ఓ పదేళ్ల వయసు చిన్నారి నరహంతకుడు కాగలడా? - ఓ నిజ జీవిత కథ 'రెస్పాన్సిబుల్ చైల్డ్'

ఫొటో సోర్స్, BBC/KUDOS/ ED MILLER
- రచయిత, సెరెనా కుచిన్స్కీ
- హోదా, న్యూస్‌బీట్ ఆన్‌లైన్ ఎడిటర్
మనం పదేళ్ల వయసులో.. మద్యపానం, ధూమపానం, ఓటు వేయటం, పెళ్లి చేసుకోవటం.. చివరికి ఒక పెంపుడు జంతువును కొనుక్కోవటం కూడా చట్టబద్ధంగా అనుమతి లేదు. ఆ వయసులో ప్రాధమిక పాఠశాలలో ఐదో తరగతిలోనో ఆరో తరగతిలోనే ఉంటాం. మనం చట్టబద్ధంగా చిన్నారులం.
కానీ.. హత్య కేసులో ఒక వయోజనుడిగా విచారణ బోనులో నిలుచోబెట్టవచ్చు.
ఎందుకంటే.. ఇంగ్లండ్, వేల్స్‌లలో నేర బాధ్యతకు కనీస వయసు పది సంవత్సరాలు. అంటే.. ఎవరినైనా హత్య చేశారని ఆరోపణలు గల పదేళ్ల వయసు నిందితులను.. యువ కోర్టుల్లో కాకుండా ఒక క్రౌన్ కోర్టులో జ్యూరీ ఎదుట వయోజనుడి తరహాలోనే విచారించవచ్చు.
వారి చిన్న వయసు ప్రాతిపదికగా కొన్ని మినహాయింపులు ఇచ్చారు. వారి మొదటి పేరును ఉపయోగించటం, లాయర్లు విగ్గులు, గౌనులు ధరించాల్సిన అవసరం లేకపోవటం, తమ న్యాయవాదికి లేదా తగిన వయోజన వ్యక్తికి దగ్గరగా కూర్చోవటానికి అనుమతించటం వంటివి అందులో ఉన్నాయి.
కానీ.. ఒక హత్య చేయటం అంటే అర్థం ఏమిటనేది అంత చిన్న వయసు పిల్లలు అవగాహన చేసుకోగలరా? వారి చర్యలకు వారే బాధ్యులవుతారా? వారు టీనేజీలోకి రాకముందే వారిని వయోజనులుగా దోషులుగా నిర్ధారించినట్లయితే తర్వాత జీవితంలో వారికి ఏం జరుగుతుంది?
ఓ నిజ జీవిత ఉదంతం ప్రాతిపదికగా రూపొందించిన బీబీసీ డ్రామా 'రెస్పాన్సిబుల్ చైల్డ్'లో 12 ఏళ్ల బాలుడు రే కథలో ఈ ప్రశ్నలు కేంద్ర బిందువుగా ఉన్నాయి.
రే.. ఈ బాలుడికి వీడియో గేమ్స్ ఆడటం, అంతరిక్షం గురించి తెలుసుకోవటం, రియాలిటీ షోస్ వీక్షించటం ఇష్టం. ఒక కిరాతక హత్యలో ఇతడి అన్న 21 సంవత్సరాల నాథన్‌తో పాటు ఇతడు కూడా సహనిందితుడిగా విచారణ ఎదుర్కొంటాడు.
నిత్యం వేధించే వీరి సవతి తండ్రి.. నాథన్ మీద గొడ్డలితో దాడి చేసినందుకు గాను జైలు శిక్షను వెంట్రుక వాసిలో తప్పించుకుని.. మళ్లీ ఇంటికి వచ్చి వీరి తల్లిని వేధించటం మొదలుపెడతాడు. ఒక రోజు రాత్రి ఈ అన్నదమ్ములు మేడ దిగి వెళ్లి.. సోఫాలో నిద్రపోతున్న అతడిని 60 సార్లకు పైగా కత్తితో పొడుస్తారు.
వాళ్లు అతడి తలను దాదాపు తెగవేసినంత తీవ్రంగా ఈ దాడి చేశారు.
తమ సవతి తండ్రిని హత్య చేసిన జెరోమ్ (14), జాషువా ఎలిస్ (23)ల ఉదంతం ఆధారంగా ఈ కథను తయారు చేశారు.

ఫొటో సోర్స్, BBC/KUDOS/ ED MILLER
ఆ హత్యను పూర్తి భయానకంగా చూపుతుందీ డ్రామా: రక్తం, కత్తులు, వారి సవతి తండ్రి నిరాయుధుడిగా నిద్రిస్తున్న వాస్తవం.. అంతా.
ఈ కథలో హత్య అనంతరం రక్తంతో తడిసిపోయి దిగ్భ్రాంతికి, అయోమయానికి లోనైన 12 ఏళ్ల బాలుడు రే పాత్రను.. వైట్ ప్రిన్సెస్ నటుడు బిల్లీ బారట్ చక్కగా పోషించాడు. అతడి వయసు కూడా 12 సంవత్సరాలే. అతడు దాదాపు తక్షణమే తన నేరాన్ని అంగీకరిస్తాడు. అతడిని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కి తరలిస్తారు.
అక్కడ అతడిని తనిఖీ చేస్తారు. నేరస్తుల తరహాలో నిలుచోబెట్టి ఫొటో తీసుకుంటారు. అతడి డీఎన్‌ఏ, రక్తం నమూనాలు సేకరిస్తారు. ఆ తర్వాత.. భీతిగొలిపే పెద్దవాళ్ల చెరశాలలో బంధిస్తారు.
చిన్నారి రే విషయంలో పెద్ద వయసు నేరస్తుల్లాగా ఎలా వ్యవహరిస్తున్నారని అతడి న్యాయవాది అడిగినపుడు.. ''అతడిని హత్య కేసులో నిర్బంధించాం.. బడి ఎగ్గొట్టినందుకు కాదు'' అని పోలీసు అధికారి కటువుగా బదులిస్తాడు.
'అచ్చమైన దుష్టులు'
ఇంగ్లండ్, వేల్స్‌లలో నేర బాధ్యతకు కనీస వయసు 10 సంవత్సరాలుగా 1963లో నిర్ధారించారు.
1995 నుంచి ఇప్పటి వరకూ ఇంగ్లండ్, వేల్స్‌లలోని క్రౌన్ కోర్టుల్లో 7,000 మందికి పైగా చిన్నారులను విచారించినట్లు అంచనా.
నేర బాధ్యతకు ఇంత తక్కువ వయసును నిర్ధారించటం పిల్లల హక్కులను విస్మరించటమే అవుతుందని.. కనీసం 12 సంవత్సరాలకు ఆ వయసును పెంచాలని ఐక్యరాజ్యసమితి పదే పదే చెప్పింది.
యూరప్‌లోని ఇతర దేశాలతో పోలిస్తే.. నేర బాధ్యతకు అతి తక్కువ వయసు ఉన్నది ఇంగ్లండ్, వేల్స్‌లలో మాత్రమే. స్వీడన్‌లో 15 సంవత్సరాలు, పోర్చుగల్‌లో 16 సంవత్సరాలుగా ఉంది. చైనా, ఉత్తర కొరియాల్లో సైతం.. వయోజనుడిగా విచారించాలంటే కనీసం 14 సంవత్సరాల వయసు ఉండాలి.
ఈ వయసు పరిమితిని నిర్ణయించినప్పటి నుంచి ఇప్పటికి.. కిశోర వయసు మెదడు ఎలా అభివృద్ధి చెందుతుంది, నిర్ణయం తీసుకోవటం మీద అది ఎలా ప్రభావం చూపుతుంది అనే అంశాలపై మన అవగాహన పెరిగిందని ఇటీవలి ప్రభుత్వ నివేదిక ఒకటి స్పష్టంచేస్తోంది.
ప్రిజన్ రిఫార్మ్ ట్రస్ట్ 2010లో 2,000 మందికి పైగా వయోజనులతో నిర్వహించిన ఒక సర్వే.. నేర బాధ్యత వయసును కనీసం 12 సంవత్సరాలకు పెంచటానికి మూడింట రెండు వంతుల మంది సానుకూలంగా ఉన్నారని చెప్తోంది.
కానీ ఇతరులు తీవ్రంగా విభేదిస్తున్నారు.
1993లో రెండేళ్ల చిన్నారి జేమ్స్ బల్గర్‌ను.. పదేళ్ల వయసున్న జాన్ వెనబుల్స్, రాబర్ట్ థామ్సన్‌లు భయానకంగా హత్య చేయటం వల్ల వారు ఆ వయసును పెంచటాన్ని వ్యతిరేకిస్తుండవచ్చు. నాడు ఆ చిన్నారిని ఒక సూపర్‌బార్కెట్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళుతున్న అస్పష్ట సీసీటీవీ దృశ్యాలను చూసిన వారు మరచిపోలేరు.
ఆ నేరం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ చిన్నారి హంతకులను ''అచ్చమైన దుష్టులు'' అని ముద్రవేస్తూ కొన్ని శీర్షికలు కూడా వచ్చాయి. వారి హింసాత్మక ప్రవర్తనకు ఒక హంతక బొమ్మ ప్రధానంగా ఉన్న 'చైల్డ్స్ ప్లే 3' వంటి హారర్ సినిమాల ప్రభావం కారణమా అనే అంశం మీద తీవ్ర చర్చ కూడా సాగింది.
జేబీ బల్జర్ తల్లి డెనిస్ ఫెర్గూస్ గతంలో.. నేర బాధ్యత వయసును పెంచటాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఆ వయసును పెంచాలని ఒక వార్తా పత్రిక వ్యాసంలో సూచించిన నాటి చిన్నారుల కమిషనర్ ఆ తర్వాత ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పారు.
'నిజానికి వారు నిందితులు'
రెస్పాన్సిబుల్ చైల్డ్ అనేది 'స్కిన్స్' రచయిత షాన్ బక్లీ, డాక్యుమెంటరీ నిర్మాత నిక్ హోల్ట్‌ల కృషి.
ఈ ప్రశ్నల మీద తన తొలి డ్రామా ఫిల్మ్ వెలుగు ప్రసరిస్తుందని నిక్ ఆశిస్తున్నారు.
చానల్4లో ప్రసారమైన 'ద మర్డర్ ట్రయల్' వంటి భీతిగొలిపే డాక్యుమెంటరీలతో ఆయనకు కీర్తి లభించింది. భార్యను హత్య చేసిన ఒక స్కాటిష్ పండ్ల విక్రేత కేసుతో ఆ డాక్యుమెంటరీని చిత్రీకరించారు. 2013లో ఆ చిత్రాన్ని నిర్మించేటపుడు.. నేర బాధ్యత వయసు మీద ఆయనకు ఆసక్తి కలగింది.

ఫొటో సోర్స్, AFP
''నేను వివిధ కేసులను పరిశీలిస్తూ సుమారు 18 నెలల పాటు స్కాట్లండ్‌లో ఉన్నాను. అప్పుడే ఒక తీవ్రమైన దాడి విచారణలో చాలా చిన్న పిల్లవాడు కోర్టులో కూర్చుని ఉండటం చూశాను. ఆ చిన్నారి ఒక సాక్షిగా అక్కడ ఉన్నాడా అని న్యాయవాదులను అడిగాను. వాళ్లు.. ''కాదు.. నిజానికి వాళ్లే నిందితులు'' అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను'' అని ఆయన వివరించారు.
''ఆ తర్వాత.. అత్యంత తీవ్రమైన నేరాలకు జ్యూరీ ఎదుట విచారణకు హాజరయ్యే వారి వయసు గురించి మరిన్ని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాను. ఆ వయసు పది సంవత్సరాలు అని తెలిసిన తర్వాత.. ఇతర దేశాలతో పోల్చి చూశాను. నాకు మరింత ఆశ్చర్యం కలిగింది. మిగతా ప్రపంచంతో పోలిస్తే ఇది ఖచ్చితంగా చాలా తేడాగా ఉంది'' అని చెప్పారు.
'అతడు ఓ చిట్టెలుకను కొనటానికి వీలులేదు'
'రెస్పాన్సిబుల్ చైల్డ్'లో రే ఒక నరహంతకుడని.. హత్య చేసినందుకు అతడికి తీవ్ర శిక్ష పడాలని ప్రాసిక్యూషన్ వాదిస్తుంది. కానీ ప్రాసిక్యూషన్.. అతడి విషయంలో తీర్పు చెప్పటానికి అతడి కఠినమైన జీవితాన్ని - అతడి తండ్రి మద్యపానం, అతడి తల్లి కుంగుబాటు, హింస, అతడి కేసును సామాజిక సేవల విభాగం విస్మరించటం - పరిగణనలోకి తీసుకోవాలని వాదిస్తుంది.
ఇది వైరుధ్యాలతో కూడిన కథ: ఆ హత్య ఎంత భయానకంగా ఉందో కళ్లకు కడుతుంది. అదేవిధంగా రే ఇంటి జీవితంలో కల్లోలాన్ని, తన ముందే తన సవతి తండ్రి దాడి చేసిన తన అన్నకు అతడు సంపూర్ణంగా విధేయంగా ఉండటాన్ని కూడా స్పష్టంగా చూపుతుంది.
రే లేదా మరే ఇతర చిన్నారి నేరస్తుడిని వారి నేరాలకు శిక్షించరాదనే సూచన ఏదీ లేనప్పటికీ.. ఏ శిక్ష వేయాలని, చిన్నారులను నేరస్తుల తరహాలో చూడటం వల్ల దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందని ఈ డ్రామా ప్రశ్నిస్తుంది.
ఆలోచన రేకెత్తించే కొన్ని మాటలు.. రా కేసును పర్యవేక్షించే చిన్నారుల మనస్తత్వవేత్త పాత్ర నుంచి వినిపిస్తాయి. ఆ పాత్రను స్టీఫెన్ కాంబెల్ మూర్ పోషించారు. ఒక హత్య చేయటమంటే అర్థం ఏమిటనేదానిని అవగాహన చేసుకోగల సామర్థ్యం ఓ చిన్నారి మెదడుకు ఉంటుందా? అని ఆయన ప్రశ్నిస్తారు.
''రే.. 16 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఓ చిట్టెలుకును కూడా కొనుక్కోవటానికి వీలులేదు'' అంటూ.. ఆ వయసు వచ్చే వరకూ పెంపుడు జంతువును కొనుక్కోవటానికి అనుమతించని బ్రిటన్ చట్టాన్ని ఆయన ఉటంకిస్తారు.

ఫొటో సోర్స్, BBC/KUDOS/ ED MILLER
చిన్నారులను చట్టం ఎలా పరిగణిస్తుందనే విషయంలో వైరుధ్యాలు ఉన్నాయని.. పిల్లల న్యాయ నిపుణుడు డాక్టర్ టిమ్ బేట్‌మాన్ 'రేడియో 1 న్యూస్‌బీట్'తో చెప్పారు.
''పాఠశాల విద్య పూర్తిచేసే వయసును 18 సంవత్సరాలకు పెంచాలనే అంశంపై ఇటీవల చర్చ సాగింది. చిన్నారుల మీద నేరస్తులుగా ముద్ర వేయటం ప్రారంభించే సరైన వయసు గురించి కూడా మనం పరిశీలించాల్సిన సమయం వచ్చినట్లు కనిపిస్తోంది'' అని ఆయన పేర్కొన్నారు.
నేర బాధ్యత వయసును 16 సంవత్సరాలకు పెంచాలని డైరెక్టర్ నిక్ అభిప్రాయపడుతున్నారు. ''నేను చేసిన పరిశోధన, అధ్యయనాల మేరకు.. కిశోర వయసు మెదడు ఇంకాస్త అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ వయసును నిర్ధారించటం ఉత్తమంగా కనిపిస్తోంది'' అని ఆయన చెప్పారు.
'ఆ వ్యక్తిని నేను కావాలనుకోవటం లేదు'
చిన్నారులను వయోజనులుగా కోర్టులో విచారించే వయసును లేబర్, కన్జర్వేటివ్ ప్రభుత్వాలు ఎందుకు పునఃపరిశీలించలేదు అనే దానిని జేమ్స్ బల్జర్ కేసు ప్రభావం పాక్షికంగా వివరించగలదని డాక్టర్ బేట్‌మాన్ అంటారు.
''నేరాల విషయంలో కఠినంగా ఉండటమనే తరహా అంశాల మీద ఏకాభిప్రాయం ఉన్నపుడు.. రెండిటిలో ఏ పార్టీ అయినా మెతకగా ఉన్నట్లు కనిపించే పని చేయటం కష్టం'' అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే ప్రజాభిప్రాయం మారుతున్నట్లు కనిపిస్తోందని ఆయన భావిస్తున్నారు. ''చిన్నారులు చట్టాన్ని అతిక్రమించటం గురించి సమాజం వ్యవహరించే తీరులో గత దశాబ్దంగా చాలా మార్పు వచ్చింది'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/KUDOS/ ED MILLER
ఈ కాలంలో కోర్టులో విచారణకు నిలిపిన చిన్నారుల సంఖ్య 75 శాతం తగ్గిపోయిందనే వాస్తవాన్ని ఆయన ఉటంకించారు. ఇక స్కాట్లండ్‌లో నేర బాధ్యత వయసును 12 సంవత్సరాలకు పెంచాలని ఇటీవలే నిర్ణయించారు.
''బల్జర్ కేసు నాటికి నేటికి మధ్య తేడా ఉంది. ఆ సమయంలో మన ఆలోచనలు ఇక ఏమాత్రం మనల్ని అంధుల్ని చేయరాదని అది మనకు చెప్తోంది'' అని డాక్టర్ బేట్‌మాన్ పేర్కొన్నారు. అయితే.. ఈ అభిప్రాయంతో కొంతమంది ఇంకా విభేదిస్తారన్న విషయం తనకు తెలుసునన్నారు.
ఈ డ్రామా చివరి దృశ్యాల్లో.. చిన్నారి నేరస్తుల విభాగంలో ఉన్న రేకి.. రాత్రి పూట భయానక పీడ కలలు, ఆ హత్యకు సంబంధించి రక్తసిక్తమైన జ్ఞాపకాలు వస్తుంటాయి. ''ఆ పని చేసిన వ్యక్తిని నేను కాకుండా ఉండాల''ని తను కోరుకుంటున్న విషయం గురించి కూడా అతడు చెప్తాడు.
ప్రేక్షకులు రే కళ్ల నుంచి విషయాలను చూసేలా ఈ డ్రామాను రూపొందించారు. ఇది చూసేటపుడు అతడి పట్ల సానుభూతి కలగకుండా ఉండటం కష్టం. అయితే.. మనం చూస్తున్నది ఒక నాటకమని గుర్తుంచుకోవటం ముఖ్యం. ''ఈ కేసు విషయానికి వచ్చినపుడు సులభమైన జవాబులు లేవు'' అంటారు నిక్.
''రెస్పాన్సిబుల్ చైల్డ్.. ఈ విషయం గురించి కనీసం ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రజలను ఒప్పిస్తుందని నేను అనుకుంటున్నా'' అని డాక్టర్ బేట్‌మాన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం... ఈ లోయ లోతు 11,500 అడుగులు
- యూఎస్బీ కండోమ్ అంటే ఏమిటో తెలుసా?
- సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే తేయాకు కథ: చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- అభిప్రాయం: భారతదేశం ఆర్థిక మాంద్యానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉందా?
- రజినీకాంత్ జీవితంలో అరుదైన కోణాలు
- నలుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు పెళ్లి కొడుకులు, ఒకే రోజు పెళ్లి
- సర్దార్ పటేల్: ‘రాజులను అంతం చేయకుండానే, రాజ్యాలను అంతం చేసిన నాయకుడు’
- షారుఖ్ ఖాన్ ఇంటర్వ్యూ: ‘అందుకే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి..’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








