భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అపర్ణ అల్లూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశం జనవరిలో వ్యాక్సీన్ కార్యక్రమాన్ని ఒక ఆశావహ దృక్పథంతో మొదలుపెట్టింది. ఆ సమయంలో దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది.
ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అవసరమైన వ్యాక్సీన్లలో అధిక భాగం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సరఫరా చేయవలసి ఉంది. జులై 2021 నాటికి కనీసం 20 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది.
వ్యాక్సీన్ పంపిణీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన పథకంలో భాగంగా భారతదేశం వ్యాక్సీన్లను కొన్ని దేశాలకు ఎగుమతి కూడా చేసింది.
కానీ, వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలయిన మూడు నెలలకే దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం మొదలయింది.
ఇప్పటికి దేశంలో కేవలం 2.6 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. 1.24కోట్ల మందికి మొదటి డోసు వ్యాక్సీన్ తీసుకోవడం పూర్తయింది.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎగుమతులను ఆపేసింది. ప్రస్తుతం దేశంలో వ్యాక్సీన్ డోసులు అందుబాటులో లేవు. అవి ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో కూడా తెలియదు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పరిస్థితికి కారణమేంటి?
వ్యాక్సీన్ల సరఫరా తక్కువగా ఉన్న సమయంలో వాటికి డిమాండు పెరిగింది. కొన్ని లక్షల మంది భారతీయులు బుధవారం మధ్యాహ్నం వ్యాక్సీన్ కోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయానికి వ్యాక్సీన్ నమోదు పోర్టల్, సంబంధిత యాప్ లు కూడా క్రాష్ అయ్యాయి.
వ్యాక్సీన్ సరఫరా తక్కువ, డిమాండు ఎక్కువ
మే 01 నుంచి 18- 44 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న సుమారు 60 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సీన్ ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, వ్యాక్సీన్ కోసం నమోదు చేసుకోవలసిన కోవిన్ యాప్ మాత్రం సహకరించలేదు.
"నేను ఓటిపి కోసం వేచి చూస్తూ ఆ వలయంలో భయానకంగా చిక్కుకున్నాను" అని వ్యాక్సీన్ కోసం నమోదు చేసుకోవడానికి ప్రయత్నించిన ఒక 33 సంవత్సరాల వ్యక్తి అన్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ కోసం వన్ టైం పాస్ వర్డ్ లను వాడతారు.
ఆమెకు ఓటిపిలు అయితే వరసగా వచ్చాయి. కానీ, ఆ ఓటిపి ఎంటర్ చేసేందుకు అయితే వీలు కాలేదు. కొంత మందికి అయితే ఓటిపి లు కూడా రాలేదు.
మరి కాసేపట్లోనే ట్విటర్ లో, #వెయిటింగ్ ఫర్ ఓటిపి అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టింది.
ఆ వెంటనే మీమ్ లు, జోక్ లు మొదలయిపోయాయి.
మరి కాసేపటికి సైటు పని చేయడం మొదలయింది. కానీ, వ్యాక్సీన్ కోసం నమోదు చేసుకున్న 1.3 లక్షల మందికి కనీసం ఒక్క వ్యాక్సీన్ కేంద్రం కూడా అందుబాటులోకి రాలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వ్యాక్సీన్ తీసుకోవడానికి అర్హులైన 60 కోట్ల మందిలో వ్యాక్సీన్ కోసం నమోదు చేసుకున్న వారు కేవలం ఒక చిన్న వంతు మాత్రమే. ఇంకా రెండవ డోసు వ్యాక్సీన్ తీసుకోవడానికి 45 సంవత్సరాలు దాటిన వారు మరో 20 కోట్ల మంది ఉన్నారు.
వ్యాక్సీన్ నిల్వలు తగినంత లేకపోతే ముందుగా 45 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సీన్ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఉండాల్సిందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సీన్ తీసుకోవచ్చని ప్రకటించకుండా ఉండాల్సిందని అంటున్నారు.
ప్రభుత్వం కూడా ముందుగా ఇలానే భావించింది. కానీ, దేశంలో కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరుగుతుండంతో 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా వ్యాక్సీన్ ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
"ముందు ముప్పు ఎక్కువగా ఉన్న వారి పై దృష్టి పెట్టి ఉండాల్సింది. ఇప్పుడు ఈ 45 సంవత్సరాలు దాటిన వారంతా వ్యాక్సీన్ తీసుకోవడానికి మిగిలిన 60 కోట్ల మందితో పోటీ పడాలి " అని ఆర్థికవేత్త పార్థా ముఖోపాధ్యాయి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం 18సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సీన్ తీసుకోవచ్చని ప్రకటించినప్పటి నుంచి వ్యాక్సీన్ కేంద్రాల దగ్గర ప్రజలు క్యూ కట్టడం మొదలు పెట్టారు.
అయితే, భారతదేశం తలపెట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం గందరగోళంగా మారడానికి కేవలం వ్యాక్సీన్ కొరత మాత్రమే కారణం కాదు.
ఇప్పటి వరకు ప్రభుత్వ ఆమోదం పొందిన కోవి షీల్డ్, కో వ్యాక్సీన్ వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం మాత్రమే నేరుగా కొనుగోలు చేసింది.
కానీ, వాటిని 28 రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ప్రైవేటు హాస్పిటళ్లు కూడా ఎవరికి వారే కొనుక్కోవచ్చని ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. కానీ, వారు ఎక్కువ మొత్తంలో వ్యాక్సీన్ ధర చెల్లించాల్సి ఉంటుంది.
50 శాతం వ్యాక్సీన్ స్టాక్ ను కేంద్ర ప్రభుత్వం డోసు 150 రూపాయలకే ఖరీదు చేస్తోంది. కానీ, మిగిలిన 50 శాతం స్టాక్ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దానికి రెట్టింపు సొమ్ము ఇచ్చి ఖరీదు చేయాలి. ప్రైవేటు ఆసుపత్రులయితే దానికి 8 రెట్లు ఎక్కువ ఖరీదు చెల్లించాల్సి ఉంటుంది.
అకస్మాత్తుగా ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాల పైకి నెట్టివేయడంతో ఈ వ్యాక్సీన్ ధర గురించి బేరసారాలు చేసే సమయం అధికారుల దగ్గర లేకుండా పోయింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ చేసిన స్టాక్ ఇంకా సరఫరా చేయవలసి ఉంది.
"వ్యాక్సీన్ ఉత్పత్తిదారుల నుంచి రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేయడానికి అవకాశం ఇస్తున్న ప్రభుత్వం మనమొక్కటే. ఇది సరైన ఆలోచనతో తీసుకున్న నిర్ణయం కాదు" అని ముఖోపాధ్యాయి అన్నారు.
రక రకాల ధరలు విచారం కలిగించేలా ఉన్నాయి. రాష్ట్రాలు ఎక్కువ ధరకు వ్యాక్సీన్ ఎందుకు కొనుగోలు చేయాలి? వాళ్ళు కూడా ప్రజలు చెల్లించిన పన్ను సొమ్మునే కదా వాడుతున్నారు" అని పబ్లిక్ హెల్త్ నిపుణుడు శ్రీనాథ్ రెడ్డి అన్నారు.
"వ్యాక్సినేషన్ ఉచితంగా జరగాలి. ఇది ప్రజా ప్రయోజనం కోసం చేస్తున్న పని". ఇది ఇప్పుడు మార్కెట్ చేతిలోకి వెళ్లిపోతుందేమోననే భయాన్ని వ్యక్తం చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో వ్యాక్సీన్ కొనుక్కోలేని పేద ప్రజలు చివర వరసలో మిగిలిపోతారేమో" అనే సందేహాన్ని వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మే 02 నుంచి 18-44 సంవత్సరాల వారికి వ్యాక్సీన్ ఇవ్వడం మొదలు పెడతామని రెండు ప్రైవేట్ హాస్పిటళ్లు ప్రకటించాయి.
అయితే, వ్యాక్సీన్ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ ఆసుపత్రులు వ్యాక్సీన్ ఎలా సంపాదించాయనే విషయం పై స్పష్టత లేదు.
ఎవరికీ ఏ విషయమూ అర్ధం కావటం లేదు. ఒక వేళ కొంత వ్యాక్సీన్ డోసులు సరఫరా అయినా అవి అందరికీ సరిపడేంత ఉంటాయో లేదో తెలియదు. దీంతో వ్యాక్సీన్ కొరత రానున్న నెలల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది.
45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సీన్ డోసులు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి మరో 6.15 కోట్ల డోసుల అవసరం ఉంది..
మిగిలిన వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకుందామని చూస్తున్నాయి.
వీరికి కనీసం 1.2 బిలియన్ డోసుల అవసరం ఉంటుంది. హెర్డ్ ఇమ్మ్యూనిటీ సాధించేందుకు కనీసం 70 శాతం మందికి వ్యాక్సీన్ ఇవ్వాలంటే కనీసం 80.7 కోట్ల డోసులను ఇవ్వవలసి ఉంటుంది.
వచ్చే సంవత్సరానికంతా వీరందరికీ వ్యాక్సీన్ ఇవ్వడం పూర్తి కావాలంటే భారతదేశానికి కనీసం రోజుకు 35 లక్షల డోసుల అవసరం ఉంటుంది. అయితే, అవసరానికి తగినంత సరఫరా జరుగుతున్నట్లు కనిపించటం లేదు. మే నాటికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 7 కోట్ల డోసులను, భారత్ బయో టెక్ 2 కోట్ల డోసులను ఉత్పత్తి చేయవలసి ఉంది.
ప్రస్తుతానికి భారతదేశం స్పుత్నిక్ వి వ్యాక్సీన్ కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకోనున్నది. ఆ వ్యాక్సీన్ ఉత్పత్తిదారులు ఇప్పటికే దీని తయారీకి సంబంధించి భారతీయ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇదంతా చూస్తుంటే వ్యాక్సీన్ కొరత మరి కొంత కాలం కొనసాగుతుందని అనిపిస్తోంది.
"ప్లాన్ ఏ పని చేయకపోతే ప్లాన్ బి తో సిద్ధంగా ఉండాలి" అని మహారాష్ట్ర మాజీ ఆరోగ్య కార్యదర్శి మహేష్ జగడే అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ప్లాన్ బి ఎందుకు లేదు?
ఈ ప్రశ్నను చాలా మంది అడిగారు. కానీ, చాలా మంది సెకండ్ వేవ్ వస్తుందని ఊహించలేకపోవడమే ప్లాన్ బి లేకపోవడానికి కారణమని సమాధానం లభిస్తోంది.
"కోవిడ్ కేసుల సంఖ్య తగ్గిపోవడంతో ఇండియా కోవిడ్ ని తరిమికొట్టిందనే వాదనను బాగా వినిపించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వ్యాక్సినేషన్ ఎక్కువగా జరిగి ఉంటే సెకండ్ వేవ్ ఇంత తీవ్రంగా ఉండి ఉండేది కాదు" అని వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ అభిప్రాయపడ్డారు.
కోవిడ్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న వారికి ముందుగా వ్యాక్సీన్ ఇవ్వడం ద్వారా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
కానీ, అలా చేయడానికి జిల్లా, గ్రామ స్థాయిలో పర్యవేక్షణ అవసరమవుతుంది.
అయితే, ఇలాంటి క్షేత్ర స్థాయి పర్యవేక్షణ మహమ్మారి మొదలయినప్పటి నుంచి కూడా లేదని నిపుణులు అంటున్నారు.
అవసరమయితే ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియ కూడా చేపట్టాలని చెప్పారు.
కానీ, ప్రభుత్వం మాత్రం ఆన్ లైన్ లో నమోదు చేసుకోవడం పైనే ఆధారపడింది.
రెండవ వేవ్ తలెత్తదనే ఆలోచన వల్లే ప్లాన్ ఏ విఫలమయింది.
ఇవి కూడా చదవండి:
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
- తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న సిలికాన్ వాలీ సీఈఓ కథ
- అమెరికాతో ఒప్పందం తర్వాత తాలిబన్లు ఏం చేయబోతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








