భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్

ఫొటో సోర్స్, Wellcome Trust
- రచయిత, జోయెల్ గెంటెర్
- హోదా, వికాస్‌పాండే
వాల్డెమర్ మొర్డెకాయ్ హఫ్కిన్ మానవజాతి చరిత్ర మరిచిపోలేని శాస్త్రవేత్త. భారత్, ఫ్రాన్స్ దేశాలలో పని చేసిన ఈ వైజ్ఞానికుడు కలరా, ప్లేగ్ వ్యాధులకు మొట్టమొదట వ్యాక్సీన్ కనిపెట్టారు. అయితే, ఒక అనుకోని ప్రమాదం ఆయన జీవితాన్ని మార్చేసింది.
కలరా వ్యాధి ఆనవాళ్లను వెతుక్కుంటూ వాల్డెమర్ హఫ్కిన్ 1894లో కలకత్తా(ఇప్పటి కోల్‌కతా) వచ్చారు. చలికాలంలో కలరా ఎక్కువగా ప్రబలే అవకాశం ఉండటంతో ఆయన ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.
అంతకు ముందు సంవత్సరం మార్చిలో ఆయన కలకత్తాలోనే ఉన్నారు. అప్పుడాయన దగ్గర ఒక వ్యాక్సీన్ ఉంది. తాను సృష్టించిన వ్యాక్సీన్‌ను ప్రయోగించి ఫలితం తెలుసుకోవడానికి ఆయన సంవత్సరమంతా ఎంతో కష్టపడ్డారు.
వృత్తిరీత్యా హఫ్కిన్ జంతు శాస్త్రవేత్త. మొదట ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరంలో, ఆ తర్వాత పారిస్‌లో శిక్షణ పొందారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా బ్యాక్టీరియాలజీ శాస్త్రం చదివిన వారిని అనుమానస్పదంగా చూసేవారు.
కలకత్తా చేరుకునేటప్పటికి ఆయన వయసు 33ఏళ్లు. ఆయన తన వ్యాక్సీన్‌ను ప్రయోగించి చూడటానికి చాలా ఇబ్బందిపడ్డారు. వారం తేడాతో రెండు డోసులుగా వ్యాక్సీన్ ఇవ్వాల్సి ఉంది.
అప్పటికే భారత్‌లో కలరా విపరీతంగా ఉన్నప్పటికీ తీవ్రంగా ఉన్న ప్రదేశాలను గుర్తించడం కష్టంగా మారేది. హఫ్కిన్ రాసుకున్న వివరాల ప్రకారం ఆయన ఉత్తర భారతదేశంలో సుమారు 23,000 మందికి వ్యాక్సీన్ ఇచ్చారు.
అయితే మరోసారి కలరా ప్రబలితే వ్యాక్సీన్ తీసుకున్న వారికి ఆ వ్యాధి మళ్లీ వచ్చిందా లేదా అనే విషయం అర్ధమయ్యేది. కానీ ఆ తర్వాత కలరా కనిపించ లేదు.

ఫొటో సోర్స్, Wellcome Trust
కలకత్తాలో ప్రయోగాలు
కలకత్తా నగరంలో ముఖ్యంగా మురికి వాడల్లోని ప్రజలు తాగే మంచి నీటిలో కలరా వ్యాధికి సంబంధించిన బ్యాక్టీరియా ఉందేమో పరిశోధించడానికి హఫ్కిన్‌ను ఇండియాకు ఆహ్వానించారు అప్పటి అధికారులు.
అప్పట్లో ప్రజలంతా ఒకే వనరు నుంచి మంచినీటిని తెచ్చుకునేవారు. ఇది కలరా వ్యాధికి తరచూ కారణమవుతుండేది.
తన వ్యాక్సీన్‌ను పరిశీలించడానికి కలకత్తా బస్తీలు సరైన ప్రాంతాలుగా భావించారు హఫ్కిన్. కలరా వ్యాధి పీడితులున్న ఇళ్లను గుర్తించి ఆ ఇళ్లలో కొందరికి వ్యాక్సీన్ ఇవ్వడం, మరికొందరికి ఇవ్వకపోవడం ద్వారా వ్యాక్సీన్ పని తీరును గమనించవచ్చని ఆయన భావించారు.
మార్చి చివరిలో కట్టల్ బగన్ బస్తీలో కలరాతో ఇద్దరు మరణించారు. ఇది కొత్తగా వ్యాధివ్యాప్తికి సంకేతం. హఫ్కిన్ ఆ బస్తీకి వెళ్లి 116 మందికి టీకాలు వేశారు. తరువాత 10కేసులు బైటపడ్డాయి. అందులో ఏడుగురు చనిపోయారు. వారిలో ఎవరూ టీకా తీసుకున్నవారు లేరు.
ఈ ఫలితాలు కలకత్తా ఆరోగ్య అధికారులు మరిన్ని ప్రయోగాలు చేయడానికి ప్రోత్సాహాన్నిచ్చాయి. కానీ టీకాలు వేసుకొమ్మని ప్రజలకు చెప్పడం సులభమే కానీ వేయడం మాత్రం చాలా కష్టంగా ఉండేది. అప్పట్లో చాలామందికి టీకా అంటే ఏంటో తెలియదు.

ఫొటో సోర్స్, Wellcome Trust
జనాన్ని టీకాలకు ఒప్పించడానికి అందరి సమక్షంలో తనకు తాను టీకా వేసుకోవడమేం మంచి ఆలోచనని హఫ్కిన్ నిర్ణయించుకున్నారు. ఇందుకు బ్రిటీష్ వైద్యాధికారులు కాకుండా భారతీయ అధికారుల సాయం తీసుకున్నారు.
“ఆయన ఈ ప్రయోగం చేసిన తర్వాత టీకా తీసుకోవడానికి బస్తీలలోని ప్రజలు బారులు తీరారు’’ అని యూనివర్సిటీ ఆఫ్ మాంఛెస్టర్‌లో హిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ మెడిసిన్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ ప్రతీక్ చక్రవర్తి తెలిపారు.
“భారతీయ వైద్యులతో కూర్చుని ఆయన రోజంతా ఈ టీకా కార్యక్రమంలో పాల్గొనేవారు. ప్రజలు పొద్దునే పనులు వెళ్లేటప్పటి నుంచి వాళ్లు తిరిగి వచ్చేదాకా ఆయన టీకా ఇస్తూనే ఉండేవారు’’ అని చక్రబర్తి తెలిపారు.
హఫ్కిన్ ప్రయోగం ఆయన్ను వ్యాధుల మీద పోరాటంలో అవిరళ కృషి చేసిన శాస్త్రవేత్తలలో ఒకడిగా నిలిపింది. అయితే ఆయనకన్నా ముందు మశూచికి టీకా కనుగొన్న ఎడ్వర్డ్ జెన్నర్, ఆయన తర్వాత పోలియోకు వ్యాక్సీన్ కనుగొన్న జోనాస్ సాల్క్‌లాగా హఫ్కిన్‌కు పేరు రాలేదు.
“ఇండియాలాంటి దేశానికి వ్యాక్సీన్ తీసుకొచ్చిన ఒకే ఒక శాస్త్రవేత్త హఫ్కిన్’’ అన్నారు చక్రబర్తి. “పారిస్‌లో ఉండే ఆయన కలకత్తాకు వచ్చి విజయవంతంగా పని చేయడం నిజంగా అద్భుత ఘట్టం’’ అన్నారాయన.
ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరంలో 1884లో జువాలజీలో ఆయన డిగ్రీ చేశారు. యూదు మతస్తుడు కావడం వల్ల అక్కడ ఆయన ప్రొఫెసర్ కాలేకపోయారు.
అప్పట్లో రష్యన్లు యూదులను అనుమానంగా చూసేవారు. ఒక యూదు మతస్తుడి ఇంటిపై కొందరు రష్యా సైనికులు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
ఒక దశలో ఆయనపై కూడా దాడి జరిగింది. అరెస్టయి ఆ తర్వాత విడుదలయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
కలరా వ్యాక్సీన్‌కు ప్రయత్నాలు
1888లో స్వదేశం స్విట్జర్లాండ్, ఆ తర్వాత పారిస్ చేరుకుని అక్కడ స్థిరపడ్డారు. లూయి పాశ్చర్ ఇనిస్టిట్యూట్‌లో లైబ్రేరియన్‌గా చేరిన ఆయన ఖాళీ సమయాలలో బ్యాక్టీరియాలజీ లేబరేటరీలో ప్రయోగాలు చేస్తుండేవారు.
కలరా వ్యాధి గురించి గినీ పందులపై ప్రయోగాలు చేశారు. కలరా బ్యాక్టీరియా పందులకు ఎక్కించడం, వాటిని తగ్గించేందుకు తాను తయరు చేసిన మందును వాడటం మొదలుపెట్టారు. చివరకు ఒక వ్యాక్సీన్‌ను సిద్ధం చేశారు.
పందుల మీద ప్రయోగం తర్వాత హఫ్కిన్ ఎలుకలు,పావురాల మీద అదే ప్రయోగం చేసి సత్ఫలితం సాధించారు. ఇక మనుషుల మీద ప్రయోగించడమే మిగిలింది.
జులై 1892లో హఫ్కిన్ తన మీద తానే ప్రయోగం చేసుకునే సాహసం చేశారు. కలరా బ్యాక్టీరియాను తన శరీరంలోకి ఎక్కించుకున్నారు. కొద్ది రోజులు విపరీతమైన జ్వరంతో బాధపడ్డాక వ్యాక్సీన్ తీసుకుని పూర్తిగా కోలుకున్నారు.
తన ముగ్గురు రష్యన్ స్నేహితుల మీద కూడా ప్రయోగాలు చేసి విజయం సాధించారు. ఇక విస్తృతంగా ప్రయోగాలు చేయడమే మిగిలింది.

ఫొటో సోర్స్, Wellcome Trust
భారీగా కలరా వ్యాప్తి ఉన్న ప్రదేశాల కోసం వెతుకుతుండగా పారిస్‌లోని బ్రిటీష్ రాయబారి ఫ్రెడెరిక్ డఫ్రిన్ బెంగాల్ గురించి చెప్పారు.
దీంతో కలకత్తాకు చేరుకుని ఇక్కడి బస్తీలలో ప్రయోగాలు చేసిన హఫ్కిన్ మంచి ఫలితాలను సాధించారు. ఆ తర్వాత టీ తోటల్లోని కూలీలకు టీకా ఇప్పించేలా తోటల యజమానులను ఒప్పించారు. వేలమంది కూలీలకు వ్యాక్సీన్ ఇచ్చారు.
వర్షాకాలం రావడంతో ఆయన మలేరియా వ్యాధి బారినపడ్డారు. కోలుకోవడానికి ఇంగ్లాండ్‌కు రావాల్సి వచ్చింది. ఆయన రాసుకున్న రికార్డుల ప్రకారం సుమారు 42 వేలమందికి ఆయన టీకా ఇచ్చారు.
తన వ్యాక్సీన్ ద్వారా చాలా వరకు కలరా కేసులను తగ్గినా, మరణాలు మాత్రం తగ్గలేదని ఆయన గుర్తించారు. దీనిని సరి చేయడానికి ఆయన 1896లో ఇంగ్లాండ్ నుంచి కలకత్తాకు తిరిగి వచ్చి మరో ఫార్ములాను అమలు చేయాలని భావించారు.
అయితే ఈసారి బాంబే (నేటి ముంబయి)లో పరిస్థితులు బాగాలేవని, అక్కడ వ్యాక్సీన్ ఇవ్వాలని ఒత్తిడి రావడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Popular Science Monthly
ప్లేగ్ మీద యుద్ధం
చైనాలోని యూనాన్ ప్రాంతంలో 1894లో ప్రబలిన ప్లేగ్ వ్యాధి ఓడలలో ప్రయాణించే వారి ద్వారా హాంకాంగ్‌కు, అటు నుంచి బాంబే వరకు వచ్చింది. 1896 సెప్టెంబర్‌లో ఈ ప్రాంతంలో తొలి కేసు బైటపడింది.
మొదట్లో బ్రిటీష్ అధికారులు ప్లేగు వ్యాధిని సీరియస్‌గా తీసుకోలేదు. యథావిధిగా వ్యాపార కార్యక్రమాలు కొనసాగించారు. దీంతో బాంబేలోని స్లమ్ ఏరియాల్లో ఈ వ్యాధి విపరీతంగా ప్రబలింది.
మరణాల రేటు కలరా కంటే రెట్టింపు నమోదైంది. బాంబే గవర్నర్ అభ్యర్ధన మేరకు హఫ్కిన్ ముంబయి చేరుకున్నారు. ఒక చిన్న గది తీసుకుని ముగ్గురు 4గురు అసిస్టెంట్లతో ప్లేగ్‌వ్యాధికి వ్యాక్సీన్ కనుగొనే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
“అప్పుడాయనకు పెద్దగా సౌకర్యాలు కూడా లేవు. సొంతంగా లేబరేటరీని నిర్మించుకుని ప్రయోగాలు ప్రాంభించారు’’ అన్నారు దిల్లీకి చెందిన అంటువ్యాధుల నిపుణులు చంద్రకాంత్ లహరియా.
“అత్యంత వేగంగా ప్లేగ్ వ్యాధికి వ్యాక్సీన్‌ను కనుగొంటే తన పేరు మారుమోగిపోతుందని ఆయనకు తెలుసు’’ అన్నారాయన.

ఫొటో సోర్స్, Wellcome Trust
ఆ సంవత్సరం శీతాకాలంలో హఫ్కిన్ అవిశ్రాంతంగా ప్రయోగాలు కొనసాగించారు. ఉడకబెట్టిన పోషకాలున్న పులుసులో వెన్న లేదా కొబ్బరినూనెను కలిపి బ్యాక్టీరియాను చంపే విషపదార్ధాన్ని ఉత్పత్తి చేశారు. కలరా కోసం కూడా ఆయన ఇలాంటి ఫార్ములానే వినియోగించారు. చివరకు ఒకేసారి తీసుకోగలిగే వ్యాక్సీన్‌ను సిద్ధమైంది.
1896 డిసెంబర్‌నాటికి ఎలుకల మీద ప్రయోగాలు చేసిన హఫ్కిన్ అందులో విజయం సాధించారు. 1897 జనవరిలో మనుషుల మీద ప్రయోగాలకు సిద్ధమయ్యారు. కలరా ప్రయోగాల మాదిరిగానే ఈసారి కూడా ఆయనే మొదట ఈ వ్యాక్సీన్‌ను ఇంజెక్ట్ చేసుకున్నారు.
మొదట కొద్దిరోజులు తీవ్ర జ్వరంతో బాధపడిన ఆయన తర్వాత కోలుకున్నారు.
బాంబేలోని బైకుల్లా జైలును తన ప్రయోగాలుకు వేదిక చేసుకున్నారు హఫ్కిన్. ఇక్కడ ప్లేగ్ వ్యాధిబారిన పడినవారిలో 147మందికి వ్యాక్సీన్ ఇచ్చి, 172మందికి ఇవ్వకుండా వదిలేశారు.
ట్రీట్‌మెంట్ తీసుకోని 172మందిలో 12మందిలో ప్లేగ్ తగ్గలేదు. వారిలో ఆరుగురు చనిపోయారు. వ్యాక్సీన్ ఇచ్చిన 147మందిలో ఇద్దరు చనిపోగా, మిగిలిన వారెవ్వరిలో ప్లేగ్ వ్యాధి లక్షణాలు కనిపించ లేదు.
ఈ ప్రయోగాలు సక్సెస్ కావడంతో ఆయన లేబరేటరీ చిన్నగది నుంచి పెద్ద గవర్నమెంట్ బంగ్లాకు మారింది. బాంబేలో ప్రముఖ మతగురువైన అగాఖాన్ తన బంగ్లాను ఈ ప్రయోగాలకు ఇచ్చారు.
అగా ఖాన్ స్వయంగా ఈ టీకా కార్యక్రమానికి వలంటీరుగామారి, అనేకమంది ముస్లింలు ఈ వ్యాక్సీన్ తీసుకునేలా ప్రోత్సహించారు. హఫ్కిన్ తయారు చేసిన వ్యాక్సీన్ పెద్ద ఎత్తున విజయవంతమై అనేకమంది ప్రాణాలను కాపాడింది.
1901 డిసెంబర్‌లో విక్టోరియా రాణి ఆయనకు నైట్‌హుడ్‌ను బహుకరించారు. ఆ తర్వాత ముంబయిలోని పరేల్‌లో ప్లేగ్ రీసెర్చ్ లేబరేటరీ నిర్మించుకునేందుకు ఒక ప్రభుత్వ బంగళాను ఆయనకు కేటాయించారు. 53మంది సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడే మరో విపత్తు మొదలైంది.

ఫొటో సోర్స్, Wellcome Trust
ప్రయోగంలో ప్రమాదం
1902 మార్చ్‌లో పంజాబ్ ప్రావిన్స్‌లోని ముల్కోవల్ ప్రాంతంలో ఈ వ్యాక్సీన్ తీసుకున్న 19మంది ధనుర్వాతంతో మరణించారు. మిగిలిన 88మంది క్షేమంగానే ఉన్నారు.
అయితే ప్లేగ్ వ్యాక్సీన్ తయారీలో స్టెరిలైజేషన్ కోసం వాడే సంప్రదాయ కార్బోలిక్ యాసిడ్‌కు బదులు, వేడి ద్వారా స్టెరిలైజ్ చేయడానికి హఫ్కిన్ ప్రయత్నించారని, ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు ఆయన ఈ పద్దతిని ఎంచుకున్నారని విచారణలో తేలింది.
లూయీపాశ్చర్ లేబరేటరీలో ఈ విధానాన్ని రెండు సంవత్సరాలపాటు వినియోగించారని హఫ్కిన్ వాదించారు. అయితే బ్రిటీష్ లేబరేటరీలకు ఇది కొత్త విషయం కావడంతో నిపుణులు ఈ విధానాన్ని సమర్ధించలేదు.
19మంది మరణానికి బాంబేలోని పరేల్ లేబరేటరీలో జరిగిన స్టెరిలేజేషనే కారణమని నిర్ధారించి ఆయన్ను లేబరేటరీ డైరక్టర్ పదవి నుంచి తొలగించడంతోపాటు ఇండియన్ సివిల్ సర్వీస్ నుంచి కూడా తప్పించారు.
ఈ నిర్ణయంతో హఫ్కిన్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తిరిగి లండన్ చేరుకున్నారు. “ఆ రోజుల్లో యూదులపట్ల తీవ్రమైన వివక్ష ఉండేది’’ అని హఫ్కిన్ వృత్తిగత జీవితం మీద పరిశోధన చేసిన డాక్టర్ బార్బారా హాగూడ్ అన్నారు. “పైగా ఆయన మెడిసిన్ చదివిన వ్యక్తి కాదు. అందువల్ల ఆయనపై మిగిలిన పరిశోధకులు సహజంగానే ఈర్ష్యతో ఉంటారు’’ అన్నారామె.
“ఆయన తీవ్ర జాతి వివక్షకు గురయ్యారని చెప్పడానికి ఆధారాలులేవుగానీ, అప్పటి కింగ్ ఎడ్వర్డ్ కింద పని చేసే అధికారులకు ఒక యూదుడి మీద ప్రేమ ఉంటుందనుకోవడం అమాయకత్వం’’ అని హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఎలి చెర్నిన్ అన్నారు.

ఫొటో సోర్స్, Wellcome Trust
పంజాబ్ ఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిగింది. దీనిపై అనేక పత్రాలను పరిశీలించిన లండన్ కింగ్స్ కాలేజ్ ప్రొఫెసర్ డబ్ల్యూజె సింప్సన్ ఒక అభిప్రాయానికి వచ్చారు. ఒక చిన్న పొరపాటువల్ల వ్యాక్సీన్ సీసా విషపూరితమైంది తప్ప లేబరేటరీలో అనుసరించిన విధానంలో లోపంలేదని ఆయన తేల్చారు.
వ్యాక్సీన్ సీసా మూత తెరుస్తున్న సమయంలో దాన్ని పట్టుకునే ఇన్‌స్ట్రుమెంట్ నేలమీద పడిందని, దాన్ని శుభ్రం చేయకుండా సిబ్బంది మళ్లీ వాడటం ఈ ప్రమాదానికి కారణమై ఉంటుందని సింప్సన్ అంచనాకు వచ్చారు.
హఫ్కిన్ అన్యాయంగా అభాండాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని సింప్సన్ అన్నారు. ఆయన బ్రిటీష్ ప్రభుత్వానికి రాసిన లేఖలు పత్రికల్లో ప్రచురితం కావడంతో హఫ్కిన్‌కు అనేకమంది మద్దతుగా నిలిచారు.
ఈ వ్యవహారం ద్వారా బ్రిటీష్ ప్రభుత్వం సైన్స్‌ను అవమానించిందని నోబెల్ బహుమతి గ్రహీత రోనాల్డ్ రాస్ విమర్శించారు.ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే భారత ప్రభుత్వం(అప్పటి బ్రిటీష్ సర్కారు) తనకు మేలు చేసినవారికి తీవ్రమైన ద్రోహం చేసినట్లేనని వ్యాఖ్యానించారు.
“వారానికి 50వేలమంది చనిపోతున్న రోజుల్లో చిన్న పొరపాటుకు ఒక లేబరేటరీని బాధ్యురాలిని చేయడమంటే ప్రభుత్వం వ్యాక్సీన్‌పట్ల ప్రజలకు నమ్మకం లేకుండా చేయడటమే’’ అన్నారు రోనాల్డ్ రాస్.
హఫ్కిన్‌కు అనుకూలంగా సింప్సన్, రోనాల్డ్ రాస్‌లు మొదలుపెట్టిన ప్రచారంతో ఈ వ్యవహారంపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ జరిగింది. 1907లో హఫ్కిన్‌ను తిరిగి భారత్‌లో బాధ్యతలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం సూచించింది.

ఫొటో సోర్స్, Wellcome Trust
అవమానాల నుంచి విముక్తి... కానీ,
ఈసారి ఆయన్ను కలకత్తా బయాలాజికల్ లేబరేటరీకి డైరక్టర్ ఇన్-చీఫ్‌గా పంపింది. అయితే ఆయన ఇకపై ఎలాంటి వ్యాక్సీన్ ట్రయల్స్ నిర్వహించరాదని, కేవలం సైద్ధాంతిక పరిశోధనకే పరిమితం కావాలని ప్రభుత్వం సూచించింది.
“పంజాబ్ వ్యవహారం నన్నుజీవితాంతం వెంటాడింది. దీని మొత్తానికి నేనే కారణమని ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు’’ అని రోనాల్డ్ రాస్‌కు రాసిన లేఖలో హఫ్కిన్ ఆవేదన వ్యక్తం చేశారు.
కలకత్తా లేబరేటికి అధిపతిగా నియమించినా ఆ తర్వాత ఆయన పరిశోధనలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఆయన రాసిన 30 పరిశోధనా పత్రాలలలో ఒకటి మాత్రమే పబ్లిష్ అయ్యింది.
కలరా వ్యాక్సీన్‌కు సంబంధించిన ఆయన కనుగొన్న కొత్త విధానాన్ని ఆమోదించడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. పదేపదే దరఖాస్తు చేసుకున్నా వ్యాక్సీన్ ట్రయల్స్‌కు ప్రభుత్వం నిరాకరించింది.
ఆ తర్వాత కాలంలో ఆయన కనుగొన్న పద్దతిని విస్తృతంగా వినియోగించారు. చివరకు 1914లో తన 55 ఏట పదవి నుంచి నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు హఫ్కిన్. పంజాబ్ ఘటన ఆయన జీవితంపై చెరిగిపోని ముద్ర వేసింది.
“ముల్కోవల్ ఘటన ఆయన కెరీర్‌ను నాశనం చేసింది. ఆయనొక పరాజితుడిలాగా ఇండియాను వదిలి వెళ్లాల్సి వచ్చింది. అలా చరిత్ర నుంచి కనుమరుగయ్యారు’’ అన్నారు ప్రతీక్ చక్రబర్తి.

1897 నుంచి 1925 మధ్యకాలంలో హఫ్కిన్ తయారు చేసిన మిలియన్‌ల డోసుల ప్లేగ్ వ్యాక్సీన్ బొంబయిని దాటి అనేక ప్రాంతాలకు సరఫరా అయ్యింది. ఆయన వ్యాక్సీన్ కారణంగా ప్లేగ్ మరణాలు 50% నుంచి 85% వరకు తగ్గాయి.
కానీ ఈ వ్యాక్సీన్ ఎంతమంది ప్రాణాలను కాపాడిందో ఎక్కడా చెప్పలేదు. “ ఆయన సేవకు ఈ సంఖ్యలే సాక్ష్యం’’ అన్నారు హాగూడ్.
ఆయన తన జీవితపు చివరి రోజుల్లో పూర్తిగా దైవచింతనలో గడిపారు. యూదు విద్యార్ధులకు చదువు చెప్పించడంపై ఆసక్తి చూపించారు. తర్వాత స్వదేశం స్విట్జర్లాండ్‌లోని లాసానేలో స్థిరపడ్డారు.
“పెళ్లి కూడా చేసుకోకుండా సైన్సుకే జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఒక వైజ్జానిక అద్భుతం’’ అన్నారు భారత్‌కు చెందిన బ్యాక్టీరియాలజిస్ట్ హెచ్.ఐ. ఝలా.
1930లో హఫ్కిన్ తన 70 ఏట మరణించారు. ఆయన మరణానికి నివాళిగా జ్యూయిష్ టెలీగ్రాఫిక్ ఏజెన్సీ ఒక సందేశాన్ని పంపింది.
“ఆయన తయారు చేసిన వ్యాక్సీన్‌ను భారతదేశవ్యాప్తంగా పంపిణీ చేశారు. ఆయన లేబరేటరీ నుంచి అనేక దేశాలకు సరఫరా ఆయ్యింది’’ అని పేర్కొంది.
“ఆయన మానవాళికి రక్షకుడు’’ అని హఫ్కిన్‌ను కొనియాడుతూ ప్రపంచ ప్రఖ్యాత బ్యాక్టీరియాలజిస్ట్ జోసెఫ్ లార్డ్ సిస్టర్ చేసిన వ్యాఖ్యలను ఆ సందేశానికి జత చేసింది.

ఆయన ఒకప్పుడు బాంబేలో తన ప్రయోగశాలగా వాడుకున్న రెండు గదుల చిన్న ఇల్లు ఇప్పుడు KEM హాస్పిటల్‌గా ప్రసిద్ధికెక్కింది. హఫ్కిన్ పరిశోధనలు జరిగిన దాదాపు వందేళ్ల తర్వాత అదే ప్రాంతం ఇప్పుడు కరోనా వైరస్‌పై పోరాటానికి నాయకత్వం వహిస్తోంది.
“ఈ ఆసుపత్రి హఫ్కిన్‌కు ఒక ఘనమైన నివాళి’’ అన్నారు చంద్రకాంత్ లహారియా. “ఆయన ఎందరో సైంటిస్టులకు స్ఫూర్తి ప్రదాత. ఆయన సేవలకు సరైన గుర్తింపు లభించకపోయిన, ఒక చిన్న గదిలో ఆయన సాధించిన విజయాలు నమ్మలేని నిజాలు’’ అన్నారాయన.
1925లో ఆయన చనిపోవడానికి 5 సంవత్సరాల ముందు పరేల్ లేబరేటరీకి ఆయన పేరు పెట్టాలని బ్రిటీష్ ప్రభుత్వంపై హఫ్కిన్ అభిమానులు ఒత్తిడి తెచ్చారు. దీనిక ప్రభుత్వం అంగీకరించడంతో అది ‘ది హఫ్కిన్ ఇనిస్టిట్యూట్’గా మారింది.
లేబరేటరీ పేరు మార్పును గురించి వివరిస్తూ అప్పటి లేబరేటరీ డైరక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మాకీ హఫ్కిన్‌కు లేఖరాశారు. దీనికి స్పందించిన ఆయన “పేరు మార్చుతూ నిర్ణయం తీసుకున్న మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా జీవితంలో అత్యున్నతమైన క్షణాలను బాంబేలోని ఈ లేబరేటరీలో గడిపాను. దానితో నాకున్న అనుబంధం మాటలలో వర్ణించలేనిది. ఈ సంస్థ భవిష్యత్తులో భారతదేశ ఆరోగ్య రంగానికి విస్తృతమైన సేవలు అందించాలని కోరుకుంటున్నాను. సిబ్బందికి నా ఆశీస్సులు’’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- మరణశిక్షతో నేరాలు తగ్గుతాయా?
- డోనల్డ్ ట్రంప్: వందేళ్ల తర్వాత అత్యధిక మరణశిక్షలు అమలు చేసిన అమెరికా అధ్యక్షుడు
- సీనోవాక్: చైనా కోవిడ్ వ్యాక్సీన్ గురించి మనకు తెలిసిన విషయాలేమిటి?
- ఏలూరు: ఈ నగరానికి పెను ప్రమాదం పొంచి ఉందా?
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
- ఓ పదేళ్ల వయసు చిన్నారి నరహంతకుడు కాగలడా?
- ఉరి తాడు ఒక్క బక్సర్ జైల్లోనే ఎందుకు తయారవుతోంది?
- అయిదు హత్యలు, ఆరుగురు నిర్దోషులు, చేయని తప్పుకు చేజారిన 16 ఏళ్ళ జీవితం
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ , ట్విటర్ లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








