భారత్‌లో జనవరి 16 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Ani

భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.

ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నవారు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు మొదటి ప్రాధాన్యంగా వ్యాక్సీన్ వేస్తారు.

మొదటి విడతలో సుమారు 3 కోట్ల మందికి వ్యాక్సీన్ వేస్తారు.

ఆ తరువాత 50 ఏళ్లు దాటినవారు.. 50 ఏళ్ల లోపు వయసున్నా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి టీకా వేస్తారు. ఇలాంటివారు సుమారు 27 కోట్ల మంది ఉంటారని అంచనా.

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి స్థితిగతులు, వ్యాక్సీనేషన్ కోసం సన్నద్ధత తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ సీనియర్ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

దిల్లీలో కరోనా మాస్కులు ధరించిన మహిళలు

ఫొటో సోర్స్, EPA

భారత్‌లో కరోనావైరస్ నివారణ టీకాలు వేయడానికి సంబంధించి కేంద్రం 2020 డిసెంబరులో మార్గదర్శకాలు జారీ చేసింది.

రోజూ ప్రతి సెషన్‌లో 100 నుంచి 200 మందికి వ్యాక్సీన్ ఇస్తారని.. అనంతరం వారిని అరగంట పాటు పరిశీలనలో ఉంచి ఏమైనా ప్రతికూల ప్రభావాలు ఉన్నాయా అనేది పరిశీలిస్తారని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.

వ్యాక్సీన్లు వేసే కేంద్రాల్లోకి ఒకసారి ఒకరిని మాత్రమే అనుమతిస్తారనీ కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

డిజిటల్ ప్లాట్‌ఫాంలను ఉపయోగించుకుంటూ...

కరోనా వ్యాక్సీన్ వేయించుకున్న ప్రజలను, వ్యాక్సీన్‌ కార్యక్రమాన్ని ట్రాక్ చేయడానికి ‘కోవిడ్ వాక్సీన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్’(కో-విన్) వ్యవస్థను ఉపయోగించనున్నట్లు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలలో ఉంది.

ముందే నమోదు చేసుకున్నవారికి మాత్రమే టీకాలు వేసే కేంద్రాలకు అనుమతిస్తారు, వారికే టీకాలు వేస్తారు.

అయితే, ఎవరు నమోదు చేసుకోవాలనే విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి నిబంధనలు లేవు.

అదే సమయంలో రిజిస్ట్రేషన్ కోసం ఇంకా ఎలాంటి నియమాలు ప్రకటించలేదు.

వేర్వేరు సంస్థలు ఉత్పత్తి చేసిన వ్యాక్సీన్లు ఒకే ప్రాంతంలో కలగలిపి ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇందుకోసం ఆయా జిల్లాలకు ఏ సంస్థ ఉత్పత్తి చేసిన వ్యాక్సీన్ పంపిణీ అవుతుందో ముందుగానే గుర్తించాలని రాష్ట్రాలకు సూచించారు.

‘కోవిడ్ వాక్సీన్ ఆపరేషనల్ గైడ్‌లైన్స్’ ప్రకారం వాక్సీన్ తీసుకెళ్లే సీసాలు, ఐస్‌ప్యాక్‌లు వంటివి ఏవీ నేరుగా సూర్యరశ్మికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ సూచించారు.

కేంద్రంలోని వ్యాక్సీన్ వేయించుకోవడానికి ఎవరైనా ప్రవేశించేవరకు కూడా టీకా నుంచి ద్రవాన్ని తీయరాదు.

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

సవాళ్లనూ ప్రస్తావించారు

‘‘కోవిడ్ టీకాలపై ‘వాక్సీన్ వయల్ మానిటర్లు’, ఎక్స్‌పయిరీ డేట్లు లేకపోయినా వాటిని వేయించుకునేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

సీజన్ చివరలో వ్యాక్సీన్ వయల్స్ ఉన్న అన్ని కేరియర్లు, ఐస్ ప్యాక్‌లు పంపిణీ కేంద్రంలోని కోల్డ్ చెయిన్ సెంటర్‌కు పంపించాల్సి ఉంటుంది.టీకా కార్యక్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సమీకృత మద్దతు వ్యవస్థను, సోషల్ మొబిలైజింగ్ స్ట్రాటజీని రూపొందించుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

కోవిడ్ -19 వ్యాక్సిన్ నిర్వహణలో దేశం అగ్రస్థానంలో ఉందని, కొన్ని సవాళ్లను కూడా సకాలంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని కేంద్రం పేర్కొంది.

130 కోట్ల మంది ప్రజలున్న దేశంలో ఈ టీకా వల్ల కలిగే ప్రయోజనం, ప్రగతిని ప్రజలందరికీ ఏకకాలంలో సమాచారం అందించడం సవాలేనని కేంద్రం పేర్కొంది.తొలుత టీకాను ఎవరికి ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో ఉండే ప్రశ్నలు, ఆందోళనలు కూడా సవాలేనంది.

వ్యాక్సీన్ తీసుకోవడం సురక్షితమేనా అన్న భయాలు చాలామందిలో ఉండొచ్చని.. సోషల్ మీడియాలో వ్యాక్సీన్‌కు వ్యతిరేకంగా ఎన్నో తప్పుడు వార్తలు, అపోహలు ప్రచారం కావొచ్చనీ కేంద్రం అంది.

మాస్క్ వేసుకున్న మహిళ

ఫొటో సోర్స్, SANDEEP RASAL/SOPA IMAGES/LIGHTROCKET/GETTY IMAGES

ఎలా వేస్తారు?

టీకాలు వేసే ప్రతి బృందంలో అయిదుగురు ఉంటారని కేంద్ర ప్రభుత్వ పత్రాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది.

ప్రతి సెషన్లో 100 మందికి మాత్రమే టీకాలు వేస్తారని మార్గదర్శకాలు చెబుతున్నాయి.

అయితే, వెయిటింగు హాళ్లు, మానిటరింగ్ కేంద్రాలు, సామాన్లు ఉంచే గది ఉంటే మరో అధికారిని నియమిస్తారు.

ఆ తరువాత అక్కడ సెషన్‌కు 200 మందికి టీకాలు వేయొచ్చు.కోవిడ్ వ్యాక్సిన్ తొలుత ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, 50 ఏళ్లు దాటినివారికి ఇస్తారు.

ఆ తరువాత 50 ఏళ్లలోపు వారికి ఇతర వ్యాధులు ఉన్నవారికి ఇస్తారు. అనంతరం లభ్యత ఆధారంగా మిగతా ప్రజలకూ టీకా వేస్తారు.

టీకా లభ్యతను బట్టి 50 ఏళ్లు పైబడిన వారిని కూడా గ్రూపులుగా విభజించే అవకాశం ఉంది. 60 ఏళ్లు దాటినవారు.. 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు అని రెండు వయోవిభాగాలు చేయొచ్చు.మొదటి దశలో 30 కోట్ల మందికి టీకాలు వేయాలని కేంద్రం యోచిస్తోంది.

కో-విన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవడానికి 12 రకాల గుర్తింపు కార్డులు చెల్లుబాటవుతాయి.

ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పెన్షన్ పత్రాలు వంటివన్నీ ఈ జాబితాలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)