ఎయిడ్స్ డే: తల్లిదండ్రులకు హెచ్ఐవీ లేకున్నా, పాకిస్తాన్‌లో వందల మంది చిన్నారులకు అదెలా సోకింది?

- రచయిత, షుమైలా జాఫ్రీ
- హోదా, బీబీసీ న్యూస్, లర్కానా నుంచి
పాకిస్తాన్‌లోని లర్కానా జిల్లాలోని ఓ గ్రామీణ ప్రాంతంలో ముజఫర్ ఘాంగ్రో పేరు మోసిన పిల్లల డాక్టర్.
గత ఏప్రిల్ వరకూ రతోడెరో ప్రాంతంలో ఆయన క్లినిక్ నడిచేది. అయితే, అక్కడ హెచ్‌ఐవీ వ్యాపించడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. హెచ్‌ఐవీ సోకిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే.
చిన్నారులకు కావాలనే హెచ్‌ఐవీ వైరస్‌ను వ్యాప్తి చేసినట్లు ముజఫర్ ఘాంగ్రోపై మొదట అభియోగాలు వచ్చాయి. ఆ తర్వాత, అధికారులు వాటిని తొలగించారు. ప్రస్తుతం వైద్యంలో నేరపూరిత నిర్లక్ష్యం వ్యవహరించినట్లు ముజఫర్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.
అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ముజఫర్ కొట్టిపారేస్తున్నారు.

''ఆరోగ్యశాఖ అధికారులు అప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. వాళ్ల అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు నన్ను బలిపశువును చేశారు. నాపై అసూయ కూడా ఇందుకు ఓ కారణం. నాకు పేరు రావడాన్ని ఓర్వలేక కొందరు వైద్యులు, పాత్రికేయులు నా మీద ఈ కథ పుట్టించారు'' అని ఆయన అంటున్నారు.
ప్రస్తుతం ముజఫర్ క్లినిక్ మూతపడే ఉంది. అధికారులు దాన్నీ సీజ్ చేశారు. ముజఫ్ఫర్‌పై విచారణ సాగుతోంది.
రతోడెరో ప్రాంతంలోని వందల మంది గ్రామస్థులు గతంలో వైద్యం కోసం ముజఫ్ఫర్ వద్దకు వచ్చేవారు.
''పదేళ్లుగా నేను వైద్య వృత్తిలో ఉన్నా. వాడిన సిరంజీలనే మళ్లీ వాడినట్లు నాపై ఇంతవరకూ ఒక్కసారి కూడా ఫిర్యాదు రాలేదు. నేను అసలు ఏ తప్పూ చేయలేదు. ప్రస్తుతం కింది స్థాయి కోర్టులో విచారణ సాగుతోంది. రెండు మూడు వాయిదాలతో ఇది ముగిసిపోతుందని ఆశిస్తున్నా'' అని ఆయన అన్నారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ముజఫర్‌కే హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలింది. అయితే, ఈ విషయం తనకు అంతవరకూ తెలియదని ఆయన అంటున్నారు.
రతోడెరో ప్రాంతంలో క్లినిక్ నడుపుతున్న మరో డాక్టర్.. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో చిన్నారులు తన వద్దకు వస్తుండటంతో అనుమానం వచ్చి హెచ్‌ఐవీ పరీక్షలు చేయించాలని సూచించారు. దీంతో దేశంలోనే భారీ హెచ్‌ఐవీ వ్యాప్తి ఘటన వెలుగుచూసింది. ప్రభుత్వం, ఇతర సంస్థలు అప్రమత్తం అయ్యాయి. ఈ ప్రాంతంలో విస్తృతంగా హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించాయి. 1200కుపైగా మందికి హెచ్ఐవీ సోకినట్లు గుర్తించారు. వారిలో 900 మంది చిన్నారులేనని, వారి కుటుంబ సభ్యులకు మాత్రం ఆ వ్యాధి లేదని తేల్చారు.
ఘంగ్రో క్లినిక్‌కు కొంచెం దూరంలో ఉన్న సుభానా ఖాన్ గ్రామంలో 32 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ సోకింది. ఆ పిల్లల కుటుంబసభ్యులకు మాత్రం హెచ్‌ఐవీ లేదు. దీంతో బాధితుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

రతోడెరోలో హెచ్ఐవీ వ్యాప్తి వెలుగుచూసిన తర్వాత యూనిసెఫ్ సాయంతో ప్రభుత్వం ఓ హెచ్ఐవీ చికిత్సా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. కానీ, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటం వారి తల్లిదండ్రులకు ఇంకా ఇబ్బందిగానే ఉంది.
''నా కూతురు బరువు చూసి, విటమిన్లు ఇవ్వమని అడిగా. వాళ్లు అందుకు మందులు మాత్రమే సూచిస్తామని, వాటిని మేమే సొంతంగా కొనుక్కొని తెచ్చుకోవాలని చెప్పారు'' అని ఓ బాధిత చిన్నారి తల్లి అన్నారు.
''వంద రూపాయలు ఖరీదు చేసే మందులను అందించలేని ప్రభుత్వం నుంచి, ఇంకేమీ ఆశిస్తాం'' అని ఆమె వాపోయారు.
బాధిత చిన్నారుల్లో చాలా మంది పోషకలోపాలతో బాధపడుతున్నారు. బరువు కూడా తక్కువగా ఉన్నారు. హెచ్ఐవీ ఔషధాలను చికిత్సా కేంద్రాలు ఉచితంగా అందిస్తున్నాయి. గ్లోబల్ సపోర్ట్ ఫండ్ వీటిని సమకూరుస్తోంది.

బాధిత చిన్నారుల్లో చాలా వరకూ అల్పాదాయ కుటుంబాలకు చెందినవారే ఉన్నారు. హెచ్ఐవీ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్లను నయం చేసే మందులను కొనేందుకు డబ్బులు లేక ఆ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.
అన్నింటి కన్నా.. వివక్ష, వ్యధే బాధిత చిన్నారుల తల్లిదండ్రులను అత్యంత బాధపెడుతున్నాయి.
''మా పిల్లల జీవితాలకు సంబంధించిన ప్రశ్న ఇది. జనాలు చీదరించుకుంటుంటే, వాళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది?'' అని బాధిత చిన్నారి తల్లి ప్రశ్నించారు.
''మా పిల్లలనే కాదు, మమ్మల్ని కూడా ఊర్లో వాళ్లు దూరం పెడుతున్నారు. హెచ్‌ఐవీ సోకిన పిల్లలతో కలిసి మిగతా పిల్లలు ఆడుకోరు. పాఠశాలలు కూడా వారికి రావొద్దని చెబుతాయి'' అని ఆమె వాపోయారు.

గత జులైలో ఐరాస విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. హెచ్‌ఐవీ వ్యాప్తి అత్యధికంగా ఉన్న 11 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి.
హెచ్ఐవీ వ్యాప్తి వెలుగుచూసిన తర్వాత రతోడెరోలో క్షేత్ర స్థాయిలో వైద్యం అందించడం మొదలుపెట్టిన వైద్యుల్లో డాక్టర్ ఫాతిమా మీర్ మొదటివారు. చిన్నారుల్లో వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ల చికత్సకు సంబంధించి ఆమె నిపుణురాలు. కరాచీలోని అఘాఖాన్ వర్సిటీ హాస్పిటల్‌లో ఆమె పనిచేస్తున్నారు.
''మా ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. అందరికీ పరీక్షలు నిర్వహించేందుకు మా దగ్గర డబ్బు లేదు. వయోజనులతో పోలిస్తే చిన్నారులకు చికిత్స అందించడం కష్టం. ఔషధాల ఖరీదు కూడా ఎక్కువగా ఉంటోంది. గ్లోబల్ ఫండ్ నుంచి గ్రాంట్ కింద పాకిస్తాన్‌కు అవి ఉచితంగా వస్తున్నాయి'' అని ఫాతిమా చెప్పారు.
రతోడెరోలో హెచ్‌ఐవీ వ్యాప్తితో పాకిస్తాన్‌లో హెచ్ఐవీ వ్యాప్తి అంశంపై ప్రపంచం దృష్టి పడింది.
వాడిన సూదులను మళ్లీ వాడటం, ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యల్లో లోపాలే హెచ్ఐవీ వ్యాప్తికి దారితీశాయని ప్రభుత్వ విచారణ కమిటీ తెలిపింది.

పాకిస్తాన్‌లో వైద్య వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, అనధికార బ్లడ్ బ్యాంకులు నడుస్తుండటం, నకిలీ డాక్లర్లు వైద్యం అందిస్తుండటం కూడా హెచ్‌ఐవీ వ్యాప్తికి కారణమయ్యాయి.
పాకిస్తాన్‌లో హెచ్ఐవీ వ్యాప్తి పెరుగుతోందని, ఆసియాలో హెచ్ఐవీ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న దేశాల్లో పాకిస్తాన్ రెండో స్థానంలో ఉందని ఐరాస ఎయిడ్స్ పాకిస్తాన్ డైరెక్టర్ మరియా ఎలెనా అన్నారు.
2010-18 కాలంలో దేశంలో హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ల సంఖ్య 57 శాతం పెరిగిందని, 2018 చివరినాటికి చికిత్స అవసరమైనవారిలో పది శాతం మందే చికిత్సను తీసుకుంటున్నారని ఆమె చెప్పారు.
వ్యాధి పట్ల రతోడెరోలో జనాల దృక్పథం మారితే సమస్యను పరిష్కరించవచ్చని మరియా ఆశాభావం వ్యక్తం చేశారు.
''ప్రభుత్వానికి, ఇతర సంస్థలకు హెచ్ఐవీ ఎయిడ్స్ ప్రాధాన్యంగా లేదు. ఈ అంశం వెనక్కువెళ్లిపోయింది. ఈ సమస్యపై చర్చలు గానీ, ప్రణాళికలు గానీ, నిధుల కేటాయింపులు గానీ ఉండీలేనట్లుగా ఉన్నాయి'' అని అన్నారు.
రతోడెరోలో హెచ్ఐవీ వ్యాప్తి వెలుగుచూసినప్పటి నుంచి చర్యలు పెరిగాయని, హెచ్ఐవీ కట్టడి కోసం మరింత సమయం, అదనంగా వనరులను కేటాయిస్తున్నారని మరియా అన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సంస్థల్లో పాటిస్తున్న ఇన్ఫెక్షన్ నియంత్రణ విధానాలను సమీక్షిస్తున్నట్లు సింధ్ ప్రావిన్సు ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ అజ్రా ఫజల్ పెకుహో చెప్పారు.

''అనధికార బ్లడ్ బ్యాంకులు రక్తంపై సరిగ్గా పరీక్షలు చేయవు. వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఒకసారి వాడితే పనికిరాకుండా పోయే సిరంజీలను ప్రవేశపెడుతున్నాం'' అని ఆమె అన్నారు.
సేఫ్ ఇంజెక్షన్ విధానాన్ని కూడా పాకిస్తాన్ రూపొందించింది. పాకిస్తాన్‌లో ఇంజెక్షన్ల వినియోగం మితిమీరి జరుగుతోందని, దేశంలో రోగులకు చేస్తున్న ఇంజెక్షన్లలో 95 శాతం అనవసరమైనవని పాక్ ప్రధానమంత్రికి వైద్యం అంశంపై ప్రత్యేక సహాయకుడిగా ఉన్న జాఫర్ మీర్జా అన్నారు.
''ఇది మన సంస్కృతిలో భాగమైపోయింది. మన చిన్నారులకు ఏం జరిగినా, ఇంజెక్షన్ ఇవ్వమని డాక్టర్‌ని అడుగుతుంటాం. మన పద్ధతులే మన చిన్నారులను ప్రమాదంలో పడేస్తున్నాయి'' అని డాక్టర్ ఫాతిమా మీర్ అన్నారు.
కొత్త సిరంజీ విధానానికి ఇప్పటికే పాక్ ప్రభుత్వం తుదిరూపును ఇచ్చింది. రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి రావొచ్చు.
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో హెచ్ఐవీ భారీగా వ్యాపించింది రతోడెరోలోనే. ఈ ప్రావిన్సులోనే హెచ్ఐవీ సోకినవారు అత్యధికంగా ఉన్నారు. ట్రాన్స్‌జెండర్, సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులకు మాత్రమే ఈ వ్యాధి ముప్పు ఉందని ప్రజలు భావిస్తుంటారు.

హెచ్ఐవీ/ఎయిడ్స్ పట్ల వివక్ష కూడా పంజాబ్‌లో ఎక్కువగా ఉంది. వ్యాధి గురించి, సురక్షిత శృంగార పద్ధతుల గురించి ప్రజలకు అవగాహన పెంచేందుకు వివిధ ఎన్జీఓల సాయంతో ప్రభుత్వం కలిసి పలు కార్యక్రమాలు చేపడుతోంది.
వివాహేతర సంబంధాలు, స్వలింగ సంపర్కం పాకిస్తాన్‌లో చట్టవిరుద్ధం కావడంతో ఈ ఎన్జీఓలు వ్యాధి ముప్పు ఎక్కువగా ఉన్నవారిని చేరుకోలేకపోతున్నాయి. వివక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందన్న భయం కూడా ఆయా వర్గాల్లో ఉంటుందని, పాకిస్తాన్‌లో హెచ్ఐవీ/ఎయిడ్స్‌ను అరికట్టడంలో ప్రధాన అడ్డంకి ఇదేనని నిపుణులు అంటున్నారు.
హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ సోకినవాళ్లు ప్రభుత్వ రికార్డుల్లో తమ పేరును నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వారికి ఉచితంగా ఔషధాలు అందుతాయి. అయితే, తమ గురించి 'విషయం బయటపడుతుందన్న' భావనతో చాలా మంది బాధితులు పేర్లు నమోదు చేసుకోరని మరియా ఎలెనా అన్నారు.
''మనం మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన సమస్య దూరమైపోదు. మరింత పెద్దదవుతుంది. ఇదివరకు వ్యాధి వ్యాపించినప్పుడు సరైన చర్యలు తీసుకోలేదని రాటోడెరోతో మళ్లీ రుజువైంది. సరైన పద్ధతిలో వ్యవహరించాల్సి సమయం ఇది. లేకపోతే మరోసారి జరిగే వ్యాప్తి మరింత భారీగా ఉంటుంది. అది మనం ఊహించలేని విధంగా ఉండొచ్చు'' అని డాక్టర్ ఫాతిమా అన్నారు.
(ఫొటోలు: ఫరాన్ రఫీ)
ఇవి కూడా చదవండి:
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- యోని గురించి తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
- ఇద్దరిని హత్య చేసిన హంతకుడు.. ఎక్కడా తన పేరు లేకుండా చూసుకున్నాడు
- మీ పెంపుడు కుక్కతో జాగ్రత్త... ముద్దులు పెడితే ప్రాణాలు పోతున్నాయి
- డోనల్డ్ ట్రంప్: మహిళల గురించి ఎలా మాట్లాడతారు... ఆయన మాటల ప్రభావం ఏమిటి?
- హాంకాంగ్‌పై చట్టం చేసిన అమెరికా, చైనా కన్నెర్ర
- 7.4 కేజీల కిడ్నీని తొలగించిన వైద్యులు - భారత్‌లో అతిపెద్ద కిడ్నీ ఇదే
- విశాఖ ఏజెన్సీలో స్ట్రాబెర్రీ సాగు.. ఈ ప్రాంతమే ఎందుకంత అనుకూలం?
- 'స్మోకింగ్ నుంచి ఈ-సిగరెట్లకు మారితే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది '
- GDP: ఆరేళ్ళలో అధమంగా 4.5 శాతానికి ఎలా పడిపోయింది - అభిప్రాయం
- బంగారు నగలకు 'హాల్‌మార్క్' తప్పనిసరి చేసిన కేంద్రం... అసలు ఈ మార్క్ ఎందుకోసం?
- జాన్సన్ అండ్ జాన్సన్‌కు మరో ఎదురుదెబ్బ... వజైనల్ మెష్ కేసులో ఓటమి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








