్లించుకోవచ్చు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘కార్పొరేట్ సంస్థలకు కనిష్ఠ పన్ను పరిమితిని నిర్దేశిస్తే... ఒకరి కంటే మరొకరు తక్కువ పన్ను విధించుకుంటూ కిందకు వెళ్లే తత్వానికి తెరపడుతుంది’’అని ఆయన బీబీసీతో చెప్పారు.

‘‘కరోనా సమయంలో ప్రజారోగ్యం కోసం పెట్టిన భారీ ఖర్చులు, తీసుకున్న రుణాలను చెల్లించేందుకు ఈ పన్నులు ఉపయోగపడతాయి’’.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీ, జపాన్, ఐరోపా యూనియన్‌ల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.

అమెజాన్

ఫొటో సోర్స్, Getty Images

అదే అసలు సమస్య

కార్పొరేషన్ పన్ను కనిష్ఠ పరిమితి (మినమమ్ రేట్ ఆఫ్ కార్పొరేషన్ ట్యాక్స్) ఎంత విధించాలన్నదానిపైనే చాలావరకు చర్చలు జరిగాయని ఇద్దరు ఆర్థిక మంత్రులూ అంగీకరించారు.

‘‘కనిష్ఠ పరిమితిని 15 శాతంతో మొదలుపెట్టొచ్చు’’అని మైరె అన్నారు.

‘’15 శాతం కంటే ఎక్కువకు దీన్ని తీసుకెళ్లగలిగినా బావుంటుంది’’.

మరోవైపు 15 శాతం అనేది మెరుగైన నిర్ణయమేనని ఓలాఫ్ కూడా అన్నారు..

శుక్రవారం నుంచి మొదలైన ఈ సమావేశాల్లో వాతావరణ మార్పులపై కూడా దేశాల ఆర్థిక మంత్రులు చర్చిస్తారు.

జీ 7 చర్చలకు ముందుగా, ఈ అంతర్జాతీయ పన్ను వ్యవస్థకు అన్ని దేశాలూ అంగీకరించాలని ఇటలీ, స్పెయిన్ మంత్రులతో కలిసి మైరె, ఓలాఫ్ అభ్యర్థించారు.

‘‘ఎలాంటి వివక్షాలేని, మెరుగైన అంతర్జాతీయ పన్ను వ్యవస్థను పరిచయం చేస్తున్నాం. ఆర్థిక సంక్షోభం నడుమ ఇది తప్పనిసరి’’అని వారు ఓ లేఖ కూడా విడుదల చేశారు.

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

అందుకే భిన్నంగా...

‘‘తొలుత కార్పొరేషన్ పన్ను కనిష్ఠ పరిమితి విషయంలో బ్రిటన్ స్వరం కాస్త భిన్నంగా వినిపించింది. ఎందుకంటే ఇక్కడ కార్పొరేషన్ పన్ను పెంచి, ఉద్యోగాలను సృష్టిస్తామని ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారు. మరోవైపు ఇప్పుడు కనిష్ఠ పరిమితికి అంగీకరిస్తే.. తర్వాత తగ్గించే అవకాశం తమ ఛాన్సెలర్‌లకు ఉండదని యూకే భావిస్తోంది’’అని ఎకనమిక్స్ ఎడిటర్ ఫైసల్ ఇస్లాం అన్నారు.

‘‘ఇప్పటికే డిజిటల్ ట్యాక్స్‌లు వసూలు చేస్తున్న ఫ్రాన్స్, ఇటలీ, యూకే తమ పన్నులను తక్షణమే ఉపసంహరించుకోవాలని అమెరికా కోరుతోంది’’.

‘‘ఎక్కడైతే విక్రయాలు జరుగుతున్నాయో అక్కడే పన్నులు విధించేందుకు తాజా ఒప్పందంతో అవకాశం ఏర్పడుతుంది. అంటే ప్రధాన కార్యాలయాలు, పేటెంట్ హక్కులు, ట్రేడ్ మార్క్‌లతో పనిలేకుండా.. విక్రయాలు జరిగే చోటే పన్నులు వసూలు చేస్తారు’’.

‘‘కేవలం దిగ్గజ మల్టీనేషనల్ టెక్ సంస్థలకే కాదు... సంప్రదాయ మల్టీనేషనల్ సంస్థల విషయంలోనూ ఇది విప్లవాత్మక మార్పు’’.

మైక్రోసాఫ్ట్

ఫొటో సోర్స్, PA Media

అడ్డుకోవడం ఎలా...

గూగుల్, అమెజాన్, స్టార్‌బక్స్ లాంటి సాంకేతిక దిగ్గజ సంస్థలు ఆదాయం ఆర్జిస్తున్న చోట కాకుండా, పన్నులు తక్కువగా ఉండేచోట ట్యాక్స్‌లు కట్టడాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని సిద్ధంచేశారు.

అమెరికా సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఐర్లండ్‌లోని సబ్సిడరీ సంస్థ గతేడాది 315 బిలియన్ డాలర్లపై కార్పొరేషన్ ట్యాక్స్‌ను కట్టకుండా తప్పించుకుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా సమావేశాలు జరుగుతున్నాయి.

‘‘మైక్రోసాఫ్ట్ రౌండ్ ఐలాండ్ వన్’’ సంస్థ ప్రధాన కార్యాలయం బెర్ముడాలో ఉంది. అయితే, దీని లావాదేవీలన్నీ ఐర్లండ్‌లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)