కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్

మాస్కు ధరించిన బాలిక

ఫొటో సోర్స్, NASIR KACHROO/NURPHOTO VIA GETTY IMAGES

    • రచయిత, జేమ్స్ గళఘర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బ్రిటన్‌లో బయటపడ్డ కరోనావైరస్‌లో కొత్త రకం పిల్లలలో సులువుగా వ్యాప్తి చెందుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అదే నిజమైతే, కోవిడ్ పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతాయని ఇంగ్లండ్‌లోని న్యూ అండ్ ఎమర్జింగ్ రెస్పిరేటరీ వైరస్ థ్రెట్స్ అడ్వైజరీ గ్రూప్ (ఎన్ఈఆర్‌వీటీఏజీ) నిపుణులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశాన్ని శాస్త్రవేత్తలు అత్యవసరంగా పరిశీలిస్తున్నారు.

ఇంతవరకు, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ పిల్లలను ఎక్కువగా బాధించలేదు. వైరస్, శరీరం లోపలికి ప్రవేశించే మార్గాలు పిల్లల్లో తక్కువ ఉండడమే ఇందుకు కారణం అని శాస్త్రవేత్తలు వివరించారు.

కానీ, ఈ కొత్త వేరియంట్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని, స్కూళ్లు తెరిస్తే ఈ వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

అయితే, ఇంగ్లండ్‌లో ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో...స్కూలు పిల్లల్లో వ్యాపించిన వైరస్ స్థాయిలు, స్థానిక సమాజంలో ఉన్న వైరస్ స్థాయిలను ప్రతిబింబిస్తున్నాయని, పాఠశాలలను మూసివేయడం తాత్కాలిక ప్రభావాన్ని మాత్రమే కలిగించిందని తేలింది.

చిన్నారి

ఫొటో సోర్స్, YVAN COHEN

మెరుపు వేగంతో వ్యాప్తిస్తున్న కొత్త వేరియంట్

"కరోనావైరస్‌లో కొత్త రకం శరీరంలో ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లోంచి సులువుగా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఇది పిల్లల్లో కూడా తొందరగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ వెండీ బార్క్లే తెలిపారు.

ఈ కొత్త రకం ఇతర కరోనా వైరస్ రకాలకన్నా 50% నుంచీ 70% వేగంగా వ్యాప్తి చెందుతున్నదని భావిస్తున్నారు.

"ఇది ఎక్కడ, ఎలా ప్రారంభమయ్యిందనే అంశాల విశ్లేషణ ఫలితాలు కూడా పిల్లల్లో అధిక స్థాయిలో వ్యాప్తిని సూచిస్తున్నాయి" అని ఎన్ఈఆర్‌వీటీఏజీ సభ్యులు ప్రొఫెసర్ నైల్ ఫెర్గుసన్ తెలిపారు.

అయితే, ఈ అంశం ఇంకా పరిశీలన స్థాయిలోనే ఉందని, దీన్ని నిరూపించడానికి మరింత పరిశోధన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

"పిల్లల్లో ఎక్కువగా వ్యాపిస్తుందన్నది నిజమైతే, ఈ కొత్త రకం కరోనావైరస్ ఇంత త్వరగా ఎలా వ్యాప్తి చెందుతున్నదనే దానికి జవాబు దొరుకుతుందని" ప్రొఫెసర్ ఫెర్గుసన్ అన్నారు.

కొత్తరకం కరోనావైరస్ ఎందుకు వేగంగా వ్యాపిస్తోంది?

అయితే, కొత్త రకం వైరస్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనడానికి ఇప్పటివరకూ కచ్చితమైన రుజువులు ఏమీ దొరకలేదని యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్‌కు చెందిన జూలియాన్ హిస్కాక్స్ తెలిపారు.

కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని పరిశీలించిన కోవిడ్-19 జెనోమిక్స్ యూకే కాన్సోర్టియం (సీఓజీ-యూకే) శాస్త్రవేత్తలు...పిల్లల్లో అధిక వ్యాప్తిని గుర్తించలేదని తెలిపారు.

యూకేలో నవంబర్‌లో లాక్‌డౌన్ ఉన్నప్పుడు కూడా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందని, ఆర్ నంబర్ (వైరస్ సోకిన వ్యక్తి, ఇతరులకు వ్యాపింపజేసే సగటు సంఖ్య) 1.2గా నమోదయ్యిందని...దీనర్థం కొత్త వేరియంట్ చాలా త్వరగా వ్యాపిస్తోందని డాటా చెబుతోంది.

యూకేలో లాక్‌డౌన్‌లో ఇతర రకాల కరోనావైరస్‌లకు ఈ ఆర్ నంబర్ 0.8 గా నమోదవ్వడమే కాకుండా ఈ సంఖ్య తగ్గుతూ ఉండడం గమనార్హం.

“ఇదే పద్ధతిలో కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంటే కొత్త సంవత్సరంలో ఎలాంటి నిబంధనలు పాటించవలసి ఉంటుంది, ఎన్ని నిబంధనలను సడలించవచ్చు అనేది ఆలోచించుకోవాలి” అని ప్రొఫెసర్ ఫెర్గుసన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)